బాపు

సినీ దర్శకుడు, చిత్రకారుడు

బాపు (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

బాపు
జననంసత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ
డిసెంబరు 15, 1933
మరణంఆగష్టు 31, 2014
చెన్నై
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుబాపు
వృత్తిచిత్రకారుడు,
కార్టూనిస్ట్
,
సినిమా దర్శకుడు
మతంహిందూ
భార్య / భర్తభాగ్యవతి
తండ్రివేణు గోపాల రావు
తల్లిసూర్యకాంతమ్మ
వెబ్‌సైటు
http://www.bapubomma.com/

బాపు శైలి మార్చు

'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!

ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు... కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ 'కోతికొమ్మచ్చి' 'బుడుగు'లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో 'ముత్యాలముగ్గు' సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.

క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

బాపు గీత కు గురువు మార్చు

బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతి నిధి అయినట్టే, గోపులు బొమ్మ తమిళిత్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రులు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు[1]. బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇంతగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసాగింది.ముందుగా చెప్పక పోతే వీరిద్దరిలో ఎవరు గీసిన బొమ్మొ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే!

విద్యారంగానికి ఈయన చేసిన కృషి మార్చు

1986-88 వరకూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు ముళ్ళపూడి వెంకట రమణలు పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమం లోనికి మార్చారు[2].

విద్యారంగంలో ఒక వినూత్న ప్రయత్నంగా ప్రారంభించారు.బాపు వయోజన విద్య కోసం కూడా పాఠ్యాంశాలను సిద్ధపరచారు. బాలల దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో బుడుగు పాత్రను సృష్టించారు, తెలుగు సాహిత్యం లోనే ఒక మకుటాయమానంగా నిలిచిపోయింది.

1964లో బెంగులూరులో జరిగిన యునెస్కో పిల్లల పుస్తకాలపై నిర్వహించిన సెమినారుకి ప్రతినిధిగా పాల్గొన్నారు.అదే సంవత్సరం చెన్నైలో యునెస్కో నే నిర్వహించిన పుస్తక ముఖచిత్ర రచన, అంతర్ చిత్రాలను గీసే తర్ఫీదు నిచ్చే కార్యక్రమాన్ని బాపు కే అప్పగించడం జరిగింది.

1960 లలో ఫోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాధి బుక్ ట్రస్ట్ కి చిత్ర రచనాసలహాదారుగా సేవలందించారు.

దక్షిణాధి లోని ప్రముఖ ప్రచురణ సంస్థలకు అనేక గ్రంథాలకు అవసరమైన చిత్రాలను చిత్రించగా వాటిలో ఐదింటికి ప్రభుత్వం బహుమతులను అమ్దుకున్నాయి.

ఇదేవిధంగా పురాణ గాథలకు,జాణపద సాహిత్యానికి విస్తృతంగా బొమ్మలు గీయడం జరిగింది.

ప్రచురణకు వెళ్ళే ప్రతి తెలుగు రచయిత పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాధసత్యనారాయణ మొదలుకొని నూతన రచయితల వరకూ ప్రతి రచయితకు బాపు గీత అవసరమయ్యింది.దానిని వారు ఒక ఆధిక్యత గానే భావించారు,

ఎందుకంటే అయన చేతి నుండి జాలువారిన చిత్రాలను విలువైనవెగానే కాక తెలివైన భావచిత్రాలుగా తీసుకొనేవారు.

జీవితంగీసిన మార్చు

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.[3] 1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. 2014 ఆగస్టు 31న చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనుమూసారు.[4][5]

చిత్రకళ మార్చు

బాపు చిత్రాలు
బాపు బొమ్మ
బుడుగు
ముగ్ధమనోహరమయిన ఒక స్త్రీ హొయలు...

బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా వేశాడు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు.

బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.

నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించాడు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.

  • పొదుపుగా గీతలు వాడటం.
  • ప్రవహించినట్లుండే ఒరవడి
  • సందర్భానికి తగిన భావము
  • తెలుగుదనము

బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పనిచేశాడు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ఇందులో బుడుగుతో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి.

ఈయన గీసే అమ్మాయిల బొమ్మలు అందానికి నిర్వచనంగా మారి అందమైన అమ్మాయి అంటే బా పు గీసిన బొమ్మ అనడం ఆనవాయితీగా మారింది.

