గళ ధమనులు
మన శరీరంలో తలను ఉత్తమాంగమని అంటారు. దానికి కారణం తలలో మెదడు ఆలోచనలను విచక్షణాజ్ఞానాన్ని కలిగించడమే కాక అవయవాలను నియంత్రించి అవి పనిచేయుటకు తోడ్పడుతుంది. పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము సేకరించే జ్ఞానములను గ్రహించి వాటిని తెలుపుటే కాక వాటికి అనుగుణంగా శరీరాన్ని నడిపిస్తుంది. తలలో ఉన్న మెదడు, జ్ఞానేంద్రియాలు వాటి పనులు నిర్వహించుటకు కావలసిన ప్రాణవాయువు పోషకపదార్థాలను అందించుటకు రక్తప్రసరణ అవసరం. మెదడు ముందు భాగానికి, పుఱ్ఱెకు,కళ్ళు, చెవులు, ముక్కు, నాలుకలకు, మెడలో చాలా భాగాలకు గళ ధమనులు / కంఠధమనులు (Carotid arteries) రక్త ప్రసరణ చేకూర్చుతాయి. మెదడు రక్తప్రసరణకు భంగం కలిగినా రక్తనాళాలలో ఇతర ప్రమాదాలు జరిగినా పక్షవాతం వంటి తీవ్ర సంఘటనలు కలుగుతాయి. మెదడులో కలిగే ఇతర వ్యాధులతో పాటు మెదడు రక్తనాళాలలో జరిగే ప్రమాదాల ఫలితాలు శరీరంలో ఇతర అవయవాలలో కనిపిస్తాయి.
గళ ధమనులు
మార్చుమెడలో కుడి గళధమని, ఎడమ గళధమని చెఱి ఒక ప్రక్కా ఉంటాయి. హృదయంలో ఎడమ జఠరిక నుండి అవయవాలకు రక్తం కొనిపోవుటకు బృహద్ధమని అనే పెద్ద ధమని వెలువడుతుంది. ఇది ముందుగా మీదకు ఆరోహణ బృహద్ధమనిగా (ఎసెండింగ్ అయోర్టా) వెళ్ళి ఛాతి మీది భాగంలో ఎడమ వైపుకు ధమనీచాపంగా వంగి తరువాత అవరోహణ బృహద్ధమనిగా (డిసెండింగ్ అయోర్టా) క్రిందకు పయనించి ఉదారవితానం ద్వారా ఉదరం లోనికి ఉదర బృహద్ధమనిగా (ఎబ్డోమినల్ అయోర్టా) ప్రవేశిస్తుంది[1]
ధమనీచాపం కుడిభాగం నుంచి బాహుశిరోధమని అనే శాఖ వెలువడుతుంది[2]. అది కుడి గళధమని, కుడి బాహుధమనులుగా చీలుతుంది. ఎడమ గళధమని, ఎడమ బాహుధమనులు ధమనీచాపం నుంచే వేఱు వేఱు శాఖలుగా వెలువడుతాయి[3].
గళ ధమనులు మెడ ముందుభాగంలో శ్వాసనాళం, స్వరపేటిక, గళ గ్రంథులకు ప్రక్కగా, దవడవైపు మీదకు వాలుగా పయనిస్తాయి. స్వరపేటిక పైభాగంకు సమతలంలో గళధమనులు అంతర గళధమని (ఇంటర్నల్ కెరాటిడ్ ఆర్టెరీ), బాహ్య గళధమనులుగా ( ఎక్స్టెర్నల్ కెరాటిడ్ ఆర్టెరీ) చీలుతాయి. బాహ్య గళధమని నుండి వివిధ శాఖలు వెలువడి గళగ్రంథికి, మెడలో చాలా భాగానికి, ముఖానికి, నాలుకకు, పుఱ్ఱె వెలుపలి భాగాలకు, పుఱ్ఱెకు రక్త ప్రసరణ చేకూర్చుతాయి.
