గంజి
గంజి లేదా అన్నరసము (Congee) బియ్యము ఉడకబెట్టి వార్చిన నీరు. ఇది చాలా ఆసియా దేశాలలో బలమైన ఆహార పదార్థము. గంజి అనే పదం ద్రవిడ భాషలలో కంజి అనే పదం నుండి ఆవిర్భవించింది.[1] వెబ్ స్టర్ ఆంగ్ల నిఘంటువులో కంజి భారతదేశం నుండి పుట్టినదని తెలిపారు.[2]
కొన్ని ప్రాంతాలలో గంజి ప్రాథమికంగా ఉదయాన్నే ఆహారంగా భుజించి పనిపాట్లకు వెళతారు. కొంతమంది దీనిని మధ్యాహ్న భోజనానికి మారుగా తింటారు. గంజిని కుండలో కాని కొన్ని రకాల రైస్ కుక్కర్లలో తయారుచేయవచ్చును. గంజిని వేడిగాను, చల్లారిన తర్వాత కూడ త్రాగుతారు.
రాత్రి వండిన అన్నము, వార్చిన గంజిలోనే వేసి రాత్రంతా ఉంచి మరునాటి ఉదయము పెందలకడనే తినిన చాలా రుచిగా ఉండును. చలువచేసి, పైత్యవికారములు, తాపము, దప్పిక, మూత్రదోషములు, మూలశంకలను హరిస్తాయి. దీనిని 'చలిది అన్నము' అంటారు.
కొంత మంది పలుచని గంజిని తెల్లని నూలు వస్త్రాలు బిరుసుగా తయారుచేయడానికి వాడతారు. ఉతికిన తర్వాత దుస్తుల్ని చివరగా ఒకసారి గంజినీటిలో ముంచి ఎండలో ఎండబెడతారు. ఎండిన తర్వాత ఇస్త్రీ చేసుకొంటే చక్కగా నిలబడతాయి. గంజి పొడి (స్టార్చ్) బజారులో దొరుకుతున్నందు వలన దీని వాడకం తగ్గిపోయింది.