కన్హేరీ గుహలు

ముంబైలోని కన్హేరీలో బౌద్ధ గుహాలయాలు
(కన్హరీ గుహలు నుండి దారిమార్పు చెందింది)

కన్హేరీ గుహలు లేదా కాన్హేరీ గుహలు ఒకప్పటి సాల్శెత్ ద్వీపాలైన నేటి ముంబాయి నగర పశ్చిమ శివారు బోరీవలీలోని సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలోనున్న కన్హేరీ అను కొండలోని బౌద్ధ గుహాలయాలు (మానవ నిర్మిత గుహలు). కన్హేరీలు శిలాద్రవపు కొండలు కాగా, వాటి చుట్టుపక్కనున్న కొండలు బసల్ట్ కొండలు.[1] సంఖ్యాపరంగా ఒక కొండలో తవ్వబడ్డ అత్యాధిక గుహలు కన్హేరీ గుహలు.[2]

కన్హేరి గుహలు
కాన్హేరి గుహలు
చైత్యంలో స్థూపము. మూడో గుహ.
Map showing the location of కన్హేరి గుహలు
Map showing the location of కన్హేరి గుహలు
స్థలంసంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం
అక్షాంశ రేఖాంశాలు19°12′30″N 72°54′23″E / 19.20833°N 72.90639°E / 19.20833; 72.90639
Geologyబసాల్టు
Entrances>110

కొండలలోనున్న ఈ గుహలను రాళ్ళను తొలిచి చెక్కిన మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఇవి మొత్తం 110 గుహలకు పైబడి ఉన్నాయి.[3] ఈ గుహ వర్గమందు చాల గుహలందు శిల్పవాస్తుప్రదర్శన ఏమియు కనబడదు. నిర్ణయక్రమము రీతిగాని వీటియందు కనబడదు. రాతిని మలచిన గూండ్లవలె ఉండును. వీటి నిర్మాణాలు సా.శ.పూ 3వ శతాబ్దిలో మొదలవ్వగా,[2] సా.శ 1వ శతాబ్ది నుండి 10వ శతాబ్ది వరకు జరిగాయి. మూడవ శతాబ్ది నాటికల్లా ఇవి ముఖ్యమైన బౌద్ధ కేంద్రాలుగా ఎదిగాయి.[4] 16వ శతాబ్ది నాటి పోర్చుగీసూ, ఇతర ఐరోపా పర్యటకుల యాత్రా చరిత్రల్లో వీటి ప్రస్తావన ఉంది.[2] ఇచట అనేక గుహలు, మరల మరల మార్పులు చెంది, తొలిరూపము తెలియకుండా మార్పు చెందినవి. ఈ గుహలందు బ్రాహ్మీలిపి శాసనములు అనేకము ఉన్నాయి. ఆంధ్రశాతకర్ణి రాజుల చరిత్ర ఇచట చాలావరకు లిఖితమయి ఉన్నదని పండితుల అభిప్రాయము.

Map (1881)

మొదట చెక్కిన గుహలు పెద్దగా అలంకరణ లేకుండా మామూలుగా ఉండగా, తరువాతి గుహల్లో శిల్పకళా, ఇతర ఆడంబరాలూ కనిపిస్తాయి.

ఈ గుహలు రెండు రకాలు. ఒకటి- చైత్యాలు. చైత్యాలు భిక్షువుల ప్రార్థనా స్థలాలు. వీటిలో శిల్పాలూ, స్థూపాలూ చెక్కబడి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది అవలోకితేశ్వరుడి శిల్పం. రెండో రకం- విహారాలు. ఇవి చైత్యాలకంటే చిన్నవి కానీ వీటి సంఖ్య ఎక్కువ. విహారాలు భిక్షువుల నివాస స్థలాలు. ఈ విహారాలను బట్టి, ఇక్కడ చాలా మంది భిక్షువులు ఉండేవారని తెలుస్తోంది.

