ఏ.బి.కె. ప్రసాద్ పూర్తి పేరు అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్. వివిధ తెలుగు పత్రికల సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు.

జననం (1935-08-01) 1935 ఆగస్టు 1 (వయసు 89)
ఉప్పలూరు, ఉయ్యూరు, కృష్ణాజిల్లా
ఇతర పేర్లుఏ.బి.కె. ప్రసాద్
వృత్తితెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షుడు
ప్రసిద్ధిప్రముఖ పాత్రికేయులు
రాజకీయ పార్టీఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ
భార్య / భర్తసుధారాణి.
పిల్లలునలుగురు ఆడపిల్లలు
తల్లిచంద్రావతి

ఈయన 1935, ఆగస్టు 1 వ తేదీన కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టారు. సొంతూరు కృష్ణాజిల్లా ఉప్పలూరు. మేనమామ చలసాని వాసుదేవరావు ఉయ్యూరు దగ్గర భట్ల పెనుమర్రులో ఉండేవారు. అమ్మ చంద్రావతమ్మ, నాన్న బుచ్చివీరయ్య. నాన్న ఐదవయేటనే పోయారు. అమ్మ పెంచింది. ఎం.ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేయకుండా వదిలేశారు.నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవాడు.అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి తనకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. తొలి ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌.

తెలుగుకు ప్రాచీనహోదా గుర్తింపుకు కృషి

మార్చు

తెలుగు భాషకు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా, కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించాడు. తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీన హోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్ఫూర్తి అంటారు ఏబికే.

ఏబికె భావాలు,అనుభవాలు

మార్చు
  • ఏ తరానికా తరం విద్యార్థులు తెలుగులో చదువుతుంటేనేగదా తెలుగు బ్రతికేది? తెలుగుమీడియంలో చదివితే ఉద్యోగాలు రావనే భయం వెన్నాడుతుంటే మన పిల్లలు తెలుగులో ఎందుకు చదువుతారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ పరీక్షలు, నియామకాలన్నింటిలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు 5 శాతం అదనపు మార్కులిస్తే తెలుగు విద్యా ర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో కార్యా లయాల్లో తెలుగు వాడకం పెరుగుతుంది. మారుతున్న కాలంతోపాటు, కొత్తగా వచ్చి పదజాలాన్నీ ఎప్పటికప్పుడు చేర్చు కుంటూ మన తెలుగు నిఘంటువుల్ని తాజా పరచుకోవాలి. తెలుగు విశ్వవిద్యాలయంతోపాటు, విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలన్నింటికీ నిఘంటువుల నవీకరణ పని అప్పజెప్పాలి. (గీటురాయి 4-8-2006)
  • కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశాను. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఆ ఇంటినీ అమ్మేసి ఆ డబ్బుతో నేను, నా భార్య సుధ ఇద్దరం హైదరాబాద్, కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో జీవిస్తున్నాం.
  • కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశాను. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మా మేనమామ వాసుదేవరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య లాంటి ప్రముఖుల చర్చలను ప్రత్యక్షంగా చూశాను. నన్ను వాళ్లు చాలా ప్రభావితం చేశారు.
  • పునాదిపాడులో ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. కొద్దికాలానికే బయటికొచ్చేశాను.
  • గాంధీజీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల విముఖత కలిగింది. నిజమే. ఊరు ఊరంతా అట్టుడికిపోయింది. పెద్దవాళ్లందరూ గాంధీజీ దేశం కోసం జీవితాన్ని అర్పించడాన్ని చెప్పుకోవడం విని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను.
  • ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశాను. ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కూడా.
  • ‘జనశక్తి’ సంపాదకుడిగా నా మీద కేసులు ఫైలయ్యాయి. జైలుకెళ్లాను కూడ. పుస్తకాలు చదువుకునే వాడికి జైలు దుర్భరంగా ఉండదు. కావలసినంత సమయం దొరికినట్లవుతుంది. అక్కడ జక్కా వెంకయ్య, డాక్టర్ శేషారెడ్డి వంటి పార్టీ సీనియర్ నాయకులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చింది.
  • కొత్తగా పత్రిక పెట్టే వారికి నా సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత నా ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీపడి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు.
  • రాజీ పడాల్సిన సందర్భాలు ఎవరికైనా సరే చాలానే వస్తాయి. రాజీపడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవాడినీ కాదేమో.
  • తృప్తిని మించిన ఆస్తి లేదు.పత్రిక అమ్మకాలు పెరగడం, తగ్గడం- రెండూ సంపాదకుడి ప్రతిభకు గీటురాళ్లే.
  • కుత్సితాల లోయలోకి వెళ్లేకొద్దీ మనలోని నైపుణ్యాలు అణగారిపోతాయి. కుహనా విమర్శను అక్కడితోనే వదిలేయాలి. మనసులోంచి తుడిచేయాలి. అప్పుడే లక్ష్యాలను చేరగలం.ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదలకూడదు. (సాక్షి 22.10.2014)

