కృష్ణ బలిజ

ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డ కులాల్లోని డి గ్రూపు కులం

ఆంధ్ర ప్రదేశ్ వెనకబడిన కులాల జాబితా D గ్రూపు కులాలలో ఈ కృష్ణబలిజ కూడా చేర్చబడింది. వీరిని బలిజోళ్ళు అని కూడా పిలుస్తారు.

సామాజిక జీవితం, వృత్తి

మార్చు

పూర్వకాలము లో కుంకుమ, గంధం, కాటుక, బుక్కా మొదలగు సాంప్రదాయక అలంకరణ సామగ్రిని వీరే తయారు చేసి అమ్మేవారు. ముఖ్యంగా దేవతార్చన లోనూ, నిత్య జీవితంలోనూ ప్రజలందరూ కళ్యాణప్రదంగా భావించి వాడుకునే కుంకుమ ను ప్రకృతి లో సహజంగా దొరికే పదార్థాలతో తయారుచేయడానికి పడమటి కనుమలు, ఆరావళి పర్వతాలలో రాళ్లు సేకరించి పొడిచేసి వస్త్రకాయం పట్టి సుగంధ ద్రవ్యాలు కలిపి సాంప్రదాయక పద్ధతి లో ఉత్పత్తి చేసేవారు. వసంతోత్సావాలలో చల్లుకోవటానికి వట్టివేళ్లు, ఉత్తరేణి వేళ్లు, గంధం పొడిలో కలిపి పచ్చ, పసుపు, ఎరుపు, కాషాయం వంటి రంగుల బుక్కాను కూడా వీరే తయారు చేసేవారు. కుంకుమతోపాటు వసంతోత్సవాలలో వాడే బుక్కా నే కాక గులాబ్, పన్నీరు వంటి వాటిని కూడా తయారు చేస్తారు. కుంకుమ అమ్మే వారిని కుంకపువాండ్లని, బుక్కా అమ్మేవారిని బుక్కవారని పిలుస్తుండేవారు. ఇవే కాకుండా స్త్రీలు తమ అలంకరణ కొరకు ఉపయోగించే కుంకుమ, కాటుక, గాజులు, పూసలు, పిన్నులు, బన్నులు, సవరాలు ఇతర సౌందర్యసామగ్రి ని కూడా అమ్మేవారు. ఆ కాలం నాటి ఫ్యాన్సీ సామాన్ల వ్యాపారం వీరిదే. స్వాతంత్ర్యం తరువాతి సాంఘీక మార్పులతో అందరిలాగానే వీరి పరిస్థితుల లోనూ గణనీయమైన మార్పులు మొదలయాయి. ఆర్థిక స్థాయి పెరిగాక సంచార వ్యాపారం తగ్గించుకుంటూ స్థిర నివాసాలు ఏర్పరచుకుని ఫ్యాన్సీ షాపులు అభివృద్ధి చేసి, బట్టల వ్యాపారాలలోకి విస్తరించి స్థిర పడడం మొదలయింది. వీరు గంపల్లో సామాను అమ్మే స్థితి నుండి ఫ్యాన్సీ షాపుల్లోని అద్దాల షో కేసుల్లో ఆ సామగ్రినే అందంగా ఆకర్షణీయంగా ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు అమ్మడం మొదలుపెట్టి ఆర్థికాభివృద్ధి పొందుతూ తమ తరవాతి తరాల వారికి విద్యాభివృద్ధికి అవకాశాలు కల్పించుకుంటూ వచ్చారు. శతాబ్దాల పూర్వం హైందవ,రామానుజ మతానుయాయులై జనపదాలలో భక్తిసాహిత్య ప్రచారం కోసం దైవ సంకీర్తనలు గానం చేస్తూ సదా దైవనామస్మరణ తో కాలినడకన దేశసంచారం చేస్తూ సామాన్య జనుల గౌరవాదరణలు పొందుతూ జీవనం సాగించిన వీరు తదనంతర(ముస్లిం నవాబుల పరిపాలనా కాల)పరిస్థితులలో సాంప్రదాయిక వ్యాపకాల నుండి ప్రక్కకు మరలి సంచార వ్యాపారాలలో జీవనం గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయం తోపాటు పశువులను పెంచి పాడి వ్యాపారం, నీలిమందు తయారీ (సున్నంతో ఇళ్ల గోడలకు వైట్ వాష్ చేసేటందుకు కలుపుతారు), ఫైనాన్స్ తదితర రంగాలలోకి కూడా అడుగుపెట్టి గడిచిన రెండు శతాబ్దాలలో జీవన వృత్తి విధానాలనూ మార్చుకుంటూ వచ్చారు. మొదట్లో ఆదిమ వర్గాల వారు విరాగుల వలె దైవ సంకీర్తనా గానంతో సంచార జీవితం గడిపేవారు గనుక స్థిరాస్తులు ఏర్పరచుకునేవారు గాదు. అందుకే ఈనాడు ఆర్థికపరంగా ఇతరులతో పోలిస్తే కొన్ని తరాల పైగా వెనుకబడిపోయారు. అదేకాక సంచారజీవన విధానంలో సంక్రమించిన దురలవాట్లతో పలువురు తరతరాలుగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయారు. వారిలో మారుమూల పల్లెలు, గ్రామాలలో పాత మార్గంలోనే జీవనాన్ని నడుపుకుంటున్న వారూ ఉన్నారు. స్టీలూ అల్యూమినియం వస్తుసామగ్రి, మహిళలకు కావాల్సిన వస్తువులు,పాత గుడ్డలు అమ్ముతూ జీవిస్తున్న ఆదిమ వర్గాల వారింకా అక్కడక్కడా తటస్థపడుతూనే ఉంటారు. ఫుట్‌ పాత్‌లపైనా, తోపుడు బండ్లమీద, సైకిళ్ల పైన ఊరూరా తిరిగి వ్యాపారం చేసుకునేవారేగాక, స్థిరంగా ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు, టైలరింగ్ చేస్తూ, కిరాణా షాపులు టిఫిన్ సెంటర్లు నడుపుతూ, జీవనం సాగిస్తున్నవారూ ఉన్నారు.[1]

ఆదిలో సంచార వ్యాపార జీవనం గడిపిన వారైనప్పటికీ, సంచార జీవితంలో పలుచోట్ల తిరిగి వివిధ వ్యవసాయ వ్యాపార వృత్తుల మెళకువలను ఆకళింపు చేసుకొని క్రొత్త విద్యలను గడించి ఆ పిదప జనపదాలలో, పట్టణాలలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం అటుపైన వ్యవసాయ వ్యాపార రంగాలలో వృద్ధి చెందుతూ ఆర్థికంగా ఎదగడం మొదలైన తరువాత అట్టివారు సంచార వర్గాల వారి నుండి దూరమవడం, విడి పడడం జరిగింది. ఆదిమ వర్గాల వారి జీవనవిధావం నుండి పూర్తిగా దూరమై సామాజికంగా పరిణామం చెందిన వారు కృష్ణబలిజ అనే నామంతో సాంఘికంగా స్థిరపడి ఆ తదనంతరం ప్రత్యేక కులముగా ప్రభుత్వ గుర్తింపు పొందారు. [2] ఆ తదుపరి వీరి వ్యావహారిక జీవితం పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు. పూర్వకాలంలో కులాలన్నీ వృత్తుల ఆధారంగా ఏర్పడినవని ప్రతి కులానికొక వృత్తిపరమైన గుర్తింపు ఉంటుందని అంటున్నప్పటికీ, ఈ కృష్ణబలిజ వారు మాత్రం వైశ్యుల వలె వ్యాపారాలు, రెడ్లూకాపుల వలె వ్యవసాయం, ఇంకా పలు వస్తు తయారీ రంగాలలో అడుగుపెట్టి జీవనం సాగించారు.

