కిత్తూరు చెన్నమ్మ

బ్రిటిష్ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి.

కిత్తూరు చెన్నమ్మ (1778 అక్టోబరు 23 – 1829 ఫిబ్రవరి 21) [1] బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. మధ్యప్రదేశ్ లోని ఝాన్సికి చెందిన లక్ష్మీబాయి కన్న 56 సంవత్సరముల ముందే పుట్టి, తన రాజ్య స్వాతంత్ర్యానికై బ్రిటిషు కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనిత. కిత్తూరు అనేది బెల్గాము రాజ్యానికి సమీపమున ఉన్న చిన్నరాజ్యం. ఆమె బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తన గళమెత్తి, వారి అఘాయిత్యాలను నిరసిస్తూ 1824లో బ్రిటిషువారి అపారసైన్యానికి బెదరక, మొక్కవోని ధైర్యంతో పోరుసల్పినది. కాని మొదట విజయం అమే వైపే ఉన్ననూ, చివరకు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనికి బందీగా చిక్కి, చెరసాలలోనే కన్ను మూసింది. కన్నడదేశానికి చెందిన నాటి వీరవనితలైన అబ్బక్కరాణి, కెలారి చెన్నమ్మ, ఒనక ఒబవ్వ చిత్రదుర్గ, ల సరసన అగ్రస్థానములో పేరెక్కిన సాహసి కిత్తూరు చెన్నమ్మ.

కిత్తూరు చెన్నమ్మ
కిత్తూరు చెన్నమ్మ
జననం
చెన్నమ్మ

(1778-10-23)1778 అక్టోబరు 23
కాకతి, బెల్గాం తాలూకా, బెల్గాం జిల్లా, బొంబాయి రాజ్యం.
మరణం1829 ఫిబ్రవరి 21(1829-02-21) (వయసు 50)
బైల్‌హొనగల్ తాలూకా, బెల్గాం జిల్లా, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా.
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లురాణి చెన్నమ్మ, చిత్తూరు రాణి చెన్నమ్మ
కిత్తూరు రాజ్యం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1824 తిరుగుబాటు
తల్లిదండ్రులు
  • దేశాయ్ ధులప్ప గౌండ్రు (తండ్రి)
కిత్తూరు కోట

చెన్నమ్మ జననం-బాల్యం

మార్చు

చెన్నమ్మ బెల్గాం పట్టణానికి 5 కి.మీ.దూరంలో ఉన్న కిత్తూరు రాజ్యంలో సా.శ.1778 లో అక్టోబరు 23వ తేదిన జన్మించింది. చెన్నమ్మ చిన్నతనముననే గుర్రపుస్వారి, విలువిద్యలలో శిక్షణపొంది, యుద్ధవిద్యలలో ఆరితేరినది. చెన్నమ్మ తండ్రి కాకతీయ దేశాయి కుంటుంబానికి చెందిన ధూళప్పగౌడరు.

వివాహం-రాజ్యపాలన

మార్చు

చెన్నమ్మకు కిత్తూరు పాలకుడయిన దేశాయిరాజ కుటుంబీకుడైన మల్ల సర్జన తో వివాహం జరిగింది. ఆమె కిత్తూరు రాజ్య రాణి అయ్యింది. ఆమె మల్ల సర్జనకు రెండవ భార్య, రెండో రాణి. వారికి ఒక కుమారుడు జన్మించాడు కానీ అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు చెన్నమ్మ శివలింగరుద్రప్ప అనే బాలుకుడిని కుమారునిగా దత్తత తీసుకున్నది. అతనిని తన వారసునికిగా ప్రకటించింది. కిత్తూరు రాజ్యచరిత్ర 1586 నుండి ప్రారంభమైనది. మలెనాడుకు చెందిన మల్ల అనే పేరున్న అన్నదమ్ములు బిజాపుర సంస్థానము పాలకుడు ఆదిలశాహి సైన్యములో పనిచేసేవారు. వారి వీరత్వానికి మెచ్చి వారికి శంశేర జంగ్ బహుదూరు అనే బిరుదు, హుబ్లి ప్రాంతంలో పాలనాధికారము ఇచ్చెను. బిజాపూరు రాజ్యం పతనమైన తరువాత వీరి వంశీకులు కిత్తూరు దేశపాలనను స్వయంగా చేసుకొనేవారు. బ్రిటిషు ఈస్టు ఇండియా వారు పాలన పగ్గాలు చేపట్టేసమయానికి దక్షిణభారతంలో తమ అస్తిత్వాన్ని నిలుపుకొనుటకు దేశాయిలు అటు హైదరాబాదు నిజాంషాహి, ఇటు మైసూరు హైదరుఆలి నడుమ పోరుసల్పుచున్న రోజులలో. హైదరుఅలితో జరిగిన యుద్ధంలో మల్లసర్జన బందిగా అయ్యి, ఉపాయంతో తప్పించుకు వచ్చిన మల్లసర్జన 1803లో అప్పటి బ్రీటిషు ఈస్టు ఇండియాకు చెందిన వెల్లెస్లీతో ఒప్పందం చేసుకొనెను.1809 లో, వేశ్వేకు 1, 75, 000 రూపాయలిచ్చి, స్థానిక బ్రిటిషు ఖర్చులు భరించేలా ఒప్పందం చేసుకొనెను. కాని వేశ్వే విశ్వాస ఘాతుతకమునకు ఒడిగట్టి, మల్లసర్జనను 3 సంవత్సరములు పూణెలో బందీగా ఉంచెను.1816లో విడుదలై తిరిగివచ్చుచు మార్గమధ్యలో కీ.శ. 1817లో మరణించెను. చెన్నమ్మ, మల్లసర్జనల దత్తపుత్రుడు శివలింగ సర్జను రక్షణకై బ్రిటిషు ఇండియాతో ఒడంబడిక చేసుకొనెను. సంవత్సరానికి 1, 70, 000 రూపాయల కప్పం చెల్లించుటకు ఒప్పందంతో వీరి ఒప్పందం 1824 వరకు కొనసాగింది . 1824 సెప్టెంబరు 11లో శివలింగ రుద్రసర్జను వారసుడు లేకుండగానే మరణిస్తాడు. అతని మరణసమయానికి అతని భార్య వీరమ్మ వయస్సు 11 సంవత్సరాలు. మరణించుటకు ముందే మాస్తమరడి గౌడర కుమారుడు శివలింగప్పను దత్తత తీసికొనడం జరిగింది. దీనిని అదునుగా తీసికొని అప్పటి ధారవాడ కలెక్టరు థ్యాకరే ఈ దత్తతను నిరాకరించి, 1824 సెప్టెంబరు 13 న కిత్తూరు వచ్చి, మల్లప్పసెట్టి,, హవేరి వెంకటరావులను అధికారులుగా నియమించి, ధనకోశముకు తాళము వేసాడు. దీనిని చెన్నమ్మ ఎదిరిస్తుంది. ఈ విషయమై చెన్నమ్మ థ్యాకరెకు, మన్రోకు, చాప్లినుకు విన్నపము చేస్తుంది, శివగంగప్ప వారసత్వాన్ని అంగీకరించి పాలనాధికార మిప్పించమని. కాని వారు నిరాకరించగా సమీపమున ఉన్న కోలాపుర సంస్థానంతో మిగతా బ్రిటిషు వ్యవహారం యెడ కోపంగా ఉన్న వారితో సహకారానికై సంప్రదింపులు జరుపుతుంది .

