కారు (ఆంగ్లం Car) అనే పదం మోటారుకారుకు వాడుక పదం. కారు మోటారుతో నడిచే చక్రాలు కలిగిన వాహనం. నిర్వచనాల ప్రకారం కారుకు ఒకటి నుండి ఎనిమిది మంది కూర్చొనడానికి వీలుగా ఉండి నాలగు చక్రాల సహాయంతో మానవుల రవాణాకు మాత్రమే ఉపయోగపడే ఒక వాహనం.[1] కాని, చాలా రకాల వాహనాలు చాలా పనులకొరకు ఉపయోగించబడుతున్నాయి, కనుక కారుకు పై నిర్వచనం కొన్ని సార్లు వర్తించకపోవచ్చు.

ప్రస్తుతం వాడబడుతున్న కారు

ఆవిష్కరణ

మార్చు

1769లో మొట్టమొదటి తనకుతాను నడిచే వాహనాన్ని కనుగొన్నట్టుగా నికోలస్-జోసెఫ్ కగ్నాట్‌ను పేర్కొంటారు. కాని కొంతమంది ఈయన తయారు చేసిన మూడు చక్రాల వాహనం అసలు నడవలేదని చెప్తారు. మరికొంతమంది ఫెర్డినాడ్ వెర్బీస్ట్ అనే ఆయన ఆవిరితో నడిచే కారును 1672 లో కనుగొన్నట్టు చెప్తారు.[2][3] ఏదేమైనా గాని స్విస్ దేశానికి చెందిన ఫ్రంకోయిస్ ఐసాక్ డే రివాజ్, హైడ్రోజన్, ఆక్సిజన్ల మిశ్రమంతో నడిచే మొట్టమొదటి 'ఇంటర్నల్ కంబషన్ ఇంజన్' కలిగిన వాహనాన్ని రూపొందించాడు. కాని ఆ డిసైన్ అంత విజయవంతమవలేదు.[4]

1881 నవంబరులో ఫ్రాన్స్ దేశానికి చెందిన గస్టావే ట్రావే పారిస్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ ఎక్సిబిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటి'లో నడిచే మూడు చక్రాల వాహనాన్ని ప్రదర్శించాడు.[5]

చరిత్ర

మార్చు
 
కార్ల్ బెంజ్ యొక్క "వెలో" మోడల్‌తో (1894) కార్ల తయారీ ప్రారంభమైనది

ఆవిరితో పనిచేసే కారు రోడ్లపై ఎక్కువ కాలం పరుగెత్తలేక పోయింది. ఆవిరి ఇంజన్ చాలా బరువుగా ఉండటం, దీని నియంత్రణ సులభంగా జరగక పోవటం వల్లనే ఇది నాలుగు కాలాలపాటు నిలదొక్కుకోలేకపోయింది. 19 వ శతాబ్దం ఉత్తరార్థంలో యంత్ర సహాయంతో పనిచేసే రోడ్డు రవాణా సాధనం యొక్క ఆవశ్యకత క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. దానితో బాటు పారిశ్రామిక రంగంలో కూడా సమర్థవంతమైన శక్తి సాధనాల ఆవశ్యకత పెరిగింది. పరిశోధనల ఫలితంగా విద్యుత్ మోటారు కనుక్కోబడటం, విద్యుచ్చక్తి ఉత్పాదన, పంపిణీ లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడినవి. కానీ కొందరు శాస్త్రజ్ఞులు వాయు ఇంజన్ ల వైపు దృష్టి సారించారు.

