మెదడు రక్తనాళాలలో ప్రమాదాలు

మన శరీరంలో తలను ఉత్తమాంగమని అంటారు. దానికి కారణం తలలో మెదడు ఆలోచనలను విచక్షణాజ్ఞానాన్ని కలిగించడమే కాక అవయవాలను నియంత్రించి అవి పనిచేయుటకు తోడ్పడుతుంది. పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము సేకరించే జ్ఞానములను గ్రహించి వాటిని తెలుపుటే కాక వాటికి అనుగుణంగా శరీరాన్ని నడిపిస్తుంది. ఇచ్ఛాకండరాల కదలికలు, సమన్వయం, శరీరపు నిలకడ కేంద్రనాడీమండలంలో పెద్దమెదడు, చిన్నమెదడులపై ఆధారపడి ఉంటాయి. శ్వాసక్రియ, హృదయవ్యాపారాలను మజ్జాముఖం (మెడుల్లా ఆబ్లాంగేటా) నియంత్రిస్తుంది. కేంద్రనాడీమండలంలో ఇతర వ్యాధులతో పాటు రక్తనాళాలలో కలిగే ప్రమాదాల వలన రక్తప్రసరణకు కలిగే అడ్డంకులు తీవ్రపరిణామాలకు దారితీస్తాయి. అంతర గళధమనులు, వెన్నుధమనులు మెదడుకు రక్తప్రసరణ చేకూరుస్తాయి. మెదడు రక్తనాళాలలో కలిగే ప్రమాదాలు పక్షవాతంగానో, తెలివి కోల్పోవుటలాగో పొడచూపుతాయి. ఈ ప్రమాదాలను మస్తిష్కవిఘాతాలుగా (సెరిబ్రల్ స్ట్రోక్స్) పరిగణిస్తారు.

మస్తిష్కవిఘాత లక్షణాలు కనిపించిన వారికి సత్వరంగా వైద్యశాలలలో తలకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణ (సి టి స్కాన్) చేసి కారణాన్ని నిర్ధారించాలి. ఈ చిత్రీకరణలో రక్తస్రావం కనిపించకపోతే రక్తప్రసరణ లోపంగా (ఇస్ఖీమియా) ఎంచి రక్త ప్రసరణకు అడ్డుపడిన నెత్తురు గడ్డలను త్వరగా విచ్ఛిన్నం చేసే అవకాశాలు పరిశీలించాలి.

మెదడు రక్తనాళాలలో ప్రమాదాలు

మార్చు

1.రక్తనాళాలలో నెత్తురు గడ్డలు ఏర్పడుట

మార్చు

రక్తనాళాలలో ధమనీకాఠిన్యం (ఎథిరోస్క్లీరోసిస్) వలన నెత్తురు గడ్డలు ఏర్పడి (థ్రాంబోసిస్) రక్తప్రసరణకు అడ్డంకి కల్పిస్తే రక్తప్రసరణ అందని కణజాలం ప్రసరణరహిత మరణం చెందడం వలన ఈ ప్రమాదాలు కలుగుతాయి. మెదడులో అరవై శాతపు రక్తనాళ ప్రమాదాలు ఈ తరగతికి చెందుతాయి.[1]

2.రక్తనాళాలలో అవరోధకాలు

మార్చు

రక్త ప్రవాహంలో రక్తపుగడ్డలు గాని యితర అవరోధకాలు గాని పయనించి (ఎంబొలై) మెదడులో సన్నని రక్తనాళాలలో అడ్డుపడి రక్తప్రసరణకు భంగం కలిగించుట ( ఎంబోలిజమ్) వలన 20 శాతపు రక్తనాళ ప్రమాదాలు కలుగుతాయి[2]. రక్తప్రసరణ అందని మెదడు కణజాలం మరణిస్తుంది. హృదయంలో కర్ణికా ప్రకంపనం (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) ఉన్నవారిలోను, కృత్రిమ హృదయకవాటాలు ఉన్నవారిలోను నెత్తురు గడ్డలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఆ నెత్తురు గడ్డలు రక్తప్రవాహంలో అవరోధకాలుగా కొట్టుకుపోయి సన్నని నాళాలాలో ఇరుక్కొని అడ్డుపడతాయి.

3.రక్తస్రావం

మార్చు

రక్తనాళాల శాఖలు చిట్లడంచేత, రక్తనాళాలలో ఏర్పడే బుడగలు చిట్లడంచేత కలిగే రక్తస్రావం (హెమొరేజ్) వలన మెదడులో 20 శాతపు రక్తనాళ ప్రమాదాలు కలుగుతాయి.

ఈ ప్రమాదాల వలన మెదడులో ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందని కణాలు మరణించుటచే మెదడు దెబ్బతిని మస్తిష్క విఘాతాలు (స్ట్రోక్స్) కలుగుతాయి.

మస్తిష్క విఘాత లక్షణాలు

మార్చు

మస్తిష్కవిఘాత లక్షణాలు మస్తిష్కవిఘాతం (సెరిబ్రల్ స్ట్రోక్) ఏర్పడిన తీరు, స్థానం (మనిషి మెదడు), తీవ్రతలపై ఆధారపడుతాయి. మెదడుకు రక్తప్రసరణ (సెరిబ్రల్ సర్క్యులేషన్) లోపం వలన కలిగినపుడు లక్షణాలు ఆకస్మికంగా కలిగినా లక్షణాలలో హెచ్చుతగ్గులు సాధారణంగా కనిపిస్తాయి.

 

గళ ధమనులలో ( కెరాటిడ్ ఆర్టెరీస్ ) దోషం ఉన్నపుడు ఆవలి పక్కనున్న దేహంలో పక్షవాతం కలిగి కండరాలు శక్తిని పూర్తిగానో, కొంతో నష్టపోతాయి[1]. అపుడు అవి ఇచ్ఛాపూర్వకంగా కదలలేవు, లేక నెమ్మదిగా నీరసంగా కదులుతాయి. స్పర్శజ్ఞానములో నష్టం కలుగవచ్చును. సగం చూపునష్టం, మాట పోవడం, పలుకులలో తొట్రుపాటు రావచ్చు[1]. జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారం మెదడు గ్రహించలేకపోతే, వస్తువులను, గతంలో తెలిసిన మనుష్యులను, శబ్దాలను, వాసనలను, రుచులను గుర్తుపట్టలేని స్థితి కలుగవచ్చు.

 
 

రక్తప్రసరణ దోషము వెన్నుధమని (వెర్టిబ్రల్ ఆర్టెరీ), మూలధమని (బెసిలార్ ఆర్టెరీ) శాఖలలో ఉంటే, దేహంలో ఒకపక్క గాని లేక రెండు పక్కలా గాని చలన నష్టం, స్పర్శనష్టం కలగడమే కాక తలతిప్పడం, కళ్ళుతిరగడం, దేహానికి అస్థిరత (అటాక్సియా), ద్విదృష్టి (ఒక వస్తువు రెండుగా కనిపించడం) కలుగవచ్చు.

గుండెలయలో మార్పులు, మర్మరశబ్దములు, కంఠధమనులలో హోరుశబ్దాలకు వైద్యులు పరీక్ష చేస్తారు.

మెదడు కణజాలంలో రక్తస్రావం జరిగినపుడు చలన నష్టం, స్పర్శ నష్టం వంటి నాడీమండలం పనిలో లోపాలతో బాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మాంద్యము , అపస్మారకతలు కూడా కలుగవచ్చు.

ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావం కలిగినపుడు జీవితంలో యెన్నడూ పొందనంత తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది[3]. వాంతులు, మూర్ఛ, చేతులు కాళ్ళలో కంపనం జ్వరం, నడుమునొప్పి, మాంద్యం లేక అపస్మారకత కూడా కలుగవచ్చు.

మెదడు సిరాపరిఖలలో (సెరిబ్రల్ వీనస్ సైనసస్) రక్తపుగడ్డలు ఏర్పడితే తలనొప్పి, మసకచూపు, కంటితెరలో వాపు (పేపిల్లిడిమా) వంటి కపాలంలో ఒత్తిడి పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి.

మస్తిష్కవిఘాతాలలా కనిపించే ఇతర వ్యాధులు

మార్చు

పార్శ్వపు తలనొప్పి కలిగినపుడు నాడీమండల లక్షణాలు పొడచూపవచ్చు. మూర్ఛ రోగం కలిగినపుడు తాత్కాలిక పక్షవాత లక్షణాలు కలుగవచ్చు. రక్తంలో చక్కెర విలువలు బాగా తగ్గినపుడు తెలివితప్పుట, నీరసం కలిగి పక్షవాతంలా కనిపించవచ్చు.

