కుక్కుటేశ్వర శతకము

(కుక్కుటేశ్వర శతకం నుండి దారిమార్పు చెందింది)

కుక్కుటేశ్వర శతకాన్ని[1] కూచిమంచి తిమ్మకవి తన జీవిత చరమాంకంలో భార్యావియోగం తరువాత వ్రాశాడు. 1920లో మద్రాసులోని వావిళ్లవారి ప్రెస్‌లో ముద్రించబడిన ఈ శతకాన్ని వావిళ్ల రామస్వామి అండ్ సన్స్ ప్రచురించారు. పురాణం సూర్యనారాయణతీర్థులు దీనిని పరిష్కరించాడు. దీనిలో 92 సీసపద్యాలు మాత్రం ఉన్నాయి. తక్కినవి (చివరి పద్యాలు) లభ్యం కాలేదు.

కుక్కుటేశ్వర శతకము
కవి పేరుకూచిమంచి తిమ్మకవి
మొదటి ప్రచురణ తేదీ1920
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంభూనుత విలాస! పీఠికాపుర నివాస!
కుముద హితకోటి సంకాశ కుక్కుటేశ!
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుసీసపద్యాలు
ప్రచురణ కర్తవావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్, చెన్నపురి
ప్రచురణ తేదీ1920
మొత్తం పద్యముల సంఖ్య101
ముద్రాపకుని పేరువావిళ్ల రామస్వామి శాస్త్రులు
ముద్రణా శాలవావిళ్ల రామస్వామి శాస్త్రి ముద్రణాలయము

వివరాలు

మార్చు

భూనుత విలాస! పీఠికాపుర నివాస!
కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ!
అనే మకుటంతో ఈ శతకములో భక్తితత్త్వము, మూర్ఖులయొక్కయు, దుష్టుల యొక్కయు స్వభావములు వివరించబడ్డాయి. పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం మిక్కిలి ప్రాచీనమైన చారిత్రకతను, పౌరాణికతను సంతరించుకున్నది. ఈ ఆలయ ప్రాంగణంలో సుప్రసిద్ధమైన పాదగయాతీర్థము అశేష భక్తకోటిని ఆకర్షిస్తున్నది. అందులోని శివలింగమును కుక్కుటేశ్వరుడని భక్తులు భావిస్తారు. పీఠికాపుర నివాసుడైన కుక్కుటేశ్వరుడు భూనుత విలాసుడు.

పరులకు సమకూడని అందలమెక్కుట వలను మానవునికి గర్వము కలుగును. అలంకార ధారణమున అహంకారము అతిశయించును, సంపద సమకూరుట వలన యశస్సు కలుగును. పదవి వలన ప్రజలను దండించు అధికార మదమును పొందును. కాని ప్రభువైన వానికి ఇవి ముఖ్యములు కావు. ప్రభువుకు సాహసము, ఔదార్యము, ఘనమైన పౌరుషము ఉండవలెను.

పూజలు మొదలైన శుభసమయములలో వచ్చి శుభవాసర నక్షత్రాదులను తెలుపు బ్రాహ్మణులను చూచి వివేక శూన్యులు మూర్ఖులు అయిన గ్రామ్యజనులు నిందించుట ఎన్న తరము కాదు. ఇటువంటి సందేశాలు ఈ శతకములో ఉన్నాయి.

మచ్చు తునకలు

మార్చు
సీ|| అందలం బెక్కుట నవనిఁ బ్రశస్తమా!
మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులుఁ దొడుగుట దొడ్డ సౌభాగ్యమా!
కడు సొమ్ములూనదే గంగిరెద్దు
విత్తంబుఁ గూర్చుట విమల ప్రచారమా!
బహునిధుల్ గావఁడే భైరవుండు
ప్రజల దండించుట పరమ సంతోషమా!
ప్రాణుల నెల్ల నేపఁడె జముండు
గీ|| దొరతనంబున కివిగావు వరుస లరయ
సాహసౌదార్య ఘన పౌరుషములుఁ గాని
భూనుత విలాస! పీఠికాపుర నివాస!
కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ!

మూలాలు

మార్చు
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973