గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

సంగీత విద్వాంసులు

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (జననం నవంబర్ 9, 1948) పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలికర్నాటక సంగీతం
వృత్తిశాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త
వాయిద్యాలుతంబురా
క్రియాశీల కాలం1970- ఇప్పటి వరకు
వెబ్‌సైటుhttp://www.facebook.com/gbkprasad/, http://sites.google.com/site/gbkprasad/biodata

బాల్యం మార్చు

ఆయన కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించాడు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియ రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించాడు. కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నాడు. 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరాడు. అన్నమయ్య సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరకు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన సభ్యుడిగా ఉన్నాడు. వివిధ స్థాయిలలో ఈ సంస్థను గొప్ప సాంసృతిక సంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశాడు. నాలుగు దశాబ్దాల నాదోపాసనలో సంపూర్ణ విశ్వాసంతో, అంకిత భావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించాడు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేశాడు. తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశాడు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించాడు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించాడు.

ప్రత్యేకతలు మార్చు

 
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
 • సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఈయన ఆద్యుడు. ఒక గాయకుదు ఒక రోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత.1997 లో విశాఖపట్నంలో, 1999లో విజయవాడలో 200 పైగా పాటలతో, 2001లో తిరుపతిలో 300 పైగా పాటలతో, 2003, 2007లో హైదరాబాదులో, 2008లో విజయవాడలో 2009లో హైదరాబాదులో 2011లో కాకినాడలో 2012లో తిరుపతిలో 200లకు పైగా పాటలతో సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించాడు.వీటిలో కొన్ని భాగాలు మా టీవీలో, భక్తి టీవీలో ప్రసారం అయ్యాయి.
 • భక్తి టీవీ "హరి సంకీర్తనం" కార్యక్రమం ద్వారా 100కు పైగా అన్నమాచార్య సంకీర్తనలను సామాన్యులకు నేర్పాడు. ఈయన రెండవ కుమారుడు జి.వి.యన్. అనిలకుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొనటం గుర్తించదగ్గది. ఎంతో మంది సంగీత ప్రియులు ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణప్రసాద్ నుండి నేరుగా నేర్చుకొనగలిగారు.
 • లక్షగళార్చన: 2008 మే 10లో సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షమందికి పైగా గాయకులు బాలకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అసాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్ ఆంధ్ర (అమెరికా తెలుగు సంస్థ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని సం యుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలోని అనేక చానెల్స్ లో ప్రత్యక్షప్రసారం చేయబడింది.
 • 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు.
 • తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన అసాధారణ సేవలకు గాను వెండిపతకం, ప్రశంసా పత్రంతో సత్కరించింది.
 • స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై, ఇతర దేవతలపై కృతులు రచించాడు. ఆయన స్వంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన జి.రాధను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం- జి.యస్.పవన కుమార్, జి.వి.యన్.అనిల కుమార్. ఈయన సినిమా గాయని యస్.జానకి మేనల్లుడు.

పురస్కారములు మార్చు

1. కేంద్రీయ సంగీత నాటక అకాడమీ పురస్కారం (2020)

2. ఆస్థాన విద్వాంసులు, తి. తి. దే. (2012 నుండి 2015 వరకు తిరిగి 2023 లో)

3. ఆస్థాన సంగీత విద్వాంసులు, శ్రీ కంచి కామకోటి పీఠం (2010)

4. ఆస్థాన సంగీత విద్వాంసులు, అహోబిల మఠం (2020)

5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం (2007)

6. అన్నమాచార్య సంకీర్తన మహతి, తి. తి. దే, లలితకళా అకాడమి (సంయుక్తంగా) (2001)

7. Musician of the year, (2009) విశిష్ట పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

8. Lifetime Achievement Award (2023), శ్రీ వాసవీ ఆర్ట్స్, హైదరాబాదు

9. బాదం మాధవరావు గుప్తా భాగవతార్ స్మారక పురస్కారం, 2006, అభ్యూదయ ఫౌండేషన్, కాకినాడ

10. రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం, (2010), రాజ్యలక్ష్మీ ఫౌండేషన్, చెన్నై.

11. సింహ తలట పురస్కారం, (2008) ప.ప.స్వామి శ్రీ భువనేశ్వర్ నారాయణాశ్రమ గురుపీఠం, విజయవాడ.

12.

డిస్కోగ్రఫీ మార్చు

అన్నమాచార్య సంకీర్తనలు, తి.తి.దే రికార్డింగ్ లు మార్చు

ఆయన తితిదే కోసం 24 రికార్డింగ్లు చేశారు.

అన్నమయ్య సంకీర్తనలు, ఇతర రికార్డింగులు మార్చు

ఆయన 36 ఇతర రికార్డింగులు చేశారు.

పుస్తకాలు మార్చు

తి.తి.దే ప్రచురణలు మార్చు

అన్నమయ్య సంకీర్తనలకు ఆయన స్వరకల్పన తితిదే వారిచే ప్రచురించబడింది.

 • 1993 - అన్నమయ్య సంకీర్తన స్వర సంపుటి (తెలుగు)
 • 1997 - అన్నమయ్య సంకీర్తన మంజరి (తమిళం)
 • 1999 - అన్నమయ్య సంకీర్తన సంకీర్తనం (తెలుగు)
 • 2000 - అన్నమయ్య సంకీర్తన సౌరభం (తెలుగు)
 • 2001 - అన్నమయ్య సంకీర్తన రత్నావళి (తెలుగు)
 • 2001 - అన్నమయ్య సంకీర్తన స్వరావళి (తమిళం)
 • 2003 - అన్నమయ్య సంకీర్తన ప్రాథమికి (తెలుగు)
 • 2004 - అన్నమయ్య సంకీర్తన మహాతి (తెలుగు)

ఇతర ప్రచురణలు మార్చు

 • కృష్ణ రవళి (2 భాగాలు) (తెలుగు)
 • ఆంజనేయ కృతి మణిమాల (తెలుగు)
 • అన్నమయ్య సంకీర్తన సంజీవని (తెలుగు)

సూచికలు మార్చు

యితర లింకులు మార్చు