కాదంబరి (నవల)
కాదంబరి రావూరి భరధ్వాజ రచించిన నవల. మహాకవి బాణుడు రచించిన 'కాదంబరి' సంస్కృతంలో వెలసిన వచన కావ్యం. ఈ మాటకి నానార్ధాలూ ఉన్నాయి. ఒకానొక కావ్య విశేషం, ఆడు కోయిల, గోరువంక, మద్యం, నవల మొదలైనవి. ఈ నవల వచన కావ్యంలాగా ఉంది. ఇందులోని ప్రతి పాత్రా ఒక్కో రకమైన మాదకతతో జోగిసలాడి పోతూ ఉంది. పుస్తకానికి 'కాదంబరి' అన్న శీర్షిక నుంచండి అని సలహా ఇచ్చినవారు డాక్టర్ రాఘవాచార్య గారు" అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు భరద్వాజ.
సంక్షిప్త నవల
మార్చుఇది రామకృష్ణయ్య కథ. పేదరికాన్ని భరించలేక చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయిన రామకృష్ణయ్య అనేక రకాల ఉద్యోగాలు చేసి, సినిమా హాల్లో బ్లాక్ టిక్కట్లు అమ్ముతూ కోటీశ్వరుడైన చంద్రశేఖరం దృష్టిలో పడతాడు. దానితో అతని జాతకం పూర్తిగా మారిపోతుంది. జీనియస్ ఎక్కడున్నా ఇట్టే పట్టుకునే చంద్రశేఖరం రామకృష్ణయ్యని తన దగ్గర పెట్టుకుని తన వ్యాపారాల మెళకువలు నేర్పడం మాత్రమే కాదు, తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాడు కూడా. పెళ్ళైన కొన్నాళ్ళకే ఆత్మాభిమానం విషయంలో బొత్తిగా రాజీ పడలేని రామకృష్ణయ్య భార్యతో కలిసి వేరు కాపురం పెట్టి, సొంతంగా కలప వ్యాపారం ప్రారంభిస్తాడు.
అంచెలంచెలుగా ఎదిగిన రామకృష్ణయ్య, ఉన్నట్టుండి ఒకరోజు తన వ్యాపారం మొత్తం కొడుక్కి అప్పగించేసి, 'మయూరాక్షి' నది మీద ప్రభుత్వం ఆనకట్ట కట్టాలంటూ పోరాటం మొదలు పెడతాడు. అధికార గణంలో ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన రామకృష్ణయ్యకి, అన్ని పార్టీల నాయకులూ స్నేహితులే. ఉన్నట్టుండి అతనీ పని ఎందుకు మొదలుపెట్టాడో ఎవరికీ తెలియకపోయినా, అతనితో పనులు ఉన్న వాళ్ళూ, అతను ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడనీ నమ్మిన వాళ్ళూ అతనితో చేతులు కలుపుతారు.
రామకృష్ణయ్యకి ఉన్న బలహీనత అతని కూతురు కౌముది. కూతురికోసం ఏమైనా చేస్తాడు ఆయన. కొడుకు మీద కూడా ఇష్టం ఉన్నా, మెజారిటీ తండ్రుల్లాగే కూతురంటే కొంచం ఎక్కువ ఇష్టం. తన తల్లితండ్రుల నుంచి తను పొందలేకపోయినది ఏమిటో బాగా తెలిసిన రామకృష్ణయ్య, పిల్లలని మాత్రం కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అంతేకాదు, కొడుకు, కూతురితో కలిసి విస్కీ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ తన సాయంత్రాలని ఆనందంగా గడపడం ఎలాగో బాగా తెలుసు. 'మయూరాక్షి' ప్రాజెక్ట్ కోసం రామకృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తుంది కౌముది. అక్షరాలా తండ్రి వెనుక నిలబడుతుంది.
అంత గొప్ప వ్యాపారస్తుడూ, పనులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంతో విరోధం తెచ్చుకునే ఉద్యమం ఎందుకు మొదలు పెట్టాడు, ఇందులో కౌముదికి ఉన్న ఆసక్తి ఏమిటి, చివరకి ఆ తండ్రీ కూతురూ సాధించింది ఏమిటి అన్నదే 'కాదంబరి' నవల.
మూలాలు
మార్చు- విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 164, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.