కూర్మనాధం కొటికలపూడి

కొటికలపూడి కూర్మనాధం (జననం: 1930 జనవరి 18 - మరణం: 2015 మే 30)

నేపధ్యం

మార్చు

బొబ్బిలి రాజ్య ఆస్థాన కవిపండిత వంశానికి చెందిన శ్రీ కొటికలపూడి కూర్మనాధం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెన్నికగన్న గేయ కవి. కూర్మనాధం ఆంగ్లంలోనూ ఆంధ్రంలోనూ కూడా కొన్ని వందల కవితలు, పాటలు రచించారు. ఆంగ్ల తెలుగు భాషల్లో వీరు రచించిన 18 పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. 'కవి కోవిద’ కవితా విశారద’ వీరి బిరుదులు.

జీవితం

మార్చు

వీరు 1930లో చోడవరంలో జన్మించారు. తండ్రి కొటికలపూడి సాంబమూర్తి స్వయంగా కవి, పండితులు, విజయనగరం మహారాజా అలక్ నారాయణ గజపతి ఆస్థానంలో ఎస్టేట్ మేనేజర్. తల్లి వెంకట రత్నమ్మ. విద్యాబుద్ధులు నేర్చినది విద్యలనగరం విజయనగరంలో. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఏ పట్టా అందుకున్నారు. కొంతకాలం మద్రాసులో వివిధ ఉద్యోగాలను నిర్వర్తిస్తూ సినీరంగాల్లో ప్రయత్నాలు చేశారు. గిడుగు సీతాపతి, ఘంటసాల, సీనియర్ సముద్రాల, సాలూరు రాజేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు మెదలగు ప్రముఖులతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అనంతరం విజయనగరం మహారాజా కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా చేరి, సుమారు 30 సం. విద్యాబోధన చేసి పదవీవిరమణ పొందారు. సతీమణి మంగతాయారు కూడా మహారాజా మహిళా కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు. మంగిపూడి రాధిక వీరి ఏకైక కుమార్తె. కుర్మనాధం 2015 మే నెల ౩౦వ తెదీన వారి స్వగృహంలో స్వర్గస్తులయ్యారు.

సాహిత్యం

మార్చు

చిన్ననాటి నుండి తెలుగు సాహిత్యం పై ఉన్న మక్కువ, కవి పండిత వంశంలో పుట్టడం వలన సాహిత్యాభిలాష అలవడింది. పెద్దలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తొలిసారి 1968లో నవనందిని అనే గేయ సంపుటిని ప్రచురించారు. చివరి రోజుల వరకు వీరి సాహితీ ప్రస్థానం ఆగలేదు. వీరు స్వర్గస్తులైన తర్వాత కూడా 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం వీరి “Sacred Waves” అనే ఆంగ్ల కవితాసంపుటిని ప్రచురించి తిరుమల బ్రహ్మోత్సవాలలో విడుదల చేశారు. 1974లో శ్రీ రామ జననం నుండి పట్టాభిషేకం వరకు మొత్తం రామాయణాన్ని ఒకే గీతంగా వీరు రచింపగా, దానిని ఎస్ పి బాలసుబ్రమణ్యం గళంలో పాడించి కొలంబియా సంస్థ వారు "శ్రీరామ పట్టాభిషేకం" ఎల్. పి రికార్డుగా విడుదల చేసారు. వీరు కృష్ణునిపై రాసిన పాటలను ఎస్ జానకి గారు పాడగా, సంగీత సంస్థ “బృందావనంలో కృష్ణయ్య” ఆడియో క్యాసెట్ గా విడుదల చేశారు.[1] అంతర్జాతీయ స్థాయిలో ‘who is who’ ‘International Biographical Center’ వంటి సంస్థలు కూర్మనాధం గారి ప్రతిభను గుర్తించి గౌరవ సర్టిఫికెట్లు అందజేశారు.[2]

రచనలు

మార్చు
  • 1968 నవనందిని – గేయ సంపుటి
  • 1972 కిన్నెరవీణ – ఖండకావ్య సంపుటి
  • 1973 సప్తగిరులు – వెంకటేశ్వరస్వామిపై భక్తి గీతాలు
  • 1977 అంతర్వాహిని - గేయకావ్యం
  • 1978 వనమాలలు – తిరుప్పావుకు అనువాద గీతాలు
  • 1979 Lilt of Halo – ఆంగ్ల కవితాసంపుటి
  • 1981 హల్లీశకము - ఖండకావ్య సంపుటి
  • 1984 భావరాగాలు - 108 శాస్త్రీయ సంగీత రాగాలపై పాటలు
  • 1984 చరణధూళి – పాటల రూపంలో రామాయణం
  • 1986 కన్నీటివాగు - తాత్వికచింతనతో కూడిన గేయ సంపుటి
  • 1988 Badri – బద్రీనాథ్ యాత్రపై ఆంగ్ల కవితా సంపుటి
  • 1994 Sparks of Piety -అన్నమయ్య కీర్తనలకు ఆంగ్లంలో “సానెట్స్”గా అనువాదం
  • 2000 Thermosteth- వైద్య పరిభాషపై ఆంగ్ల కవితా సంపుటి
  • 2000 హితవాహిని – పాటల రూపంలో భగవద్గీత
  • 2002 రుద్రాక్షలు – తిరువెమ్బావుకు అనువాద గీతాలు
  • 2010 మానస మాధవం- వెంకటేశ్వరస్వామిపై 300 భక్తి గీతాలు, టీటీడీ ప్రచురణ[3]
  • 2015 చింతనామృతం -వెంకటేశ్వరస్వామిపై మరొక 300 భక్తి గీతాలు
  • 2018 Sacred Waves – వెంకటేశ్వరస్వామిపై ఆంగ్లంలో భక్తి కవితలు, టీటీడీ ప్రచురణ [4]

మూలాలు

మార్చు
  1. "Brundavanamlo Krishnayya". Relive (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-25. Retrieved 2022-08-25.
  2. kotikalapudi, Kurmanadham (1999). Who's who of Indian Writers, 1999: A-M (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-0873-5.
  3. "Book authored by Kotikalapudi Kurmanadham". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-25.
  4. "Sacred waves (Eng) (F) | By Tirumala Tirupati Devasthanams". ebooks.tirumala.org. Retrieved 2022-08-25.