పరీక్షలు

మార్చు

రక్త పరీక్షలు

మార్చు

మస్తిష్కవిఘాత లక్షణాలు కనిపించిన వారికి ప్రాథమిక రక్తపరీక్షలు అవసరం. వివిధ రక్తకణాల గణనం, రక్తఫలకాల లెక్కింపు (ప్లేట్ లెట్స్), రక్తము గడ్డకట్టు సమయాల పరీక్షలు , చక్కెర విలువ, విద్యుద్వాహక లవణాలు పరీక్షలు చేయాలి.

విద్యుత్ హృల్లేఖ

మార్చు

విద్యుత్ హృల్లేఖ వలన గుండెలయలో మార్పులు, యితర హృదయ విలక్షణాలు తెలుస్తాయి.

గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణం (కంప్యుటెరైజడ్ ఏక్సియల్ టోమోగ్రఫీ)

మార్చు
 
మెదడులో రక్తస్రావం ( సి టి స్కాన్ ‘)
 
మధ్య మస్తిష్కధమనిలో నెత్తురుగడ్డ వలన రక్తప్రసరణలోపం. (మెదడు మెలికలు మరుగుపడ్డాయి.)

మస్తిష్కవిఘాత లక్షణాలు పొడచూపిన వారికి త్వరగా వ్యత్యాసపదార్థాలు ఇవ్వకుండ మెదడుకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణం చెయ్యాలి. ఈ పరీక్షలో మెదడు కణజాలంలో రక్తస్రావం, ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావం (సబ్ ఎరఖ్ నాయిడ్ హెమొర్రేజ్) త్వరగానే కనిపిస్తాయి[4].

రక్తప్రసరణ లోపం వలన కలిగే మస్తిష్కవిఘాతాలు కనిపించడానికి 48 నుంచి 72 గంటలు పైన పట్టవచ్చును. గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణంలో రక్తస్రావపు లక్షణాలు కనిపించకపోతే రక్తస్రావం జరుగలేదని నిర్ధారణ చేసి అవకాశం ఉంటే నెత్తురు గడ్డలను విచ్ఛిన్నం చేసే చికిత్సలు మొదలుపెట్టాలి. ఆ అవకాశం లేనపుడు నెత్తురు గడ్డకట్టుటను నివారించు చికిత్సలు మొదలుపెట్టాలి.

రక్తస్రావం కలిగిన వారిలో రక్తఘనీభవనం ఆలస్యం చేసే మందులు వాడకూడదు.

అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణం

మార్చు

అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణంలో (మేగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్) మస్తిష్కవిఘాతాలు త్వరగానే కనిపిస్తాయి. కాని రోగిని పరీక్షించినపుడు మస్తిష్క విఘాత (స్ట్రోక్) లక్షణాలు స్పష్టంగా కనిపిస్తే ఎమ్ ఆర్ ఐ వలన ఎక్కువ ప్రయోజనం లేదు. అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణలతో మెదడులో రక్త నాళాలను పరీక్షించ వచ్చును.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణం

మార్చు

శ్రవణాతీత ధ్వనిచిత్రీకరణంతో (అల్ట్రాసోనోగ్రామ్) కంఠధమనులను పరీక్షిస్తే కంఠధమనులలో సంకుచిత భాగాలను పసిగట్టవచ్చు.

హృదయ ప్రతిధ్వని చిత్రీకరణం

మార్చు

హృదయ ప్రతిధ్వని చిత్రీకరణంతో హృదయంలో నెత్తురు గడ్డలను, కవాటాల సంకోచాన్ని, కవాటాల పైన మొలకలను { వెజిటేషన్స్: లోపొరను ఆక్రమించి సూక్ష్మజీవులు వృద్ధిపొంది తాపం (ఎండోకార్డైటిస్) కలుగ జేస్తే యీ మొలకలు కనిపిస్తాయి. ఇవి విచ్ఛిన్నమై రక్తప్రవాహంలో అవరోధకాలు కలుగజేయ గలవు.}, కవాటాలలో తిరోగమన ప్రవాహాలను, గుండె నడిమి గోడలో రంధ్రాలను (సెప్టల్ డిఫెక్ట్స్) కనుగొనవచ్చు.

