కూడలి సంగమేశ్వర క్షేత్రం

(కూడలి సంగమేశ్వర క్షేత్రము నుండి దారిమార్పు చెందింది)

కూడలి సంగమేశ్వర క్షేత్రం కృష్ణా తుంగభద్రా నదుల సంగమ క్షేత్రం.ఆలంపూరుకి 10 మైళ్ళ దూరంలో కూడ (లి) వెల్లి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో కృష్ణా, తుంగభద్రల సంగమ స్థలముంది. దీనిని షణ్ణదీ సంగమం అని కూడా అంటారు. కృష్ణ, వేణీ, మలప్రభ, భీమ, తుంగ, భద్ర అనే ఆరు నదులు ఇందులో కలిసి ఉన్నందువల్ల ఈ పేరు వచ్చింది. రెండు నదుల మధ్య ఎత్తైన దిబ్బ మీద సంగమేశ్వరాలయం ఉంది. దీనిని బాదామి చాళుక్యులు కట్టించారు. ఆలయం చుట్టూ దృఢమైన శిలాప్రాకారం నిర్మించబడింది. గుడి చుట్టూ గోడలలోని కొన్ని గూళ్ళలో, ద్వారాలకు, గంగాయమునలు, అర్ధనారీశ్వరుడు, శివుని లీలామూర్తులు రమణీయంగా నిలుపబడి ఉన్నాయి. గుడి గర్భాలయంలో సంగమేశ్వరుని లింగం ఉంది. గర్భగృహం చుట్టూ ప్రదక్షిణాపథం, ముందుభాగాన విశాలమైన మొగశాలలో ఒక ప్రక్కన పార్వతి, గణేశుడు, మరొక ప్రక్కన వీరభద్రస్వామి ప్రతిష్ఠించి ఉన్నాయి. గుడి వెలుపల ఆగ్నేయమూలలో విష్ణ్వాలయం, ఈశాన్యమూలలో ఆంజనేయుని గుడి ఉన్నాయి. సాధారణంగా యాత్రికులు దూరప్రదేశాలనుండి ఈ క్షేత్రానికి వస్తుంటారు. శివరాత్రి సమయంలో స్వామికి తిరునాళ్ళు 5 దినాలు జరుగుతుంది. అప్పుడు రథోత్సవం కూడా జరుపుతారు.

కూడలి సంగమేశ్వర క్షేత్రం
కూడలి సంగమేశ్వర క్షేత్రం

విశేషాలు

మార్చు

ఈ క్షేత్రం జోగులాంబ జిల్లా, అలంపూర్ తాలూకాలో కృష్ణా, తుంగభద్రల సంగమం (కూడవెల్లి (నిర్జన గ్రామం) దగ్గర వెలసిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం రెండు నదులైన కృష్ణ, తుంగభద్ర నదుల నడుమ వెలసిఉంది. అందువల్ల ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన శివార్చనలు, సంబరాలు జరుగుతాయి.

చేరుకొనే మార్గాలు

మార్చు

ఈ క్షేత్రానికి వెళ్లాలంటే కర్నూలు నుండి అలంపూర్ నకు బస్సులో వెళ్లాలి. అక్కడినుండి కాలినడకన లేక గుర్రం బండ్ల మీద ప్రయాణించి నేరుగా సంగమేశ్వరం చేరుకోవచ్చును.

పురాణ గాథ

మార్చు

ద్వాపరయుగంలో పాండవులు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని నివసించారు. కౌరవులు తమ భోగ భాగ్యాలను వారిముందు ప్రదర్శిచాలని "ఘోషయాత్ర" నెపంతో బయలుదేరిరి, కౌరవులను తమ శతృవులుగా భావించి గంధర్వులు వారిని బంధిచి గంధర్వలోకానికి తీసుకొని పోవుచుండగా పాండవాగ్రజుడు ధర్మరాజు వారిని విడిపించమని భీముడు, అర్జునుడు లను ఆదేశిస్తాడ. అపుడు కౌరవ వీరులు అవమానంతో హస్తినాపురం చేరతారు. అపుడు కృష్ణుడు పాందవులను దండకారణ్యంలో గడపవలసినదిగా ఆదేశించగా వారు అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. అక్కడి ప్రజలను ఆదరిస్తూ, వారి వారి మన్ననలను పొందుతూ సంచార జీవితం గడుపుతుంటారు. అలా సంచరిస్తూ మనసులను ఆహ్లాదపరచే జల విన్యాసాలతో అలరారుచున్న కృష్ణ, తుంగభద్రల సంగమం (కూడలి) వద్దకు చేరుకుంటారు.

ఒకనాడు ధర్మరాజు రెండు నదుల సంగమం (కూడలి) కావున సంగమేశ్వరుని ప్రతిష్ఠించి పూజలు చేసి తరించాలని కోరికను తన భార్య, సోదరులకు వెల్లడించాడు. అగ్రజుని కోరిక నెరవేర్చదలచిన భీమసేనుడు, శక్తిసామర్థ్యాలతో కాశీ క్షేత్రం చేరి అన్నపూర్ణ, విశ్వనాథస్వాముల ప్రార్థన చేసి అక్కడనున్న ఒక పవిత్ర శివలింగంను తీసుకొని ఆఘమేఘాలమీద కృష్ణా, తుంగభద్రల సంగమానికి చేరుకున్నాడు. పాండవులు సకల పూజా ద్రవ్యాలు సేకరించి రెండునదుల కలయిక గట్టుపై ఆ శివలింగంను ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు సాగిస్తారు. కొంతకాలం పాండవుల పూజలందుకున్నాడు ఆ సంగమేశ్వరుడు.

శాసనాలు

మార్చు

ఇక్కడ 'కల్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుని' కుమార్తె మైలలదేవి ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికులను కృష్ణా, తుంగభద్రా నదులలో ధర్మంగా దాటించడానికి బెస్తవానికి భూదానం చేసి వేయించిన శాసనం, కన్నడ గోకర్ణదేవుని కాలంలో 'మల్లికార్జున పండితారాధ్యుడు' ఈ క్షేత్రానికి వచ్చినపుడు చేసిన దానం తెలిపే శాసనం, ఆలయ జీర్ణోద్ధరణకు చెందిన శాసనాలు ఉన్నాయి.

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు