కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం

అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న

కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న దేవాలయం.[1] మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు దేవాలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు.[2]

కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం is located in Telangana
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ ప్రాంతం
భౌగోళికాంశాలు :16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మహబూబ్ నగర్
ప్రదేశం:కురుమూర్తి, చిన్నచింతకుంట మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ వేంకటేశ్వరుడు
ముఖ్య_ఉత్సవాలు:బ్రహ్మోత్సవాలు
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. 1268
సృష్టికర్త:ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు

చరిత్ర

మార్చు

అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య స్వయంభూవంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామి పేదల తిరుపతిగా మొక్కులందుకుంటున్నాడు. కురుమూర్తి వేంకటేశ్వరస్వామి దేవస్థానం సా.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు.[3] 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. ఈ వేడుకలు మండల పరిధిలోని వడ్డేమాన్ నుంచి ప్రారంభమవుతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.[4] 1966లో ఈ దేవాలయం దేవాదాయ శాఖలో విలీనం చేయబడింది.

పురాణ కథలు

మార్చు

ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్ళి చేసుకోడానికి కుబేరుని వద్ద అప్పుచేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందిన స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు. అక్కడ్నించి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక గుర్తురావడంతో అక్కడి ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించి అక్కడ్నించి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని స్థల పురాణం వివరిస్తోంది.

కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి తిరుపతి నుంచి ఉత్తరముఖంగా ఇక్కడికి వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వేంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందినది.[5]

 
కురుమూర్తి దేవాలయంలోని భగవంతుడి పాదాలు

నిర్మాణం

మార్చు

మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతిగుండు కింద ఉండేది. భక్తులు గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొనేవారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించారు. దానిముందు మండప నిర్మాణం, ధ్వజ స్తంభం ఏర్పాటు చేశారు.

కాకతీయుల సామంతుడిగా, రాజప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించిన గోన గన్నారెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్ళినపుడు ఈ దేవాలయానికి సమీపంలో ఉన్న చంద్రగిరి ప్రాంతంలోని ముక్కెర వంశస్థుడైన గోపాలరెడ్డిని కలిశాడు. ఆయన గుణగణాలను, ధైర్య సాహసాలను, ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దుడై, వర్థమానాపురం (వడ్డేమాన్) పరగణాకు ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన గోపాలరెడ్డికి ‘మక్తలనాడ గౌడ’ పదవిని అప్పగించాడు.

అలా ముక్కెర వంశానికి చెందిన గోపాలరెడ్డి మొదలుకొని (సా.శ. 1268) సంస్థానాలు విలీనమయ్యే నాటికి అధికారంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవి (1948) దాకా మొత్తం 28 తరాల వారు అందరూ తమ ఇలవేల్పు అయిన ఇక్కడి ‘కురుమూర్తి స్వామి’ దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు.

ఆత్మకూరు సంస్థాన పాలకులు సా.శ. 1350 సం.లో అప్పటి సంస్థాన బాధ్యతలు నిర్వహించిన చంద్రారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారని, అనంతరం ఇదే వంశానికి చెందిన మిగిలిన రాజ వంశీయులు కొండకు మెట్లు, మండపాలు, కొండ కింద కోనేరు నిర్మాణాలు చేయడంతోపాటు ‘వార్షిక బ్రహ్మోత్సవాల’ను ఘనంగా నిర్వహించడంలోనూ ప్రధాన భూమికను పోషించారని చరిత్రకారుల అభిప్రాయం.

తరువాత 1810–1840 సం.ల మధ్యకాలంలో ఆంజనేయస్వామి దేవాలయాన్ని చిన్న వెంకటరెడ్డి, 1857-78 మధ్య కాలంలో వాద్యకారుల కోసం నగారా బంగ్లా (నవత్ ఖానబంగ్ల), ఉద్దాల మండపాలను రాజా శ్రీరాం భూపాల్ నిర్మించారు. ఉత్సవాల సందర్భంగా వీటిని ఉపయోగించేవారు.