ఈ గుహలయాలకు అక్కడి ఇతర రేవు పట్టణాలైన సోపారా, కల్యాణ్, నాశిక్, పైఠణ్, ఉజ్జయినీలతో సంబంధాలుండేవి. మౌర్యులూ, కుషాణుల కాలానికి కన్హేరి విశ్వవిద్యాలయంగా ఉండేది.[5] 10వ శతాబ్ది చివరలో బౌద్ధ పండితుడూ, భిక్షువూ ఐన అతిశా (980–1054), బౌద్ధ ధ్యానం గురించి రాహులగుప్తుడి నుండి నేర్చుకునేందుకు కృష్ణగిరి విహారానికి వచ్చాడు.[6]

వ్యుత్పత్తి

మార్చు

కన్హేరీ అనే పేరుకు మూలం కృష్ణగిరి అనే సంస్కృత పేరు. కృష్ణగిరి అంటే కారు నలుపు కొండ అని అర్థం.[5] వీటి రంగు వలన ఆ పేరు వచ్చింది. ఈ రంగుకు కారణం శిలాద్రవం.[1] ఈ కృష్ణగిరీ ప్రాకృత భాషలో కన్హగిరి అయ్యింది. కన్హశిల అనే పేరు కూడా కొన్ని శాసనాల్లో కనిపిస్తుంది.[2] తరువాత కన్హగిరి కన్హేరీ/కాన్హేరీలుగా మారింది.[3] హిందీలో కన్హేరీ అనే పేరు ఎక్కువ వాడగా, మరాఠీలో కాన్హేరీ పేరు ఎక్కువగా వాడుతున్నారు. మరాఠీలో వీటి అధికారిక నామం కాన్హేరీ బౌద్ధ లేణీ[7] (లేణీ అంటే గుహ అని అర్థం).

గుహనిర్మాణం-శిల్పకళ

మార్చు
 
పైకప్పుపై అసంపూర్తి చిత్రం ఉన్న గుహ

ఈ గుహలయందు అనేక గుహలు నేడు మనము ఎరిగిన గృహనిర్మాణపద్ధతులను అనుసరించే నిర్మితమయ్యి, నేటికినీ వాసయోగ్యముగ ఉండును. ఈ గుహలందు కొన్ని మాత్రమే రూపశిల్పములచే అలంకృతమయినవి. కొన్ని గుహలందు చిత్రలేఖనము కానవచ్చును. అనేక కారణముల వలన శిథిలమయిన ఈ గుహల తొలిశోభ నేడు చూడలేము.

మూడవ గుహ

మార్చు

ఈ గుహలందు ముఖ్యముగా గమనింపదగగినది మూడవ గూహ అయిన ఒక మహా చైత్యగుహ. ఈ గుహ ద్వారబంధముపైన యజ్ఞశ్రీశాతకర్ణి శాసనము ఉంది.ఈ చైత్యము నిజముగా ఆనాడే ఏర్పడినప్పటికి, అనేక రూపాలంకారశిల్పములు చాల కాలమూయిన తరువాత ఇందు మలిచినందువలన, దీని పూర్ణప్రథమస్వచ్ఛ రూపము మనకు తెలియదు.

ఈ గుహ ఏర్పాటంతయు కార్ల గుహలు పోలినది. గుహకు ఎదురుగా, కొలదిదూరమున ఒక చిన్నఅడ్డగోడ ప్రాకరమును ఉద్దేశించును. ఈ ఆడ్డగోడ బాహ్యమతయు శిల్పముచే అలంకృతమయినది. ఈ అలంకారశిల్పము గౌతమిపుత్రగుహ అడ్డగోడ శిల్పమువలెనే ఉండి, అమరావతీ ప్రాకారశిల్పమును స్మృతికి తెచ్చును. బహుశా ఈ అడ్డగోడ అలంకారము గుహనిర్మాణమయిన కొంతకాలము తరువాత చేర్చియుండబడి ఉండవచ్చును. ఈ గుహముఖమంతయు గౌతమిపుత్ర గుహముఖమును పోలియున్నది. ఈ గుహాశిల్పములందు ఒక చిత్రమందు ఏర్పడిన జంతురూపచక్రసంకలనము అమరావతిశిల్పశైలిని అనుకరించబడి ఉంది. ఈ గుహకు ఎదురుగా ఇరువైపుల రెండు ధ్వజస్తంభములు ఉన్నాయి. ఒక స్తంభమునకు శిరస్సుపైన అశోక స్తంభములకువలె నాలుగు సింహములు ఉన్నాయి. రెండవదానిపై మూడు కుబ్జరూపములు మలిచి ఉన్నాయి. వీటికి పైన పెద్ద ధర్మచక్రములు నిర్మితమై ఉండినట్లు పండితుల ఊహ.

