కోతి కొమ్మచ్చి

(కోతికొమ్మచ్చి నుండి దారిమార్పు చెందింది)

కోతి కొమ్మచ్చి, ఆంధ్రదేశములోని గ్రామీణ సాంప్రదాయక ఆట.

ఆట విధానం సవరించు

ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.

ఆటగాళ్లంతా భద్రంగా చెట్లెక్కేస్తారు - ఇద్దరు తప్ప. జట్టులోని మేటి ఆటగాడొకరు చెట్టు కింది లేక సమీపంలోని ఒక వృత్తం(గిరి అంటారు) మధ్యలో ఎడమకాలిమీద నిలబడి, కుడికాలు మోకాలివరకు పైకెత్తి, ఆ కాలి కిందుగా కుడిచేత్తో ఒక మూరడు పొడుగున్న కర్రని విసరగలిగినంత దూరం విసరగానే, అతని ఎదురుగా నిలబడిన దొంగగా పిలవబడే ఆటగాడు పరుగునవెళ్లి ఆ కర్రను తెచ్చి గిరిలో పెట్టాలి. ఈ లోగా కర్ర విసిరినవాడూ చెట్టెక్కేస్తాడు. ఇప్పుడు చెట్టుమీదున్న వాళ్లలో ఎవరైనా ఒకరు దొంగకు దొరక్కుండా (అందకుండా) గిరిలోని కర్రను తాకగలిగితే దొంగ మళ్లీ దొంగావతారం ఎత్తాలి. ఎవరూ కర్రను తాకక మునుపే ఎవరైనా దొంగకు దొరికితే (చెట్టు మీదయినా కిందయినా) ఆ ఆటగాడు దొంగవుతాడు. మాజీదొంగ కర్రవిసరాలి. దొంగ కర్రకు కాపలాగా గిరిలోనే వుండిపోకుండా ఎవరినైనా దొరకబుచ్చుకొనే ప్రయత్నంలో వుండాలి.

శారీరక మానసిక వ్యాయామం సవరించు

ఈ ఆట ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ వ్యాయామం పొందవచ్చు. ఈ ఆటగాళ్ళు శారీరకంగా చాలా చలాకీగా తయారు కాగలరు. పూర్తిగా ఆటలో మునిగి ఆడతారు గావున, మానసికంగానూ బలవంతులయ్యే అవకాశాలు మెండు. ఈ ఆట, ఖర్చులేని ఆట, సామూహికంగా ఆడతారు కాబట్టి, స్నేహవాతారణము అలవడుతుంది.

ప్రమాదాల సంభావ్యత సవరించు

చెట్టు మీద నుండి క్రింద పడటం వల్ల ప్రమాదాలు జరగవచ్చు.