కబంధుడు రామాయణములో రాముని చేత సంహరింపబడిన ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల, మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు, వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి.

రామ లక్ష్మణులకు తన వృత్తాంతమును వివరిస్తున్న కబంధుడు.

జన్మ వృత్తాంతము

మార్చు

ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రునితో కలహించెను. అంతట ఇంద్రుడు వజ్రాయుధముచే కబంధుని పరాజితుని గావించి, ఆతని శిరస్సును, ఇతర అంగములను శరీరము లోనికి చొచ్చునటుల చేసెను. ఇది ఒక కారణముగా చెప్పబడింది. మరొక కథ ప్రకారము, ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను. 1. ఒక రాక్షసుఁడు. వీఁడు జంఘారహితుఁడు అయి యోజనదీర్ఘములు అగు బాహువులును ఉదరమునందు అణఁగిన ముఖమును కలిగి దండకారణ్యమున ఉండెను. రామలక్ష్మణులు సీతను వెదుకుచు పోవు అవసరమయిన వారిని పట్టి మ్రింగపోఁగా వారు వీనిబాహువులు తెగనఱకిరి. అంతట వాఁడు ఒక గంధర్వుఁడు ఆయెను. తొల్లి దనువు అను గంధర్వుఁడు తపోబలముచే చిరజీవిత్వమును కామరూపిత్వమును పడసి క్రౌర్యపరుఁడు అయి ఉండఁగా వానికి స్థూలకేశుఁడు అను ఋషి శాపముచే ఇట్టి రాక్షసరూపము ప్రాప్తము అయ్యెను. అనంతరము మఱి ఒకప్పుడు వాఁడు ఇంద్రునితో సంగరము కోరి పోరునపుడు అతని వజ్రాయుధము పెట్టుచేత కంఠమును శిరమును కాళ్లును పొట్టలోపలికి అడఁగిపోయెను. వాఁడే కబంధుడు అన పరఁగెను. కాఁబట్టి రామలక్ష్మణులు తన బాహువులను తెఁగగొట్టగానే వీనికి శాప విమోచనము అయ్యెను.

కబంధ వధ

మార్చు

శ్రీరాముడు కబంధుని యుద్ధమున తీవ్రముగా గాయపరచిన పిదప, కబంధుడు శ్రీరాముని తన దేహమును మరణించిన పిదప దహనము చేయమని కోరెను. శరీరము దహింపబడుచుండగా కబంధుడు తన నిజ రూపమున ప్రత్యక్షమై, శ్రీరామునకు మైత్రి అవసరమని సుగ్రీవుడు చేతులు కలపమని రావణుని జయించడం తేలికగా అవుతుందని బోధించెను. కబంధునకు దను అను పేరు కూడా ఉంది.

బయటి లింకులు

మార్చు

కబంధుడు గురించి

"https://te.wikipedia.org/w/index.php?title=కబంధుడు&oldid=2956163" నుండి వెలికితీశారు