కలవారి కోడలు (గేయం)

కలవారి కోడలు సమష్టి కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి విశిష్టత, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను, వారి బాధ్యతలను, ప్రవర్తనా రీతులను వివరించే కౌటుంబిక జానపద గేయం. ఈ గేయాన్ని నల్గొండ జిల్లా భువనగిరి తాలూకాలోని నానిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీమతి మనమ్మ బతుకమ్మ పండుగ సందర్భంగా పాడారు.

కుటుంబం

గేయం మార్చు

గేయ సారాంశం మార్చు

"కలవారి కోడలు" కామాక్షిని అత్తింటి నుండి పుట్టింటికి తీసుకొని పోవడానికి ఆమె అన్నలు వస్తారు. కడవలో పప్పు కడుగుతున్న కామాక్షి అన్నలను చూడగానే కన్నీరు పెట్టుకుంది. ఆమె కన్నీరు పుట్టింటిపైన స్త్రీలకుండే ప్రేమానురాగాలకు ప్రతీక. ఇంటికి అథిథులు వచ్చినప్పుడు మొదట కాళ్ళకు నీళ్ళివ్వడం జానపదుల సాంప్రదాయం. కామాక్షి కూడా అన్నలకు నీళ్ళనిస్తుంది. వారు చెల్లెలి కన్నీరును చూచి, ఆమె మదిలోని ఆవేదనను అర్ధం చేసుకొని సొమ్ములు పెట్టుకొని, పట్టుచీర కట్టుకొని అత్తమామల అనుమతిని తీసుకొని పుట్టింటికి బయలుదేరమంటారు. అత్తింటి సౌభాగ్య సంపదలను పుట్టింట్లో ప్రదర్శించడం, పుట్టింటి భోగభాగ్యాలను అత్తింటిలో చెప్పుకోవడం తెలుగు ఆడపడుచుల సహజగుణం.

అన్నల ఆదేశానుసారం కోడలు ఇంటికి పెత్తనం వహించే కుర్చీపీట మీద కూర్చున్న అత్తను పుట్టింటికి వెళ్ళడానికి అనుమతినివ్వమని అడుగుతుంది. ఆమె మామను అడగమంటుంది. పట్టె మంచం మీద పడుకున్న మామ బావనడుగ మంటాడు. భారతం చదివేటి పెదబావ అక్కనడుగ మంటాడు. వంటలు చేసేటి అక్కగారు భర్తనడుగ మంటుంది. చిట్టచివరకు రచ్చలో కూర్చున్న రాజేంద్రభోగి "సొమ్ములు పెట్టుకొని, చీరకట్టుకొని పుట్టింటికి పోయిరా" అని అనుమతి నిస్తాడు. కోడలు కామాక్షి ఇంటివారి అనుమతిని తీసుకొని ఇరుగక్క పొరుగక్కలకు చెప్పి పుట్టింటికి బయలుదేరుతుంది.

వ్యాఖ్యానం మార్చు

  • పుట్టి పెరిగిన కన్నవారింటికి పోవడానికి కామాక్షి అత్తింట్లోని కుటుంబ సభ్యుల అనుమతిని వేడడం, ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వెళ్ళడం అచ్చమైన పల్లీయ పడతి జీవితాన్ని ప్రతిబింబించే గేయమిది.
  • భర్త కొరకే భార్య అత్తింటికి వచ్చినా, కోడలు భర్తతో పాటు కుటుంబ సభ్యులందరితో భక్తి గౌరవాలతో మెలగాలి అని ఈ గేయం పరోక్షంగా బోధిస్తుంది.
  • కుటుంబంలోని అందరి అనుమతిని వేడినా, అనుమతినిచ్చేది మాత్రం ఆమె భర్తే. భార్య జీవితాన్ని శాసించేది భర్తే, భర్త ఇష్టానుసారంగా భార్య ప్రవర్తించాలి. ఇటువంటి వినయ విధేయతలున్న కోడళ్ళవల్లనే కుటుంబం సమష్టిగా మనగలుగుతుంది, లేకుంటే ముక్కలు ముక్కలై పోతుంది. అందుకే కుటుంబానికి కోడలు సహనం, వినయ విధేయతలే మూలస్తంభాలని జానపదుల విశ్వాసం.
  • ఈ గేయంలోని కామాక్షి కలవారి కోడలు. కలవారి ఇళ్ళల్లో కోడళ్ళు తప్ప మిగతా వారెవ్వరూ పనిచేయరు. అత్తగారు కుర్చీపీట మీద కూర్చుంటుంది, మామ పట్టెమంచం మీద పడుకుంటాడు, బావ భారతం చదువుతుంటాడు, భర్త రచ్చబండలో రాజేంద్ర భోగిలా కూర్చుంటాడు. కామాక్షి మాత్రం పప్పు కడుగుతుంటుంది, ఆమె తోటి కోడలు వంటలు చేస్తుంటుంది.
  • పల్లెల్లో ఒక్కొక్క వీధిలోని వారందరూ ఒకే కుటుంబంగా సఖ్యతగా ఉంటారు. ఎవ్వరింట్లో ఏది జరిగినా ఎవ్వరు ఎక్కడకు వెళ్ళినా వీధి అంతా తెలియజేస్తారు. ఇది పల్లెటూర్తలోని ఇరుగు పొరుగుల సఖ్యతకు ఒక నిదర్శనం.