1863 లో ఎటీన్ లెనాయిర్ అనే ఫ్రాన్స్ ఇంజనీరు మామూలు బొగ్గు వాయువుతో పనిచేసే ఇంజన్ ని నిర్మించి, దీనితో ఒక చిన్న కారును నడపగలిగాడు. వియన్నాకి చెందిన సిగ్‍ఫ్రీడ్ మార్కన్ అనే మరో ఇంజనీరు 1875 లో తొలిసారిగా ఆస్ట్రియా రాజధాని పట్టణ వీధుల్లో పెట్రోలుతో కారును నడిపాడు. కానీ శబ్దం ఎక్కువగా ఉంటుందనే కారణంతో పోలీసులు దీన్ని నిషేధించారు. 1884 లో ఇంగ్లండ్కి చెందిన ఎడ్వర్డ్ జట్లర్ ఇది వరకటి ఇంజన్ ని మెరుగు పరచి నెట్రోలుతో నడిచే మూడు చక్రాల సైకిల్ ని ప్రదర్శించాడు. కానీ ఇలాంటి కొత్త వాహనాలు బహుశ ప్రచారంలోకి రావటానికి తగిన వాతావరణం అప్పట్లో లేదు. ఇంగ్లండ్ లో ఆ రోజుల్లో "ఎర్ర జండా చట్టం" అంటూ ఒకటుండేది. దీని ప్రకారం గుర్రం లేని ఏ వాహనం గానీ నగర ప్రాంతాల్లో గంటకు రెండు మైళ్ళ వేగం కంటే ఎక్కువగానూ, వూరి బయట నాలుగు మైళ్ల వేగం కంటే ఎక్కువగానూ వెళ్ళటానికి వీలులేదు. అలా వెళ్ళే పక్షంలో వాహనం ముందు ఎర్రజెండా పుచ్చుకుని ఒక మనిషి తప్పని సరిగా వెళ్ళాలి. ఇది బట్లర్ నమూనా వల్ల శాపంగా పరినమించిన ఈ చట్టం మూలంగా పరిశోధనలన్నీ నిలిచి పోయాయి. వాటి కోసం చేసిన ఖర్చంతా బూడిదపాలైంది.

ఇలా ఉండగా జర్మనీలో ప్రయోగాలు చురుకుగా సాగాయి. 1872 లో ఆగస్టు నికొలాన్ ఆటో అనే ఇంజనీరు వాయు ఇంజన్ కనిపెట్టాడు. ఆవిరి ఇంజన్ లలో లాగ ఇంధనం యంత్రం లోపలి భాగంలోనే దహనమవుతుంది. ఈ ఏర్పాటు వల్ల ఉష్ణం వృధా కావటాన్ని తగ్గించుకోవచ్చు.

వైజ్ఞానిక పరిశోధనల్లో ఆటోకి సహచరుడిగా డేమ్లిర్ అనే ఇంజనీరు ఇతని ఫ్యాక్టరీలో చేరాడు. ఇతనికి జర్మనీ లోనే గాక విదేశ కంపెనీలలో కూడా మంచి అనుభవం ఉండేది. అంతర్థహన యంత్రంలో పనిచేసే మొట్టమొదటి మోటారు సైకిల్ ని డేమ్లర్ నిర్మించి, 1885 లో తన ఇంటిపెరట్లోనే ప్రయోగాత్మకంగా నడిపాడు. తనకంటే పదేళ్ళూ చిన్నవాడైన కార్ల్ బెంజ్ కేవలం 60 మైళ్ళ దూరంలో పెట్రోలుతో నడిచే చిన్నకారు నిర్మాణాన్ని కొన్ని నెలల క్రితమే పూర్తి చేశాడని డేమ్లర్ కి అప్పట్లో తెలియలేదు.

బెంజ్ ఆవిష్కరణ

మార్చు

బెంజ్ ఒక రైల్వే కార్మికుని కొడుకు. చిన్నప్పుడే తండ్రి చనిపోవటం వల్ల తల్లిని పోషించే భారం ఇతనిపై పడింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి లోంచి బయటపడి స్వంతంగా ఒక చిన్న పర్క్ షాపు స్థాపించుకోవటానికి అతడు చాలా ఏళ్ళు శ్రమ పడ్డాడు. సైకిల్ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక రవానా సాధనాలను యంత్ర సహాయంతో ఎలా మెరుగు పరచటమో అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. లెనాయిర్ వాయు ఇంజన్ ని చూశాక డేమ్లర్ లాగా పెట్రోలుని ఇంధనంగా వాడవచ్చునన్న ఆలోచన తట్టింది. ఇలా చేయటం చౌకగా ఉంటుంది కూదా.

