కాజీపేట శ్వేతార్కమూల గణపతి దేవాలయం

తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేటలోని వినాయక దేవాలయం

కాజీపేట శ్వేతార్కమూల గణపతి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేటలోని రైల్వేస్టేషను ప్రాంగణంలో ఉన్న వినాయక దేవాలయం. గణపతికి ప్రతిరూపంగా భావిస్తున్న వంద సంవత్సరాలు దాటిన శ్వేతార్కం (తెల్ల జిల్లేడు) చెట్టుమూలం (వేరు) గణపతి ఆకృతిని పొందిందని చెబుతారు. తూర్పు అభిముఖంగా కొలువుదీరిన ఈ గణేషుడిని దర్శించుకోవడానికి అనేకమంది భక్తులు వస్తుంటారు.[1] తమిళనాడులోని మహాబలిపురంలో లభించిన అమృతశిల అనే ప్రత్యేకమైన రాయితో తయారుచేయబడ్డ ఈ దేవాలయంలోని విగ్రహాలను నాణెంలాంటి ఏదైనా లోహపు వస్తువుతో కొట్టినపుడు సంగీత స్వరాలు పలుకుతాయి.

కాజీపేట శ్వేతార్కమూల గణపతి దేవాలయం
పేరు
స్థానిక పేరు:శ్వేతార్కమూల గణపతి
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హన్మకొండ జిల్లా
ప్రదేశం:కాజీపేట
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వినాయకుడు
ప్రధాన పండుగలు:వినాయక జయంతి, వినాయక చవితి
నిర్మాణ శైలి:దేవాలయ నిర్మాణ శైలీ

పేరు వెనుక చరిత్ర

మార్చు

శ్వేతం అనగా తెలుపు, ఆర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు పెరిగితే ఆ చెట్టు వేరుమూలంలో గణపతి రూపం తయారవుతుందని నారద పురాణంలో చెప్పబడింది. తెల్లజిల్లేడు వేరు మొదలు నుంచి ఉద్భవించింది కనుక ఇక్కడి గణపతిని శ్వేతార్కమూల గణపతి అంటారు. ఈ విగ్రహాన్ని చెక్కడం కాని, మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం, అన్ని స్పష్టంగా కనబడతున్నాయి.[2]

దేవాలయ చరిత్ర

మార్చు

ఐనవోలు అనంత మల్లయ్యశర్మ 2009లో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఒకనాడు కాణిపాకంలోని గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న మల్లయ్యశర్మ, కాణిపాకం నుంచి తిరిగొచ్చాక కాజీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలోని సాయిబాబా దేవాలయంలో పూజారిగా సేవ చేయడం ప్రారంభించాడు. 1999 ఏప్రిల్ 20న తన కలలో నల్గొండ పట్టణానికి చెందిన మాడ ప్రభాకర శర్మ ఇంటిలోని ‘శ్వేతార్కమూల గణపతి’ దర్శనమివ్వగా, నల్గొండకు వెళ్ళి 'తెల్ల జిల్లెడు' చెట్టు వేరులోవున్న గణేశుడి విగ్రహాన్ని కనుగొన్నాడు. 2009లో విష్ణుపురిలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా దేవాలయ నిర్మాణం చేసి, ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ విగ్రహానికి పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్ని అమర్చారు.[3]

ఒడియా నిర్మాణ శైలిలో నిర్మించిన మూడు అంతస్తుల దేవాలయ సముదాయంలో వీరాంజనేయ, సీతారామలక్ష్మణులు, పద్మావతి వేంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి, షిరిడీ సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతినెల మొదటి మంగళవారం రోజున ప్రత్యేక గణపతి హోమం, గరిక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6.30 గం. అభిషేకం, 8.00 గం. మహానివేదన, రాత్రి 7.00 గం. పూజలు జరుగుతాయి.[4] ఈ దేవాలయానికి స్వంత వెబ్‌కాస్టింగ్ సౌకర్యం, రేడియో కూడా ఉన్నాయి. వాటిద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ప్రతిరోజూ దాదాపు 12,000 మంది భక్తులకు వెబ్‌కాస్ట్ చేయబడుతున్నాయి.

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-08-31). "తెలంగాణ‌లో స్వయంభువుగా గ‌ణేశుడి ఆల‌యాలు ఇవే." Namasthe Telangana. Archived from the original on 2022-08-31. Retrieved 2022-09-01.
  2. N, Saraswathi (2019-05-03). "స్వయంభువుగా తెల్లజిల్లేడు వేరు నుండి ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి దర్శిస్తే." telugu.nativeplanet.com. Archived from the original on 2022-09-01. Retrieved 2022-09-01.
  3. Edwin, James (2016-09-13). "Temple draws thousands with its musical deities". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-09-14. Retrieved 2022-09-01.
  4. "శ్వేతార్కమూల గణపతి". TeluguOne Devotional (in english). 2022-09-01. Archived from the original on 2020-02-23. Retrieved 2022-09-01.{{cite web}}: CS1 maint: unrecognized language (link)