ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం

ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం (ఆంగ్లం: Andhra Pradesh Official Language Commission) అధికార భాషా చట్టం 1966 ప్రకారం ఏర్పాటయిన సంస్థ. ఈ చట్టం 14.05.1966 లో అమలులోకి వచ్చింది. 1974లో ఈ సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనారంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. పరిభాష రూపకల్పన, ప్రభుత్వ శాఖలలో అమలుకు కృషిచేసింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.

చరిత్ర సవరించు

మాతృభాషను కాపాడుకోవటానికి ఉత్తర ప్రదేశ్ 1951లో, ఒడిషా 1954లో, తమిళనాడు 1956లో, అస్సాం 1960లో, గుజరాత్ 1961లో, కర్ణాటక 1963లో, మహారాష్ట్ర 1965లో, ఆంధ్ర ప్రదేశ్ 1966లో తమ భాషని అధికార భాషగా చట్టాలను చేశాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటగా 23 శాఖలలో మండలం, దానికన్నా తక్కువ స్థాయిలోని కార్యాలయాలలో, కొన్ని శాసనేతరమైన అంశాలకు మాత్రమే తెలుగు ప్రవేశ పెట్టబడింది. 1967,1968 సం.లలో మరి కొన్ని శాఖలలో తెలుగు వాడకాన్ని విస్తరించింది.1971-73 లో పశుసంవర్థక, వ్యవసాయం, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్తులు, దేవాదాయ శాఖ, విద్యా శాఖలలో తెలుగును ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1974లో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పాటయింది. దీనిలో అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. సచివాలయంలోని ఒక ఉపకార్యదర్శి ఈ సంఘానికి కార్యదర్శిగా ఉంటారు. ఇది ప్రభుత్వ అవసరాలకు తెలుగు వాడటానికి సంబంధించిన ప్రగతిని సమీక్షించి, తెలుగు భాష వినియోగానికి సిఫారసులు చేస్తుంది. 1974 నుండి 1979 వరకు రాష్ట్ర స్థాయిలో తెలుగు అమలు విషయమై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 మే 28, నందమూరి తారకరామారావు జన్మదినాన్ని అధికార భాషా దినోత్సవముగా ప్రకటించారు. 2004లో స్వభాను ఉగాది న అధికార భాషా సంవత్సరముగా ప్రకటించారు.

సంస్థ ఆకృతి సవరించు

1974లో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పాటయింది. దీనిలో అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. సచివాలయంలోని ఒక ఉపకార్యదర్శి ఈ సంఘానికి కార్యదర్శిగా ఉంటాడు. ఇది ప్రభుత్వ అవసరాలకు తెలుగు వాడటానికి సంబంధించిన ప్రగతిని సమీక్షించి, తెలుగు భాష వినియోగానికి సిఫారసులు చేస్తుంది. జిల్లా స్థాయిలో సమీక్షా సంఘాలకు కలెక్టరు అధ్యక్షులుగా, 8 మంది ఆధికారిక సభ్యులు, 15 నుండి 20 మంది అనధికారిక సభ్యులు ఉంటారు. అధికార భాషా సంఘం జిల్లాలలో పర్యటించి, అధికారులతో సమావేశాలు నిర్వహించి, తెలుగు ఉపయోగించడంలోని సాధక బాధకాలను తెలుసుకొని, తగు సూచనలు ఇస్తుంది. ఈ సంఘం కార్యాలయం చిరునామా: దక్షిణ హెచ్ నూతన భవనము, జి బ్లాక్ ఎదురుగా, సచివాలయం, హైదరాబాదు-500022. 2010 లో సంస్థ సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.

సంస్థ కార్యక్రమాలు సవరించు

2003 లో తిరుపతిలోని మహాతీ సభాప్రాంగణంలో అధికార భాష దినోత్సవం జరిగింది. భాషా సదస్సు, పండిత సదస్సు, వక్తృత్వ సదస్సు, సత్కార మహోత్సవం నిర్వహించడం జరిగింది. 15% శాతం అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న సాహెబులకొరకు, 13 జిల్లాలలో ఉర్దూని రెండవ అధికార భాషగా ప్రకటించారు. అవి కర్నూలు, హైదరాబాదు, కడప, నిజామాబాదు, అనంతపురం, రంగారెడ్డి, మెదక్, గుంటూరు, చిత్తూరు, మహబూబ్ నగర్, అదిలాబాదు, వరంగల్లు, నెల్లూరు.

లక్ష్యాలు సవరించు

2004 నాటివి

  • దాదాపు 40 శాతం జనాభా, అనగా రెండు కోట్ల నలభై లక్షల తెలుగు వారున్న తమిళనాడులో, తెలుగును రెండవ అధికార భాషగా గుర్తించుట
  • జాతీయ అధికార భాషగా తెలుగుని గుర్తించడానికి సిఫారస్ చేయడం
  • 2003-2004 నుండి తెలుగుని పాఠశాల విద్యలో త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అమలు చేయడం
  • తెలుగు భాషలో కృషి చేసిన రచయితలు పండితులకు సన్మానం
  • ప్రభుత్వ శాఖలలో తెలుగు వాడటానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం

2012నుండి జరిగిన పని సవరించు

ఆంధ్ర ప్రదేశ్ సమాచార సాంకేతికశాఖ, అధికారభాషాసంఘం, సిలికానాంధ్ర కలిసి 2013 అక్టోబరు 30న హైదరాబాదులో యూనికోడ్ పై సదస్సు నిర్వహించింది. దీనిలో భాగంగా [1]ను ఆవిష్కరించారు. దీనిలో పుస్తకాల పునర్ముద్రణ ప్రతులను యూనికోడ్, ఇపబ్, పిడిఎఫ్ రూపంలో చేర్చారు.[2]