ప్రతి తెలుగు ప్రారంభ పత్రిక ముఖచిత్రం బాపు గీసిందే కావాలనే ది ప్రతి ఒక్కరి కోరిక. ఆంధ్ర పత్రిక రాస్రంలోని ప్రముఖ వ్యక్తుల పేర నిర్వహించిన శీర్షికకు రేఖా చిత్రాలను బాపు నే గీసారు.

మరో పత్రిక బాపు గీసిన బొమ్మకు కథను రాసే పోటీని నిర్వహించింది. 1974 లో ఇంగ్లీషు,ఫ్రెంచి భాషలలో పిల్లల కోసం రామాయణాన్ని తనదైనశైలిలో బొమ్మలతో చెప్పారు. దీనికి కొనసాగింపుగా మహాభారతం ను, శ్రీకృష్ట్ణలీలలను కూడా తయారు చేసారు.

చలన చిత్రకళ మార్చు

1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నాడు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1976 లో వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది.

బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా (స్టోరీబోర్డు) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కించేవాడు. ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవాడు.
ఉదాహరణకి...రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం.

పురస్కారాలు మార్చు

బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అందులో ముఖ్యమయినవి కొన్ని:

బాపు చిత్రమాలిక మార్చు

అసంఖ్యాకంగా ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలో నుండి మచ్చుకు కొన్ని...

బాపు దర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

  1. శ్రీరామరాజ్యం, 2011 (తెలుగు)
  2. సుందరకాండ, 2008 (తెలుగు)
  3. రాధా గోపాళం, 2005 (తెలుగు)
  4. రాంబంటు, 1996 (తెలుగు)
  5. పెళ్ళికొడుకు, 1994 (తెలుగు)
  6. పరమాత్మా, 1994 (హిందీ )
  7. శ్రీనాథ కవిసార్వభౌమ,1993 (తెలుగు)
  8. మిష్టర్ పెళ్ళాం, 1993 (తెలుగు)
  9. పెళ్ళి పుస్తకం, 1991 (తెలుగు)
  10. ప్రేమ్ ప్రతిజ్ఞా, 1989 (హిందీ )
  11. దిల్ జలా, 1987 (హిందీ )
  12. ప్యార్ కా సిందూర్, 1986 (హిందీ )
  13. కళ్యాణ తాంబూలం, 1986 (తెలుగు)
  14. మేరా ధరమ్, 1986 (హిందీ )
  15. ప్యారీ బెహనా, 1985 (హిందీ )
  16. బుల్లెట్, 1985 (తెలుగు)
  17. జాకీ, 1985 (తెలుగు)
  18. మొహబ్బత్, 1985 (హిందీ )
  19. సీతమ్మ పెళ్ళి, 1984 (తెలుగు)
  20. మంత్రిగారి వియ్యంకుడు, 1983 (తెలుగు)
  21. వోహ్ సాత్ దిన్, 1983 (హిందీ )
  22. ఏది ధర్మం ఏది న్యాయం, 1982 (తెలుగు)
  23. కృష్ణావతారం, 1982 (తెలుగు)
  24. నీతిదేవన్ మయగుగిరన్, 1982 (తమిళం )
  25. పెళ్ళీడు పిల్లలు, 1982 (తెలుగు)
  26. బేజుబాన్, 1981 (హిందీ )
  27. రాధా కళ్యాణం, 1981 (తెలుగు)
  28. త్యాగయ్య, 1981 (తెలుగు)
  29. హమ్ పాంచ్, 1980 (హిందీ )
  30. వంశవృక్షం, 1980 (తెలుగు)
  31. కలియుగ రావణాసురుడు, 1980 (తెలుగు)
  32. పండంటి జీవితం, 1980 (తెలుగు)
  33. రాజాధిరాజు, 1980 (తెలుగు)
  34. తూర్పు వెళ్ళే రైలు, 1979 (తెలుగు)
  35. మనవూరి పాండవులు, 1978 (తెలుగు)
  36. అనోఖా శివభక్త్, 1978,హిందీ
  37. గోరంత దీపం, 1978 (తెలుగు)
  38. స్నేహం,1977 (తెలుగు)
  39. భక్త కన్నప్ప, 1976 (తెలుగు)
  40. సీతాస్వయంవర్, 1976 (హిందీ )
  41. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్,1976 (తెలుగు)
  42. సీతాకల్యాణం, 1976 (తెలుగు)
  43. ముత్యాల ముగ్గు, 1975 (తెలుగు)
  44. శ్రీ రామాంజనేయ యుద్ధం, 1975 (తెలుగు)
  45. అందాల రాముడు, 1973 (తెలుగు)
  46. సంపూర్ణ రామాయణం,1971 (తెలుగు)
  47. బాలరాజు కథ, 1970 (తెలుగు)
  48. ఇంటి గౌరవం, 1970 (తెలుగు)
  49. బుద్ధిమంతుడు, 1969 (తెలుగు)
  50. బంగారు పిచిక, 1968, తెలుగు
  51. సాక్షి, 1967 (తెలుగు)

ప్రదర్శనలు మార్చు

సాహిత్యరంగం మార్చు

 
రాధా గోపాళం సినిమాకు స్టోరీబోర్డు చిత్రాలు - ముందుగా గీసిన చిత్రాలతోబాటు సినిమా తీసిన తరువాతి షాట్లను కూడా చూడవచ్చును.

బాపు చిత్రకారునిగా పలు పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు. పత్రికల్లో కథలకు, నవలలకు ఆయన వేసిన చిత్రాలు మౌనవ్యాఖ్యలుగా అమరాయి అని విమర్శకులు బాపు బొమ్మల్ని ప్రశంసించారు. అమరావతి కథలు ముందుమాటలో సత్యం శంకరమంచి రాసిన కథలతో పాటు ఆ కథలకు బాపు వేసిన చిత్రాల గురించి కూడా ముళ్ళపూడి వెంకటరమణ సమాన ప్రాధాన్యతతో విశ్లేషించారంటే వాటి ప్రభావాన్ని గురించి అంచనా వేయవచ్చు. వంశీ "మా పసలపూడి కథలు", పుట్టపర్తి నారాయణాచార్యుల "శివతాండవం" వంటి ఎన్నో రచనలకు బాపుబొమ్మలు అదనపు విలువను తీసుకువచ్చాయని చేప్తూంటారు. బాపు రచనలను పూర్తిగా చదివి, రచయిత హృదయాన్ని అవగతం చేసుకుని వేసే బొమ్మలు సాహితీలోకంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పలువురు రచయితలు తమ రచనలు బాపుబొమ్మలతో ప్రచురణ పొందడాన్ని సార్థకతగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. శ్రీరమణ రచించిన ప్రఖ్యాత "మిథునం" కథ ఎంతగానో నచ్చడంతో బాపు దాన్ని తన దస్తూరిలో తిరగరాసి ఒక ప్రశంసగా రచయితకు పంపారు. తరువాతి కాలంలో దస్తూరీ తిలకం పేరిట ఆ కథను బాపు దస్తూరిలో ఆయన ఆ కథకు వేసిన పలు బొమ్మలతో ప్రచురించారు. సాహిత్యంలో బాపును గురించి పలు ప్రస్తావనలు వచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన ఆత్మకథ కోతికొమ్మచ్చిలో రమణ ఆప్తమిత్రుడైన బాపు జీవితాగమనం కూడా రాశారు. అందుకే ఇది తన ఒక్కడి ఆత్మకథే కాదని తన ఆత్మబంధువైన బాపు కథ కూడా అని రమణ పలు సందర్భాల్లో ప్రకటించారు.

