కపిలి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
గతంలో రైతులు తమ పొలాలకు బావులలో నుండి కపిలి లేదా మోట అనె సాధనంతొ నీటిని తోడి పంటలు పండించే వారు. ఈ సాధనం ఎద్దులతో నడిసేది.
ఇందులోని భాగాలు:....బాన, మోకు, బండి (చక్రం) కదురుగోలు, తొండం తాడు తాడు., కాడి మాను, ఇరుసు,
ప్రస్తుతం దీని ఉనికి పూర్తిగా కనుమరుగై నట్టుంది. హైదరాబాదులో దీని ఆనవాలు చూడాలంటె గోలుకొండ కోట లోని బావుల వద్ద గాని, పక్కనే వున్న సమాధుల మధ్యనున్న బావి వద్ద గాని చూడ వచ్చు. ఇవి వందల సంవత్సరాల క్రితంవి. పొలాల్లో బావుల వద్ద వీటి ఆనవాలు చూడ వచ్చు.
- పనిచేసే విధానం
బావి గట్టున ఏటవాలుగా భూమి లోనికి ఒక చివరన రంద్రాలున్న పొడవాటి రాతి స్థంబాలను బావి లోనికి సాగి ఉండేటట్లు పాత తారు. ఆ రంద్రాలలో బలమైన కర్రలను దించి వాటి పైన అడ్డంగా ఒక కర్ర దుంగను పెట్టి దాని మధ్యలో రెండు చిన్న రంద్రాలను చేసి వాటిలో కూడా రెండు గట్టి కర్ర బద్దలను (పైచివరలలో రంద్రాలున్నవీటిని చెవులు అంటారు ) దించు తారు. ఈ రెండు కర్రల మధ్య సుమారు తొమ్మిది అంగుళాల దూరం ఉంటుంది. ఇప్పుడు భూమిలోనికి ఏటవాలుగా పాతిన రెండు రాతి పలకల మధ్య మూడు రాతి బండలను కాలువ లాగ చేసి ఏట వాలుగా లోపలనుండే బయటకు వచ్చే ఏర్పాటు చేస్తారు. ఈ కాలువకున్న రెండు బండల చివరన చిన్న గాడి కొట్టి అందులో చివరన ఇనుప కడ్డీలున్న రోకలి బండలాంటి చక్రాన్ని అమర్చు తారు. దీన్ని కదురుగోలు అంటారు. ఇప్పుడు పైనున్న చెవుల మధ్యలో ఇరుసు ఆధారంగా చుట్టూ గాడి వున్న దిట్టమైన చక్రాన్ని అమర్చు తారు. బాన. ఇది చర్మంతో గాని, ఇనుప రేకుతో గాని చేసింది. పైబాగాన వెడల్పుగాను, క్రింది బాగాన సన్నని మూతి గలది. అనగా బోర్లించిన అడుగు తీసేసిన కుండ ఆకారంలో వుంటుంది. ఈ బాన మూతి వైపున సుమారు ఆరు అడుగుల కైవారం ఉంటుంది. దీనికి ఒక ఇనుప చువ్వతో చేసిన రింగును అనుసందానించి ఆరింగుకు నాలుగు వైపులా నాలుగు ఇనుప కడ్డీలతో బిగించి చివరన ఒక చిన్న రింగు అమర్చుతారు. దానికి మోకు కట్టతారు. కింది వైపు సన్నని మూతిగల వైపున సుమారు ఒక అడుగు కైవారము గల చర్మంతో చేసిన సుమారు నాలుగడుగుల గొట్టం బిగిస్తారు. దీన్నే తొండం అంటారు. దాని చవరలలో రెండు చెవులు లాంటివి కుట్టి వుంచుతారు. దీనికి పొడవాటి దారం కట్టతారు. దీన్నీ తొండం తాడు అంటారు. ఇది కపిలి బాన యొక్క సమగ్ర రూపం.