ఎబికె ప్రసాద్ గారి గురించి ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు
  • “కొత్త పత్రికలకు పురుడు పోయడం, సరికొత్త ఆలోచనలకు వేదికనివ్వడం, అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవడం ఎ.బి.కె విలక్షణత. వస్తువు, రూపం కలిపిన మేలిమి కలయికలు, విజ్ఞాన పేటికలు ఆయన సంపాదకీయాలు. అక్షర నిబద్దుడైన ఎ.బి.కె కు నిశిత బుద్దితో, సముద్రమంతటి గాంభీర్యంతో, భావనా వైశాల్యంతో సాగిన అద్భుత సాహిత్యదర్శనం, విశ్వ విజ్ఞానాన్ని పిడికిట్లో ఇముడ్చుకున్న రచన . ఆయని నిబద్ధాక్షరి” - సి నారాయణ రెడ్డి
  • “ఎ.బి.కె వచనానికి సోయగం వుంది, పరిపక్వత వుంది, పరిమళం వుంది, అతను ఒక్కొక్కసారి రచనలో కవిత్వపు తళుకులు చూపిస్తాడు. ఒక్కొక్కసారి ఆవేశంలో అక్షర జలపాతాలు కురిపిస్తాడు. ఈ శిల్పం నిబద్ధత వల్లనే అబ్బింది. అతని సాహిత్య సంపాదకీయాలలో ప్రతీ రచనా ఒక కావ్యం.” - దాశరథీ రంగాచార్య
  • "తమిళ సంప్రదాయంలో “కైవాసి” అనే పదం ఉంది. మీ చేతి చలువ అలాంటిది. మీరు ప్రారంభించిన పత్రికలు యాజమాన్యాలకు ప్రతిష్ఠ చేకూరుస్తున్నాయి. మీరు హైదరాబాదు, తిరుపతి ఎడిషన్ల (ఆంధ్రజ్యోతి) ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మీ పరిశ్రమకు మీ మేథాశక్తికి అవి తార్కాణాలు."-దాశరథీ కృష్ణమాచారి
  • ”ఎదుటివారు అసూయపడేలా బ్రతకడం, ఈర్ష్యతో గింజుకు చచ్చేటంత బాగా వ్రాయడం శత్రువులు కూడా ఔరా అనుకున్నంత “స్వచ్చంగా” నైతిక విలువల్ని కాపాడుకోవడం నా లక్ష్యంగా వుంచుకున్నాను. నువ్వు నాకన్నా మొండివాడివి. గట్టివాడివి! నువ్వు శాపగ్రస్తుడివైన గ్రీకు మహాశిల్పి “ఫిడియస్” లాంటివాడివి. నువ్వు అదృష్టం కరువైన అతిలోక బలశాలి “అట్లాస్” లాంటివాడివి. నిజానికి ముందుగా ‘నమస్కారం’ అనాలి. కాని చివరికంటున్నాను.” - రావూరి భరద్వాజ
  • “మట్నూరి, నార్ల, గోరాశాస్త్రి తదితర ఉద్దండులైన నైతిక విలువలు కల్గిన సంపాదకులలో ఎ.బి.కె చివరివాడు. ఫ్రెంచి విప్లవం ద్విశత జయంతి సంధర్బంగా (1989 జూలై) “ఆంధ్రభూమి” దినపత్రికలో ఆయన వ్రాసిన సంపాదకీయం చరిత్ర అధ్యాపకుడినైన నన్ను ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. నాలాంటి చరిత్ర అధ్యాపకులకు కూడా అంతుచిక్కని అంశాలను ఆయన ప్రస్తావించడం ఆశ్యర్యం గొల్పింది."- వకుళాభరణం రామకృష్ణ
  • “సంపాదకుని పని అశిధారావ్రతం. ఎ.బి.కె సంపాదకీయాలలో బిందువుల్లో సింధువును చూపాడు. అద్దంలో కొండను చూపాడు. ఎ.బి.కె సంపాదకీయాలు అశిధారావ్రతంతో చేసిన రచనలు శ్యామశబల వ్రతంతో నిగ్గుతేరని అపరంజి రేకులు. ఏ సంపాదకీయం చదివినా నా మట్టుకు నాకు ఏదో నేను కలలోనూ చూడని నందనోద్యానంలో విహరించినట్టు, అపురూప సౌందర్యాన్ని సాక్షాత్కరించుకున్నట్టు, కైలసనాధకోన, ఎత్తిపోతల, కుర్తాళం, నయాగరా జలపాతాలలో జలకాలాడినట్టు ఏ హెలికాప్టర్లోనో ఒంటిగా విహన పథంలో తిరుగుతూ లోకంలోని అతిలోక సౌందర్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు, షేక్ చినమౌలానా సాహెబ్ నాదస్వరాన్ని వింటున్నట్టు, ఎల్లా వెంకటేశ్వరరావు నవమృదంగనాదాన్నో, అల్లారక్ఖా తబల భాషనో వింటున్నట్టు అనిపిస్తుంది. ఇదొక ప్రపంచం, ఇదొక కొత్త సృష్టి. నేనొక నవ్య ప్రపంచంలో విహరించాను. క్షణక్షణానికి రూపం మార్చుకుంటూ విచిత్ర రూపాలతో అలరిస్తూ తిరిగే మేఘాల మేఘాలయాన్ని చూచాను. రచన విధి సృష్టికి భిన్నమయింది. అది మరొక మహాలోకం. ఎ.బి.కె గారు మీ మనస్సు మహితం మీ బుద్ధి మహాతీక్షణం. మీ విమర్శ నిష్పక్షపాతయుతం. మీ ఊహలు సత్యధర్మ సంయుతాలు” - తిరుమల రామచంద్ర (1997)
  • ”తెలుగు పత్రికా రంరంలో అతి విశిష్ట స్థానం పొందిన ఎ.బి.కె, సాధారణ జనచైతన్య దిగంతరేఖను విస్తృతం చేస్తున్న వ్యక్తి. ఎ.బి.కె జర్నలిస్టు మాత్రమే కాదు. సాహిత్య వేత్త, తత్వచింతకుడు, పీడిత జనపక్ష పాతి, ఉద్యమశీలి. మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖలతోనూ ఆయనకు పరిచయం ఉంది. వసంత రుతువులో అన్ని పూలగంధాలను పూనుకుని విహరించే వాయువులాంటిది ఎ.బి.కె వ్యక్తిత్వం." -గుంటూరు శేషేమ్ద్ర శర్మ (1996)
  • "Mr. A.B.K is a very alert and efficient Journalist. He mastered every branch of journalism from proofreading to page make-up, from investigative reporting to leader writing, He has already made his mark as one of our leading Journalists."- Narla venkateswar rao

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు