కాళిదాసు పురుషోత్తం

తెలుగు రచయిత

కాళిదాసు పురుషోత్తం నెల్లూరులో నివసిస్తున్నాడు.[1] తల్లి రమణమ్మ, తండ్రి విద్యావాచస్పతులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి, పురుషోత్తం జనం 1942 మే 1వ తారీకు. ఇతని తండ్రి వెంకట సుబ్బాశాస్త్రి నెల్లూరు కాశిఖేలవారి అగ్రహారంలోని వేదాంత మందిరంలో షుమారు యిరవైరెండేళ్ళు ప్రతిదినం ఉదయం ప్రవచనం చేశారు. వెంకటసుబ్బాశాస్త్రి గారి కుమారులు పురుషోత్తం నెల్లూరు వి. ఆర్. హైస్ల్కూలు విద్యార్థి. వి.ఆర్ కళాశాలలో బి.ఎ చదివాడు. వీ.ఆర్. కళాశాల తెలుగు హెడ్ పోలూరు జానకీరామశర్మ ప్రేరణతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏలో చేరి, ఫస్ట్ క్లాసులో, క్లాసు ఫస్టుగా నిలిచి, అత్యధిక మార్కులు సంపాదించుకొని, విశ్వవిద్యాలయం నుండి "గురజాడ అప్పారావు స్వర్ణపతక పురస్కారం" పొందాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ ఆర్కైవ్స్ జాతీయ స్కాలర్షిప్.తో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో వెంకటగిరి సంస్థానం(నెల్లూరు జిల్లా) చరిత్ర, సాహిత్యం మీద పరిశోధించి డాక్టరేట్ పట్టా పొందాడు. నెల్లూరు శ్రీ సర్వోదయ డిగ్రీకళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ అధిపతిగా, ఆ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి 2000లో పదవీవిరమణ చేశాడు. నెల్లూరు సాంస్కృతిక జీవితంలో ముప్ఫయి సంవత్సరాలు క్రియాశీలంగా పనిచేశాడు. నెల్లూరు కెమెరా క్లబ్, కార్యదర్శిగా, ది ప్రొగ్రెసివ్ ఫిల్మ్ అసొసియేషన్ (ప్రో ఫిల్మ్)పేరుతొ మిత్రులతో కలసి పదేళ్ళు ఫిల్మ్ సొసైటి నిర్వహించాడు. దీన్ని ఫెడరేషన్ అఫ్ ఫిలిం సొసైటీస్, నేషనల్ ఫిల్మ్ ఆర్చివ్ పూణే అనుబంధించి అపూర్వ మయిన చిత్రాలను నెల్లూరు కళాభిమానులకు ప్రదర్శించడమేకాక, ఈ సంస్థల సహకారంతో నెల్లూరులో 10 రోజుల[1980} పాటు ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించాడు.ఈ కృషిలో సింగరాజు రాజేంద్రప్రసాద్, కె.పెంచలయ్య, ఎం.టి. శేఖర్ రెడ్డి , డాక్టర్ ఎం. శివరామప్రసాద్, డాక్టర్ పి.మధుసూదనశాస్త్రి, డాక్టర్ సి.పి.శాస్త్రి, సి.సంజీవరావు, బాబు వంటి సహృదయులు ఎందరో సహకరించారు.[2]

నెల్లూరు వర్ధమాన సమాజ కార్యవర్గ సభ్యులుగా కవిత్రయ కవితా వైజయంతి, ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాల ప్రచురణలో సహకరించాడు. వర్ధమాన సమాజం నిర్వహించిన కవిత్రయ జయంతుల్లో పండితులు చేసిన ఉపన్యాసాలను కవిత్రయ కవితావైజయంతి పేరుతో పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం మరి ఇద్దరు మిత్రులతో కలిసి సహసంపాదకులుగా ఒక సంకలనం తయారు చేయగా, వర్ధమాన సమాజం ఈ గ్రంథాన్ని ప్రచురించింది. దుర్భా సుబ్రహ్మణ్యశర్మ రచనలను పురుషోత్తం, డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్, పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి కావ్యపంచమి పేరుతో సంకలనంచేయగా, దుర్భా రామమూర్తి దాన్ని ప్రచురించారు.జూలియా థామస్ 1836-39నడుమ భారతదేశంనుంచి ఇంగ్లాండ్ కు రాసినలేఖలను తనపేరు లేకుండా లెటర్స్ ఫ్రమ్ Madtas1836-39 అని ప్రచురించింది. రచయిత్రి పేరు బై ఎ లేడీ అని తనపేరు బహిరంగం కానీయలేదు. పెన్నేపల్లి గోపాలకృష్ణ అజ్ఞాత రచయిత్రి కనుక తెలుగులో "ఆమె లేఖలు" అని నామకరణం చేశారు. తెలుగు అనువాదం: పెన్నేపల్లి గోపాలకృష్ణ, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, ఎమెస్కో సంయుక్త ప్రచురణ, మే, 2021.హైదరాబాద్. పోతం జానకమ్మ అనె తెలుగు మహిళ 1874లో తన ఇంగ్లాండ్ యాత్రా చరిత్ర పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ను "జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర" పేరుతొ అనువదించి ప్రచురించాడు 1980 ప్రాంతంలో జమీన్ రైతు వారపత్రికలో శివారెడ్డి కవి వారం వారం రాసిన పద్యాలను సేకరించి వక సంకలనంగా జిల్లాకలక్టరు సహకారంతో అచ్చువేయించాడు.

ఆధారాలు, మూలాలు

మార్చు

భారతి, ఉదయం, వార్త, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సాక్షి, జమీన్ రైతు, యూత్ కాంగ్రెస్, మిసిమి, జనసాహితి, చైతన్య మానవి, అమ్మనుడి, గ్రంథాలయ సర్వస్వం వంటి పత్రికల్లో సాహిత్యం, సినిమా, యాత్రాచరిత్రలు(travelogues) మీద కాళిదాసు పురుషోత్తం రాసిన వ్యాసాలు, 1979లో మెడ్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్లో 15రోజుల ఫిలిం అప్రిసియేషన్ కోర్సు, 1980లో పూణే ఫిల్మ్ & టి.వి. ఇన్స్టిట్యూషన్ లో 6 వారాలు ఫిలిం అప్రీసియేషన్ కోర్సు. సర్టిఫికేషన్ చేశాడు. కావలి జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. పట్టాభిరామిరెడ్డి గారికి సహకరించి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సభలు(ఎ . పి.హిస్టరీ కాంగ్రెస్)స్థాపించడంలో క్రియాశీలంగా పనిచేశాడు. తను ఈ సంస్థ స్థాపక సభ్యుడు కూడా. 1986 నుండి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభలకు హాజరువుతూ, పరిశోధన పత్రాలు సమర్పించాడు.

ఫోటోగ్రఫీ, చరిత్ర, సినిమా, పర్యటనలు, గురజాడ అప్పారావు గారి రాతప్రతులు (manuscripts) పరిశోధించడం తనకు ఇష్టమైన విషయాలు. నెల్లూరు కెమెరా క్లబ్ కార్యదర్శిగా వ్యవహరించి, అఖిల భారత స్థాయిలో రెండు ఆల్ ఇండియా ఫోటోగ్రఫీ శ్రీధర్ సెలూన్ లు ఏర్పాటుచేశాడు. గోపినాథుని వెంకయ్యశాస్త్రి అముద్రిత రచన మారుతీశతకం సంపాదించి, వెంకయ్యశాస్త్రి వంశీయులు శ్రీనివాసమూర్తి ద్వారా ఆ శతకాన్ని 1968లో అచ్చువేశాడు. 1988లో "గోపినాథుని వెంకయ్యశాస్త్రి జీవితం, సాహిత్యం" పుస్తకం రచించి, తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆర్థిక సహకారంతో ప్రచురించాడు. వీరేశలింగం పంతులు సమకాలికులు, పీపుల్స్ ఫ్రండ్ ఆంగ్ల వారపత్రికా సంపాదకులు దంపూరు నరసయ్యగారి జీవితం, కృషిమీద పరిశోధించి "ఇంగ్లిషు జర్నలిజంలొ తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య" పుస్తకం రచించాడు.ఈ పుస్తకం 2007 కడప చరిత్ర సభల్లో ఆవిష్కరించబడింది. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ సహ సంపాదకులుగా పూండ్ల రామకృష్ణయ్య సంపాదకత్వంలో వెలువడిన అముద్రిత గ్రంథ చింతామణి మాసపత్రికలోని వ్యాసాలలో ఎంపికచేసిన వ్యాసాలతో "అలనాటి సాహిత్య విమర్శ" గ్రంథాన్ని తయారు చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ అండ్ ఓరియంటల్ మనుస్క్రిప్ట్స్ లైబ్రరీ , హైదరాబాద్, వారు 2008లో ప్రచురించారు.

పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి గురజాడ అప్పారావు పంతులుగారి రాతప్రతులు, రికార్డు పరిశీలించి, గురజాడ సమగ్రరచనలు "గురుజాడలు" సంకలనానికి కృషిచేశాడు. దీనికి పెన్నేపల్లి గోపాలకృష్ణ,డాక్టర్.ఎం.వి.రాయుడుగార్లతో పాటు సహసంపాదకుడుగా వ్యవహరించాడు. ఈ గ్రంథాన్ని మనసు ఫౌండేషన్ స్వచ్ఛందసంస్థ ప్రచు రించింది(2011).

మనసు ఫౌండేషన్ గుర్రం జాషువ సమగ్ర రచనల సంంకలనం తీసుకొని వచ్చిన సందర్భంలో మధ్రాసు, ఇతరచోట్ల గ్రంథాలయాలన్నీ శోధించి జాషువ గ్రంథాల తొలిముద్రణలు సేకరించి సహకరించాడు. ఈ సంపుటాన్ని హైదరాబాదు ఏర్పాటు చేసిన సభలో శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు ఆవిష్కరించిన సభకు కాళిదాసు పురుషోత్తం అధ్యక్షత వహించాడు.

సాక్షి దినపత్రిక నెల్లూరు టాబ్లాయిడ్ లో 2009-10 సంవత్సరంలో 13 నెలలపాటు "పెన్న ముచ్చట్లు" పేరుతో నెల్లూరు జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వంటి ఆంశాలమీద 62 వ్యాసాలు రాశాడు. ఇవి "పెన్న ముచ్పట్లు" పేరుతో పుస్తక రూపంలో వెలువడ్డాయి. మనసు ఫౌండేషన్ డాక్టర్ ఎం.వి.రాయుడు సహకారంతో ఆచార్య ఆర్.వి.యస్. సుందరం, పారా అశోక్.లు సహ సంపాదకులుగా ఆధునిక తెలుగుకవి పట్టాభి(తిక్కవరపు పట్టాభిరామరెడ్డి)"లభ్య సమగ్ర రచనల సంకల"నానికి సంపాదకులుగా వ్యవహరించాడు.ఈ గ్రంథాన్ని మనసు ఫౌండేషన్ 2019 ఫిబ్రవరి 19న పట్టాభి శతజయంతి రోజు, నెల్లూరు టౌన్ హాల్ లో విడుదలచేసింది. 2019లోనే బంగోరె(బండి గోపాలరెడ్డి)జాబులను "బంగోరె జాబులు" పేరుతో డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ తో కలిసి, పరిష్కరించి, ప్రచురించాడు. బంగోరె సాహిత్యకృషి, జీవితం గురించి ఈ పుస్తకం కొత్తవిషయాలను తెలియజేస్తుంది.

నెల్లూరు మిత్రులు కొందరితో కమిటీగా ఏర్పడి 2014 సెప్టెంబర్ 21న గురజాడ 152వ జయంతిరోజు కన్యాశుల్కం పూర్తి నాటకాన్ని ఎనిమిది గంటల ప్రదర్శన నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రలో ఏర్పాటు చేసాడు. ఆచార్య ఆదిత్య ఈ కమిటీకి అధ్యక్షులుగా, చిరసాని కోటిరెడ్డి కోశాధికారిగా, చెలంచెర్ల భాస్కరరెడ్డి కార్యదర్శిగా, పురుషోత్తం సహ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రదర్శనకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చయింది. విజయనగరం నుంచి కిశోర్ బృందం నాటకాన్ని ప్రదర్శించింది. అప్పటి జిల్లా కలెక్టర్ ఈ ప్రదర్శనకు సహాయం చేసాడు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ ప్రదర్శన ఒక జ్ఙాపకంగా మిగిలిపోయింది.

కాళిదాసు పురుషోత్తం పర్యవేక్షణలో అముద్రిత గ్రంథచింతామణి సంపాదకులు పూండ్ల రామకృష్ణయ్య మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్యగారి నవలలు, కథలమీద  కుమారి ఉభయభారతి పరిశోధించి డాక్టరేట్  పట్టాలు పొందారు. జూలియా థామస్ అనే బ్రిటిష్ వనిత రాజమండ్రి నుంచి ఇంగ్లండ్ కు 27 లేఖలు రాసింది 1936-39  మధ్య. పెన్నేపల్లి గోపాలకృష్ణ ఈ లేఖలను అనువాదానికి పూనుకొని,  అనువాదం పూర్తికాకుండానే మరణిస్తే, ఇతను అనువాదాన్ని "ఆమె లేఖలు" పేరుతో పూర్తి చేయగా ఎం.ఎస్.కో, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సభల సంఘం దాన్ని1920 లో సంయుక్తంగా ప్రచురించి వెలుగులోకి తెచ్చాయి. ప్రొఫెసర్ వకుళాభరణం ఈపుస్తకానికి ఉపోద్ఘాతం రాశారు.

పోతంసెట్టి జానకమ్మ 1873లో ఇంగ్లండ్ పర్యటించి ఆ యాత్రానుభవాలను పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతో1876లో పుస్తకరూపంలో తెచ్చింది. ఈ అరుదైన పుస్తకాన్ని ఇతను తెలుగుచేసి 2022 జూలైలో "జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర" పేరుతో ప్రచురించాడు. "సంచిక తెలుగు వెబ్ మేగజిన్" లో 82వారాలు ధారావాహికగా తన జీవిత అనుభవాలను, జ్ఞాపకాల తరంగిణి' శీర్షికతో ప్రచురించాడు. పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య ఆత్మకథను స్మ్రుతిశకలాలు పేరుతొ 1973లో నెల్లూరు వారపత్రిక యూత్ కాంగ్రెస్. లో వారం వారం ప్రచురించాడు.వాటిలో ఇప్పుడు లభిస్తున్న 25వ్యాసాలను "వెన్నెలకంటి రాఘవయ్య స్మ్రుతిశకలాలు" పేర 2024 జనవరిలో పుస్తకరూపంలో ప్రచురించాడు.

