గుడుగుడు గుంజం ఆట

(గుడు గుడు గుంజం ఆట నుండి దారిమార్పు చెందింది)

బాల బాలికలు ఎంతో ఇష్టంగా ఆడుకునే ఆట. పిల్లలందరూ సాయంత్రం వేళ ఒక చోట కూర్చుని రెండు చేతుల పిడికిళ్ళు బిగించి ఓకరి పిడికిలి మీద మరొకరి పిడికిలి ఉంచాలి. ఆటలో పెద్దగా ఉండే ఒకరు పిడికిలిలో తన చూపుడు వ్రేలును ఉంచి ఆడిస్తూ ఈ విధంగా పాడటం జరుగుతుంది. [1]

బాల బాలికల ఆటలు

'గుడు గుడు గుంజం గుండే రాగం

పాముల పట్టుం పడగారాగం,

చిన్నన్న గుర్రం చిందులు తొక్కే,

పెద్దన్న గుర్రం పెళ్ళికి పోయే,

నీ గుర్రం నీళ్ళకు పోయే,

నా గుర్రం పాలకు పోయే,

కత్తెయ్యనా- బద్దెయ్యనా,

రోలెయ్యనా - రోకలెయ్యనా,

వేన్నీళ్ళు పోయనా - చన్నీళ్ళు పోయనా'

అని అడుగుతూ పైన పిడికిలి గలవారు ఆట పెద్ద అడిగిన దానికి తనకు ఇష్టమైన దానిని కోరుకోవాలి. ఉదాహరణకు కెత్తెయ్యమని కోరినచో ఆట పెద్ద తన చూపుడు వ్రేలితో వారి పిడికిలి మీద కత్తితో నరికినట్లు కొట్టాలి. తరువాత వారు తమ పిడికిలిని ముద్దు పెట్టుకొని వెనుకకు దాచుకోవాలి. అందరూ ఈ విధంగా చేసిన తరువాత ఆట పెద్ద అందరినీ 'మీ చేతులు ఏమైపోయాయి?' అని అడుగును. 'పిల్లెత్తుకుపోయింది' అని వారందరూ చెబుతారు. 'పిల్లిని ఎక్కడి దాకా తరిమారు' అని పెద్ద అడిగితే 'కొండపల్లి దాకా తరిమాము' అని చెబుతారు. తరువాత ఆట పెద్ద మిగిలినవారందరికి చక్కిలిగింతలు పెట్టును.[2]

ఇతర విశేషాలు

మార్చు

గుడు గుడు గుంజం అనే పేరుతో డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరోగా వి. రవికుమార్ నిర్మించిన సినిమా 2011 లో విడుదల అయ్యింది. ఈ ఆట గురించి ప్రముఖ పుస్తక రచయిత గాజుల సత్యనారాయణ గారు తన పెద్దబాల శిక్షలో చక్కగా వివరించారు.

మూలాలు

మార్చు
  1. వెలగా, వెంకటప్పయ్య (2003). మన పిల్లల పాటలు. విజయవాడ: తెలుగు బాలల రచయితల సంఘం. pp. 100, 101.
  2. తెలుగువారి సంప్రదాయాలు. నిత్ర పబ్లికేషన్స్. pp. 363–365.