గుహలోపల చైత్యమందు 34 స్తంభములు ఉన్నాయి. వీటియందు 12 మాత్రమే పీఠము, అధిష్టానము, కుంభము, గ్రీవము, బోధిక మొదలయిన భాగములు కలిగి, పుర్ణముగా ఉన్నాయి. ఈ స్తంభముల వాస్తు కార్ల గుహలను పోలి ఉన్నాయి. కాన మానప్రమాణములు సమముగా ఏర్పడక కొంతమోటుగా ఉన్నమాట వాస్తవము. స్తంభశిరస్సులందు బోధికభాగమున ఏర్పడిన శిల్పములు సయితము, స్వచ్ఛతను తప్పి, కొంత లోటు పడిన మాట వాస్తవము. చైత్యోపరిభాగమున కప్పుకు ఆనాడు నిర్మించిన కొయ్యచట్టమంతయు శిథిలమయి అదృశ్యమైనది. ఈగుహ అంతర్భాగము దాదాపు 17 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగి ఉండును.

ఈ గుహాంగణమందు అనేక శిల్పములు ఉన్నాయి. ఇవి చాల శిథిలయినవి. ఇక్కడ బాగా ఆకర్షించునవి పార్స్యకుడ్యములందు మలిచిన బుద్ధరూపములు. ఇవి 13 అడుగుల ఎత్తున అద్భుతముగ ఉండును. ఈ బుద్ధముఖములందు మహాయానస్థులు సిద్ధంతీకరించిన కరుణ అతి స్పష్టము. ఈ మహాశిల్పములు గుహ నిర్మితమయిన రెండుమూడువందలఏండ్లకు మలిచి ఉండవచ్చును.

గుహ సింహద్వారమునకు ఇరువైపుల గోడన మలిచిన రూపశిల్పములు తొలినాటివే. ఇవి సంపూర్ణముగా ఆంధ్రములు. ఇక్కడ బాగా ఆకర్షించునవి సోదర శిల్పములు. ఈ సోదరరూపములు ఆనాడు ఈగుహనిర్మాణమునకు కావలిసిన ధనమునిచ్చిన ధనికులవని ఆనాటి శాసనములు తెలుపుచున్నవి. ఇవి మనిషి ప్రామాణమున ఉన్నాయి. ఈ రూపములు సంపూర్ణజీవము కలవయి, తాము నిర్మించిన చైత్యగుహకు అందరిని ఆహ్వానించుచున్న రీతిని గోచరించును. ద్వారబంధమునకు ఎడమ వైపునున్న స్త్రీముఖమందలి మందహాసము, ఐరోపానందు అతిప్రఖ్యాతి వహించిన డావించీ మోనాలిసా తైలవర్ణ చిత్ర మందహాసమువలె నుండును. దుష్టులెవరో ఈమె పెదిమలను ఛేదించిరి. అయినను ఆ పెదిమలందు తాండవించుచున్న అపూర్వమందహాసమును ఏమాత్రము మాపలెకపోయిరి. ఈ కుడ్యముఖముననే, పైభాగమున చిత్రితమయిన సప్తమానుష బుద్ధరూపములు, ఒక అవలోకితేశ్వర రూపశిల్పములు సయితము, తొలినాటి శిల్పములు కాక, చాలాకాలము తరువాత మలిచినవే.

ఇతర గుహలు

మార్చు

మిగిలిన గుహలందు కళాభావనము పరికింపదగిన విశేషము లంతగా లేవు. అయినప్పటికీ రూపశిల్పము లతివిరివిగా మలిచియున్న 1, 4 గుహలను ఒకింత గమనించవచ్చును. ఈ గుహలందు అనేక బుద్ధ, బోధిసత్వ, స్తూపరూపము లమితముగా కనిపించును. ఈ శిల్పములందు పునరుక్తి ఎక్కువ అయి, దూషరూపమునే వహించును. ఇవన్నియు క్రీస్తు తరువాత మలచినవే.