చెన్నమ్మ-బ్రిటిష్ వారితో యుద్ధం

మార్చు

ధారవాడ కలెక్టరు సైన్యసమేతంగా 21 అక్టోబరు 1824 న కిత్తూరువచ్చి యుద్ధము ప్రకటించి, ఫిరంగులను పేల్చుటకు సిద్ధమవ్వగా, కోట ముఖద్వారం తెరుచుకొని బయటికివచ్చిన చెన్నమ్మ సైన్యం ఒక్కుమ్మడిగా బ్రిటిషు సైన్యంపై గురుసిద్దప్పఅను చెన్నమ్మ సైన్యాధిపతి నేత్రుత్వంలో శత్రుసైన్యంపై ఊపిరిసల్పనివ్వకుండ దాడిచేసింది. చెన్నమ్మ అంగరక్షకుని తుపాకి గుండుకు కలెక్టరు మరణించగా. స్టివన్సను,, ఈలియట్ అను బ్రిటిషువాళ్లు బందీలుగా చిక్కారు. దేశద్రోహనికి ఒడికట్టి, బ్రిటిషువారికి సహకరించిన కన్నూరు వీరప్ప, సరదార మల్లప్ప కిత్తూరు సైన్యంచేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. బ్రిటిషువారు కుటిలనీతితో ఒప్పందానికి వచ్చినట్లు నటించి, బందీలైన తమ ఇద్దరు బ్రిటిషు అధికారులను1824, డిసెంబరు2న విడిపించుకెళ్తారు. అయితే మాట తప్పి, బ్రిటిషువారు మళ్లీ డిసెంబరు 3 వ తేదిన అపారసైన్యంతో కిత్తూరు మీద దాడి చేస్తారు. ఫిరంగులతో కోటగోడలను బద్దలుకోట్టిలోనికి ప్రవేశిస్తారు. కిత్తూరు సైన్యం వీరోచితంగా పోరాడినను చివరకు లొంగిపోక తప్పలేదు. చివరకు డిసెంబరు 5, 1824 న చెన్నమ్మ, తన కోడలైన వీరమ్మ, జానకిబాయిలతోపాటు బ్రిటిషువారికి బందీగా చిక్కుతుంది. వీరిని బందీలుగా బైలహొంగలకు తీసుకెళ్తారు బ్రిటిషు వారు. చెన్నమ్మ 4 సంవత్సరాలు బైలహొంగలలో ఖైదీగా ఉండి ఫిబ్రవరి 2, 1829 న స్వర్గస్థురాలైనది.

ఇతర విశేషాలు

మార్చు
  • రాణి కిత్తూరు చెన్నమ్మ విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో, సా.శ. 2007, సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ఆవిష్కరింపబడింది.[2] అవిష్కరణకు దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి శివరాజ్ పాటిల్, లోకసభస్పీకరు సోమనాథ్ ఛటర్జి, బి.జె.పి.నాయకుడు ఎల్.కె.అద్వాని ప్రభృతులు హజరయ్యారు.[3]
  • కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహాలు బెంగళూరు, కిత్తూరు నగరాలలో కూడా ప్రతిష్ఠించారు.
  • రాణి కిత్తూరు చెన్నమ్మ స్మారక తపాలా బిళ్ళ 1977 అక్టోబరు 23న విడుదలయ్యింది.
  • రాణి కిత్తూరు చెన్నమ్మ మరణాంతరము, ఆమె సమాధిని బైలహొంగలలో నిర్మించారు. కాని సరియైన పర్యవేక్షణ లేనందున సమాధి శిథిలస్థితికి చేరినది.
  • కిత్తూరు రాణి చెన్నమ్మ ఇతిహాసం ఆధారంగా, కన్నడలో బి.రామకృష్ణయ్య పంతులు దర్శకత్వంలో 1962లో కిత్తూరు చెన్నమ్మ పేరుతో సినిమా తీసాడు.
  • కిత్తూరు చెన్నమ్మ అనుపేరుమీద ఒక తీర రక్షణ నౌక 1983 లో భారతీయ నౌకాదళములో ప్రవేశపెట్టబడింది. ఈమధ్యనే 2011 లో ఆనౌకకు విశ్రాంతి ఇచ్చారు.
  • కిత్తూరు చెన్నమ్మ పేరుమీద జానపదరీతిలో బల్లడ , లావణి , గిగిపద గేయాలు జనప్రాచుర్యంలో ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Rani Chennamma of Kitturu". pib.nic.in. Retrieved 2018-02-21.
  2. "Pratibha unveils Kittur Rani Chennamma statue" Archived 2014-11-06 at the Wayback Machine, news.oneindia.in
  3. "Kittur Rani statue unveiled". The Hindu. 12 September 2007. Archived from the original on 7 జనవరి 2008. Retrieved 5 November 2012.

బయటి లంకెలు

మార్చు