కైరం భూమాగౌడ్ తెలంగాణ గర్వించదగిన వాగ్గేయకారుడు. కల్లుకుండలపైన కవిత్వం వ్రాశాడు. భూమాదాసుగా నిమప్రసిద్ధికెక్కాడు[1].తెలంగాణా లో గౌడ కులం లో జన్మించినాడు

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1876లో కైరం రాజమల్లు, లింగమ్మ దంపతులకు గౌడ కుటుంబంలో జన్మించాడు. ఆ కాలంలో తెలంగాణా ప్రాంతం నిజాం పరిపాలనలో ఉండేది. ఊళ్లలో పాఠశాలలు ఉండేవి కావు. ఉన్నా ఉర్దూ తప్ప తెలుగు బోధించేవారు కాదు. గౌడులంటే తెలంగాణా ప్రాంతంలో కల్లుగీత కార్మికులు. .ఆర్థిక ఇబ్బందుల వలన అందు చేత ఇతడికి బాల్యంలో చదివే అవకాశం లేక చిన్నతనంలోనే కుండ, నిచ్చెన పట్టుకుని గీతకార్మికుడిగా మారాడు. ఇతడు 10 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి శ్రీ పెరుంబుదూరు నించి ఒక వైష్ణవస్వామి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలకు ముగ్ధులైన ప్రజలు స్వచ్ఛందంగా శంఖు చక్రాలు భుజాలపై వేయించుకుని వైష్ణవభక్తులైపోయారు. అలా వైష్ణవమతం స్వీకరించిన వారిలో కైరం భూమాగౌడ్ ఒకడు. మతం ఐతే స్వీకరించాడు కానీ డొక్కశుద్ధి లేదు. పైగా వైష్ణవ ప్రవచనాలు ఎక్కువభాగం తమిళంలోనూ, మిగతావి సంస్కృతంలోనూ ఉండేవి. అయినా పట్టుపట్టి సన్నని ఇసుకపై కర్రపుల్లలతో అక్షరాలు దిద్దడం ప్రారంభించాడు. పట్టుదలతో అక్షరాలనే కాదు కవిత్వం వ్రాయడం నేర్చుకున్నాడు. పాలబలపం పట్టుకుని తాటి చెట్లు ఎక్కి నల్లని కుండపై తెల్లని కవిత్వం వ్రాసేవాడు. తాటితోపు ఇతని కవిత్వంతో నారాయణవనం అయిపోయేది. అలా పెరిగి పెద్దయ్యాడు. నర్సుబాయితో వివాహం అయ్యింది. భూమాగౌడ్ కాస్తా 'భూమాదాసు'గా మారిపోయాడు. సంసారాన్ని పట్టించుకోకుండా వైష్ణవభక్తుల చుట్టూ తిరుగుతూ, వారినుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. తిరునగరి నరసింహదాసు, జంకి కిష్టయ్య, ఆకుల వెంకటి మొదలైన కవులతో స్నేహం చేస్తూ వైష్ణవ గీతాలు వ్రాస్తూ, ఆలపించేవాడు. ఇతడు బోర్నపల్లి సంస్థానంలో చెన్నమనేని యతిరాజా ఆశ్రయం పొందాడు. ఆ సంస్థానంలో భాగవత సప్తాహాలను నిర్వహించేవాడు. ఊరుపేరు మార్చి జగన్నాథపురం అనీ, చెరువుకు సత్యభామ చెరువు అనీ పేరుపెట్టాడు.

భూమాదాసుకి సాహిత్యంతోనే కాదు ఆయుర్వేద వైద్యంలోనూ ప్రవేశం ఉంది. దీర్ఘ తలనొప్పితో బాధపడేవారికి, చర్మవ్యాధులతో బాధపడేవారికి, మొండి వ్యాధులున్నవారికి ఉపశమనం కలిగించేవాడు. భస్మాలు, లేహ్యాలు తయారు చేసేవాడు.అన్ని కులాల వారిని అదరించినాడు

వరకవి

మార్చు

భూమాదాసు వేములవాడ భీమకవి లాగా శాపానుగ్రహ సమర్థుడని అంటారు. ఒకసారి ఆ ఊరి దొర లక్ష్మారెడ్డి ఇతడినీ, ఇతడి భక్తబృందాన్నీ కొట్టి మిట్టమధ్యాహ్నం వీపుల మీద బండలు పెట్టి మోయించాడట. దానితో ఇతనికి కోపం వచ్చి

అవనిన్ కడుపాతకుడీ
భువినేలిన లక్ష్మరెడ్డి బూడిదయగునే
కవిగా వాని శపించితి
కవితిట్టును పాముకాటు కట్టి కడుపురా

అని అన్నాడు. తర్వాత లక్ష్మారెడ్డికి కుష్టురోగం వచ్చి, పురుగులు పట్టి చనిపోయాడని ప్రతీతి. అప్పటి నుండి ఇతడిని వరకవి భూమాదాసు అని పిలవడం మొదలుపెట్టారు.

రచనలు

మార్చు

ఇతడు చాలా చాటువులు వ్రాశాడు. తన రచనలలో ఆధ్యాత్మికతను, సామాజిక స్పృహను కలగలిపి రామశతకం, తిరునామాలు, జానపదాలు, మంగళహారతులు, కృష్ణచెలిమి వంటి ఎన్నో రచనలు చేశాడు. వర్ణ సంకరాన్ని తన కీర్తనలో ఇలా తూర్పారపడుతున్నాడు.

తండ్రి మధ్వాచారి తనయుడు భట్రాజు
జనని రామానుజజాతి పడతి
ఆలు కోమటిజాతి - అక్క జంగమురాలు
బావగారిది లింగ బలిజె కులము
తను కూచిమతము తమ్ముడు పాడ్యుండు
సర్వేశ్వరమతము - షడ్డకునిది
ఆడబిడ్డ సుకారి - అల్లుండు పింజారి
మరదలు కొడలు మారువాడి!

మరణము

మార్చు

ఇతడు పుష్య శుద్ధ పౌర్ణమి నాడు స్వర్గస్థుడయ్యాడు.

మూలాలు

మార్చు
  1. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు - ప్రత్యేక సంచిక - లలితకళలు(విభాగం) - ఎందరో మహానుభావులు (వ్యాసం) - తనికెళ్ళ భరణి - పేజీలు: 546-548