కుందేళ్ల పెంపకం

(కుందేలు పెంపకం నుండి దారిమార్పు చెందింది)

కుందేళ్ల పెంపకం ఒక లాభసాటి వ్యాపారం.[1] మన దగ్గరున్న తక్కువ పెట్టుబడితో, చిన్న స్థలంలోనే ఈ కుందేళ్ళ పెంపకం చేయుటవలన ఎక్కువ రాబడి వస్తుంది. కుందేళ్ళు సామాన్యమైన మేతను తిని దానిని అధిక ప్రోటీన్లు గల విలువైన మాంసంగా మార్చుకుంటుంది. మాంసం ఉత్పత్తికొరకే కాకుండా దాని చర్మము, బొచ్చు కొరకు కూడా ఈ కుందేళ్ళను పెంచవచ్చును. స్వంతభూమి లేని రైతులకు, నిరక్షరాస్యులైన యువతకు, స్త్రీలకు ఈ కుందేళ్ళ పెంపకం పార్ట్ టైమ్ ఉద్యోగములా అదనపురాబడిని ఇస్తుంది.

కుందేళ్ళ పెంపకం వలన ఉపయోగాలు

మార్చు
  • కుందేళ్ళ పెంపకం ద్వారా నాణ్యమైన ఎక్కువ ప్రోటీన్ కలిగిన మాంసమును మన కుటుంబం కొరకు పొందవచ్చు.
  • సులువుగా మన ఇంట్లో లభ్యమయ్యే ఆకులు, వ్యర్థమైన కూరగాయలు, గింజలు మేతగా వేసి కుందేళ్ళను పెంచవచ్చు.
  • బ్రాయిలర్ కుందేళ్ళ పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మూడు నెలల వయస్సు లోనే రెండు కిలోగ్రాముల బరువు పెరుగుతుంది.
  • సంతతి పరిమాణం కుందేళ్ళలో చాలా ఎక్కువగా (సుమారు 8 నుండి 12 వరకు) ఉంటుంది.
  • ఇతర మాంసాలతో పోల్చితే కుందేలు మాంసం అధికంగా మాంసకృత్తులు (21%), తక్కువ కొవ్వు (8%) కలిగి ఉంటుంది.కనుక పెద్దల నుండి పిల్లల వరకు ఈ మాంసం చాలా అనుకూలమైనది.

సంతానోత్పత్తి వయస్సు

మార్చు
  • ఆడ కుందేలు - 5-6 నెలలు
  • మగ కుందేలు - 5-6 నెలలు (మగ కుందేలు - 5-6 నెలలు వయస్సు వచ్చినప్పటికీ ఒక సంవత్సరము తరువాత మాత్రమే సంతానోత్పత్తి కొరకు .వినియోగించాలి దిని వల్ల నాణ్యతగల కుందేళ్ళను పొందవచ్చు.

సంతానోత్పత్తి కొరకు కుందేళ్ళ ఎంపిక

  • సంతానోత్పత్తికై కుందేళ్ళను 5 - 8 నెలలు తరువాత పూర్తిగా బరువును సంతరించుకున్న తరువాత ఎంపిక చేయాలి.
  • ఎక్కువ సంతతి పరిమాణంఉన్న కుందేళ్ళనుంచి, మగ, ఆడ కుందేళ్ళును సంతానోత్పత్తి కొరకు ఎంపికచేయాలి.
  • ఆరోగ్యవంతమైన కుందేళ్ళను మాత్రమే సంతానోత్పత్తికి ఎంపికచేయాలి. ఆరోగ్యవంతమైన కుందేళ్ళు చురుకుగా ఉంటాయి. మేత, నీటిని మమూలుగా తీసుకుంటాయి. వీటన్నిటికీ మించి అవి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాయి.ఆరోగ్యకరమైన కుందేళ్ళ బొచ్చు పరిశుభ్రంగా, మెత్తగా, మెరుపు గలిగి ఉంటాయి.
  • సంతానోత్పత్తికై ఉపయోగించే మగ కుందేళ్ళుకు పైన పేర్కొన్న లక్షణాలతో పాటు స్పష్టమైన బాగా క్రిందికి దిగిన రెండు వృషణాలు బీజకోశములో ఉంటుది .
  • మగ కుందేళ్ళను ఎంపిక చేసేటప్పుడు, వాటి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తెలుసు కోవడానికి మగ కుందేళ్ళను ఆడ కుందేళ్ళతో జత కట్టిస్తారు.

