అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు, చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు Map
అనంతపురం జిల్లా | |
---|---|
![]() | |
నిర్దేశాంకాలు: 14°42′N 77°35′E / 14.7°N 77.59°ECoordinates: 14°42′N 77°35′E / 14.7°N 77.59°E | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | రాయలసీమ |
ప్రధాన కార్యాలయం | అనంతపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 19,130 కి.మీ2 (7,390 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 40,83,315 |
• సాంద్రత | 213/కి.మీ2 (550/చ. మై.) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
అక్షరాస్యత | 64.28 (2001) |
పురుషుల అక్షరాస్యత | 74.09 |
స్త్రీల అక్షరాస్యత | 54.31 |
జాలస్థలి | అధికారక వెబ్సైట్ |
జిల్లా పేరు వెనుక చరిత్రసవరించు
అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది.
అనంతపురం జిల్లా ముఖ చిత్రంసవరించు
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
జిల్లా చరిత్రసవరించు
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.
తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారంనకు కాపలాగా ఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.
1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి,మదిగుబ్బ,నల్లమాడ,నంబులిపులికుంట,తలుపుల,నల్లచెరువు, ఓబులదేవరచెరువు,తనకల్లు,ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి.తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాల్, కణేకల్లు, బొమ్మనహళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.[1][2]
అనంతపురం జిల్లాలోని జైన క్షేత్రాలుసవరించు
- కొనకొండ్ల ఈ కొనకొండ్ల, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలానికి చెందిన గ్రామం. శాసనపరంగాను జినకధనం పరంగాను చూస్తే కుందకుందాచార్యుడు కొనకొండ్ల దాపున గల కొండపై నివసించినట్లు బోధపడుతున్నది. ఇంద్రనంది శృతావతారం పద్మనంది అనే జినగురువు ఇక్కడ నివచించినట్లు తెలుస్తున్నది. దీని అసలు పేరు కుంద కుంద పురం, కుందకుందాచార్యుని అసలు పేరు పద్మనంది అనియు అక్కడ లభించన శాసనాల వలన తెలుస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ జినావాశేషములన్నియు కొనకొండ్ల దాపునగల రససిద్ధుల గుట్టపై మనం ఇప్పటికీ చూడవచ్చును. ఇందులో కాయచ్చర్గ భంగిమ బాగా ప్రసిద్ధి చెందినది. నిటారుగా ఏ వంపులు లేకుండా నిలబడి రెండు చేతులను మోకాలివరకు తిన్నగా వ్రేలాడువేయు భంగిమను కాయచ్చర్గ భంగిమ అంటారు. జిన మతానుసారం ఋషభనాధుడు, నేమినాఢుడు, మహావీరుడు మినహా మిగిలిన 21 తీర్ధంకరులు ఈ భంగిమలోనే సిద్ధి పొందారు. ఇక్కడ సిద్దచక్రం చెక్కబడి ఉన్నది.
- రాయదుర్గం రాయదుర్గం అంటే రాజాగారికోట. ఈ కోటదాటి ఉత్తరదిశగా 1 కి.మీ. పయనిస్తే మనకు శిద్ధుల గుట్ట కావవస్తుంది. ఇది అసలు జినక్షేత్రం. ఇది యాపనీయ శాఖకు చెందినది.యాపనీయులు జైనమతాచారాలన్నిటినీ సరళంచేసి సామాన్య ప్రజలకు సైతం ఆచరణయోగ్యంగా చేసేవారు.అటువంటి యాపనీయ సంఘమునకు చెందిన జినక్షేత్రం ఇది.జినులు స్త్రీలను మోక్షానికి అనర్హులుగా యెంచి వారిని జైనమతంలో చేర్చుకొనకపోతే యాపనీయులు స్త్రీలుకూడా మోక్షానికి అర్హులేఅని స్త్రీలకు జైనమతంలో ప్రవేశం కల్పించిరి.