ఈ శిల్పములందు రెండు కల్పనలు మాత్రము గమనించదగినవి. ఈ కల్పనలందు శిల్పవిశేష మేమియు లేకున్నప్పటికిని, చిత్రమయిన భావవిశేషములు మాత్రము ఉన్నాయి. ఒక కల్పన యందు బుద్ధుడు ఉపవిష్టుడయిన పద్మము ఒక నిటారుకంబముపైన ఉండును. ఈ కమబమునకు క్రిందిభాగమున నాగపురుషులిద్దరు ఇరువైపుల తన్ని పట్టి కంబమును నిలుపుచుందురు, కంబమధ్య భాగమునుంచి ఇరువైపుల రెండుపద్మములు మొలచును. ఈ పద్మములందు నాగపురుషులో, లేక భక్తులో కానవచ్చెదరు. ఈ కల్పన అనేకమార్లు అనేకమార్లు కనిపించును. అప్పుడప్పుడు రచన యందు కొంత భేదము కానవచ్చినను, రూపు మాత్రము పోలికి ఉండును.

ఇక రెండవ కల్పన ఒక బోధక శిల్పము. దీనిలో కేంద్రమున అవలోకితేశ్వరుడుండును. కుడివైపున పైనుంచి క్రిందకు వరుసగా ఒక పురుషుడు ఏనుగు, సింహము, సర్పము, అగ్ని, నావచ్చేదనము మొదలయిన బాధలకు లోనయి, భయమున నుండును. ఎడమ పార్స్వమందు ఇదే రీతిన కారాగార, గరుడ, సితాళ (బౌద్ధుల పోలేరమ్మ) ఖడ్గ, విరోధిబాధలు చిత్రించి యుండును. ఇటువంటి సర్వబాధలనుంచి అవలోకితేశ్వరుడు రక్షించగలడని ఈ చిత్రభావము. ఈ చిత్రకల్పనయందు చిత్రితమయిన ప్రతి ఒక బాధను గూర్చిన కథలు సయితము ఉన్నాయి. మహాయానము ప్రబలుచున్న కాలమున, నీరసించుచున్న అంతర్యస్వభాగవతులందు ఉద్భవించిన కల్పనలివి.

ఈ కన్హరీ గుహలు ఇంత ప్రబలమయిన దయినను ఒక్క విహారమయినను ఇందు కానము. మొదట చెప్పిన ఒక మహాచైత్యము తప్ప, మిగిలనవన్నియు విడి భిక్షుక గృహములె. సర్వగుహములందును ముఖ్యముగా విదితమవు ప్రధానలక్షణములు గుహాంగణమందలి వరాండా, అరుగులు. ఆతిధ్యభావమున ఉదయించిన, ప్రత్యేక ఆంధ్రవాస్తు లక్షణమయిన వరాండా పూర్ణవిని యోగము, వాస్తువునందిది కల్పింపగల సొంపు కన్హరీ గుహలందు ప్రస్ఫుటతమయినది.

ఈ వర్గమందు విహారములు లేనందున, ఇచటి పరివ్రాజక వర్గమమందు సామాజికజీవనము లేదనుటకు వీలులేదు. అందరు కూడి ధర్మమును చర్చింటుకకయి మహాశాలలు రెండు ఈగుహలందు ఉన్నాయి. ఇందు ప్రఖ్యాతి వహించినది దర్బారుగుహ. ఈ గుహ నిర్మాణక్రమము నాడు అజాతశత్రువు రాజగృహసంగీతము కొరకు నిర్మించిన మహాశాల ననుకరించినని పండితాభిప్రాయము. ఇచట నిర్మితమయిన ప్రతి గుహయందు, ముందు వరాండాయేగాక, తపశ్చ్యకొరకు ఏర్పరిచిన ఉపగదితోపాటు, అరుగులు కలిగిన ఒక చావిడి సయితము ఉంది. కొన్ని గుహలందు ఈ చావిడుల వెనుక భాగమున, ఒక చిన్న ఆదిత్యమును సయితము కల్పించి, ఆదిత్యమందు ఒక బుద్ధ విగ్రహమును నిలిపిరి. అందుచేత అనేక శాఖలకు చెంది, ప్రత్యేక శిష్యవర్గములు కలిగిన, వివిధ సన్యాసుల సమూహము ఇచట నాడు ఉండెడిది అని ఊహించవచ్చును.

ఈ గుహలందు సర్వపండితులను ఆశ్చర్యమొనర్చిన ఇంకో విశేషము ఇంకొకటి ఉంది. ప్రతిగుహకు ఎదురున ఒక చిన్న నీటికుందు కానవచ్చును. వర్షపర్యంతము ఈ నీటికుండ్లు, చల్లటి మచితీర్ధముతో చేతి కందురీతిన నిండి ఉండును. ఈ నీటి ఉనికిని కనుగొని, ఆనాడు ఇచట ఇంత మహాగుహ వర్గమునకు శంకుస్థాపన మొనరించిన ప్రథమశిల్పి ప్రజ్ఞ మహాద్భుతమని వేరుగ చెప్పనక్కర్లేదు.

శాసనాలు

మార్చు
 
మహాచైత్యపు వాకిట్లో బ్రాహ్మీ లిపిలో చెక్కిన శాసనం

గుహలపై 100కు పైగా శాసనాలు ఉన్నాయి. చాలావరకు ఇవి బ్రాహ్మీ, దేవనాగరీ లిపులలో చెక్కారు. 90వ గుహలో మాత్రం 3 శాసనాలు పహలావీ లిపిలో ఉన్నాయి.[8][9]

శాసనాలు ఎక్కువగా గుహల నిర్మాణానికీ, వసతుల కల్పనకీ నిధులిచ్చిన దాతల వివరాలను తెలియజేస్తాయి.[3] ఈ శాసనాల ద్వారా నాటి ముంబై శకుల పాలనలో ఉండేదని తెలుస్తోంది. ఈ శాసనాల్లో ఎక్కువగా పేర్కొన్న రాజులూ, రాజవంశాలూ: గౌతమీపుత్ర శాతకర్ణి (సుమారు సా.శ.106–30), వాశిష్ఠీపుత్ర శ్రీ పులుమావి (సుమారు సా.శ 130–158), శ్రీ యజ్ఞ శాతకర్ణీ (సుమారు సా.శ 170–201), ప్రతిష్ఠాణం (ఆధునిక పైఠాణ్) రాజధానిగా పాలించిన ఇతర శాతవహనులూ,.[2] 5వ గుహ మీద శాతవహనుల వంశక్రమం, వాశిష్ఠీ పుత్ర శాతకర్ణీ, అతని దేవి ఐన మొదటి రుద్రదామన్ కుమార్తెల వివాహాన్ని ప్రస్తావిస్తూ శాసనం ఉంది.[10][11] 81వ గుహలోనూ,[12] మూడో గుహలోనూ[12]: 75  యజ్ఞశ్రీ శాతకర్ణీ (సా.శ 170–199) ప్రస్తావనులున్నాయి. అలాగే సా.శ 494–95 నాటి శాసనము ఒకదానిలో త్రయకూటక వంశ ప్రస్తావన ఉంది.[13]

నీటి వనరుల నిర్వహణ[14]

మార్చు

కన్హేరీలో నీరు రెండు మార్గాల నుండి దొరికేది:

  1. బసల్టు కొండల్లోని నీటి బుగ్గలూ
  2. నిల్వ ఉంచిన వర్షపు నీళ్ళూ.

వర్షపు నీళ్ళని నీటి గుంటల్లో, కుందులలో నిల్వ ఉంచుకునే వారు. ఈ గుంటలూ, కుందులూ గుహల దగ్గరా, అలాగే కొండ మీదా ఉన్నాయి. రాతిలో తహకుందుల తవ్వకానికీ, గుంటల నిర్మాణానికీ చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చేవారు. ఆ వివరాలు శాసనాల్లో ఉన్నాయి.