ఇప్పుడు పొడవైన లావు పాటి దారాన్ని (దీన్నే మోకు అంటారు) తీసుకొని పైన అమర్చిన చక్రాని కున్న గాడి పై ఈమోకును అమర్చి దాని చివరను బానకున్న చిన్న రింగుకు కట్టి,, మరో వైపున ఉన్న తొండానికి ఇంకో సన్నని దారాన్ని కట్టి (తొండం తాడు) ఆ దారాన్ని కదురుగోలు పై వేసి ఈ రెండు దారాలను కాడిమానుకు కలిపి కట్టుతారు. కాడిమానును రెందు ఎద్దుల మెడపై వుంచి పలుపులతో బంధించి బానను బావిలోనికి వదులుతారు. ఇప్పుడు బాన బావిలో చక్రం పై మోకు, కదురుగోలు పై తొండం తాడు ఆధారంగా వేలాడు తుంటుంది. ఇప్పుడు బానను మెల్లిగా బావిలోనికి వదిలి ఎద్దులను కపిలికి ముందు వరకు (వెనక్కి నడిపించి) తీసుకొచ్చి తొండం తాడుని పట్టి లాగితే బానమూతి నీటిలో మునిగి బాన నిండుతుంది. ఇప్పుడు ఎద్దులను ముందుకు నడిపించితే నీటితో నిండిన బాన పైకి వస్తుంది. బానకన్న ముందు కిందనున్న తొండం పైకి వచ్చి అందులోని నీరు కాలవ లోనికి ప్రవహించి బయటకు వెళ్ళుతుంది. తిరిగి ఎద్దులను మెల్లిగా వెనక్కు నడిపించి బానను నీటిలో ముంచి ఒక మునక వెయించి మరలా ఎద్దులను ముందుకు నడిపిస్తారు. ఈ విదంగా నిరంత రాయంగా ఎద్దులను ముందుకు, వెనక్కు నడిపించి నీటిని తోడి పొలాలకు పారిస్తారు. ఒక్కోసారికి సుమారు రెండు మూడు వందల లీటర్ల నీరు బయటకు వస్తుంది.
ఇది చాల శ్రమతో కూడుకున్న పని. ఐనా ఈవిదంగానె రైతులు శ్రమించేవారు. సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఇదే విధానం అమలులో ఉండేది.. ఇప్పుడు కరెంటు మోటార్లు వచ్చినందున ఈ కపిలి ప్రక్రియ పూర్తిగా మరుగున పడిపొయింది. ఈ తరం వారికి కపిలి అంటే బొమ్మల్లో గాని, సినిమాల్లో గాని చూపించితేతప్ప తెలియదు. ఈ కపిలిలో ఉంకో రకం వుంది, అది తిరుగుడు కపిలి. ఈ విధానంలో ఎద్దులను మాటిమాటికి వెనక్కి నడిపించడం వుండదు. కాని దీనికి రెండు జతల ఎద్దులు కావాలి. ఇద్దరు మనుషులు కావాలి. ఈ విధానంలో నీరు కపిలికి సమాంతరంగా వున్న లేదా పల్లంలో వున్న పొలాలకు మాత్రమే నీరు పారించగలం. గతంలో వర్షాలు బాగా పడి చెరువులు. వంకలు, వాగులు, సెలయేళ్లు నీటితో నిండుగా వుండేవి. అందుచేత బావులలో నీరు నిండుగా వుండేది. కనుక కపిలి/మోటతో నీటిని సులభంగా తోడేవారు.అప్పట్లో అత్యంత లోతైన బావి అంటే 7 మట్ల బావి. ఒక మట్టు అంటే ఒకమనిషి లోతు. అనగా 6 అడుగులు. అనగా లోతైన బావి అంటే సుమారు 40 - 50 అడుగులు లోతు. ప్రస్తుతం భూగర్బ జలం అడుగంటినందున ఎంతో లోతుకు అనగా వందల అడుగుల లోతులో నీళ్లు ఉన్నాయి. అంత లోతు బావి త్రవ్వడం అసాద్యం., పైగా అంత లోతు నుండి కపిలి/మోట ద్వారా నీళ్లు తోడడం వీలు కాని పని. ఇప్పుడున్నవన్నీ వందలాది అడుగుల లోతైన బోరు బావులే. వాటిలో నుండి నీళ్లు తోడడం కరెంటు మోటార్లకే సాద్యం. అందు చేత బోరు బావులే అందరికి ఆధారం. బావులు రకాలు:.... బావులు చాల రకాలున్నాయి. గుండు బావి, చదరం బావి, దీర్ఘ చదరం బావి. కట్టుడు బావి. (ఇవి రాతితో కట్టినవి) దొరువు బావులు అంటే రాతి కట్టడం లేనివి, దిగుడు బావులు, అనగా మనుషులు గాని, పశువులు గాని నేరుగా బావిలోనికి దిగేటట్లు కొంత దూరం నుండి ఏటవాలుగ బావి ఆడుగు వరకు దారి వున్న బావులు. చేద బావి. ఇది చాల చిన్నది. బావి పైన కట్టిన గిలక సహాయంతో నీటిని తోడి ఇంటి అవసారాలకు వాడుకుంటారు. ఇవి పల్లెల్లో వుంటాయి. ప్రస్తుతం ఇలాంటి బావులన్నీ ఎండి పోయి అడుగున చెట్ట్లు మొలిచి ఉన్నాయి. ఇప్పుడున్నవ్న్నీ నీళ్లు కనిపించని బోరు బావులే పొలాలకు నీటిని తోడే విధానలలో ఇంకా కొన్ని పద్ధతులున్నాయి. అవి, గూడ, ఏతం.