- కంబదూరు ఇది కల్యాణదుర్గంలో తాలూకాలోనిది.ఇక్కడ ఉన్న మల్లేశ్వరస్వామి దేవాలయం ఒకప్పటి జినాలయం. జైన వీరశైవ మత కలహాల తరుణంలో వీరశైవులు విజృంభించి ఇక్కడ ఉన్న జిన్నమతాన్ని ఛ్హిన్నాభిన్నం చేసిరి.అందుకే ఈ ఆలయంలో ఇంకా జినప్రతిమలు కనబడుతున్నవి.శిక్షరం పైన పరియం కాసానం (పద్మాసనం) లో ఉన్న జైనమునిని మనం చూడవచ్చును. ఇక్కడే ఉన్న అక్కమగుడి ఆలయాకృతినిబట్టి ఇదికూడా జినాలయం అని తెలియుచున్నది.
- అమరాపురం ఈగ్రామం బాలేందు మలధారి అనే జినగురువుచే ప్రభావితమైనది.ఇతడు మూలసంఘము, దేశీయగుణము, పుస్తక్ గుఛ్చ, ఇనగలి బలికి చెందిన జిన సంఘారామానికి గురువు.జైనమతంలో కూడా బౌద్ధమతంలో వలే అనేక సంఘారామశాఖలు కలవు. ప్రతి జినగురువును తెలిసేటప్పుడు ఆతని సంఘము, గుణము, గుఛ్ఛము విధిగా తెలుపవలెను.ఈ గ్రామం మొత్తం ఒకప్పటి జిన క్షేత్రం.
- పాతశివరాం ఇది మడకశిరా తాలూకాలో కలదు.ఇక్కడ లభించిన ఒక శిలాసానంలో ఇది ఒకప్పుడు పవిత్రమైన జినక్షేత్రంగాను, ప్రసిద్ధ జినగురువగు పద్మప్రభమలధారి దేవుని నివాసస్థలం.ఈ జినగురువు కుందకుందాచార్యుడు రచించిన నియమసారంపై వెలువడిన తత్పర్యవృత్తి గ్రంధకర్త.ఈతడు క్రీ.శ.12వ శతాబ్దానికి చెందినవాడు.
- రత్నగిరి ఇది విజయనగర రాజుల కాలంలో పరసిద్ధిగాంచిన జినక్షేత్రం. ఇచ్చట శాంతినాధుని దేవాలయం కలదు.ఇది చాలా పెద్దది.స్థానిక జైనులతో మరమ్మత్తులు చేయించుకొనబడినది.శాంతినాధుడు జైనుల 16వ తీర్ధంకరుడు.
- తాడిపత్రి క్రీ.శ. 12వ శతాబ్దంలో ఇది జైనుల క్షేత్రమని తెలియుచున్నది.క్రీ.శ.1198లో ఉదయాదిత్యుడనే సామంత ప్రభువు ఇచ్చటగల చంద్రనాధ పార్స్వనాధ జినాలయానికి భూమిదానమిచినట్లు ఇక్కడ ఒక శాసనం కలదు.
- తొగరకుంట క్రీ.శ. 11-12వ శతాబ్దంలో ఇది జైనుల చంద్రప్రభువు తీర్ధంకరుడి క్షేత్రమని తెలియుచున్నది. ఆరవ చాళుక్య విక్రమదిత్యుడు రాజ్యం చేస్తున్న తరుణంలో ఆతని సామంతరాజు ఇక్కడ జినాలయమునకు భూమిని దానం చేసినట్లు ఇక్కడ లభించిన శాసనం తెలుపుచున్నది.