పర్యటన

మార్చు

చేరుకొను విధానం

మార్చు

సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం గుండా ఇక్కడకు వెళ్ళాలి. ఉద్యానవనానికి సొంత వాహనంతో పాటు సిటీ బస్సులో కూడా చేరుకోవచ్చు. అలాగే బోరీవలీకి రైల్వే స్టేషను ఉన్నందున లోకల్ ట్రైనులో కూడా రావచ్చు. ఈ మధ్య మెట్రో రైలు మార్గం కూడా ఏర్పాటైనది. రాష్ట్రీయ ఉద్యాన్ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఈ ఉద్యానవనం ఉంది. ఈ స్టేషనుకు 2022 ముగింపు నాటికి ఒక వైపు ఆరే, ఇంకో వైపు దహిసర్ స్టేషన్ల నుండి మొదలు రైళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కాక ఆటోలలో కూడా చేరుకోవచ్చు.

ఉద్యానవనంలోకి వెళ్ళేందుకు ప్రవేశ రుసుము చెల్లించాలి. కొండ దగ్గరకు చేరుకునేందుకు 6 కి.మీ పైన ప్రయాణించాలి. కాలి నడకన కానీ సొంత బండి పైన కానీ వెళ్ళవచ్చు. అలా వెళ్ళలేని వారికి డబ్బులు కట్టించుకుని తీసుకువెళ్ళే 'బెస్ట్' బస్సు లేదా కిరాయి వ్యానులూ ఉద్యానవనంలో దొరుకుతాయి. ఆసక్తి గలవారికి సైకిళ్ళు అద్దెకిచ్చె వసతి కూడా ఉంది.

భారతీయ పురాతత్వ శాఖ ప్రకారం ఈ గుహలు టికెట్టు ద్వారా ప్రవేశించవలసిన స్మారకాలు.[15] కనుక ఉద్యానవనానికి కట్టిన డబ్బులు కాక, గుహలను చూసేందుకు మళ్ళీ ప్రత్యేకంగా డబ్బులు కట్టవలసి ఉంటుంది. కొండ ఎక్కేందుకు నడక తప్ప వేరే మార్గం లేదు.

వసతులు

మార్చు

కన్హేరీ కొండలు భారత పురాతత్వ శాఖచే రెండో విడతలో ఆదర్శ స్మారకాలుగా (పర్యటకులకు మౌలిక వసతులు ఉండవలసిన స్మారకాలు) గుర్తించబడ్డాయి.[16] కనుక ఇక్కడ ఉచిత త్రాగునీరూ, మరుగుదొడ్లూ, భద్రతా సిబ్బందీ, సేద తీరేందుకు కుర్చీలూ, స్వచ్ఛ భారత అభియాను ననుసరిస్తూ చెత్తబుట్టలూ ఉన్నాయి. ఇది కాక ఫలహారశాల కూడా ఉంది. గుహల మొదట్లో స్థూల సమాచారంతో పాటు, ముఖ్యమైన గుహల దగ్గర వాటి విశేషాలను వివరిస్తూ ఆంగ్లం, మరాఠీ, హిందీ భాషలలో భారతీయ పురాతత్వ శాఖ పటాలు ఉన్నాయి. ఆపైన మరిన్ని సాంకేతిక వివరాలు తెలిపేందుకు వ్యాఖ్యా కేంద్రం ఉంది.

ఇబ్బందులు

మార్చు

ప్రాథమిక సంరక్షణా చర్యలు కొన్ని ఉన్నప్పటికీ, ఇవి కొంత ప్రమాదకరమైన కొండలు. వ్యక్తిగత జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా వయసు మళ్ళిన వారూ, పిల్లలూ మరింత జాగ్రత్తగా ఉండాలి. కోతుల బెడద ఉంది. మనుషులకు అలవాటు పడ్డ కోతులు మామూలుగా ఎవరినీ ఇబ్బంది పెట్టవు కానీ, తినుబండారాలను చూస్తే దాడి చేయవచ్చు. జంతువులకు తినిపించరాదని ప్రభుత్వ హెచ్చరికలు ఉన్నాయి. కొంత ఎత్తుకు మేర, లెపర్డ్‌ల సంచార ప్రాంతంగా గుర్తించబడింది. అక్కడకు ప్రవేశ పరిమితులేవీ లేవు కానీ ప్రభుత్వ హెచ్చరిక మాత్రం ఉంటుంది.

