ఈజిప్టు పిరమిడ్లు

(గీజా పిరమిడ్ ప్రాంగణం నుండి దారిమార్పు చెందింది)

"పిరమిడ్" అనునది (Greek: πυραμίς pyramis[1]) జ్యామితి పరంగా పిరమిడ్ వంటి నిర్మాణ ఆకృతి. దీని బయటి తలములు త్రిభుజాకారంగా ఉండి, పై చివర ఒక బిందువుతో అంతమగును. దీని భూమి త్రిభుజ, చతుర్భుజ, లేదా ఏదైనా బహుభుజి ఆకారాన్ని కలిగి ఉంటుంది.

ఈజిప్టు పిరమిడ్లు

ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమయినవి. ప్రాచీన, మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి. ఇవి క్రీ.పూ. 2886-2160 నాటివి. నైలునదీ లోయకు 51 వ మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో, ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700 కి పైగా పిరమిడ్ లు గోచరిస్తాయి. ఈ పిరమిడ్ లు సమాధుల రూపాలు. వీటిలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని చరిత్ర కారుల అంచనా.

అతి పెద్ద పిరమిడ్లు - నిర్మాణ శైలి మార్చు

ఈ పిరమిడ్ల లోని "గీజా" వద్ద నిర్మాణమైన ఖుపూ, ఖప్రే, మెంకార్ పిరమిడ్ లు చాలా పెద్దవి. ఈ పిరమిడ్ లు చాలా ఎత్తు, వెడల్పు గలిగినవని తెలుస్తున్నది. పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్టును పిరమిడ్స్ ఆఫ్ గీజా అని కూడా పిలుస్తారు. ఈ పిరమిడ్ లు చియాప్స్, ఛిఫ్హెరన్, మైసిరినాస్ అనే ముగ్గురి (ఈజిప్టు సుల్తాన్లు) పేర నిర్మించబడ్డాయి.

ఈ మూడింటిలో కూడా అతి పెద్ద పిరమిడ్ ఛియాప్స్ పేర నిర్మాణమైనది. దీనిని గ్రేట్ పిరమిడ్ అంటారు. దీని భూతలం 5,70,000 చదరపు అడుగులు అంటే 53,000 చదరపు మీటర్లు ఉంటుంది. నిర్మాణంలో 23,00,000 సున్నపురాళ్లను ఇటుకలను వాడారు. ఒక్కో ఇటుక 2.5 టన్నుల బరువు గలది. ఒక్కో ఇటుక లేక ఘనం 3 చదరపు అడుగుల వైశాల్యం ఉంది.

గ్రేట్ పిరమిడ్ నిర్మాణ శైలిలో కూడా చాలా కచ్చితమైన కొలతలు పాటించారు. పిరమిడ్ భూతలం నాలుగు వైపులా పొడవు సరాసరి 755 అడుగులు (1230.12 మీటర్లు) ఉన్నాయి. భూతల రేఖలలో మరీ పొట్టి 8 అంగుళాలు లేదా 20 సెంటీ మీటర్లు మాత్రమే. నాలుగు మూలలు, కచ్చితమైన సమకోణాలుగా ఉన్నాయి. కాకపోతే ఒక డిగ్రీలో చాలా స్వల్పమైన తేడా కనిపిస్తుంది. నక్షత్రాలను బట్టి ఆనాటి పిరమిడ్ నిర్మాతలు లేక నిర్మాణపు పనివారు తమ కార్యక్రమం నిర్వహించినట్లు భావించవచ్చు. పిరమిడ్ ప్రక్కతలాలను అంత సూత్రబద్ధంగా నిర్మించడానికి ఖగోళ పరిజ్ఞానం ఉపకరించి ఉండవచ్చని చెప్పవచ్చు. కంపాస్ ను ఉపయోగించారో లేదో తెలియదు గాని, డిగ్రీలు అంత సూక్ష్మభాగాన్ని కూడా లెక్కలేనట్లు నిర్మాణంలో ఉపయోగించటం, ఆనాటికి పిరమిడ్ నిర్మాణ ప్రవీణుల మేథస్సును విశదీకరించటమే కాక, ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేయటం గమనార్హం. "ఎలివేషన్"కోణం 52 డిగ్రీలు. దాదాపు 490 అడుగులు(150 మీటర్లు) ఎత్తుదాకా ఇదే పద్ధతి పాటిస్తూ నిర్మాణం చేయటం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు తార్కాణం.

నిర్మాణ కారణం మార్చు

ఈజిప్టు రాజ వంశానికి చెందినవారు మరణించినపుడు వారికోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేసింది ఇంహోటెప్ అనే వాస్తు శిల్పి. అప్పటి వరకు ఉన్న 'మస్టబా'లను అంచెలంచెలుగా ఒకదాని పైన ఒకటి అమర్చి పైకి వెళ్తున్న కొద్దీ పరిణామము తగ్గుతూ ఒక కొన వద్ద నిర్మాణం ఆగిపోయే విధంగా రూపకల్పన చేసాడు. ఈ నిర్మాణానికే 'పిరమిడ్' అని పేరుపెట్టబడింది. తర్వాతి కాలంలో ఈజిప్షియన్లు 'ఇంహోటెప్' ను దైవసమానుడిగా కొలిచేవారు. పిరమిడ్ల నిర్మాణానికి ఫారో వంశస్థులు రాజ్యమేలుతున్న కాలం స్వర్ణయుగం లాంటిది. అత్యంత గొప్ప పిరమిడ్ అయిన గిజా, మరి కొన్ని అత్యద్భుత పిరమిడ్లు ఫారోల కాలంలో నిర్మింపబడ్డాయి. తదనంతర కాలంలో ఫారోల ప్రాభవం తగ్గుముఖం పట్టడం, పెద్ద పెద్ద నిర్మాణాలకు అవసరమయిన వనరులను చేకూర్చుకోలేక పోవడంతో, తక్కువ సాంకేతిక విలువలతో కూడిన చిన్న చిన్న పిరమిడ్లు మాత్రమే కట్టబడ్డాయి.

నమ్మకాలు మార్చు

 
ఫారో్

పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం: రాత్రి పూట ఆకాశంలో కనపడే దట్టమయిన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమయిన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నదీ తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి.

నిర్మాణం మార్చు

సర్ ప్లిండర్స్ పెట్రీ గొప్ప పురాతన శాస్త్రవేత్త. ఆయన అంచనా ప్రకారం లక్ష మంది పనివారు నిర్మాణ స్థలానికి రాతి ఫలకాలను చేరవేసి ఉంటారని, అదనంగా నాలుగు వేల మంది కార్మికులు పూర్తిగా నిర్మాణపు పనులను చేసి ఉండవచ్చునని భావన.[2]

నిర్మాణపు పనులు చాలా సులభమైనవే. వాస్తవానికి కొలతలు ఖచ్చితమైనవే, పిరమిడ్‌లను సమతలంగా ఉంచటానికి "బెడ్‌రాక్" విధానాన్ని అవలంబించినట్లు తెలుస్తుంది. పునాది ప్రాంతం అంతా బురదతో చుట్టుకొని ఉంది. ఆ బురద నేల అంతా నీటమయం గోతులను త్రవ్వారు. రాతినేలలోనే రాతి ఉపరితలం వరకు గోతులన్నీ సమానమైన కొలతల్లోనే త్రవ్వడం జరిగింది. అలా వాళ్ళు పునాదులను నిర్మించారు. బహుశః ఎక్కడన్నా కొలతల్లో ఒక్క అర అంగుళం మాత్రం తేడా ఉంటే ఉండవచ్చు.

వినియోగించిన రాతిఫలకాలన్నీ "మొక్కాటమ్" కొండల నుండి తీయబడినవే. ఆ రోజుల్లో ఈజిప్షియన్‌ల వద్ద పుల్లీలు (కప్పీలు) లేవని దీని సత్యం. అంత బరువైన రాతి ఫలకాలను పైకి చేర్చడానికి అధునాతన క్రేన్స్ లేవు. వాళ్ళు ఏటవాలుగా స్థలాన్ని నిర్మించుకున్నారు. అంటే ఈనాడు మనం చూసే "రాంప్స్" లాంటివి. ప్లై ఓవర్ బ్రిడ్జీలకు అటు ఇటు ఏటవాలుగా చదునైన భారం ఏర్పరుస్తారే అలాగే. భూమి అలా ఉండటం వల్ల బరువైన వస్తువులను, సామగ్రిని పైకి తీసుకెళ్ళడం, క్రిందకు దొర్లించి దింపడం చాలా సులభమవుతుంది. ముందు "పిరమిడ్"కు ఒక ప్రక్క ఇలా ఏటవాలు తలాన్ని ఏర్పరిచారు. ఇప్పటికీ ఈజిప్టు ప్రజలు విశ్వసించేదేమంటే, ఇలా శరీర కష్టంతో కన్నా, మానసిక శక్తుల వినియోగం ద్వారా అంటే అతీంద్రియ శక్తులను ఉపయోగించి, ఈ పిరమిడ్ల నిర్మాణం కోసం అత్యంత భారీ రాతి ఫలకాలకు అత్యంత ఎత్తుకు చేర్చగలిగారు.

పిరమిడ్ లోపల చుట్టూ నిట్టనిలువుగా "తాపీ" పనిద్వారా ఒక గోడ నిర్మించారని తెలుస్తున్నది. అలా నిర్మించిన ఆకారానికి సున్నపురాళ్ళ ఫలకాలతో పై భాగాన్ని రూపొందించారని, అలా చేయటం వల్ల సోపానాలు ఏర్పడినట్లుగా మనకు గోచరిస్తుంది. ఈ సోపానాలను మరికొన్ని ఫలకాలతో మూసివేశారు. తరువాత గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉన్న మెట్లను, నున్నగా రూపొందించిన రాతిఫలకాలను అంటించడం వల్ల ఆ సోపానాలు మృదువుగా ఉండి నున్నగా కనిపిస్తున్నాయి.

గ్రేట్ పిరమిడ్ మార్చు

ఈ గ్రేట్ పిరమిడ్ మధ్య భాగంలో "ఛియోవ్స్" సమాధి మందిరం ఉంది. ఈ మందిరం గ్రానైట్ రాళ్ళతో నిర్మాణమయినది. 34X17 చ.అడుగుల (10.5X5.3 చ. మీటర్లు) వైశాల్యంలో, 18 అడుగులు (15.8 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. రాజులు శవాన్ని ఉంచే శవపేటిక (కాఫిల్ లేక సర్కోఫంగస్) ఈ గ్రానైట్ గదిలో పశ్చిమాన ఉంది. ఉత్తర దిశ నుండి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. అక్కడ నుండి ఒక వరండా ఉంది. ఈ వరండా పునాది వరకు ఉంది. ఈ వరండా చివర పూర్తిగా నిర్మాణం కాని, సమాధి గది వరకు ఉంటుంది. ఇక్కడ నుండి "గ్రాండ్ గాలరీ" అని పిలువబడే రాజు సమాధి మందిరంలో శవపేటిక వరకు విశాలంగా ఉండి పైకి ఎక్కే ఏర్పాటు ఉంది.

ఛియాస్ పిరమిడ్ మార్చు

"ఛియోస్" పిరమిడ్ చుట్టూ ఎత్తు తక్కువగా ఉండే చిన్న చిన్న సమాధులున్నాయి. ఈ సమాధులు బల్ల పరుపుగా ఉన్నాయి. వీటిని మస్తబాస్ అంటాము. మూడు చిన్న పిరమిడ్స్, ఛియోప్స్ కుటుంబీకులు, అతనికి సంబంధించిన ఉన్నతోద్యోగుల సమాధులు ఉన్నవిగా గుర్తింపబడ్డాయి. పిరమిడ్ దక్షిణ గోడ వద్ద ఒకే నేల మాళిగ (అండర్ గ్రౌండ్) ఉంది. 1954 లో ఈ విషయం బయటకు వచ్చింది. ఇందులో ఛియోప్స్ "ప్యూనరల్ ఫిష్" ఉంది. 4600 ల సంవత్సరాలకు పూర్వం పనాడో అక్కడ ఉంచిన పడవ ఎవ్వరూ ముట్టనైనా ముట్టకుండా ఈ నాటికీ భద్రంగా ఎలా ఉండాలో అలానే ఉంది. చనిపోయిన రాజుగారు స్వర్గానికి వళ్ళాలంటే తగిన వాహనం ఉండాలని ఈజిప్టు వారు విశ్వసించేవారు. అందువల్ల రాజుగారి స్వర్గారోహణ ప్రయాణం నిమిత్తం ఒక పడవ అందులో ఆహార పదార్థాలు, దుస్తులు, ఆయన సేవ సహాయాల కోసం చనిపోయిన సమాధి అయిన సేవకుల శవాలను ఆ పడవలో ఉంచేవారు. అలాటి పడవ ఒకటి పిరమిడ్ నేల మాళీగలో భద్రంగా ఉంది.

ఛెప్‌రన్ పిరమిడ్ మార్చు

రెండవ అతి పెద్ద పిరమిడ్ "ఛెప్‌రెన్ పిరమిడ్", ఛియోప్స్ పిరమిడ్ కు నైఋతి మూలగా ఉంది. ఇది కొంచెం మాత్రమే చిన్నది. 460 అడుగులు (140 మీటర్లు) ఎత్తు, 709 అడుగులు (216 మీటర్లు) చదరం కలిగినవి. ఛియోప్స్ పిరమిడ్లా కాకుండా పైకి పోయే కొద్దీ మరింత సన్నగా, కోలగా సూదిగా ఉంటుంది. "ఛియోప్స్" పిరమిడ్స్ పిరమిడ్ లా పై భాగం సున్నపు పూత లేకుండా "ఛెఫ్‌రెన్" పిరమిడ్ సున్నపు ఫలకాలను ఎదురెదురుగా అతికింపబడి, సున్నపు పూత అవసరం లేకుండగానే రూపొంది ఉంది. ఇలా ఫలకాలను అతకడంలో మంచి నేర్పరితనం వ్యక్తమవుతుంది.

గిజా పిరమిడ్ మార్చు

 
ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా

ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లేదా ఖుఫు పిరమిడ్ అత్యంత ప్రాచీనమయిన, అతి పెద్ద పిరమిడ్. ఇది అతి పెద్ద పిరమిడ్లలో మూడవది. యిది "ఛెఫ్‌రాన్" పిరమిడ్ కు నైఋతి దిశలో ఉంది. దీనిని పిరమిడ్ మైసిరిసన్ అని గూడా పిలుస్తారు. ఇది 354 అడుగులు (108 మీటర్లు) చదరముల ఎత్తు 230 అడుగులు లేక 70 మీటర్లు. ఇతర పిరమిడ్ల నిర్మాణంలో వాడిన సున్నపు రాతి పరిమాణంలే 1/10 వరకు మాత్రమే ఈ పిరమిడ్ నిర్మాణానికి సరిపోయి ఉంటుంది. ఈ పిరమిడ్ ముఖతలాలు పింక్ రంగు గ్రానైట్, సున్నపు రాయి మిశ్రమఫలకాలతో నిర్మానమై ఉంది. ప్రాచీన ప్రపంచ ఏడు వింతల్లో ఈ పిరమిడ్ ఒకటి. నాలుగవ ఈజిప్ట్ ఫారో అయిన ఖుఫు మరణానంతరం దీనిని 20 ఏళ్ళ పాటు నిర్మించి క్రీ.పూ. 2560లో పూర్తి చేసారు. నిర్మాణం పూర్తి అయిన నాటికి దీని ఎత్తు 146.6 మీటర్లు. ఈ పిరమిడ్ ఒక్కో భుజం 225 మీటర్లకు పైగా పొడవు కలిగి ఉంది. ఈ పిరమిడ్ బరువు 59 లక్షల టన్నులు అని అంచనా. ఈ పిరమిడ్ నిర్మాణం ఎంత కచ్చితంగా జరిగిందంటే 225 మీటర్ల పొడవు ఉన్న నాలుగు భుజాల మధ్య కేవలం 58 మిల్లీ మీటర్ల తేడా మాత్రమే ఉన్నది! ఈ పిరమిడ్ నిర్మాణానికి దాదాపు రెండు లక్షల మంది పనిచేసారు.

 
ది గ్రేట్ పిరమిడ్ రేఖాచిత్రం

గీజాలు ఈ పిరమిడ్స్ తో పాటు, "స్ఫినిక్స్" చాలా ప్రసిద్ధమైనవి. ఇవి రాతి శిల్పాలు. మనుష్యుని తల, మిగిలిన శరీర భాగంలో సింగాకృతిలో ఉంటాయి. ఇది "ఛిఫ్‌రాన్" ఆకారంగా భావించబడుతున్నది. ఈ స్ఫినిక్స్ ను సూర్య దేవునిగా భావించి, పూజచేయడం, ఆరాధించడం ఈసిప్షియన్ల ఆచారం.

విశ్వాసాలు మార్చు

ఏటవాలుగా ఉండే పిరమిడ్ ప్రక్కతలాలు సూర్యకిరణాలుగా భావిస్తారు. చనిపోయిన మహారాజు ఈ కిరణాలనే సోపానాల సహాయంతో స్వర్గాన్ని చేరుకోగలడని వారి విశ్వాసం[2]

The age of the pyramids reached its zenith at Giza in 2575-2150 BCE.[3] చనిపోయిన వారి ఆత్మ స్వర్గాన్ని చేరడానికి కొంత కాలం పడుతుందని ఈజిప్టు వారు దృఢంగా నమ్ముతారు. అందుకని తమ మహారాజులైన "ఫరోక్స్" స్వర్గం చేరడానికి, మరణానంతరం తమకు చేతనైన ఈ సాయం చేస్తున్నారు. అనుకోవడంలోనే వారికి సంతృప్తి. వారు తమ ప్రభువులను దేవతలుగా భావించి, ఆరాధించడం వారి సంప్రదాయం. మన హిందూ సంప్రదాయంలో కూడా "నా విష్ణుః పృధివీ పతిః" అని శాస్త్రం. అంటే రాజు విష్ణు దేవునితో సమానం లేక ఆ భేదం లేదు. అని ఆంగ్లంలోనూ ఒక సామెత ఉంది. "కింగ్ కెన్ డు నో రాంగ్" అని అంటే రాజు గారు తప్పు చేయడు. అని మరో విధంగా చెప్పాలంటే రాజు ఏం చేస్తే అదల్లా న్యాయమే సరైనదే అని అర్థం.

సమాధి గదిలో "మమ్మీ ఫైడ్" అంటే మమ్మీగా తయారుచేసిన శవానికి దానిని భద్రపరచిన శవపేటిక (సర్కోఫగస్) లో వీలైనంత ఎక్కువ బంగారం, వెండిలను అధిక పరిమాణంలో ఆహార పదార్థాలు, దుస్తులు ఉంచుతారు. కొన్ని సందర్భాలలో వ్యక్తి గత సేవకులను కూడా ఆ సమాధుల్లోనే ఉంచుతారు. ఆ ఫరోక్స్ తో పాటు మరణానంతరం గూడా రాజుగారి సేవకులను వారి అవసరం ఉంటుందనే ఒక నమ్మకానికి ఇదో చిహ్నం.

ఇలా శవపేటికలను భద్రపరిచే సమాధి గదులు గోడలను వివిధ పెయింటింగ్స్ తోనూ, పిరమిడ్ కు సంబంధించిన వంశ వృక్షాలు (ముత్తాత,తాత,తండ్రి,పినతండ్రి మొదలైన వంశీకుల వివరాలు) తోనూ అలంకరిస్తారు. ఈ పట్టికలో ఈ బిడ్డకు చెందిన త్యాగధనుల ప్రార్థనలు కూడా ఉంటాయి. కొన్ని మంత్రాలు, రకరకాల ఉచ్చాటనకు వినియోగపడే బీజాక్షరాలు, కూడా వాటిలో ఉంటాయి. ఇలా గోడలపై అలంకరించడం వల్ల మరణించిన రాజు లేక రాణీ పునరజ్జీవితులు కావచ్చు లేదా మరణానంతరం కూడా జీవంలో ఉండే అవకాశాం కలగవచ్చు లేదా కొన్ని మంత్రాలు తంత్రాలకు అద్భుత శక్తులకు ఆలవాలం కావచ్చు.

ఈజిప్టు వాసులకు దేవతలు అనేక రూపాల్లో ఉంటారు. మనుష్య రూపంలో జంతు రూపంలో, వస్తు రూపంలో కూడా ఈ దేవతలు ప్రకృతి, శక్తులను, నిర్జీవ భావాలకు ప్రతీకలు, చిహ్నాలు, ఈ దేవతలు ప్రతిరూపాలను సమాధి గోడలపై ఏర్పాటు చేస్తారు. ఈ సమాధి గదిలో ఒక ప్రక్క "బుక్ ఆఫ్ ది డెడ్" మరణించిన వారి గురించి వివరాలను పొందుపరచిన గ్రంథాన్ని శవపేటికలో మృతదేహం ప్రక్కనే ఉంచుతారు. ఈ గ్రంథంలో కాగితాలు పైన వ్రాసిన మంత్రాలు ఉంటాయి. ఈ గ్రంథం వలన ఆ కాలపు శ్రాద్ధ కర్మలు ఎలా చేసేవారో, మరణం సంభవించినప్పుదు ఏయే క్రతువులు చేస్తారో, మన కాలం వారు అవగాహన చేసుకొనె అవకాశం ఏర్పడింది.

ప్రఖ్యాత గీజా పిరమిడ్స్ ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఆనాటి ప్రసిద్ధ "ఫరో" ల గొప్ప నాగరికతను ఇలా శతాబ్దాల తరబడి భద్రపరచి, ఆధునికల అవగాహన కోసం విజ్ఞానాన్ని అందించగలగడం చెప్పుకోదగ్గ విషయం.

వివిధ దేశాలలో పిరమిడ్లు మార్చు

సూచికలు మార్చు

  1. πυραμίς, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, on Perseus Digital Library
  2. 2.0 2.1 Redford, Donald B., Ph.D.; McCauley, Marissa. "How were the Egyptian pyramids built?". Research. The Pennsylvania State University. Retrieved 11 December 2012.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  3. "Egypt Pyramids-Time Line". National Geographic. 2002-10-17. Archived from the original on 2011-08-10. Retrieved 2011-08-13.

మూలాలు మార్చు