అంతర గళధమనులకు పుఱ్ఱె వెలుపల శాఖలు ఉండవు. ఇవి నిట్టనిలువుగా కపాలం క్రింది భాగానికి పయనించి కపాలం క్రిందిభాగంలో చెరిప్రక్కా టెంపొరల్ ఎముక పీట్రస్ భాగంలో ఉండే కెరాటిడ్ నాళికల ద్వారా కపాలంలోనికి ప్రవేశిస్తాయి. ప్రతి అంతర గళధమని కపాలంలో మధ్యచెవికి (టింపానిక్ శాఖ), పిట్యూటరీ గ్రంథికి, ట్రైజిమినల్ నాడీగ్రంథికి (ఆర్టీరియా రిసెప్టాక్యులై శాఖ) మెదడును ఆవరించు ఉండు పొరలకు (మినింజియల్ శాఖలు) శాఖలు ఇస్తుంది. తరువాత కంటికి కంటిధమని ( ఆఫ్తాల్మిక్ ఆర్టెరీ) శాఖ ఇస్తుంది[4]. ఆపై అంతర గళధమని పురోమస్తిష్క ధమని , పృష్ష్ఠ సంధానధమని శాఖలు ఇచ్చి పిమ్మట మధ్యమస్తిష్క ధమనిగా కొనసాగుతుంది. అంతర గళధమనులు తమ శాఖల ద్వారా మెదడు ముందు భాగాలకు, ప్రక్క భాగాలకు, కళ్ళకు రక్తప్రసరణ చేకూర్చుతాయి. మెదడుకు రక్తప్రసరణ చేకూర్చుటలో అంతర గళధమనులు, వెన్నుధమనులు పాల్గొంటాయి.
మెడలో గళధమని, అంతర గళధమనులకు వెలుపలి ప్రక్క అంతర గళసిర (ఇంటర్నల్ జుగులార్ వీన్) ఉంటుంది. ఈ రక్తనాళాల వెనుక వేగస్ నాడి ఉంటుంది. వీటిని ఆవరించి కెరాటిడ్ షీత్ అనే పీచుపదార్థపు కోశము ఉంటుంది[5]. వయోజనులలో గళధమనుల సగటు లోపలి వ్యాసపరిమాణం పురుషులలో 6.5 మి.మీలు స్త్రీలలో 6.1 మి.మీలు ఉంటుంది.
ధమనుల గోడలలో బయటపొర (ఎడ్వంటీషియా), మధ్యపొర (మీడియా), లోపొర (ఇంటిమా) అనే మూడు పొరలు ఉంటాయి[6]. బయటపొరలో సాగుకణజాలం, పీచుకణజాలం ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరాలు, సాగుకణజాలం, పీచుకణజాలం, పీచుపదార్థం (కొల్లజెన్) ఉంటాయి. ధమని నాళపు లోపొరలో పూతకణాలు ఒక వరుసలో (ఎండోథీలియం) ఉంటాయి. పూతకణాల క్రింద శర్కరమాంసకృత్తుల మాతృకతో సాగుపదార్థం (ఎలాష్టెన్ ), పీచుపదార్థం మూలాధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి.
గళధమనిలో నాడి కనుగొనుట
మార్చుమెడకు ముందున్న శ్వాసనాళంపై చూపుడువేలు మధ్యవేలు (ఇందుకు బొటన వ్రేలు వాడకూడదు) నిలిపి వాటిని మెల్లగా ప్రక్కకు శ్వాసనాళం, ఉరఃకర్ణమూలిక కండరం ( స్టెర్నోమాస్టాయిడ్) మధ్య ఉన్న గాడిలోనికి జరిపి గళ ధమనిని తాకి నాడి పసిగట్టవచ్చు[7]. ఎప్పుడైనా ఒక్క గళధమనిని మాత్రమే తాకి కనుగొనుటకు ప్రయత్నించాలి. రెండు గళధమనులను ఒకేసారి తాకకూడదు. గళధమని నాడి వేగంను కూడా లెక్కించి తెలుసుకొనవచ్చు.
గళధమనుల వ్యాధులు
మార్చుధమనీ కాఠిన్యం
మార్చుగళధమనులలో కలిగే చాలా ఉపద్రవాలు ధమనీకాఠిన్యం వలన కలుగుతాయి. ధమనీ కాఠిన్యం (ఆర్టీరియోస్క్లీరోసిస్) శైశవం నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యంలో ఎక్కువ అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొరలో పూతకణాల క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపక కణాలు పేరుకొని ఫలకలుగా పొడచూపుతాయి[8]. ఈ పలకలు రక్తనాళముల లోపలి పరిమాణంను తగ్గిస్తాయి. ఈ పలకల వలన రక్తనాళాలలో సంకోచాలు కలుగవచ్చు. ఈ పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ కలిగి, రక్తపు గడ్డలు ఏర్పడుతాయి.