చిత్రమాలిక

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Insider's guide to... Kanheri Caves". Retrieved 26 డిసెంబరు 2022.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; asi అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 3.2 Superintending Archaeologist (డిసెంబరు 2022). Buddhist Caves, Kanheri (Information board). Sanjay Gandhi National Park, Entrance to Kanheri: ASI, Mumbai Circle. Retrieved 28 డిసెంబరు 2022.
  4. "Kanheri Caves Mumbai". Retrieved 26 డిసెంబరు 2022.
  5. 5.0 5.1 "Kanheri Caves". Retrieved 26 డిసెంబరు 2022.
  6. Ray, Niharranjan (1993). Bangalir Itihas: Adiparba in Bengali, Calcutta: Dey's Publishing, ISBN 81-7079-270-3, p. 595.
  7. Superintending Archaeologist (డిసెంబరు 2022). Buddhist Caves, Kanheri (Information board) (in మరాఠీ). Sanjay Gandhi National Park, Entrance to Kanheri: ASI, Mumbai Circle.
  8. West, E.W. (1880). "The Pahlavi Inscriptions at Kaṇheri". The Indian Antiquary. 9: 265–268. Retrieved 26 డిసెంబరు 2022.
  9. Ray, H.P. (2006). Inscribed Pots, Emerging Identities in P. Olivelle ed. Between the Empires: Society in India 300 BCE to 400 CE, New York: Oxford University Press, ISBN 0-19-568935-6, p.127
  10. "A Note on Inscriptions in Bombay". Maharashtra State Gazetteers-Greater Bombay District. Government of Maharashtra. 1986. Retrieved 26 డిసెంబరు 2022.
  11. Cave 5 Water Cistern (Information board). Sanjay Gandhi National Park, Outside cave 5: ASI, Mumbai Circle. The inscription also mentioned the genealogy of Satavahanas, and records that the queen (devi) of Vasisthiputra Sri-Satakarni, descended from the race of the Karddamaka kings, daughter of the Mahakshatrapa Rudra. [శాసనం శాతవాహనుల వంశక్రమాన్ని కూడా ప్రస్తావించడంతో పాటు, వాశిష్ఠీ పుత్ర శాతకర్ణి యొక్క దేవి కర్దమక వంశ రాజు మొదటి రుద్రదామనుడి కుమార్తె అని చెబుతోంది]{{cite sign}}: CS1 maint: location (link)
  12. 12.0 12.1 Burgess, James; Bühler, Georg (1883). Report on the Elura cave temples and the Brahmanical and Jaina caves in western India; completing the results of the fifth, sixth, and seventh seasons' operations of the Archaeological survey, 1877-78, 1878-79, 1879-80. Supplementary to the volume on "The cave temples of India.". London, Trübner & Co. p. 79. Retrieved 26 డిసెంబరు 2022.
  13. Geri Hockfield Malandra (1993). Unfolding A Mandala: The Buddhist Cave Temples at Ellora. SUNY Press. pp. 5–6. ISBN 9780791413555.
  14. Water Management at Kanheri (Information board). Near Kanheri Caves: ASI, Mumbai Circle.
  15. "Kanheri Caves". Archaeological Survey of India. Retrieved 27 డిసెంబరు 2022.
  16. "Adarsh Smarak". Archaeological Survey of India. Retrieved 27 డిసెంబరు 2022.

మరింత సమాచారం

మార్చు
  1. 1950 భారతి తెలుగు మాస పత్రిక. వ్యాస కర్ప శ్రీ ఆమంచర్ల గోపాలరావు
  2. Nagaraju, S. (1981). Buddhist Architecture of Western India, Delhi: Agam Kala Prakashan.

వెలుపలి లంకెలు

మార్చు
  1. గూగుల్ ఆర్ట్స్ & కల్చర్‌లో భారతీయ పురాతత్వ శాఖ అందించిన 360° వీక్షణ
  2. కన్హేరీలోని పురావస్తు తవ్వకాల వివరాలు: Lal, B.B, ed. (1969). Written at New Delhi. "Maharashtra" (pdf). Explorations and excavations. Indian Archaeology Review. Calcutta: Archaeological Survey of India (published 2 జూన్ 1972): 21–22. Retrieved 27 డిసెంబరు 2022.
  3. Kanheri Caves Decoded online documentary video