గీత గోవిందం

సంస్కృత కావ్యం

గీత గోవిందం జయదేవుడు రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.[1][2] వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన[3] ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిషా, అస్సాం రాష్ట్రాల లలిత కళలపై గీత గోవిందం ప్రభావం ఉంది.

జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ విలియం జోన్స్ ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన నారాయణ తీర్థుల వంటి వారికి ఈ గ్రంథం స్ఫూర్తినిచ్చింది.[1]

కవి సవరించు

దీని రచయిత అయిన జయదేవుడు సా. శ 12వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన జన్మస్థలం బెంగాల్ లోని కెండూలి అనే ప్రాంతం. భోజదేవుడు, రమాదేవి ఈయన తల్లిదండ్రులు. ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు, విష్ణు భక్తుడు అయిన లక్ష్మణసేనుడి ఆస్థాన కవిగా ఉండేవాడు.[4]

సారాంశం సవరించు

శ్రీమహావిష్ణువు యొక్క అవతార మూర్తుల స్మరణతో కావ్యం ఆరంభమవుతుంది. మూల వస్తువు విరహ వేదన. పన్నెండు సర్గలున్న ఈ కృతిలో మొదటి పది సర్గలలో విరహ శృంగారమూ, తర్వాతి రెండు సర్గలలో సంభోగ శృంగారమూ వర్ణించబడ్డాయి.[5] మొదటి కీర్తన తప్పించి మిగతా అష్టపదులు 10 చరణాలుగా వ్రాయబడ్డాయి. ప్రతి సర్గ శ్రీకృష్ణారాధనతో ప్రారంభమౌతుంది.

 1. సామోద దామోదర
 2. అక్లేశ కేశవ
 3. స్నిగ్ధ మధుసూదన
 4. ముగ్ధ మధుసూదన
 5. సాకాంక్ష పుండరీకాక్ష
 6. ధన్య వైకుంఠ
 7. నాగర నారాయణ
 8. విలక్షణ లక్ష్మీపతి
 9. ముగ్ధ ముకుంద
 10. ముగ్ధ మాధవ
 11. సానంద గోవింద
 12. సుప్రీత పీతాంబర

ఇందులో మనకు మూడు పాత్రలు గోచరిస్తాయి. శ్రీ కృష్ణుడు, రాధ, సఖి. సఖి పాత్ర కీలకం. నాయికా నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేస్తూ వారిద్దరినీ సన్నిహితం చేస్తూ మధుర సంగమానికి సిద్ధం చేసే నైపుణ్యం కనబరుస్తుంటుంది.

తర్జుమాలు, వ్యాఖ్యానాలు సవరించు

ఈ కృతికి అనేకమంది తర్జుమాలు,వ్యాఖ్యానాలు రచించారు. ఎక్కువగా 16 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఒరియా, బెంగాలీ భాషలోకి తర్జుమాలు జరిగాయి. 14 వ శతాబ్దం నుంచి 20 వ శతాబ్దం దాకా దాదాపు 100కి పైగా వ్యాఖ్యానాలు, 50కి పైగా అనుసరణలు వెలువడ్డాయి. రసిక ప్రియ, రసమంజరి అనే వ్యాఖ్యలు ప్రసిద్ధాలు. తిరుమల దేవ రాయలు దీనిపై శ్రుతి రంజని అనే వ్యాఖ్య రచించాడు.[5] మరికొన్ని సుప్రసిద్ధమైన అనుసరణలు.

 1. ఉదన్య కార్య (12వ శతాబ్దం)
 2. జగద్ధర (14 వ శతాబ్దం)
 3. నారాయణ దాసు (16వ శతాబ్దం)
 4. లక్ష్మీధర (16వ శతాబ్దం)
 5. శంకర మిశ్ర (16వ శతాబ్దం)
 6. ధనంజయ (17వ శతాబ్దం)
 7. భగవద్దాస నారాయణ పండిత (17వ శతాబ్దం)
 8. పూజారి గోస్వామి (16, 17వ శతాబ్దం)
 9. లక్ష్మణ భట్ట (18వ శతాబ్దం)
 10. కృష్ణదాస కవిరాజ్ (18వ శతాబ్దం)
 11. ది సీగల్ (ఆక్స్ ఫర్డ్ 1975)
 12. ఎస్. ఆర్. శ్రీనివాస అయ్యర్ (1963)
 13. పండిట్ హరికృష్ణ ముఖోపాద్యాయ (4వ ముద్రణ కలకత్తా, 1965)

ఇంకా ఎంతోమంది వ్యాఖ్యాతలు, పండితులు, కవులు, సామాజిక వేత్తలు పలు వ్యాసాలు ప్రచురించారు.

ప్రాచుర్య సాహిత్యంలో సవరించు

చందన చర్చిత నీల కళేబర, సావిరహే తవదీనా లాంటి అష్టపదులు జన బాహుళ్యంలో ప్రజాదరణ పొందినవి. సినిమా పాటల్లో కూడా వీటిని వాడటం వలన కొంత ప్రచారం వచ్చినది.[5]

మూలాలు సవరించు

 1. 1.0 1.1 పింగళి, పాండురంగారావు (2017). భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు.[permanent dead link]
 2. Kapila, Vastyayan (1979). Jaur Gita Govinda. Delhi: National Museum, Janapath.
 3. Goerge, Keyt. Gita Govinda The Loves Of Krishna And Radha. p. 9.
 4. యల్లకరి, తిరువేంగళ మూరి (1996). ఆంధ్ర గీతగోవిందము.[permanent dead link]
 5. 5.0 5.1 5.2 మంచాల, జగన్నాథ రావు (1971). శ్రీ గీతగోవిందము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్సు. pp. VI.

బయటి లింకులు సవరించు