గణపతి (నవల)
గణపతి నవలను హాస్యరచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించారు. గణపతి నవల హాస్యనవలగా ప్రాచుర్యం పొందింది.
గణపతి | |
కృతికర్త: | చిలకమర్తి లక్ష్మీనరసింహం |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | హాస్య నవల |
ప్రచురణ: | |
విడుదల: |
రచన నేపథ్యం
మార్చుచిలకమర్తి లక్ష్మీనరసింహం దాదాపు వందేళ్ల పూర్వం రాసిన నవల గణపతి. సాధారణంగా తెలుగులో చక్కటి హాస్య నవలలే అరుదైన పరిస్థితి ఉంది. అందులో అధిక్షేపాత్మక నవలల సంఖ్య మరీ స్వల్పం. ఈ నేపథ్యంలో హాస్య రసాన్ని పోషిస్తూ అధిక్షేపాత్మకంగా సాగిన గణపతి నవల సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతి పొందింది.
ఇతివృత్తం
మార్చుగణపతి నవల ముఖ్యంగా బ్రాహ్మణ్యంతోటీ, బ్రాహ్మణ జీవనరీతి తోటీ ముడిపడిన నవల. ముఖ్యమైన మూడు పాత్రలున్నాయి. ఆ పాత్రల జీవితాన్ని వివరించడానికి సహకరించే ఉపపాత్రలు, స్థల వివరాలూ ఉన్నాయి. ప్రధాన పాత్ర గణపతి. అవలక్షణాల పుట్ట అయిన ప్రధాన పాత్ర గణపతి ఈ నవలలో కథానాయకుడు. ఈ పాత్రను కేంద్రంగా మలచుకుని గణపతిని హాస్యనవలగా తీర్చిదిద్దారు రచయిత. గణపతికి ముందు ఆ వంశంలోని ఏడుతరాల ప్రసక్తి ఉన్నా, రచయిత ముఖ్యంగా మూడుతరాల కథని చెప్పడం జరిగింది.
గణపతి తాత పాపయ్య, మందపల్లి నివాసి. తద్దినాలకి, తదితర తంతులకి భోక్తగా వెళ్ళడం అతని వృత్తి. చిల్లర దొంగతనాలు ప్రవృత్తి. తిండి పుష్టి, యావ ఎక్కువ. తల్లి బతికి ఉండగా అతనికి వివాహం కాలేదు. ఆమె మరణానంతరం సంపాదన కోసం, పెళ్ళి కోసం, తన వృత్తి బహుధా బావుంటుందని తలచి పూనాకి వెడతాడు. పూనాలో తెలుగు బ్రాహ్మణుల సంస్కృత ఉచ్ఛారణకి గౌరవం, విలువ ఉంటుందని తలచి ఆ ప్రాంతానికి వెళతాడు. అక్కడ సంపాదించుకుంటున్నా యావ తీరక శవాలను మోస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చని ఆ వృత్తిలో దిగుతాడు. అలా దిగజారి బాగా సంపాదించుకున్నా, పాపయ్యని దుర్వ్యసనాలు పట్టిపాడుచేశాయి. చివరకు పాపయ్య అరవయ్యో ఏట పన్నెండేళ్ల పిల్లతో వివాహమైంది. అప్పుడే పాపయ్య తిరిగి మందపల్లి వచ్చి కాపురం ప్రారంభించాడు. ఆ పాపయ్య కొడుకు గంగాధరుడు.
గంగాధరుడు చిన్న వయసులోనే అతని తండ్రి పాపయ్య మరణించాడు. గంగాధరం తల్లి పిచ్చమ్మ మందపల్లిలో ఇల్లు అమ్మి, అప్పటికీ ఈతిబాధలు తీరక ప్రక్కనే ఉన్న ఏనుగుల మహలు గ్రామానికి మకాం మార్చింది. గంగాధరునికి ఉపనయనం అయ్యాకా, మధూకరం, యాయవారం, బ్రాహ్మణార్థాలతో కుటుంబం గడుపుతూ వచ్చాడు. ఇతనికి ఉన్న అవకరం తిండియావ. ఇది తెలిసి వృత్తిలోనే ఇబ్బందులు వచ్చినా గంగాధరం లెక్క చెయ్యలేదు. కానీ పరిస్థితులు అనుకూలించక కాకినాడ చేరి కావడితో నీళ్లు మోయడం ప్రారంభిస్తాడు. సంపాదనతో పాటూ జూదం, స్త్రీలోలత్వం అబ్బాయి. శనిదానాలు పట్టడమే కాక నీచకార్యాలకు ఒడిగట్టే స్థితికి చేరుకుంటాడు. ఎన్నో అరిష్టాలు గడిచి అతనికి ఆఖరుకు పెళ్ళి అవుతుంది. భార్య సింగమ్మకు 13ఏట, అతని 53వ ఏట సంసారం మళ్లీ మందపల్లిలో ఆరంభమైంది. వారి పుత్రుడే గణపతి.
సింగమ్మ అన్నగారింట చేరడంతో, మేనమామ ఇంటిపంచన, తల్లిగారాబంతో తండ్రి తాతల తిండి పిచ్చి, అనాకారిత్వంతో పాటు మరిన్ని అవలక్షణాలు ఉన్నాయి. గణపతి చెయ్యని అల్లరి పనులు లేకపోగా కొన్ని కొన్ని పనులు చిన్నతనంలోనే అల్లరి స్థాయిని దాటిపోతాడు. దొంగతనాలు, చుట్టలు కాల్చడం, చదువు రాకపోవడం వంటి లక్షణాలకు అంతే లేదు. పెద్దయ్యే కొద్దీ వితండవాదం, విచిత్రమైన కోర్కెలు పెరుగుతాయి. గుర్రమెక్కాలన్న కోరిక ఎలాగోలా తీరినా నిరంతరం తిరిగే వీలు లేదు కనుక ఆ స్థానే గాడిదనెక్కి తిరగాలని నిర్ణయించుకొంటాడు. ఇటువంటి వాడు చేసే గాడిద సవారీ, తల్లి చనిపోయిందని అబద్ధాలాడి దహనానికి డబ్బు అడుక్కోవడం, తద్దిన భోక్తగా అవతారం, నాటకాల్లో వేషాలు, వంట బ్రాహ్మడిగా కుదరడం వంటివి ఎన్నో చేస్తాడు. ఏం చేసినా హాస్యం ఉట్టిపడుతుంది. మాస్టారిగా గౌరవప్రధమైన అవతారం ఎత్తినా చింత బరికెలతో పిల్లలను బాది, భయపెట్టి నోరు మూయించి, తెలిసీ తెలియనివి ఎవో చెప్పడం అతను చెప్పే చదువు.
ఇటువంటి గణపతికి పెళ్ళి చేయాలనేదే తల్లి కోరిక. ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలితం దక్కలేదు. గణపతి పెళ్ళి కూడా ఈ నవలలో ఓ ప్రహసనం. చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు, గణపతి పెళ్ళి నేరం నుంచి పారిపోయి ఇప్పటివరకూ కనిపించకపోవడమే ముగింపు.
పాత్రలు
మార్చు- పాపయ్య, గణపతి తాత
- పిచ్చమ్మ, పాపయ్య భార్య
- గంగాధరుడు, గణపతి తండ్రి
- సింగమ్మ, గణపతి తల్లి
- నాగన్న, గణపతి మేనమామ
- గంగమ్మ, నాగన్న భార్య
- బుచ్చమ్మ, గణపతి మేనకోడలు
- పుల్లయ్య, గణపతికి వరసయ్యే మేనమామ
- మహాదేవ శాస్త్రి, గణపతికి ఆశ్రయం ఇచ్చే కుటుంబ యజమాని
పాత్ర చిత్రణ
మార్చుముఖ్యపాత్ర గణపతి అనాకారి, పెద్ద పొట్ట, వికృత రూపం, మరుగుజ్జు. అన్ని అవలక్షణాల ప్రతిరూపం గణపతి. అతని తాత పాపయ్య కన్నా తండ్రి గంగాధరం అవలక్షణాలు ఎక్కువ. వారిద్దరి కన్నా గణపతి పాత్రలో అవలక్షణాలు ఎక్కువ. శుచికి, పద్ధతికి, సత్కర్మలకి, మంచి అలవాట్లకీ, ఆహారనియమాలకీ ఆలవాలమైన బ్రాహ్మణ జీవిత విధానంలో చొరబడుతున్న అలసత్వం, తిండియావ, దుర్లక్షణాలన్నిటినీ ఎద్దేవా చేయడానికే ఈ మూడు పాత్రలనీ ఇలా తీర్చిదిద్దారని సాహిత్య విమర్శకులు వి.రాజారామమోహనరావు అభిప్రాయపడ్డారు.[1][2]
మూలాలు
మార్చు- ↑ వి.రాజారామమోహనరావు నవలాహృదయం పుస్తకంలో గణపతి నవల పరిచయం(పేజీ.19,20)
- ↑ గణపతి. వికీసోర్స్.