బెంజ్ నిర్మించిన కొత్త నమూనా ఇంజన్ తో బాటు 1877 లో జేమ్స్ స్టార్లీ కనుగొన్న దిఫరెన్షియల్ గేర్ అనే సాధనాన్ని కూడా తన మూడు చక్రాల కారు నిర్మాణంలో అమర్చాడు. రోడ్డు వంపు ఎక్కువగా ఉండే సందర్భాల్లో లోపలి చక్రాల కంటే బయటి చక్రాల వేగం అధికంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఈ కొత్త గేర్ విధానం బాగా ఉపకరిస్తుంది. కారును ఇటూ అటూ తిప్పడానికి డ్రైవర్ సీటు వద్ద ఒక చిన్న చక్రాన్ని కూడా అమర్చాడు. 1885 లో ఒక రోజు అతని వర్క్ షాపుకు దగ్గరి మైదానం చుట్టూ కొత్త కారులో ఒకసారి తిరిగేసరికి గర్వంతోనూ, సంతోషం తోనూ బెంజ్ ఉబ్బి తబ్బిబ్బయ్యడు. కానీ పట్టరాని ఆ భావోద్వేగంతో కారు గోడకు ఢీ కొట్టడంతో మొదటి ప్రయోగం విఫలమైంది. ఇది వరకటి నమూనాను కొద్ది మార్పులతో మళ్ళీ నిర్మించి 1887 పారిస్ ప్రదర్శనలో చూపెట్టాడు. గానీ దీన్ గురించి ఎవరూ అంతటా పట్టించుకోలేదు. ఒక సంవత్సరం తరువాత మూనిచ్ నగర వీధుల్లో దీన్ని నడుపుకుంటూ వెళ్ళినపుడు గొప్ప సంచలనం చెలరేగింది. అనేక దేశాల నుంచి మోటార్ కారుల కోసం విజ్ఞప్తులు కోకొల్లలుగా వచ్చాయి. మ్యూనిచ్ నుంచి మాన్ హీంకి బెంజ్ తిరిగి వచ్చేలోగా మరో "సంఘటన" జరిగిపోయింది. 15, 13 సంవత్సరాలు వయస్సు గల అతని ఇద్దరు కొడుకులు వాళ్ళ అమ్మని పోర్ట్ హీమ్‍కి తీసుకెళ్ళి వెనక్కి రావటమే కాకుండా దారిలో అవసరమైన కొన్ని మరమ్మత్తులు కూడా చేసేసారట! మోటారు కారుతో 125 మైళ్ళు ప్రయాణం చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదు. కారులో అంతదూరం వెళ్ళడం నిజంగానే "పిల్లాట"" అయిపోయింది.

డేమ్లర్ ఆవిష్కరణ

మార్చు

డేమ్లర్ నాలుగు చక్రాలతో నడిచే తొలికారును 1886 లో నిర్మించాడు. ఇందులో అతడు 1.5 హెచ్.పి ఇంజన్ ని వాడాడు. ఇది గంటకు 18 మైళ్ళ వేగంతో పోసాగింది. విల్‍హెమ్‍మేబక్ తో కలిసి చేసిన మూడేళ్ళ కృషి ఫలితంగా నలుగురు కూర్చోవటానికి వీలైన కారుని డేమ్లర్ 1889 పారిస్ ప్రదర్శనలో చూపెట్టాడు. అతని అంగీకారంతో ఒక ఫ్రాన్స్ కంపెనీ ఇలాంటి కార్లను పెద్ద ఎత్తున తయారుచేయటం మొదలుపెట్టింది. అప్పటి నుండి మోటారు కారు నిర్మాణంలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంటోంది. 1894 లో మొదటి మోటార్ కారు పందెం నిర్వహించినపుడు డేమ్లర్ తయరుచేసిన కారు గెలిచింది. బెంజ్ కూడా అసంఖ్యాకమైన కార్లను ఫ్రాన్స్ కు అమ్మాడు. "మోటారు కారు పరిశ్రమకి జర్మనీ తండ్రి అయితే, ఫ్రాన్స్ తల్లి అవుతుంది." అని బెంజ్ చెబుతుండేవాడు.

అమెరికాలో కార్లు

మార్చు

మొదటి మోటార్ కారు చూడటానికి అమెరికా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అంరికా రోడ్డుపై పెట్రోలుతో నడిచే మొదటి వాహనం 1893 లో నిర్మించబడింది. చార్లెస్ డూరియా అనే మెకానిక్ దానిలో ప్రయానం చేశాడు. గానీ అతనికి వేగంపై అదుపు లేకుండా పోయింది. అతడు నిర్మించిన తరువాత నమూనాలు మెరుగ్గా ఉండటమే కాకుండా పోటీలలో ఇతర దేశాల వాహనాల కంటె వేగంగా వెళ్ళ గలిగాయి.

అమెరికా దేశపు మోటార్ కార్ల రాజధానిగా ప్రసిద్ధి చెందిన టెట్రాయిట్ నగరంలో మొట్టమొదటి మోటార్ కారుని హెన్రీ ఫోర్డ్ అనే ఎలక్ట్రీషియన్ 1896 లో నిర్మించి తానే నడిపాడు. ఇతడు సమర్థవంతమైన మెకానిక్. చిన్న వయస్సునుంచే మంచి ఊహాశక్తి, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఉండేవాడు. అతి వేగంగా పెరుగుతున్న సంపద, సువిశాల దూరాలు కలిగి అమెరికా దేశం ఎన్ని మోటార్ కారులనైనా వాడటానికి వీలుందని అతడు దృఢంగా విశ్వసించేవాడు. కానీ గుర్రాల వ్యాపారులు, వాటిని మేపేవాళ్ళు, కమ్మరులు, గడ్డి వ్యాపారులు అప్పటి రవాణా భారాన్నంతా పోస్తున్న గుర్రాలపై ఆధారపడి జీవన యాత్ర చేసేవాళ్ళు. కాబట్టి వాడకానికి తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించారు.

ఫోర్డ్ కారు

మార్చు

కొత్త విషయాలను కనుక్కోవటం కన్నా ఉన్నవాటిని మెరుగు పరచటంలోనూ సంధలను నిర్వహించటంలోనూ ఫోర్డ్ కి ఎక్కువ ఆసక్తి ఉండేది. యూరప్ ఖండంలో వాడే కార్లలోని ప్రధాన దోషాలెమిటో అతడు కనుక్కోగలిగాడు. అక్కడి కార్లన్నీ క్రీడాకారుల కోసం,ఔత్సాహిక యువకుల కోసమే గాని నిత్యజీవితంలో అహర్నిశలు శ్రమించే సామాన్య పౌరుని అవసరాల్ని తీర్చలేకపోయాయి. కొనటానికి చౌకగా, వాడటానికి పొదుపుగా ఉంటూ సమర్థవంతంగానూ, దోష రహితంగానూ ఉండే రవాణా సాధనం అమెరికా ప్రజలకు అత్యంతావశ్యకమని భావించిన హెన్రీ ఫోర్డ్ "టిన్ లిజీ" అనే మోటారు కారు నమూనాను తయారుచేశాడు. దీంతో అతడు కోట్లాది డబ్బు ఆర్జించటమే కాకుండా ప్రపంచమంతటా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు.

మోటారు కార్ల ఉత్పత్తి కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించాడు. దీని పొడవు దాదాపు పాతిక మైళ్ళు ఉంటుంది. పెద్ద ఎత్తున కార్లను నిర్మించటానికి కన్వేయర్ బెల్ట్ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టాడు. 1908 లో ఫోర్డ్ తయారుచేసిన టిన్‍లిజీ నమూనాని ఇప్పుడుచూస్తే చాలా మొరటుగానూ, విచిత్రంగానూ కనిపించవచ్చు. కానీ ఇది అమెరికా పురోగమనానికి ఎంతగానో దోహదపడిందన్న వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి 1908 నుంచి 1927 వరకు 15 మిలియన్ల కార్లను ఉత్పత్తి చేశాక నమూనాను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని ఫోర్డ్ గ్రహించాడు.

రోబోటిక్‌ కార్లు

మార్చు

మన శాస్త్రవేత్తలు డాక్టర్‌ భీబయ్య శర్మ, డాక్టర్‌ ఉతేష్‌ చంద్ బృందం రూపొందించిన గణిత సూత్రాలు రొబోటిక్‌ కార్లు తాము ప్రయాణిస్తున్న దారిని ఎప్పుడు, ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాయి.రొబోటిక్‌ కారును అందులో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌కు శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్స్‌ ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటాయి. ప్రతి కారులోనూ సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్స్‌ ఉంటాయి కాబట్టి ఇవి పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మరీ దగ్గరగా వచ్చినా, ఎదురెదురుపడినా పరస్పరం సంభాషించుకుని సురక్షిత మార్గం ఏదో గుర్తించి ఆ దిశగా కదులుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తలెత్తవు. కార్లు రెండూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మాత్రం ప్రమాదం జరగదు. అలా కాకుండా కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని పక్కకు ఒకటి అత్యంత సమీపంలోకి వచ్చినా, లేదంటే కారు మరీ రోడ్డు పక్కకు వచ్చినా ప్రమాదం జరగదని చెప్పలేం.ఎందుకంటే - రోబోటిక్‌ కార్లలో ఉండే సెంట్రలైజ్డ్‌ బ్రెయిన్‌లకు సూచనలు అందించే అల్గారిథమ్స్‌ ఎదురెదురుగా వచ్చే రోబోటిక్‌ కార్ల నడుమ మాత్రమే సమాచార బదిలీ జరుగుతుంది. పక్కపక్కన ప్రయాణించే కార్లు పరస్పరం సభాషించుకోలేవు, సమాచారం ఇచ్చిపుచ్చుకోలేవు .

బ్లాక్‌ బాక్సులతో కార్లు

మార్చు

ఈ బ్లాక్‌ బాక్సులో కారు వేగం, స్టీరింగ్‌, బ్రేకులు పనితీరు వీడియో చిత్రాలతో నమోదవుతుంది. దీనికోసం వాహనం లోపలా, బయటా కెమెరాలూ అమర్చుతారు. ప్రమాదం జరిగిన తర్వాత ఈ పరిజ్ఞానం తనంతట తానే పోలీసులు, బీమా సంస్థలకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల ప్రమాదానికి కారణాన్ని, బాధ్యులను వెనువెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా పరిజ్ఞానం రోడ్డుపై ఉండే సంకేత చిహ్నాలను గుర్తించి, నియంత్రణలోనూ తోడ్పడుతుంది. కారులో ఉండే సెన్సర్లు రోడ్డుపై గుంతలను గుర్తించి జీపీఎస్‌ వ్యవస్థ సాయంతో రహదారుల నిర్వహణ విభాగాలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతాయి. కారును అడ్డగోలుగా నడుపుతున్నా, ఇతర వాహనాలకు మరీ సమీపంగా వెళ్లినా, వరుసలు మార్చి నడిపినా వెంటనే డ్రైవర్‌కు హెచ్చరిక అందుతుంది.

బీఎస్‌-4 వాహనం

మార్చు

2010 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశంలోని 13 నగరాల్లో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే బీఎస్‌-4 వాహనాల్ని మాత్రమే రిజిస్టర్‌ చేస్తున్నారు. బీఎస్‌-3 వాహనం రిజిస్టర్‌ చేయడానికి వాహనాల డీలర్లు ప్రయత్నించినా ఇకపై ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ పోగ్రాం తిరస్కరిస్తుంది.

గాలి వాహనం

మార్చు

బెంగళూరు సమీపంలోని రామనగరకు చెందిన నంజుండయ్య గాలితో వాహనాన్ని నడిపి చూపాడు.14 కెజీల గాలిని రెండు సిలిండర్లతో నింపుకుంటే యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చన్నారు.

మైలేజీ పెంచే యంత్రం

మార్చు

కారులో ఇంధన వృథాను అరికట్టి తద్వారా మైలేజీని పెంచే యంత్రాన్ని తమిళనాడుకు చెందిన రైతు నెహ్రూ కనుగొన్నాడు. పాకెట్‌సైజులో ఉన్న ఈ యంత్రాన్ని ఇంజిన్‌కు బిగిస్తే 15-20 శాతం ఇంధనం పొదుపు అవుతుందని, మైలేజీ 30 శాతం పెరుగుతుందని ఈయన ప్రయోగపూర్వకంగా నిరూపించారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. పాకెట్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ. లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. 1976. ISBN 0-19-861113-7.
  2. "SA MOTORING HISTORY - కాల రేఖ" (PDF). దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వము. Archived from the original (PDF) on 2007-06-14. Retrieved 2007-10-30.
  3. సెట్‌రైట్, ఎల్. జె. కె. (2004). డ్రైవ్ ఆన్!: ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ ద మోటార్ కార్. గ్రాంటా బుక్స్. ISBN 1-86207-698-7.
  4. రాల్ఫ్ స్టీన్ (1967). ద ఆటోమొబైల్ బుక్. పాల్ హామ్లిన్ లిమిటెడ్.
  5. వేక్‌ఫీల్డ్, ఎర్న్‌స్ట్ ఎచ్. (1994). హిస్టరీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఆటోమొబైల్. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్, ఇంక్. p. 2-3. ISBN 1-56091-299-5.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కారు&oldid=4276153" నుండి వెలికితీశారు