అన్ని సామాజిక వర్గాల వలెనే కృష్ణబలిజ కులస్తులు కూడా స్వాతంత్ర్యానంతరం జీవన ప్రమాణాలలో మార్పు సాధించుకొంటూ వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారనే చెప్పవచ్చును. ప్రభుత్వం నుండి ఆర్ధిక సామాజిక ఆలంబనా మరియూ ఉన్నత విద్యార్జనకూ ఉద్యోగ సముపార్జనకూ అవకాశాలూ మరింతగా అవసరమైన వారే ఇప్పటికీ అధికంగా ఉన్నారు. రాజకీయాల్లో వీరి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండడం కూడా వీరి అభివృద్ది కుంటుపడడానికి ఒక కారణంగా చెప్పవచ్చును.

రూపాంతరం చెందుట

మార్చు

కృష్ణబలిజ కులస్తులలో కొన్ని తెగలవారు బట్టల వ్యాపారం, వ్యవసాయం చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. విద్యాభివృద్ధి సాధించిన వారు ఉద్యోగావకాశాలు పొంది స్థిరపడుతున్నారు. కృష్ణ బలిజ కులం వారనేకులు నేడు ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, చెరుకుంపాలెం, నరసరావుపేట, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెము, గూడూరు, తిరుపతి, అనంతపురం, ఖమ్మం, భద్రాచలం, ఏలూరు, కొయ్యల గూడెం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, మరియు హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ మొదలగు పట్టణాల్లో నివాసాలు ఏర్పరచుకుని స్థిరపడినారు. కృష్ణబలిజ వారిలో ఈ క్రింది ఇంటిపేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీసం, విస్సా, కుప్పం, తిర్లుక, బత్తుల, నాయుడు, మద్దినేని, కొరవి, కోలా, గంటా, గడ్డం, చెన్నూరి, దండా, దండే, కుప్పాళ, పసుపులేటి, గుడ్లూరి, పప్పు మొదలగు ఇంటిపేర్లు గలవారు అన్నం, అత్తులూరి, తుపాకుల, బాణాల, గోరంట్ల, తన్నీరు, పల్లా, పొదిలి, చేజర్ల, గడ్డం, మువ్వా, మువ్వల, కావేటి, పాశం, చేను మొదలగు ఇంటిపేర్ల వారితో వివాహ సంబంధాలు కలిగి ఉండడం ఆంధ్ర ప్రాంతం లో ఎక్కువగా చూడవచ్చు.

వీరి జనాభా రానురానూ తక్కువవుతూ ఉండడం వలన సామాజికంగా సమాన స్థాయిలో ఉన్న ఇతర బలిజ శాఖల వారి తోను, తెలగాలు, దాసరి, కాపులు, మున్నూరుకాపులు, తెలుగోళ్లు వంటి ఇతర కులాల వారి తోను వివాహ సంబంధాలకై కలవడం కూడా తరచుగా కనబడుతోంది. రేపటితరాల వారిలో కులాల అడ్డుగోడలను తొలగించగలమనే ఆశయానికి ఇది ఒక ఆచరణీయమైన ప్రగతిశీలమైన ముందడుగుగా, ఆదర్శనీయమైన ధోరణిగా భావించవచ్చు.

https://en.wikipedia.org/wiki/Draft:KrishnaBalija  

నివేదనలు

మార్చు

బిసి-డి గ్రూపులో కృష్ణ బలిజ అని కులంగా ఉన్నారు. తమను గ్రూప్‌-డి నుంచి `ఎ'లోకి మార్చాలని కోరుతు న్నారు.

ఇవీ చూడండి

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా

  1. ముందు తరాల పెద్దలతో వృద్ధులతో సంభాషణల నుండి మరియు కీర్తిశేషులైన పెద్దల ద్వారా వంశ పరంపర్యంగా లభించి జీర్ణస్థితిలో ఉన్న కొన్ని వ్రాతప్రతులను చదివి బహు కాలంగా సేకరించిన సమాచారం ద్వారా జనిత మైన వివరాలు.
  2. ముందు తరాల పెద్దలతో వృద్ధులతో సంభాషణల నుండి మరియు కీర్తిశేషులైన పెద్దల ద్వారా వంశ పారంపర్యంగా లభించి జీర్ణస్థితిలో ఉన్న కొన్ని వ్రాతప్రతులను చదివి బహు కాలంగా సేకరించిన సమాచారం.