కేదార్‌నాథ్ సింగ్

భారతీయ రచయత
(కేదార్‌నాథ్‌ సింగ్ నుండి దారిమార్పు చెందింది)

కేదార్‌నాథ్‌ సింగ్ హిందీ కవి. 2013 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారం గెలుచుకున్నారు.[1]

కేదార్‌నాథ్‌ సింగ్
కేదార్‌నాథ్‌ సింగ్
జననం (1934-07-07) 1934 జూలై 7 (వయసు 90)
జాతీయతభారతీయుడు
వృత్తికవి

నేపధ్యము

మార్చు

కేదార్‌నాథ్ సింగ్ ప్రతి రచనలో ఒక ఆత్మీయ ఆర్ద్రత కనబడుతుంది. ఆ ఆర్ద్రత ఈ దేశంలోని కోట్లాది గొంతులకు ఒక వేదికగా మారుతూ స్వతంత్ర భారత వైరుధ్యాలను ముందుకు తెస్తుంది. 1934లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన కేదార్‌నాథ్ సింగ్ చుట్టూ ఉన్న ప్రపంచానే్న తన కవిత్వానికి వస్తువుగా మలచుకుని అనేక కావ్యఖండాలను చెక్కారు. తన చుట్టూ ఉన్న పదజాలానే్న కవితా భాషగా స్వీకరించి ప్రజల భాషను సజీవంగా నిలబెట్టారు. నిజానికి వారి కవితాయాత్ర 1950 నుంచే మొదలవుతుంది. సమకాలీన హిందీ కవిత చరిత్ర రచనా రీతుల మీద చర్చకు తెరలేపిన కవి ఆజ్ఞేయ్ సంపాదకత్వంలో 1950లో వెలువడిన ‘తార్ సప్తక్’లో స్థానం పొంది అప్పట్లోనే శక్తివంతమైన యువకవిగా పేరొందారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను లోతుగా పరిశీలిస్తూ తమదైన శైలిలో గొంతు కలిపిన కవి కేదార్‌నాథ్ సింగ్. వారి కలం నుంచి వెలువడిన కవితా సంకలనాల శీర్షికలను చూడగానే కవి తృష్ణ అవగతమవుతుంది. ‘అభిబిల్కులే అభి’, ‘జమీన్ పక్ రహీ హౌ’, ‘అకల్ మే సారస్’ (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన) టాఘ్ (పులి) ల్లాంటి అత్యంత శక్తివంతమైన రచనలు ఈ రోజు జ్ఞానపీఠ అవార్డు రావడానికి పునాదులుగా పనిచేశాయి.

రచనలు

మార్చు

‘పులి’ కవితా సంకలనం

మార్చు

మిగతా కవితా సంకలనాల కన్నా ‘పులి’ కవితా సంకలనం విశిష్ట రచనా ప్రక్రియను ప్రవేశపెడుతుంది. ‘పులి’ కవితా సంకలనం కొన్ని కావ్యఖండికల సమాహారం.‘నా వీపుమీద కాలపు పంజాల సంతకాలు ఎన్ని ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు’ అంటూ ‘పులి’ కవిత్వం ఆరంభంలోనే నేడు విస్తరిస్తున్న ఉద్యమ స్ఫూర్తిని, ఆర్తిని, సంఘర్షణ లోతులను కేదార్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. ‘పులి’ కవిత్వం ‘మనిషి’ని కుదిపివేసే కవిత్వం. చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనల నడుమ నిలబడి అస్తిత్వం, అభివృద్ధి కోసం పరితపించే ‘మాయావి సమయం’లో మనిషి అంతరంగంలో నుంచి పుట్టుకువచ్చే అనేక రూపాల ఆకారం - ‘పులి’. పులి కవిత్వం అనేక దృశ్యాలు, చిత్రాలు, రూపకాలుండే ప్రతీకా? లేక ప్రతిబింబమా? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ‘మనిషి’ అంతర్గత పరిస్థితిని సృజనాత్మక దృష్టితో పరిశీలించే గొప్ప కావ్యం ‘పులి’. కాల ప్రవాహంలో, చీకటి మలుపులతో కొనసాగుతున్న మానవ విధ్వంసానికి పోరాట జీవన గాథ ‘పులి’. మనలోని చైతన్యాన్ని, ప్రేమను, అమాయకత్వాన్ని, నిరాశను అర్థం చేసుకునే విశ్వాసాన్ని, అవకాశాన్ని ‘పులి’ కల్పిస్తుంది. ‘పులి’ నగరమంతటిని తిరస్కారంగాను, అసహ్యంగాను చూస్తుంది. అంటే మానవ నైజంలో చోటుచేసుకున్న వికృతాన్ని అసహ్యించుకుంటుందన్నమాట. మానవ జీవితంలోని వికృతాన్ని, విపరీత పోకడలను తిరస్కరించడమంటే మనిషిలోని ప్రేమను బ్రతికించడమే. అనారోగ్యం, అంధవిశ్వాసాలు, నిరక్షరాస్యత, దారిద్య్రం మీద పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు భయంకరమైన వౌన సంస్కృతికి అలవాటుపడ్డారు. ప్రశ్నించే స్వభావాన్ని ఇంకా అలవరుచుకోలేదు. తమ గురించి ఆలోచించే వారున్నారని, వారే అన్నీ చేసి పెడతారని ఆలోచించే ‘మాట్లాడని సంస్కృతి’లోకి నెట్టివేయబడ్డారు. అందుకేనేమో ‘పులి’ ఓచోట ‘మనుషులు ఈమధ్య వౌనంగా ఎందుకుంటున్నారు’ అని ప్రశ్నిస్తుంది. కాని సంతృప్తికరమైన జవాబు దొరకదు. అయోమయంలో పడిపోతుంది. మన పల్లెసీమలు పట్నం వైపు కదులుతున్నాయి. ‘కోరికలతో నిండిన ఎద్దుల బండ్లు కదిలిపోతున్నాయి’ అంటాడు కవి. అయితే అవి ‘పల్లె నుంచి పట్నానికి ఏదో ఒకటి మోస్తూ తన వంతు భూమిని కోల్పోతూ సాగుతుంటాయి’ అంటాడు. ఎంత నిజం. ఇలాంటి అనేక వాస్తవాలతో సమకాలీన భౌతిక, భౌతికేతర పరిస్థితులను, సమస్యలను స్పర్శిస్తూ, సృజిస్తూ పాఠకుడిలో ఒక లోతైన ఆలోచనను నాటి అర్థవంతమైన ప్రయత్నం ‘పులి’.

మూలాలు

మార్చు
  1. "Kedarnath Singh chosen for Jnanpith". The Hindu. 21 June 2014. Retrieved 21 September 2014.

బయటి లంకెలు

మార్చు