ముక్కెర వంశస్థుల ఆభరణాలు

మార్చు

అమరచింత (అమ్మాపూర్) సంస్థానాధీశుల ఇలవేల్పైన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

మొదట్లో ఆభరణాల భద్రత దృష్ట్యా వాటిని సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపేవారు. అనంతరం కొండపైకి వాటిని వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు. 1968లో కురుమూర్తి దేవాలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైనందువల్ల 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా వాటిని తెచ్చి స్వామి వారికి అలంకరిస్తున్నారు. ముక్కెర వంశస్థులే నేటికీ ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన భూమికను పోషిస్తున్నరు.[6]

బ్రహ్మోత్సవాలు

మార్చు

స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహ లోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తల, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.

పేదలకూ, దళితులకూ దగ్గరివాడైన దేవుడు

మార్చు
 
కురుమూర్తిస్వామి మెట్లదారి

పేదల తిరుపతిగా ప్రసిద్ధమైన కురుమూర్తి దేవాలయంలో వర్ణవివక్షకూడా లేదనే చెప్పాలి. స్వామి వారి పాదుకలను వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్పోగారంలో రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండలంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం.

ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తరు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తరు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తరు. దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది.

కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు.

అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం

మార్చు

1991లో కీ.శే. పాలెం సౌరప్ప తన శిష్యబృందంతో ప్రతి అమావాస్య రోజున ఇక్కడకు వచ్చి, ఆ రాత్రి ఇక్కడే బసచేసి, భజనలు చేసి తిరిగి వెళ్ళేవాడు. తరువాతికాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి, ప్రతి అమావాస్యకు 15 నుండి 20 వేలమంది వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అప్పుడు కొందరు దాతల సహకారంతో దేవాలయ ప్రాంగణంలో ‘అన్నదాన కార్యక్రమాని’కి శ్రీకారం చుట్టగా అప్పంపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు 1994లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టాడు. మొదట్లో 40 నుండి 50 మంది వరకు మాత్రమే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. కానీ, ప్రస్తుతం ప్రతి అమావాస్యకు వేలసంఖ్యలో అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. కురుమూర్తిని సందర్శించుకునే భక్తుల సౌకర్యార్థం కొండ కింద శాశ్వత షెడ్లు, విశ్రాంతి గృహం, కళ్యాణ కట్ట, మంచినీటి సౌకర్యం కోసం కొండ కింద, పైన వాటర్ ట్యాంకులను నిర్మించారు. కేవలం ఉత్సవాల సందర్భంగానే కాకుండా ప్రతి అమావాస్యకు భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

తిరుమలకు కురుమూర్తికి పోలికలు

మార్చు
 
కురుమూర్తి స్వామి దేవాలయ ప్రవేశద్వారం
  • తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామికి ‘ఉద్దాల మండపం’ ఉంది[7]
  • తిరుపతిలోలాగే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు
  • తిరుపతిలోలాగే ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు
  • తిరుపతిలో ఉన్నట్లుగానే ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు
  • తిరుమలకు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి
  • తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేరిట ఎత్తయిన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు అలాంటిదే కనిపిస్తుంది[8]

కురుమూర్తి స్వామి ఏడు కొండలు

మార్చు

ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు...

  1. శ్వేతాద్రి (బొల్లిగట్టు) (శ్వేత వర్ణం అంటే తెల్లని అద్రి అంటే కొండ, వాడుకలో బొల్లి అనేది కూడా తెలుపుకే వాడతారు)
  2. ఏకాద్రి (బంటి గట్టు) (ఏక అంటే ఒక్కటి అని దానినే వాడుకలో ఒంటి అని కొండను గట్టు అంటున్నారు)
  3. కోటగట్టు
  4. ఘనాద్రి (పెద్ద గట్టు)
  5. భల్లూకాద్రి (ఎలు గులగట్టు) (భల్లూకమూ అంటే ఎలుగ్గొడ్డు లేదా బేర్)
  6. పతగాద్రి (చీపుర్లగట్టు)
  7. దైవతాద్రి (దేవరగట్టు)

అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు.

కురుమూర్తి దేవాలయానికి చేరు విధానం

మార్చు
  • జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు
  • కురుమూర్తి రైల్వేస్టేషను నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • 7వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • కురుమూర్తి సమీపంలో వాగుపై ప్రాజెక్టు ఉంది.

కురుమూర్తి గురించి ప్రస్తావనలు

మార్చు
  • బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు రాసిన ‘శ్రీ ఉత్తర వెంకటాచల మహత్యం’ (కీ.శ. 1854-61) గ్రంథంలో కురుమూర్తి గిరుల శోభ ప్రస్తావన.
  • 1959లో వి.రామకృష్ణయ్య శ్రీకుర్మూర్తిస్వామి భజన కీర్తనలు వెలువరించారు
  • ‘కురుమూర్తి స్వామి’ క్షేత్రానికి సంబంధించి ‘దుర్వాస, దిలీప సంవాదం’ అనే చారిత్రక కథ
  • ఇక్కడి ఏడుకొండల ప్రస్తావన 1878లో నరసింహ దీక్షితులు రచించిన చెంచుకథలో ఉంది
  • అజకొల్లు శేషకవి ‘శ్రీ కురుమూర్తి క్షేత్రస్థల పురాణం’ (1850)లో మొత్తం 107 పద్యాలు ఉన్నాయి.
  • 1851-1905 మధ్య కాలంలో కురుమూర్తి స్వామి సుప్రభాతాలు ప్రసిద్ధినొందాయి శ్రీనివాస విలాస గ్రంథకర్త కృష్ణమాచార్యులు రచించారు.
  • స్థానిక కవి పండితులు వైద్యం వేంకటేశ్వరాచార్యులు 1983లో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ‘శ్రీ కురుమూర్తి క్షేత్ర చరిత్ర’ రాసారు.
  • 2005లో సంస్కృత గ్రంథమైన శ్రీ ఉత్తర వేంకటాచల మహాత్మ్యం’ను వైద్యమ్ వెంకన్న తెలుగులోకి అనువదించారు.
  • విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు కురుమూర్తిస్వామి భజన కీర్తనలు ప్రచురించారు.
  • చరిత్ర, సాహిత్య పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి ఈ క్షేత్రం వివరాలను క్రోడీకరించి వెలువరించారు.
  • వనపర్తికి చెందిన ఉమ్మెత్తల నర్సింహమూర్తి స్వామిని కీర్తించే అనేక జానపద గేయాలను సేకరించి ప్రచురించారు .

మూలాలు

మార్చు
  1. "CC Kunta | Mahabubnagar District,Telangana | India". www.mahabubnagar.telangana.gov.in. Archived from the original on 2022-09-22. Retrieved 2022-12-12.
  2. "భక్తి శ్రద్ధ్దలతో వైకుంఠ ఏకాదశి". www.andhrabhoomi.net. Archived from the original on 2018-12-20. Retrieved 2022-12-12.
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 9, తేది జూన్ 11, 2008
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది నవంబర్ 11, 2007
  5. "కురుమూర్తి‌రాయా మేమొస్తు‌న్నాం మేమొస్తు‌న్నాం | కవర్ స్టోరీ | www.NavaTelangana.com". NavaTelangana. 2018-11-25. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-12.
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, నవంబర్ 17, 2007
  7. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది అక్టోబర్ 19, 2006
  8. "కురుమూర్తి జాతర: ఇక్కడ దళితులే అర్చకులు!". BBC News తెలుగు. 2017-10-31. Archived from the original on 2022-11-21. Retrieved 2022-12-12.

వెలుపలి లంంకెలు

మార్చు