ఆడకుందేళ్ళ జతకావడాన్కి లేదా ఎద సంకేతాలు
కుందేళ్ళలో ప్రత్యేకంగా గర్భధారణ సమయము అంటూ ఏదీలేదు. ఎప్పుడైతే ఆడ కుందేలు మగ కుందేలుతో జత కట్టనిస్తుందో అప్పుడు ఆడ కుందేలుకి గర్భధారణ సమయమని భావించాలి. ఒక్కొక్కప్పుడు ఆడ కుందేలు యోని ఎర్రగా ఉబ్బితే అది యదలు ఉన్నదని భావించాలి. ఎప్పుడైతే మగ కుందేలును యదలో ఉన్న లేదా గర్భధారణ కాంక్షలో నున్న ఆడ కుందేలు వద్దఉంచినపుడు ఆడ కుందేలు వీపుని నొక్కిపెట్టి వెనక భాగాన్ని ఎత్తి చూపిస్తుంది. ఆడ కుందేలు యదలో లేక పోయి నట్లయితే, బోను మూలకు పోయి మగ కుందేలుపై దాడి చేస్తుంది.

కుందేళ్ళ గర్భధారణ

మార్చు

కుందేళ్ళ గర్భధారణ వివరములు

మగ, ఆడ కుందేళ్ళ నిష్పత్తి 1 :10
మొదటి కలయిక వయస్సు 5 – 6 నెలలు. మంచి సంతానోత్పత్తి కొరకు మగ కుందేళ్ళు ఒక సంవత్సరము వయస్సు వచ్చిన తరువాత మొదటిసారి ఆడ కుందేళ్ళతో జత కట్టిస్తే లిట్టర్ సైజు పెరుగుతుంది
జతకట్టే సమయంలో ఆడ కుందేళ్ళ శారీరక బరువు 2.25 -2.50 కిలో గ్రాములు
గర్భధారణ సమయం 28 -31 రోజులు
తల్లిపాలు త్రాగుట మాన్పించబడే వయస్సు 6 వారాలు
కాన్పు తరువాత జతకట్టే సమయం కాన్పు లేదా కుందేలు పిల్లలు తల్లి పాలు త్రాగుట మానిన 6 వారాల తరువాత.
అమ్మదగిన వయస్సు 12 వారాలు
అమ్మకము సమయంలో ఉండవలసిన శరీరము బరువు సుమారుగా రెండు కిలోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ

ఆడ కుందేలు యద లేదా గర్భధారణ సూచనలు వెల్లడించినప్పుడు, మగ కుందేళ్ళ బోను లోకి ప్రవేశపెడతారు. ఆడ కుందేలు జతకట్టే సరైన సమయంలో ఉంటే తోక ఎత్తి మగ కుందేలును జతకట్టడానికి ఆహ్వానిస్తుంది. జతకట్టే ప్రక్రియ విజయవంతగా పూర్తవగానే మగ కుందేలు ఒక ప్రక్కకు పడిపోతుంది, ఒక నిర్ధిష్టమైన ధ్వనిని చేస్తుంది. ఒక మగ కుందేలును వారంలో మూడు లేదా నాలుగు రోజులకి మించి జత కట్టే కార్యక్రమంలో ఉపయోగించకూడదు. అదే విధంగా మగ కుందేలును రోజుకు రెండు లేదా మూడు సార్లుకి మించి జతకట్టు కార్యక్రమంలో ఉపయోగించకూడదు. జతకట్టు కార్యక్రమంలో పాల్గొన్న మగ కుందేళ్ళకు సరిపడినంత విశ్రాంతి, మంచి పోషకాహారము ఇవ్వాలి. కుందేళ్ళ సమూహంలో ప్రతి పది ఆడ కుందేళ్ళకు ఒక మగ కుందేలుని ఉంచాలి. ఒకటి లేదా రెండు మగ కుందేళ్ళని అదనంగా కుందేళ్ళ ఫారంలో పెంచవచ్చు. ఏదైనా కుందేలు వ్యాధి బారినపడినప్పుడు అదనంగా పెంచబడిన మగ కుందేళ్ళను జతకట్టే కార్యక్రమంలో ఉపయోగించవచ్చు.

