కాలాతీత వ్యక్తులు
కాలాతీత వ్యక్తులు డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు నవల. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.
కాలాతీత వ్యక్తులు | |
"కాలాతీత వ్యక్తులు" పుస్తక ముఖచిత్రం.. | |
కృతికర్త: | పి. శ్రీదేవి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: | 1958 |
ఈ నవల ఆధారంగా తెలుగులో చదువుకున్న అమ్మాయిలు (1963) అనే సినిమాను నిర్మించారు.[1]
పాత్రలు
మార్చు- ప్రకాశం - వైద్య విద్యార్థి
- కృష్ణమూర్తి - ప్రకాశం స్నేహితుడు
- ఇందిర
- ఆనందరావు - ఇందిర తండ్రి
- కళ్యాణి - ఇందిర స్నేహితురాలు
- వసుంధర - కళ్యాణి క్లాస్ మేట్
- డాక్టర్ చక్రవర్తి
సంక్షిప్త కథాగమనం
మార్చువిశాఖపట్నంలో ఒక మేడపైనున్న గదిలో అద్దెకుంటున్న ప్రకాశం వైద్య విద్యార్థి. కొన్నాళ్ళ క్రితం ఇందిర అనే వర్కింగ్ గర్ల్ తన తండ్రితో సహా క్రింది వాటాలో దిగింది. ఇందిర నాన్నగారు ఆనందరావుకు సుస్తీ చేస్తే ప్రకాశం ఆయనను కె.జి.హెచ్.లో అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించాడు. అలా ప్రారంభమైన పరిచయంతో ఇందిర తండ్రి ఆరోగ్యం గురించి ఏదో అడగడానికని వచ్చి కబుర్లు పెట్టుకొని కదిలేది కాదు. రాత్రి గదికి తిరిగివచ్చిన ప్రకాశంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక్కోసారి ఆమె రాకపోకలు చికాకు కలిగించేవి.
ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణమూర్తికి జల్సాలకు డబ్బు ఖర్చుపెట్టడం సరదా, అమ్మాయిల మీద మోజు. ఇద్దరికీ చాలా విషయాల్లో శృతి కలిసి ఇద్దరూ బాగా తిరిగేవారు.
ఇందిర స్నేహితురాలు కళ్యాణి ఇంటర్ చదువుతున్నప్పటి క్లాస్ మేట్. పరిచయమైన తర్వాత ప్రకాశానికి ఆమె మీద అభిమానం కలిగింది. కళ్యాణి ఎవరితోనైనా మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడుతుంటే అతనికేదో ఓదార్పు, ఊరక కలిగేవి. కల్యాణికి టైఫాయిడ్ సోకగా ప్రకాశం ఆమెను కె.జి.హెచ్.లో చేర్పించాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ నెలరోజులూ తనంటే ప్రకాశం పడిన ఆదుర్దా, చూపిన శ్రద్ధా కళ్యాణి హృదయాన్ని కృతజ్ఞతతో నింపివేశాయి. వీరిద్దరూ దగ్గరవడం ఇందిర సహించ లేకపోయింది. సూటిపోటి మాటలతో సున్నితమైన కళ్యాణి మనస్సును గాయపరిచింది. కళ్యాణి తల్లి ప్రేమ ఎరుగదు. ప్రకాశం చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. వారిద్దరూ పరస్పరం బాధాకరమైన తమ కుటుంబ నేపథ్యాలను చెప్పుకొనేవారు. ఇంతలో కళ్యాణి తండ్రి చనిపోయాడు. ప్రకాశం దారి ఖర్చులకు డబ్బిచ్చి చదువైపోయేదాకా సహాయపడతానని మాటిస్తాడు. రైల్లో క్లాస్ మేట్ వసుంధర పరిచయమై ఇందిర తన గురించి చెడు ప్రచారం గురించి తెలియజేస్తుంది. కళ్యాణి బాధలకు స్పందించి వసుంధరకు తనింట్లో నీడ ఇచ్చి సోదరిలా చూసుకుంది.
చివరకు కృష్ణముర్తి - ఇందిర, డాక్టర్ చక్రవర్తి - కళ్యాణి రెండు జంటలూ తిరుపతి కొండమీద దంపతులుగా మారతారు.
మూలాలు
మార్చు- ↑ "'కాలాతీత వ్యక్తులు'కు షష్టిపూర్తి - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-04-07.