సాహిత్యరంగంతో ఇంతటి సన్నిహిత సంబంధాలున్న బాపు స్వయంగా కథా రచన చేశారు. తన ఆప్తమిత్రుడు ముళ్లపూడి వెంకటరమణ కథారచన చేయక ముందు ఆయనను ఉత్సాహపరిచేందుకు "లక్ష్మి" అన్న కథను ముళ్లపూడి వెంకట్రావు (రమణ అసలుపేరు) పేరిట రాశారు. ఆపై మరో కథ సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు అసలుపేరు) పేరుతో రాయగా, మూడో కథ "మబ్బూ వానా మల్లెవాసన" బాపుగా రాశారు. మూడు కథల్లోనూ "మబ్బూ వానా మల్లెవాసన" బహుళ ప్రాచుర్యం పొంది ఉత్తమ కథగా నిలిచింది. ఓ యువకుడు దాంపత్యజీవితం పట్ల కనే కలలు నిజజీవితంలో జీవిత భాగస్వామికీ అతనికీ ఉన్న అభిరుచి భేదాలు, వాటివల్ల కలిగే చిన్న చిన్న ఆశా భంగాలు వంటివి ఎంతో మనోహరంగా రచించారు. ఈ కథ పలుమార్లు పత్రికల్లో పునర్ముద్రణ పొంది, "తెలుగు కథకు జేజే" సంకలనంలోనూ చోటుచేసుకుంది. తన కార్టూన్లలో, గ్రాఫిటీ స్ట్రిప్ లలో సందర్భానుసారం వచ్చే సంభాషణలు, వ్యాఖ్యలు బాపు రాశారు. బాపు వాక్యాలు సునిశితమైన వ్యంగ్యం, సున్నితమైన హాస్యం కలగలిసిన ఆ వచనంలో సమకాలీన వ్యవహారికం, అచ్చ తెలుగు నుడికారం పోతపోసినట్టు ఉంటాయి. బాపు-రమణల స్నేహాన్ని పురస్కరించుకుని సామాన్య పాఠకుల్లో కార్టూన్లలో "బాపూది గీత రమణది రాత" అనే ప్రథ వ్యాపించి ఉండగా కార్టూన్లలో రాత, గీత బాపుదేనని రమణ నిక్కచ్చిగా తేల్చారు. వీటన్నిటినీ పురస్కరించుకుని బాపును ఉత్తమ పాఠకుని గానే కాక నిశితమైన సాహితీ విమర్శకునిగా, విలక్షణమైన వచనం రాయగల సాహితీకారునిగా భావించవచ్చు.

ప్రముఖుల అభిప్రాయాలు మార్చు

  1. కొడవటిగంటి కుటుంబరావు - బాపువేసే బొమ్మల్లోని మనుషులు వాస్తవ వ్యక్తులే అయి ఉంటే వారు అసమానమైన నటులనుకోవలిసింది. ఆయా పాత్రల మనస్థితీ, స్వభావమూ బొమ్మలో రూపుకట్టినట్టు కనిపిస్తుంది. ఈ శక్తి నేను ఏ ఇతర కళాకారుడిలోనూ చూడలేదు.[9]
  2. శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌ లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు.
  3. త్రివిక్రమ్ శ్రీనివాస్-బాపు షాట్ కంపోజిషన్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం - అన్నీ అంతర్జాతీయ స్థాయివే. నా దృష్టిలో ఆయన తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్. అంతర్జాతీయ సినిమాలు చూసిన వ్యక్తిగా ఇది ఘంటాపథంగా చెబుతున్నా. ఒక్క మాటలో రేపటి సినిమాను... నిన్ననే ఆలోచించి... ఇవాళే తీసేసిన... దిగ్దర్శకుడు బాపు గారు.[10]

మరణం మార్చు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన బాపు చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ . 2014, ఆగష్టు 31న గుండెపోటుతో మరణించారు.

మూలాలు మార్చు

  1. సాక్షి పత్రిక మే 2,2015
  2. ది హిందూ దిన పత్రిక  21  ఫిబ్రవరి 2013
  3. http://www.bapubomma.com/biography.htm Archived 2012-03-01 at the Wayback Machine తీసుకొన్న తేది:09, జూన్ 2008.
  4. ఈనాడు దినపత్రిక - జాలస్థలి నుండి.
  5. "నమస్తే తెలంగాణ పత్రికలో వార్త". Archived from the original on 2016-03-05. Retrieved 2014-08-31.
  6. http://www.bapubomma.com/biography.htm Archived 2012-03-01 at the Wayback Machine తీసుకొన్న తేదీ:14, ఏప్రిల్ 2008.
  7. http://bapuart.com/pages.php?page=1&pID=5 Archived 2008-04-20 at the Wayback Machine తీసుకొన్న తేది:16,ఏప్రిల్ 2008.
  8. http://www.bapubomma.com/biography.htm Archived 2012-03-01 at the Wayback Machine తీసుకొన్న తేది:15,ఏప్రిల్ 2008.
  9. కొడవటిగంటి కుటుంబరావు "బాపు చిత్రకళ", బాపు చిత్రకళా ప్రదర్శనం-ప్రత్యేక సంచిక, నరసయ్య ట్రస్టు, విజయవాడ, 26 జనవరి, 1963, పేజి సంఖ్య 9
  10. బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం!:రెంటాల జయదేవ్:సాక్షి:సెప్టెంబర్ 1, 2014

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బాపు&oldid=3886037" నుండి వెలికితీశారు