గళధమని, అంతర గళధమని, అంతర గళధమనుల శాఖలలో ధమనీ కాఠిన్యం వలన నెత్తురు గడ్డలు ఏర్పడితే (థ్రాంబోసిస్), అవి రక్తప్రసరణకు అడ్డు కలుగజేయగలవు. లేక ఆ నెత్తురు గడ్లల తునకలు, ధమనీ కాఠిన్య ఫలకల తునుకలు రక్తప్రసరణలో అవరోధాలుగా (ఎంబొలై) ముందుకు పయనించి సన్నని శాఖలలో అడ్డుపడి వాటిలో రక్తప్రసరణకు భంగం కలిగించగలవు. రక్తప్రసరణ అందని మెదడు కణజాలము మృతిచెందుతుంది. మెదడు కణజాలాలలో కలిగే నష్టం ఆ యా కణజాలాలు నియంత్రించు అంగముల పనులలో లోపంగా కనిపిస్తుంది.
రక్తనాళాల నుంచి మెదడు కణజాలంలోనికి రక్తస్రావం జరిగినా కణజాలనష్టం కలుగగలదు. మెదడురక్తనాళాలలో ప్రమాదాలు పక్షవాతం వంటి లక్షణాలతో కనిపిస్తాయి.
ధమనులలో బుడగలు
మార్చుగళధమనులలోను వాని శాఖలలోను ధమనీకాఠిన్యం వలన వాటి గోడలలో పదే పదే జరిగే తాపప్రక్రియ ఫలితంగా మృదుకండరాల స్థానంలో పీచుపదార్థం ఏర్పడి, గోడల బలం తగ్గి సాగి బుడగకాయలు (ఎన్యురిజెమ్స్) ఏర్పడవచ్చు. ఈ ధమనుల బుడగలలో రక్తపుగడ్డలు ఏర్పడి వాటి తునుకలు రక్తప్రవాహంలో అవరోధకాలుగా పయనించవచ్చు. ఈ ధమనుల బుడగలు మెదడులో చిట్లుతే మెదడులో రక్తస్రావం కలుగగలదు. గళధమనుల మెడభాగంలో ఈ బుడగలు అరుదుగా కలుగుతాయి. అవి రక్తతరంగాలతో వ్యాకోచ సంకోచాలు పొంది గుండెలా కొట్టుకొనే కాయలుగా కనిపిస్తాయి.
తాపక వ్యాధులు
మార్చుగళధమనులు వాటి శాఖలు ఉపశాఖలలో తాపప్రక్రియతో కూడిన టాకయాసూస్ వ్యాధి, టెంపొరల్ ఆర్టెరైటిస్, పాలీ ఆర్టెరైటిస్ నోడోజా, కావసాకీ వ్యాధి మొదలగు వ్యాధులు కూడా కలుగగలవు.
మూలాలు
మార్చు- ↑ Gray, Henry (1995). gray’s Anatomy. New York: Barnes & Noble Books. p. 450. ISBN 1-56619-821-6.
- ↑ Gray, Henry (1995). Gray’s Anatomy 15 th edition. New York: Barnes & Noble Books. p. 455. ISBN 1-56619-821-6.
- ↑ Gray, Henry (1995). Gray’s Anatomy. New York: Barnes & Noble Books. p. 456. ISBN 1-56619-821-6.
- ↑ Gray, Henry (1995). Gray’s Anatomy. New York: Barnes & Noble Books. p. 480. ISBN 1-56619-821-6.
- ↑ Gray, Henry (1995). Gray’s Anatomy. New York: Barnes & Noble Books. p. 457. ISBN 1-56619-821-6.
- ↑ "The Lead's Histology Guide". The Lead’s Histology Guide.
- ↑ "Checking pulse over the carotid artery". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-07-23.
- ↑ "Atherosclerosis - What Is Atherosclerosis? | NHLBI, NIH". www.nhlbi.nih.gov (in ఇంగ్లీష్). 2022-03-24. Retrieved 2023-07-16.