కుచేలోపాఖ్యానము

భాగవతంలో కుచేలుని కథ
(కుచేలోపాఖ్యానం కథ నుండి దారిమార్పు చెందింది)

కుచేలోపాఖ్యానం మహాగ్రంథాలు - శ్రీ మహాభాగవతము చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలో, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది.

కుచేలుడికి సపర్యలు చేస్తున్న శ్రీకృష్ణుడు

ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ, చివరికి బ్రతుకే కటకటలాడవస్తే, పాపం, ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, "మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారే? అతనో గొప్ప ప్రభువు కదా? ఐశ్వర్యవంతుడు. అతనిని అడిగితే, కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ?" అని యెంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు తనలో, "ధనమేమి దొరకక పోయినా, యీ నెపంతో నైనా చాలాకాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది" అని ఆలోచించి, "సరే్, అలాగే" అన్నాడు.

ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ, "నా నేస్తానికి తీసుకు వెళ్లడానికి మనయింట్లో యేమైనా ఉందా?" అని కుచేలుడు భార్యని అడిగాడు. ఆమె, ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు నాలుగు పిడికెళ్లు, కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది.

సంతోషంగా ద్వారక యెప్పుడు వస్తుందా, యెప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేసాడు.

ద్వారకలో మూడు ప్రహారీగోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్లి, కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనం.

దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి, రెండు చేతులూ ముందుకు చాచి వెళ్లి, కుచేలుని కౌగిలించుకున్నాడు. కుచేలుడిని లోనికి తీసుకుపోయి, ఆసనమిచ్చి, దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు.

కుచేలుడు, చిక్కి శల్యంలా మురికిగుడ్డలతో చూడ బిచ్చగాడిలా ఉన్నాడు. అతనికీ, ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికీ యేమంత స్నేహం అని అంతఃపురవాసులంతా ఆశ్చర్యపొయారు.

కుశల ప్రశ్నలయాక, చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ యిద్దరు మిత్రులూ మురిసిపోయారు. కొంచెం సేపయాక నవ్వుతూ, "మిత్రమా, నాకోసం యేం తెచ్చేవేమిటి?" అని కృష్ణుడు కుచేలుని అడిగాడు. కుచేలుడు అటుకులమూట పట్టుకుని, 'ఇంతటి ఐశ్వర్యవంతుడి కిదేనా తేగలిగేను" అని సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు, ఆ అటుకులమూటని తీసుకుంటూ, "భక్తితో నాకు పత్రమర్పించినా చాలు. లేదంటే యేమి తెచ్చినా నాకు నచ్చదు" అని ఆ మూట విప్పి, రుక్మిణితో, "చూసేవా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడో" అని చెప్తూ, అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి, మరొ పిడికెడు వేసుకోబోయాడు, తన నోట్లో. అప్పుడు రుక్మిణి, "ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి యిహంలోనూ, పరంలోనూ సకలసంపదలూ కలుగుతాయి. చాలు" అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా, సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిదురించాడు. తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటానంటే, అతనితో కృష్ణుడు కొంతవరకూ వెళ్లి సాగనంపేడు.

ఇంటికి వస్తూ, తోవలో, "అరెరే, అ పరమసంతోషంలో మా ఆవిడ మరీమరీ చెప్పినది కృష్ణుని అడుగనే లేదు. ఐనా, ఎలా నోరు విప్పి, నాకేమైనా సర్దిపెట్టు అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు. ఎందరు నోచుకోగలరు అ భాగ్యానికి?" అని తృప్తిగా అడుగులు వేసాడు.

ఇంటి దరిదాపులకి చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. ఆశ్చర్యంగా అలా కళ్లప్పగిస్తూ, వస్తూండగా నౌకరులు ముందుకు వచ్చి, " దయచేయండి స్వామీ" అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్లగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య యెదురై, "స్వామీ! దయచేయండి" అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూన్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణపరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది. అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికీ, కుచేలుడు నమస్కరించాడు.

కృష్ణుడు ప్రసాదించిన ఐహికభోగభాగ్యాలని అనుభవిస్తున్నా, వాటియందు మోహమే లెకుండా, నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ, కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు.

ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ

గరుణాల వాలు భాసురకపోలుఁ

గౌస్తుభాలంకారుఁ గామిత మందారు

సురుచిర లావణ్యు సురశరణ్యు

హర్యక్షనిభ మధ్యు నఖిల లోకారాధ్యు

ఘన చక్రహస్తు జగత్ర్పశస్తు

ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ

బన్నగశయను నబ్జాతనయను

మకరకుండల సద్బూషు మంజు భాషు

నిరుప మాకారు దుగ్ధసాగర విహరు

భూతి గుణసాంద్రు యదు కులాంబోధి చంద్రు

విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు