గుత్తి కోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి.

గుత్తి కోట

చరిత్ర

మార్చు

గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు అయితే విజయనగర రాజులు దీనిని పటిష్ఠము చేసారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము, సంస్కృతములో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఒక శాసనములో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజముగా కీర్తించబడింది.

గుత్తి కైఫియత్ ప్రకారము కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెను. ఆ తరువత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉంది. 1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు దీనిని జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్భంధము తర్వాత వశపరచుకొనెను. 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.

నిర్మాణ వివరాలు

మార్చు

ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారాలు కలిగి ఉంది. కొండలు తక్కువ స్పర్‌ల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. కోట పశ్చిమ కొండపై ఉంది. ఇందులో రెండు భవనాలు ఉన్నాయి, ఒకటి ధాన్యాగారం కాగా, రెండోది గన్‌పౌడర్ నిల్వ. శిథిలమైన నరసింహ ఆలయం శిఖరం దగ్గర ఉంది. వ్యాయామశాల ఒకటి ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపైన " మురారీ రావు గద్దె" అనే ఒక చిన్న పెవిలియన్ ఉంది. ఇక్కడి నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మరాఠా జనరల్ మురారీ రావు ఇక్కడ చదరంగం ఆడేవాడు.[1]

దిగువ కోటలు ప్రాకారాల శ్రేణిని కలిగి ఉంటాయి, ఇవి గేట్‌వేల ద్వారా అనుసంధానించబడి బురుజులతో ఉంటాయి . వర్షపునీటిని ఆపి నిల్వచేయడానికి రాళ్ళ పగుళ్ళలో గుంటలు తవ్వి అనేక జలాశయాలు చేసారు.[1] కోట లోపల 108 బావులు తవ్వారు.[2]

కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి, వాటిలో ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధాగారాలూ ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి థామస్ మన్రో, జైళ్లుగా ఉపయోగించారు .[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Monuments in Anantpur". Archaeological Survey of India, Hyderabad Circle. Archived from the original on 2016-06-14. Retrieved 2016-11-10.
  2. "Historic Gooty fort in need of renovation". The Hindu. 2016-06-07.