కృష్ణ రజని (పుస్తకం)

కృష్ణ రజని ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయాల సంకలనం. ఈ సంకలనంలోని అధికభాగం కృష్ణశాస్త్రి రచించగా సంగీతకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం కూర్చారు.

కృష్ణ రజని
కృతికర్త: దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: గేయాలు
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: మార్చి 2009
పేజీలు: 16
కృష్ణ రజని (పుస్తకం) రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి

రచన నేపథ్యం

మార్చు

కృష్ణశాస్త్రికి మూగతనం వచ్చాకా రాసిన గేయాలను ఈ గేయకావ్యంగా ప్రచురించారు. హైదరాబాద్ లో ఉండగా కృష్ణశాస్త్రి వీటిని రచించారు. కృష్ణ రజనీ అనే శీర్షికకు చీకటిరాత్రి అనే కాక, కృష్ణశాస్త్రి సాహిత్యం, రజనీ సంగీతం అనీ అర్థం వస్తుందని గ్రంథకర్త స్వయంగా పేర్కొన్నారు. అయితే అన్ని పాటలూ రజనీతో కూర్చుని రాయడం కుదరలేదు.[1]

రచయిత గురించి

మార్చు

ప్రధాన వ్యాసం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా ఉద్యమంలో కృష్ణశాస్త్రి ఒక కీలకమైన కవి. తొలిదశలో భావకవిత్వానికి రూపుదిద్ది, తర్వాత వయసులో రేడియో లలితసంగీతానికి ఒరవడి పెట్టి, ఆపైన సినీగీతాలకు రూపురేకలు తీర్చిన విశిష్టకవి. ఆయన ప్రభావం భావకవులపై ఎంతగా పడిందంటే కవిత్వాన్నే కాక ఆయన ఆహార్యాన్ని కూడా అనుకరించేవారు యువకులు. భావకవిత్వాన్ని భుజానమోసి ఊరూరా కవితాగానంతో ప్రచారం చేసిన వ్యక్తి. అటువంటి మధురగళం ఆయన తుదివయస్సులో మూగబోవడం గొప్ప విషాదం. గొంతు పోయినా చివరిదశ వరకూ తాను కవిత్వం రాస్తూనే గడిపారు.

కవితా వస్తువులు

మార్చు

అమృతవీణ గేయసంకలనంలో వైవిధ్యభరితమైన కవితా వస్తువులతో గేయరచన చేశారు. ఎందుకొరకు ఎవరికెరుక గేయాన్ని ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు రచించిన వెలుగు నీడలు నాటకానికి నేపథ్య గీతంగా రచించారు. ఒక సాయంత్రం హైదరాబాద్ నగరంలో నమాజు విని ఖుదా! నీదే/ అదే పిలుపు! గేయాన్ని రాసుకున్నారు. ఈ గేయాలు సినిమాల్లోకి కూడా తీసుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఇవి ప్రాచుర్యం పొందాయి.[2]

అంకితం

మార్చు

కృష్ణ రజని గేయకావ్యాన్ని గేయకర్త కృష్ణశాస్త్రి భగవంతునికి అంకితమిచ్చారు. తన గొంతును మూగబోయేలా చేసి తనను మూగను చేసిన భగవంతునికి ఈ అంకితం అంటూ ఈ ఉద్విగ్నభరితమైన గేయంతో ఆ అంకితాన్ని ప్రకటించారు:

నీ ఆన యైన, స్వామీ, నా
ఔదల నిడికోనా?
"పోనీలే ! నీ దయ ఇం
తే" నని అన్నానా ?

మాట తీసుకుని నాకు
మౌన మొసంగినావు !
మౌన మందికొని నీకు
గాన మియ్యమంటావు !

నా కంఠము చీక టైన
ఈ కృష్ణ రజని తుదిని
నా కయి నీ చెయి చాచిన
నా కానుక ఇంతే గద!
ఈ కొంచెపు పాటే గద!

ప్రాచుర్యం

మార్చు

కృష్ణ రజని సంకలనంలోని ముందు తెలిసెనా, ప్రభు! ఈ/మందిర మిటు లుండేనా? అనే గేయాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాణమైన మేఘ సందేశం సినిమాలో ఉపయోగించారు. అక్కినేని నాగేశ్వరరావు, జయప్రదలపై చిత్రీకరింపబడిన ఈ గీతానికి ప్రముఖ సంగీతదర్శకుడు రమేష్ నాయుడు సంగీతాన్ని అందించారు.

మూలాలు

మార్చు
  1. కృష్ణశాస్త్రి నాల్గవ సంపుటం-గేయాలు:విశాలాంధ్ర ప్రచురణ:కృష్ణ రజనికి ముందు సంపాదకుని నోట్
  2. కృష్ణశాస్త్రి సాహిత్యం నాల్గవ సంపుటం-గేయాలు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్:పేజీలు.4,9