రచనలు

మార్చు
  1. కనక పుష్యరాగం - పొణకా కనకమ్మ స్వీయచరిత్ర (సంపాదకత్వం), సునయన క్రియేషన్స్, యం.వి.రాయుడు, బెంగుళూరు, 2011 [3]
  2. ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (జీవితచరిత్ర, కృషి. పరిశోధన)సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు, 2007.
  3. వెంకటగిరి సంస్థాన చరిత్ర - సాహిత్యం(ఉస్మానియా విశ్వవిద్యాలం నుంచి 1971లో డాక్టరేట్ పట్టా పొందిన గ్రంథం-- ప్రథమ ముద్రణ 2014)[4]
  4. కవిత్రయ కవితా వైజయంతి (పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి సంపాదకత్వం) నెల్లూరు వర్ధమాన సమాజం ప్రచురణ,1974.)
  5. కావ్యపంచమి (సంపాదకత్వం దుర్భా సుబ్రమణ్య శర్మగారి రచనలు.)1975 ప్రచురణ.
  6. శివారెడ్డి పద్యాలు (పెన్నేపల్లి గోపాలకృష్ణ, బండి నాగారాజు, బ్రహ్మారెడ్డి లతో కలిసి సంపాదకత్వం)1980
  7. అలనాటి సాహిత్య విమర్శ (.సంపాదకులు: కాళిదాసు పురుషోత్తం, ఎం.శివరామప్రసాద్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పరిశోధన సంస్థ, గ్రంథాలయం, హైదరాబాద్.2008.
  8. "గురుజాడలు" (సంపాదకులు: పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం, యం.వి.రాయుడు. మనసు ఫౌండేషన్ , బెంగుళూరు2012.
  9. గోపినాథుని వెంకయ్యశాస్త్రి జీవితం, సాహిత్యం, టిటిడి ఆర్ధికసహకారంతో ప్రచురణ.1988.
  10. పెన్న ముచ్చట్లు, (నెల్లూరు మండల చరిత్ర, సంస్కృతి మీద వ్యాసాలు) పల్లవి పబ్లికేషన్స్ , విజయవాడ, 2018.
  11. తెలుగు సంస్కృతి, రెండవ సంపుటం (కొన్ని వ్యాసాలు), తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.1988.
  12. ఆమె లేఖలు, జూలియా థామస్ "Letters from Madras 1836-39" ఇంగ్షీషు లేఖలకు తెలుగు అనువాదం, ఎమెస్కో, A.P.History Congress సంయుక్త ప్రచురణ, 2021.
  13. పోతంసెట్టి జానకమ్మ 1873లో ఇంగ్లండ్ పర్యటన Pictures of England, 1876 పుస్తకాన్ని తెలుగుచేసి 2022 జూలైలో "జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర" పేరుతో ప్రచురించాడు[5]
  14. పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య స్మృతిశకలాలు, సంపాదకులు: డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, సొసైటి ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు, ప్రచురణ,2024.

మూలాలు

మార్చు
  1. "నెల్లూరు: 6న ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన". prabhanews.com. Archived from the original on 2018-08-29. Retrieved 2018-08-29.
  2. "zaminryot". www.zaminryot.com. Retrieved 2022-11-18.
  3. "కనకపుష్యరాగం – పొణకా కనకమ్మ స్వీయచరిత్ర". pustakam.net. Archived from the original on 2016-07-30. Retrieved 2018-08-29.
  4. "వెంకటగిరి సంస్థాన చరిత్ర - సాహిత్యం". prasthanam.com. Archived from the original on 2016-04-02. Retrieved 2018-08-29.
  5. "జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర – ఈమాట". Retrieved 2022-11-18.

Page-no.4 of zaminryot edition 2nd April 2021(From the Archives page)

వెలుపలి లంకెలు

మార్చు
  • కవిత్రయ కవితా వైజయంతి, నెల్లూరు వర్ధమాన సమాజం ప్రచురణ.1974.
  • శివారెడ్డి పద్యాలు, శివారెడ్డి సొంత ప్రచురణ.1980.
  • హిందూ బాంధవి, పక్షపత్రిక,సంపాదకులు: చతుర్వేదుల వెంకటరాఘవయ్య.
  • 2021 ఏప్రిల్ 2న జమీన్ రైతు వారపత్రికలో శ్రీ రహీమ్ వ్యాసం "చారిత్రక పరిశోధకుడు కాళిదాసు పురుషోత్తం"
  • బంగోరె జాబులు, సంపాదకులు: కాళిదాసు పురుషోత్తం, మాచవోలు శివరామప్రసాద్, సొసైటి ఫర్ సోషల్ ఛేంజ్, నెల్లూరు ప్రచురణ, 2020.
  • ఆమె లేఖలు, జూలియా థామస్ ఇంగ్లీషు లేఖలకు తెలుగు అనువాదం, పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, ఎం.ఎస్.కొ సంయుక్త ప్రచురణ, 2020.
  • జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర, 1873 లో పోతం జానకమ్మ రాఘవయ్య చేసిన ఇంగ్లండ్ పర్యటనను తెలుగులో యాత్రా చరిత్రగా రచించి, దానికి 1876లో ఆంగ్లంలో Pictures of England పేరుతొ ఇంగ్లీష్ లో జనకమ్మే చేసిన ఇంగ్లీషు అనువాదానికి తెలుగు అనువాదం. అనువాదకులు: కాళిదాసు పురుషోత్తం, సొసైటి ఫర్ సోషల్ ఛేంజ్, నెల్లూరు ప్రచురణ,2022.
  • .