పురస్కారాలు సవరించు

2013 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన డాక్టర్‌ గారపాటి ఉమా మహేశ్వరరావు, డాక్టర్‌ పివి పరబ్రహ్మశాస్ర్తి, డాక్టర్‌ రవ్వా శ్రీహరి, ఉర్ధూభాషా సేవారంగానికి సంబం ధించి జలీల్‌భాషాకు విశిష్ట పురస్కారాలు అందజేశారు. విపత్తు నివారణ సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ టి.రాధ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి జి.బలరామయ్య, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ నందివెలుగు ముక్తేశ్వరరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌, నాగార్జున విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు వియన్న రావు తది తరులకు తెలుగు పరిపాలనా భాషా పురస్కారాలు అందజేశారు.[3]

2014 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భాషా అభివృద్ధి, పరిపాలనలో అమలు కోసం కృషి చేసిన పలువురు ఐఎఎస్‌ అధికారులకు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్ర ప్రదేశ్‌ అధికార భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో భాషా పురస్కారాలను ప్రదానం చేశారు. తెలుగు భాషా రంగానికి పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం, చరిత్ర పరిశోధన రంగానికి వకుళాభరణం రామకృష్ణ, నిఘంటు నిర్మాణ రంగానికి ఆంధ్రభారతి వెబ్‌సైట్‌ నిర్వాహకుడు శేషబాబు, ప్రసార రంగానికి గాను హెచ్‌.ఎం.టివి మఖ్యకార్యనిర్వహణాధికారుకె.రామచంద్రమూర్తి, ఉర్దూ భాషా రంగానికి రెహనుమ-ఎదక్కన్‌ ఉర్ధూ దిన పత్రిక ప్రధాన సంపాదకుడుసయ్యద్ వికారుద్దీన్ లకు విశిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. అలాగే తెలుగు పరిపాలనా భాషా పురస్కారాలను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అంగలకుర్తి విద్యాసాగర్‌, ప్రధాన పరిపాలన ప్రభుత్వ కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌, ఆంధ్ర ప్రదేశ్‌ నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య వైస్‌ ఛైర్మన్‌ దుర్గాదాస్‌, కరీంనగర్‌, గుంటూరు, తూర్పుగోదావరి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్లు ఎం.వీరబ్రహ్మయ్య, సురేష్‌కుమార్‌, నీతు కుమారి ప్రసాద్‌, గిరిజాశంకర్‌, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వి.రాజకుమార్‌, ద్రావిడ విశ్వవిద్యా లయం వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కంకణాల రత్నయ్య, జవహర్‌ జ్ఞానాధారిత అనుసంధా న వ్యవస్థాపక సంఘం ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆత్మకూరి అమర నాథరెడ్డి లకు ప్రదానం చేశారు. పురస్కారంగా రూ.20వేల నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. [4]

అధ్యక్షులు సవరించు

మొదటి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య పనిచేశాడు. ఇటీవలికాలంలో ఎబికే ప్రసాద్ 2005 నుండి 2009 వరకు అధ్యక్షుడుగా పనిచేశాడు. 2012లో దీనిని పునరుద్దరించిన తరువాత మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

అధ్యక్షుల జాబితా
  1. వావిలాల గోపాలకృష్ణయ్య -1974-77
  2. టి. అనసూయమ్మ -1977-78
  3. వందేమాతరం రామచంద్రరావు -1978-81
  4. సి. నారాయణరెడ్డి -1981-85
  5. కొత్తపల్లి వీరభధ్రరావు -1985-86
  6. నండూరి రామకృష్ణమాచార్య -1987-90
  7. పి.యశోదారెడ్డి -1990-93
  8. అబ్బూరి వరదరాజేశ్వరరావు,
  9. గజ్జల మల్లారెడ్డి -1993-95
  10. తూమాటి దోణప్ప -1995-1999
  11. మాడుగుల నాగఫణిశర్మ -1999-2002
  12. పరుచూరి గోపాలకృష్ణ -2003-2005
  13. ఏ.బి.కె. ప్రసాద్ -2005-2009
  14. మండలి బుద్ధ ప్రసాద్ 2012 ఆగస్టు 01 - 04 ఏప్రిల్ 2014
  15. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 2019 ఆగస్టు 13 - 2022
  16. విజయబాబు 2022 అక్టోబరు 29; సీనియర్ జర్నలిస్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) మాజీ కమిషనర్

భాషాభివృద్ధి సవరించు

  • భారత రాజ్యాంగం తెలుగు అనువాదం, ప్రచురణ
 
భారత రాజ్యాంగం
 
కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం

బయటి లింకులు సవరించు

మూలాలు సవరించు

  1. తెలుగు పుస్తకం డాట్ ఆర్గ్ Archived 2013-10-22 at the Wayback Machine పరిశీలన తేది:2 నవంబరు 2013
  2. తెలుగు భాష కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి : సిలికానాంధ్ర , ఆంధ్రజ్యోతి వెబ్ సంచిక 1 నవంబర్ 2013, పరిశీలన తేది 2 నవంబర్ 2013
  3. "తెలుగు అమలుకు నిర్మాణాత్మక కార్యచరణ". సూర్య. 2013-02-21. Retrieved 2014-03-20.[permanent dead link]
  4. "మాతృభాషను బతికించుకుందాం". విశాలాంధ్ర. 2014-02-22. Retrieved 2014-03-20.[permanent dead link]
  5. కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం Archived 2010-11-20 at the Wayback Machine పేజీలో Training manual (Telugu) అన్న వరుసలో పిడిఎఫ్ ఫైలు చూడండి