ఐతన్న
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఐతన్న వైయస్సార్ కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఒక సాధారణ వేటగాడు.
సాధించిన విషయం
మార్చు1986 జనవరి 5వ తేదిన చలికాలంలో రాత్రి 2 గంటల సమయంలో కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె సమీపంలో లంకమల చిట్టడవిలో ఐతన్న వేటకు వెళ్ళాడు. ఆయన వేటాడుతుండగా కొత్తరకం పక్షుల జంట కనబడింది. రెండు వింతైన పక్షులు అతడి టార్చిలైట్ వెలుగులో మెరిశాయి. పొడవాటి కర్రకు ఉచ్చు తగిలించిన ఐతన్న వాటి దగ్గరకుపోయి మెడకు ఉచ్చులు బిగిద్దామనుకున్నాడు. ఓ పక్షి గిర్రున ఎగిరిపోయింది. అప్పటికే మంచులో తడిసి ముద్ద అయిన మరో పక్షి ఎగిరేందుకు తడిసిన రెక్కలు సహకరించక, పరిగెత్తే శక్తి లేక వేటగాడి ఉచ్చులో చిక్కింది. అప్పటి వరకూ భరత్ భూషణ్ లాంటి అధికారులు చెపుతున్న అరుదైన పక్షి అదే అయ్యిండవచ్చు అనుకున్నాడు. పోస్టర్లలోని పోటోతో ఈ పక్షులను పొల్చుకుని నిర్థారించుకున్నాడు. ఆ పక్షుల జంటలో ఓ పక్షిని అతి కష్టంమీద పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ పక్షి అంతరించిపోయిందనుకుంటున్న కలివికోడి. ఆయన ఆ పక్షిని అటవీ శాఖ అధికారులకు చూపించాడు. ఈ పక్షిని డాక్టర్ సలీం అలీ అనే శాస్త్ర వేత్త కలివికోడిగా దృవీకరించారు. దశాబ్దాల తరువాత ఈ అరుదైన పక్షిని గుర్తించిన ఐతన్నకు ప్రభుత్వం అటవిశాఖలో ఉద్యోగం ఇచ్చి సత్కరించింది.
కలివికోడిని పట్టుకున్న విధం అతని మాటల్లోనే
మార్చు“ | ఒకనాడు గొర్రెల కాసుకుంటూ అడవికి పోతుంటి. 20 ఏళ్ల కిందట భరత భూషణ్ అనే రేంజ్ ఆఫీసర్ ఈ ప్రాంతానికి వచ్చారు. నా దగ్గర ఒక ఫోటో చూపి ఇలాంటి పక్షిని చూశావా, చూస్తే కనిపిస్తే పట్టిస్తే రూ.1116లు బహుమానం, ఉద్యోగం ఇస్తా అని ప్రకటించారు. పక్షి గుర్తులు వివరించే ఫోటో ఇచ్చారు. ఇలాంటి పక్షులు చూశా అని గొర్లు, ఆవులు కాసేవారు అనుకుంటున్నారని చెప్పాను. నేనే రాత్రి వేళల్లో 8 నెలలు తిరిగాను. నాకే 1986 జనవరి 5న కనిపించింది. ఉచ్చు వేసి పట్టి తువ్వాల్లో మూటగట్టి ఇంటికి తెచ్చాను. గంప కింద మూశా. తెల్లారాక సిద్దవటం రేంజర్ మద్దిలేటికి విషయం చెప్పాను. ఆయన చూసి డి ఎఫ్‌ఓకు చెప్పారు. మరోమారు భరతభూషణ్ వచ్చి ఆ పక్షి ఇదేనని నిర్ధారించారు. ఢిల్లీకి టెలిగ్రామ్ కొట్టారు. గంప కింద ఉన్న పక్షికి సొద్దలు, కొర్రలు, రాగి గింజలు వేశా. తినలేదది. అలాగే ఉంది. వారం అయింది. పక్షి శాస్తవ్రేత్త సలీంఅలీతో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. గంప కింద ముడుచుకుపోయిన పక్షిని చూశారు. పక్షి దొరికిన ప్రాంతం చూపించాను. తిరిగి ఇంటికొచ్చే సరికి పక్షి చనిపోయింది. పొట్ట చీల్చి, పేగులు తీసి పొడి నింపి పక్షిని తీసుకుపోయారు. నాకు నెలకు 500 ఇచ్చి పక్షిని చూపేందుకు వెంట తిప్పే పని చూపారు. 1990లో వాచర్‌గా ఉద్యోగం రెగ్యులర్ చేశారు. ఇంక ఆ పక్షి పుణ్యమా అని నెలకు 7500 జీతం తీసుకుంటున్నా. మా కుటుంబం అంతటికీ ఆధారం ఆ పక్షే. | ” |
—ఐతన్న |