మస్తిష్క ధమనుల చిత్రీకరణం

మార్చు

కంఠ ధమనిలోనికి వ్యత్యాస పదార్థాలను ఎక్కించి మెదడులో ధమనులను ఎక్స్ రేలతో చిత్రీకరించవచ్చు[5]. ధమనులలో బుడగలను (ఎన్యురిజ్మ్స్), ధమనులలోని వైకల్యాలను యీ చిత్రాలతో కనుగొనవచ్చు. ఎరఖనాయిడ్ పొర క్రింద రక్తస్రావం కనుగొనుటకు వెన్నులో సూదితో నాడీద్రవంను గ్రహించి పరీక్షలు సలుప వచ్చు.

చికిత్స

మార్చు

మస్తిష్కవిఘాత లక్షణాలు కనిపించిన వారికి సత్వరంగా వైద్యశాలలలో తలకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణ (సి టి స్కాన్) చేసి కారణాన్ని నిర్ధారించాలి[4]. ఈ చిత్రీకరణలో రక్తస్రావం కనిపించకపోతే రక్తప్రసరణ లోపంగా (ఇస్ఖీమియా) ఎంచి ప్రసరణకు అడ్డుపడిన నెత్తురు గడ్డలను త్వరగా విచ్ఛిన్నం చేసే అవకాశాలు పరిశీలించాలి.

రోగి రక్తపు పోటు, హృదయ వేగం, ఉష్ణోగ్రతలు, ప్రాణవాయువు సంతృప్తతలు పరిశీలించాలి.

రక్తపుపోటు నియంత్రణ

మార్చు

మస్తిష్కవిఘాతాలు కలిగిన వారిలో రక్తపుపోటు నియంత్రణలో చాలా జాగ్రత్త వహించాలి. వీరిలో తొలుత రక్తపుపోటు హెచ్చుగా ఉన్నా, తరువాత దినాలలో దానంతట అదే క్రమేపి తగ్గుతుంది. రక్తనాళంలో ప్రవాహానికి అడ్డు ఉన్న పై భాగంలో రక్తపుపోటు తగ్గి కణజాలానికి ప్రసరణ సరిపోదు. అందువలన మెదడులో కణజాలానికి తగిన ప్రసరణ చేకూర్చడానికి రక్తపుపోటు సామాన్య పరిమితుల కంటె కొంత ఎక్కువ ఉండడం అవసరం.

రక్తపుపోటుని బాగా తగ్గిస్తే నాడీమండల స్థితి క్షీణించే అవకాశాలు ఎక్కువవుతాయి. అందువలన రక్తపుపోటుని త్వరితంగా సామాన్యస్థితికి తగ్గించే ప్రయత్నాలు చేయకూడదు. రక్తపుపోటు విషమస్థితికి చేరినా (ముకుళితపు పోటు) 220 మి. మీ. మెర్క్యురీ మించినా, వికాసపు పోటు 120 మి.మీ. దాటినవారిలోను, హృదయవైఫల్యం ఉన్నవారిలోను, రక్తపుపోటును జాగరుకతతో నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. రోజుకు 15 శాతంకు మించి రక్తపుపోటును తగ్గించకూడదు.

సిరల ద్వారా తగినంత లవణజల ద్రవం (0.9% saline) ఇచ్చి రక్త ప్రమాణం పెంచి మెదడుకు ప్రసరణ బాగా జరిగేటట్లు చూడాలి .

కపాలం లోపల రక్తస్రావం జరిగితే రక్తపుపోటు హెచ్చుగా ఉంటే క్రమంగా ఔషధాలతో దానిని తగ్గించాలి. తలభాగంను శరీరం కంటె 15 డిగ్రీల యెత్తులో ఉంచాలి.

ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావం జరిగితే ఆ యా కారణాలకు చికిత్స అవసరం. ధమనుల బుడగలకు శస్త్రచికిత్స అవసరం.

విశ్రాంతి, అవసరమైతే నొప్పి తగ్గించు మందులు, నిద్రకు మందులు, విరేచన దోహదకారులు వాడి కపాలం లోపల ఒత్తిడి పెరుగుటను అరికట్టాలి.

నెత్తురు గడ్డల విచ్ఛేదనం

మార్చు

రక్తనాళాలలో నెత్తురు గడ్డలు ఏర్పడి మెదడుకు రక్తప్రసరణ లోపించడంచే కలిగే మస్తిష్కవిఘాతాలకు నెత్తురుగడ్డల విచ్ఛేదనం ప్రయోజనం చేకూర్చే అవకాశం చాలా ఉంది. మస్తిష్కవిఘాత లక్షణాలు పొడచూపిన మూడు గంటలు సమయంలోపల నెత్తురు గడ్డల విచ్ఛేదక ఔషధాలు (రీకాంబినెంట్ టిష్యూ ప్లాస్మినోజెన్ ఏక్టివేటర్) వాడిన వారిలో ఫలితాలు చాలా మెరుగుగా (ముప్పదిశాతం) ఉంటాయి[4] [6]. మస్తిష్కవిఘాత లక్షణాలు తీవ్రం కానప్పుడు, ఆ లక్షణాల నుంచి త్వరగా తేరుకొంటున్న వారిలోను, ఇటీవల కాలంలో శస్త్రచికిత్సలు జరిగిన వారిలోను, తలకు దెబ్బలు తగిలిన వారిలోను, జఠరమండలంలోను, మూత్రావయవాలలోను రక్తస్రావాలు ఉన్న వారిలోను రక్తపుపోటు హెచ్చుగా ఉన్నవారిలోను, నెత్తురు గడ్డకట్టుటను అవరోధించు మందులు వాడుతున్న వారిలోను, మెదడులో అదివఱకు రక్తస్రావం జరిగిన వారిలోను, రక్తఫలకములు (ప్లేట్ లెట్స్) తక్కువ ఉన్నవారిలోను నెత్తురు గడ్డలు విచ్ఛేదించు మందులు వాడకూడదు. ఈ మందుల వలన మెదడులో రక్తస్రావం కలిగే అవకాశం ఉంది.

కృత్రిమనాళిక ద్వారా ధమనులలో నెత్తురు గడ్డలను విచ్ఛేదించు చికిత్స కొన్ని చోట్ల లభ్యము.

ఏస్పిరిన్

మార్చు

ఏస్పిరిన్ రోజుకు 325 మి.గ్రా. మొదటి రెండు దినములు ఆపై రోజుకు 81 మి.గ్రా రక్తప్రసరణ లోపం వలన కలిగే విఘాతాలకు ఉపయోగిస్తారు. రక్తఫలకాలు గుమికూడుటను ఏస్పిరిన్ అరికట్టి రక్తం గడ్డకట్టుటను మందగింపజేస్తుంది. క్లొపిడోగ్రెల్ కూడా రక్తఫలకాలు గుమికూడుటను అవరోధిస్తుంది. ఏస్పిరిన్ వలన అవలక్షణాలు కలిగిన వారిలో క్లొపిడోగ్రెల్ ను వాడవచ్చు.

రక్తఘనీభవన అవరోధకాలు

మార్చు

కర్ణికా ప్రకంపనం (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) ఉన్నవారిలోను, కృత్రిమ హృదయకవాటాలు ఉన్నవారిలోను రక్తం గడ్డకట్టుటను అరికట్టే ఔషధాలు మస్తిష్కవిఘాతాలు నివారించడానికి ఉపయోగపడుతాయి[7]. వార్ఫెరిన్, ఎపిక్సబాన్, రివరోక్సబాన్, డబిగార్టన్, కొన్ని ఉదహరణలు.

ఊపిరితిత్తులలోనికి ఆహారము మళ్ళుట నివారించుట

మార్చు

మస్తిష్కవిఘాతాలు కలిగిన వారిలో మింగు కండరాలలో నీరసం ఉంటే ఆహారం ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి ఊపిరితిత్తుల తాపం (న్యుమోనియా) కలిగించవచ్చు[8]. మింగుట యిబ్బంది ఉన్నవారికి కడుపులోనికి కృత్రిమ నాళం ద్వారా ద్రవపదార్థాలు ఆహారంగా యివ్వాలి.

శస్త్రచికిత్సలు

మార్చు

కంఠధమనిలో పలక ఏర్పడి రక్తనాళం సంకోచిస్తే (సంకోచం 60% కంటె ఎక్కువ ఉన్నపుడు) వారిలో, ఆ పలకను తొలగించే ‘కెరాటిడ్ ఎండార్టెరెక్టమీ’ శస్త్రచికిత్స మస్తిష్కవిఘాతాలు కలిగే అవకాశాలను తగ్గిస్తుంది[7] శస్త్రచికిత్స వలన 3-4% మందిలో ప్రమాదాలు కలుగవచ్చు. చిన్నమెదడులో విఘాతాల వలన వాపు కలిగి మెదడు మూలముపై ఒత్తిడి పెంచినా, నాడీద్రవ ప్రసరణకు ఆటంకం కలిగించి జలశీర్షం (హైడ్రోసెఫలస్) కలిగించినా అత్యవసర శస్త్రచికిత్సలు అవసరం.

వ్యాయామ చికిత్స, వృత్తి చికిత్స, వాక్చికిత్స

మార్చు

మస్తిష్కవిఘాతాలు కలిగిన వారికి వ్యాయామ చికిత్స, వృత్తి చికిత్సలు కండరాలలో శక్తిని పెంచడానికి, నడకతీరు సరిచేయడానికి, దినచర్యలు చేసుకొనడానికి తోడ్పడుతాయి[9]. వాక్చికిత్సలో ముఖకండరాలకు, నమలు కండరాలకు, జిహ్వ కండరాలకు, మింగుకండరాలకు శిక్షణ ఇస్తారు.

నివారణ

మార్చు
  • అరవై శాతపు మస్తిష్క విఘాతాలు ధమనీకాఠిన్యం (ఎథిరోస్క్లీరోసిస్) వలన కలుగుతాయి . అందువలన రక్తపుపోటుని అదుపులో ఉంచుకోవాలి. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. కొలెష్టరాలు అధికంగా ఉంటే దానిని తగ్గించుకోవాలి. పొగ త్రాగకూడదు. ఊబకాయంను తగ్గించుకోవాలి. తగినంత వ్యాయామం చేస్తుండాలి. ఈ చర్యలు ధమనీకాఠిన్యత ప్రక్రియను మందగించుతాయి.
  • ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, అపరాలు, ఆలివ్ నూనె వాడుట మంచిది. మాంసాహారము తినేవారు చేపల వాడుక పెంచుకొని మిగిలిన మాంసంను మితపరచుట మేలు. సారాయి వాడుకను మితపరచుకోవాలి.
  • కర్ణికా ప్రకంపన ఉన్నవారు, కృత్రిమ హృదయకవాటాలు ఉన్నవారు నెత్తురుగడ్డలను నివారించు మందులు వాడుకోవాలి[7].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 The Washington Manual Of Medical Therapeutics 37 th edition. Washington University School of Medicine, St.Louis: Washington University in St.Louis. 2023. pp. 973–975. ISBN 978-1-975190-62-0.
  2. "UpToDate". www.uptodate.com. Retrieved 2023-05-26.
  3. "Brain Bleed/Hemorrhage (Intracranial Hemorrhage): Causes, Symptoms, Treatment". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-05-26.
  4. 4.0 4.1 4.2 Ustrell-Roig, Xavier; Serena-Leal, Joaquín (2007-07-01). "Stroke. Diagnosis and Therapeutic Management of Cerebrovascular Disease". Revista Española de Cardiología (English Edition) (in ఇంగ్లీష్). 60 (7): 753–769. doi:10.1016/S1885-5857(08)60011-0. ISSN 1885-5857.
  5. "Brain Aneurysm: What It Is, Causes, Symptoms & Treatment". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-05-26.
  6. "Tissue Plasminogen Activator for Acute Ischemic Stroke". New England Journal of Medicine (in ఇంగ్లీష్). 333 (24): 1581–1588. 1995-12-14. doi:10.1056/NEJM199512143332401. ISSN 0028-4793.
  7. 7.0 7.1 7.2 Kernan, Walter N.; Ovbiagele, Bruce; Black, Henry R.; Bravata, Dawn M.; Chimowitz, Marc I.; Ezekowitz, Michael D.; Fang, Margaret C.; Fisher, Marc; Furie, Karen L.; Heck, Donald V.; Johnston, S. Claiborne (Clay); Kasner, Scott E.; Kittner, Steven J.; Mitchell, Pamela H.; Rich, Michael W. (2014-07). "Guidelines for the Prevention of Stroke in Patients With Stroke and Transient Ischemic Attack: A Guideline for Healthcare Professionals From the American Heart Association/American Stroke Association". Stroke (in ఇంగ్లీష్). 45 (7): 2160–2236. doi:10.1161/STR.0000000000000024. ISSN 0039-2499. {{cite journal}}: Check date values in: |date= (help)
  8. Alberts, M. J.; Horner, J.; Gray, L.; Brazer, S. R. (1992). "Aspiration after stroke: lesion analysis by brain MRI". Dysphagia. 7 (3): 170–173. doi:10.1007/BF02493452. ISSN 0179-051X. PMID 1499361.
  9. "Rehab Therapy After a Stroke". www.stroke.org (in ఇంగ్లీష్). Retrieved 2023-05-26.

వెలుపలి లంకెలు

మార్చు