బ్రాయిలర్ కుందేళ్ళ గర్భధారణ సమయం 28 – 31 రోజులు. ఆడ కుందేలు మగ కుందేలుతో జతకట్టిన 12-14 రోజుల తర్వాత మన చేతివేళ్ళతో వాటి ఉదరాన్ని తాకడం ద్వారా అవి గర్భంతో ఉన్నదీ లేనిదీ మనము తెలుసుకొనవచ్చును. గర్భనిర్ధారణను మన రెండువేళ్ళతో వాటి వెనుక కాళ్ళ మధ్యనగల పొత్తికడుపును స్పర్శించుటద్వారా తెలుసుకొనవచ్చును. ఒక గుండ్రటి గడ్డ వంటిది వ్రేళ్ళకు తగిలితే ఆ కుందేలు గర్భం ధరించిందని భావించాలి. జతకట్టిన 12-14 రోజుల తర్వాత కూడా ఆడ కుందేలు గర్భం ధరించకపోతే వాటిని తిరిగి మగ కుందేలుతో జతకట్టిస్తారు. ఆ విధంగా ఆడ కుందేలు మూడుసార్లు మగ కుందేలుతో జతకట్టించిన తర్వాత కూడా గర్భం దాల్చకపోతే ఆ కుందేలుని ఆ పెంపక కేంద్రం నుండి వేరు చేయాలి .

జతకట్టిన 25 రోజుల తర్వాత గర్భస్థ కుందేళ్ళ శారీరక బరువు 500-700గ్రాములు పెరుగుతుంది. ఈ పెరిగిన బరువును ఆ కుందేళ్ళను పైకెత్తుట ద్వారా గమనించవచ్చు. గర్భస్థ కుందేలును మగ కుందేళ్ళ వద్దకు పంపినట్లయితే అవి జతకట్టవు.

గర్భం దాల్చిన ఆడకుందేళ్ళ సంరక్షణ

మార్చు

గర్భనిర్ధారణ జరిగిన తర్వాత వాటికి ఎక్కువ మొత్తంలో అధిక పోషణగల మేతను 100 నుండి 150 గ్రాముల సాధారణ మేత కంటే అధికంగా ఇవ్వాలి. ఆ గర్భం దాల్చిన కుందేళ్ళను 25 రోజుల తర్వాత పిల్లలను కనే బోనులోకి మార్చాలి. కాన్పుకు ఐదు రోజుల ముందు గూడు పెట్టెను బోనులోకి చేర్చాలి. ఎండు కొబ్బరి పీచు లేదా వరిగడ్డిని మెత్తగా బోను క్రింది భాగంలో పేర్చాలి . గర్భస్థకుందేలు తన పొట్టపై నున్న వెంట్రుకలను పీక్కొని, ఒకటి లేదా రెండు రోజులలో ఈనుటకు ముందు, వాటి పిల్లలకు గూడులా ఏర్పాటు చేస్తాయి. ఈ సమయంలో కుందేళ్ళ ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరిని బోను వద్దకు అనుమతించరాదు.

మామూలుగా ఉదయం వేళలో కుందేళ్ళు ఈనడం జరుగుతుంది. ఈనడానికి 15 నుండి 30 నిమిషములు పడుతుంది. ఆ తల్లి కుందేలు ఉదయమే తన పిల్లలను తానే శుభ్ర పరుస్తుంది. ప్రతి రోజు ఉదయమే గూడు పెట్టెను పరిశీలించాలి. చనిపోయిన పిల్లలను గూడు పెట్టె నుంచి తొలగించాలి. గూడు పెట్టెను పరిశీలిస్తున్నపుడు తల్లి కుందేలు కలతచెందుతుంది. అందువల్ల తల్లి కుందేలును గూడు పెట్టె పరిశీలనకు ముందే అక్కడనుంచి తొలగించాలి.

కొత్తగా ఈనబడిన కుందేళ్ళ పిల్లలు, వాటి సంరక్షణ యాజమాన్య విధానాలు
పుట్టిని కుందేలు పిల్లల కళ్ళు మూసుకుని ఉంటాయి. వాటి శరీరంపై ఏ విధమైన బొచ్చు ఉండదు. చిన్న కుందేలు పిల్లలు వాటి తల్లి ప్రక్కనే ఆ తల్లిచే తయారుచేయబడిన పడుకపై పడుకొని ఉంటాయి. మామూలుగా తల్లి కుందేలు తన పిల్లలకు రోజుకు ఉదయం ఒక్కసారి పాలిస్తుంది. కాని మనం తప్పనిసరిగా పిల్లలను తల్లి కుందేలు పాలను త్రాగుటకు ప్రయత్నం చేస్తే ఏ విధమైన పాలు తల్లి కుందేల నుండి రావు.తల్లి కుందేల నుండి సరిపడు పాలును త్రాగుచున్న పిల్ల కుందేళ్ళ శరీరము మెరుస్తూ ఉంటుంది. కాని తల్లి కుందేల నుండి సరిపడ పాలు త్రాగని పిల్ల కుందేళ్ళ శరీరము పొడిగాను, ముడతలు పడి ఉంటుంది., వాటి శారీరక ఉష్ణోగ్రత తక్కువగా వుండి అవి బద్ధకంగా ఉన్నట్లు కనిపిస్తాయి.

మారు తల్లి కుందేలుచే పెంపక విధానము
మామూలుగా ఆడ కుందేలు పొదుగులో 8 – 12 చను మొనలుంటాయి. ఒక కాన్పులో ఈనబడిన పిల్లల సంఖ్య కంటే పొదుగులో చనుమొనల సంఖ్య తక్కువగా ఉంటే క్రొత్తగా ఈనబడిన పిల్లలకు సరిపడు ప్రమాణంలో పాలను పొందలేవు కనుక దాని ఫలితంగా పిల్లలు చనిపోతాయి. దీనికి అదనంగా పలురకాల పరిస్థతులు అనగా తల్లి కుందేలు చనిపోవటం, తల్లి సంరక్షణ లేకపోవడం, బోనులోనుండి పిల్లలు బయటకు పడిపోవడం వల్ల తల్లికుందేలు తన పిల్లలను గుర్తించలేకపోవడం వల్ల మారు తల్లికుందేలును పిల్లల పోషణలో ఉపయోగిస్తారు.

కొత్తగా ఈనబడిన కుందేలు పిల్లలు మారు తల్లి కుందేళ్ళ సంరక్షణలో మార్పు చేసినపుడు గుర్తించుకోవలసిన విషయాలు

  • కొత్తగా ఈనబడిన కుందేలు పిల్లల వయస్సు, వాటిని సంరక్షణ చేసే మారుతల్లి యొక్క పిల్లల వయస్సు వ్యత్యాసము 48 గంటలు మించి ఉండరాదు.
  • ఒకేసారి మనము మూడు కంటే ఎక్కువ కుందేలు పిల్లలను ఒక మారుతల్లి దగ్గరకు మార్చరాదు.

తల్లిపాలు మానిన పసి కుందేళ్ళు లేక చిన్న కుందేళ్ళు
పిల్ల కుందేళ్ళు మొదటి మూడు వారాల వయస్సు వచ్చు వరకు గూడు పెట్టెలో ఉంచబడతాయి. ఆ తర్వాత గూడు పెట్టెలను బోనులో నుండి తీసివేస్తారు. పసి కుందేళ్ళకి తల్లిపాలు 4 – 6 వారాల వరకు ఇవ్వవచ్చు. తల్లిపాలు మాన్పించుచున్న సమయంలో మొదట తల్లి కుందేలును బోను నుంచి తప్పిస్తారు. పిల్లకుందేళ్ళను 1-2 వారాలు అదే బోనులో ఉండనిస్తారు. ఆ తరువాత కుందేళ్ళ లింగ నిర్ధారణ చేసి వాటిని వేరువేరుగా విడివిడి బోనులలో పెంచుతారు. మనం తల్లిపాలు మానిన పిల్లకుందేళ్ళ ఆహారము లేక మేతను ఒకేసారి మార్చకూడదు.

పిల్ల కుందేళ్ళలో తగ్గిన మృతసంఖ్య
పదిహేను రోజులు వచ్చువరకు పిల్లకుందేళ్ళను తల్లి వద్దే ఉండనిస్తారు. ఈ సమయంలో తల్లిపాలే పిల్లలకు ఆహారం. ఈ సమయంలో పిల్లకుందేళ్ళ మరణం తన తల్లిద్వారానే సంభవిస్తుంది. పదిహేను రోజుల వయస్సు తరువాత పిల్లకుందేళ్ళు వాటి కోసం సమకూర్చిన నీటిని స్వయంగా త్రాగటం, మేతను తినడం చేస్తాయి. ఈ కాలంలో అవి ఎక్కువగా అనారోగ్యానికి గురౌతాయి. అందువల్ల వాటికి మరిగించి చల్లార్చిన వేడి మంచి నీటిని తల్లి కుందేలుకి దాని పిల్లలకు ఏర్పాటు చేయ్యాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఒక లీటరు నీళ్ళలో ఒక మిల్లీ లీటరు వంతు చొప్పున కలిపి ఇరవై నిమిషాల తర్వాత కుందేళ్ళకు ఏర్పాటుచేయాలి.

వనరులు

మార్చు
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]