చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగు రచయిత

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సు లో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం.

చిలకమర్తి లక్ష్మీనరసింహం
Teluguwriter chilakamarthiLN.JPG
జననం(1867-09-26)1867 సెప్టెంబరు 26
మరణం1940 జూన్ 17(1940-06-17) (వయసు 72)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు రచయిత,
నాటక కర్త,
విద్యావేత్త,
సంఘ సంస్కర్త
తల్లిదండ్రులు
 • వెంకన్న (తండ్రి)
 • రత్నమ్మ (తల్లి)

జననంసవరించు

లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26[1]పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.

విద్య, బోధనసవరించు

 
రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గరలో స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీనరసింహం

ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాల గా మార్చబడింది.

30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.

1946, జూన్ 17[1] న లక్ష్మీనరసింహం మరణించారు

రచనా పరంపరసవరించు

 
ఆత్మకథ ముఖపత్రం

పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. గయీపాఖ్యానం నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు. ఆయన వ్రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.

1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916 లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు.

స్వీయచరిత్రసవరించు

21 అధ్యాయాల్లో రాసిన స్వీయ చరిత్రములో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం. గ్రంథంరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంధాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించాడు.

సంస్కరణ కార్యక్రమాలుసవరించు

లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల (రామమోహన పాఠశాల) స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ స్థాపించలేదు. కేవలం తన పుస్తకాలనుండి వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ గా చేసారు. అంథుడైనప్పటికి చిలకమర్తి వారి దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్ లాండ్ ఎంతగానో ప్రశంసించారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.

విశేషాలుసవరించు

 • ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
 • కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
 • అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
 • 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
 • కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
 • 1897 లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
 • మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
 • చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
 • ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
 • భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
 • ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది.

రచనలుసవరించు

నాటకాలుసవరించు

 1. కీచక వధ -1889
 2. ద్రౌపదీ పరిణయం -1889-1890
 3. శ్రీరామ జననం -1889-1890
 4. పారిజాతాపహరణం -1889-1890
 5. సీతా కళ్యాణం -1889-1890
 6. గయోపాఖ్యానం -1889-1890
 7. నల చరిత్రం -1892
 8. ప్రసన్నయాదవం - 1906 (ప్రదర్శింప బడింది, కాని ప్రచురింపబడలేదు)
 9. నవనాటకము
 10. చతుర చంద్రహాసము-1922[2]

నవలలుసవరించు

 1. రామచంద్ర విజయము[3] - 1894 (ధారావాహిక)
 2. హేమలత -1896 (చారిత్రిక నవల)
 3. అహల్యాబాయి - 1897
 4. సౌందర్య తిలక - 1898 - 1900
 5. పార్వతీపరిణయము
 6. గణపతి(హాస్యనవల)
 7. కీచక వధ -1889
 8. ద్రౌపదీ పరిణయం -1889-1890
 9. శ్రీరామ జననం -1889-1890
 10. పారిజాతాపహరణం -1889-1890

కవితలుసవరించు

 1. పృథ్వీరాజీయము (అముద్రితం)

అనువాదాలుసవరించు

 1. పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
 2. అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
 3. స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
 4. మధ్యమ వ్యాయోగము (భాసుని సంస్కృత నాటకం నుండి)
 5. ఋగ్వేదం (ఒక మండలం)
 6. ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా ఆంగ్లంలో రచించిన నవల)
 7. సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
 8. వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
 9. రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)

ఇతర రచనలుసవరించు

 1. రాజస్థాన కథావళి
 2. మహాపురుషుల జీవిత చరిత్రలు
 3. కృపాంబోనిధి
 4. చిత్రకథాగుచ్ఛ
 5. సమర్థ రామదాసు
 6. భల్లాట శతకం
 7. స్వీయ చరిత్రము
 8. ప్రకాశములు (4 సంపుటములు)
 9. భాగవత కథా మంజరి
 10. రామకృష్ణ పరమహంస చరిత్ర
 11. కాళిదాస చరిత్ర
 12. చంద్రహాసుడు
 13. సిద్ధార్థ చరిత్ర

ప్రాచుర్యంసవరించు

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గణపతి నవల బహుళ ప్రచారం పొందింది. ఆకాశవాణిలో శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి ఆశువుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియావు పద్యం స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ స్థానం పొందింది. గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో పాఠంగా నిర్దేశించారు.

రచనల నుండి ఉదాహరణలుసవరించు

బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం: ఈ పద్యం చెన్నాప్రగడ భానుమూర్తి (1905) వ్రాశాడని కొందరివాదన.[4]. ఈ వాదన సహేతుకంగా లేదని ప్రతివాదన [5]

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

గయోపాఖ్యానంలో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:

ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ అర్జునుడిలా అన్నాడు
మగువ మీదను పతికింత మక్కువైన
మగువ మీదను పతికింత మమతయున్న
పుట్టినింటికి కడుగూర్చు పొలతి యెపుడు
పుట్టింటి సొమ్ములెన్ని తీసుకొన్నా ఆడువారు మెట్టింటివైపే మాట్లాడుతారంటూ కృష్ణుడు పలికిన విధం
సార చీరెలు నగలును చాలగొనుచు
పుట్టినిండ్ల గుల్లలు జేసిపోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు
మగనిపై కూర్మి అధికము మగువకెపుడు

చతుర చంద్రహాసం నాటకంలో - పాండవులను వారణావతానికి పంపమని దుర్యోధనుడు పట్టుబట్టినపుడు ధృతరాష్ట్రుడు పడిన ఆవేదన

కొడుకు నుడువులు వింటినా కులము సెడును
కులము మేలెంచుకొంటినా కొడుకు సెడును
కొడుకు కులమును జెడకుండ నడువ వలయు
లేనిచో వంశమున కెల్ల హాని గల్గు
"పకోడి" గురించి

ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!
"గీత మంజరి" లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ

బయటి లింకులు, వనరులుసవరించు

 1. 1.0 1.1 మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రచించిన తెలుగు రచయితలు మొదటి భాగం
 2. లక్ష్మీనరసింహం, చిలకమర్తి. చతుర చంద్రహాసము.
 3. ఎమెస్కో వారి రామచంద్ర విజయము ఆర్కీవులోని ప్రతి.
 4. ఆంధ్రజ్యోతి వ్యాసం
 5. "సాక్షి వ్యాసం". Archived from the original on 2016-03-06. Retrieved 2009-09-14.