- పెనుగొండ ఇది ప్రఖ్యాత జినక్షేత్రమని జినసారస్వతంలో కీర్తించబడినది.పైగా పెనుగొండ యావద్భారతంలో గల నాలుగు జినవిద్యాకేంద్రాలలో ఒకతిగా జిన కధన,ఉలు తెలుపుచున్నవి.మిగిలిన్ మూడు ఢిల్లీ, కొల్హాపూర్, జినకంచి.విజయనగర రాజుల పాలనలో కూడా పెనుగొండ జినక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అజితనాధుని, పార్స్వనాధుని బసదులను లేదా జినాలయములు ఇప్పటికీ తెలుయుచున్నవి.అజితనాధుడు రెండవ తీర్ధంకరుడు. ఏనుగు ఆతని లాంచనము.పార్స్వనాధుడు 23వ తీర్ధంకరుడు. ఇచట కల అజితనాధ దేవాల్యం దక్షిణ శిఖరం కలిగి ఉన్నది.అంటే హిందూ దేవాలయాల శిఖరాలను పోలిన శిఖరాకృతి. ఈ అజితనాధ జినాలయం శీఖరం మార్పు జైనమతం చివరి దశలో జరిగి ఉండవచ్చును.అదియును విజయనగర రాజులలోనే ఈ మార్పు జైరిగి ఉండవచ్చును.
భౌగోళిక స్వరూపంసవరించు
అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున వైఎస్ఆర్ జిల్లా,కడప, ఆగ్నేయమున చిత్తూరు జిల్లా, పశ్చిమాన, నైఋతిన కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మధ్యభాగంలో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగం ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలూరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురుస్తుంది. రాజస్థాన్ లోని జైసల్మేరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.
పరిశ్రమలుసవరించు
- యాడికి గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.
- జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. రామగిరి, శింగనమల, వజ్రకరూరు జిల్లాలోని కొన్ని ముఖ్య పవనవిద్యుత్కేంద్రాలు.
- పారిశ్రామికపరంగా తాడిపత్రి పట్టణంలో గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, ధర్మవరం పట్టు, జౌళి పరిశ్రమ బాగా ప్రసిద్ధి చెందినవి.
- జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
- సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ )
- పెన్నా సిమెంట్ (యాడికి)
- సాగర్ సిమెంట్ (యాడికి)
- సిఫ్లాన్ డ్రగ్స్
- ఎమ్ జి మెటాలిక్స్ అండ్ స్ప్రింగ్స్
- జ్యోతి హార్డ్‌వేర్
- మొనార్చ్ పైప్స్
- భాస్కర్ ఫర్టిలైజర్స్
- హేమ ఇండస్ట్రీస్
- రేణుక ఫర్టిలైజర్స్
- అమరన్ బ్యాటరీస్
- గాయత్రి మిల్క్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్
- కియా మోటార్స్)
- కియా మోటార్స్ అనుబంధ సంస్ధలు
- తాహ అయుర్వెద, అరాగనిక్ కంపని
రెవెన్యూ డివిజన్లు, మండలాలుసవరించు
భౌగోళికంగా జిల్లాను 5 రెవెన్యూ డివిజన్లుగాను,63 మండలాలుగా విభజించారు.[3]
రెవెన్యూ డివిజన్లుసవరించు
మండలాలుసవరించు
- డి.హిరేహాల్
- బొమ్మనహళ్
- విడపనకల్లు
- వజ్రకరూరు
- గుంతకల్లు
- గుత్తి
- పెద్దవడుగూరు
- యాడికి
- తాడిపత్రి
- పెద్దపప్పూరు
- శింగనమల
- పామిడి
- గార్లదిన్నె
- కూడేరు
- ఉరవకొండ
- బెళుగుప్ప
- కణేకల్లు
- రాయదుర్గం
- గుమ్మగట్ట
- బ్రహ్మసముద్రం
- శెట్టూరు
- కుందుర్పి
- కళ్యాణదుర్గం
- ఆత్మకూరు
- అనంతపురం
- బుక్కరాయసముద్రం
- నార్పల
- పుట్లూరు
- యల్లనూరు
- తాడిమర్రి
- బత్తలపల్లి
- రాప్తాడు
- కనగానపల్లి
- కంబదూరు
- రామగిరి
- చెన్నేకొత్తపల్లి
- ధర్మవరం
- ముదిగుబ్బ
- తలుపుల
- నంబులపూలకుంట
- తనకల్లు
- నల్లచెరువు
- గాండ్లపెంట
- కదిరి
- అమడగూరు
- ఓబులదేవరచెరువు
- నల్లమడ
- గోరంట్ల
- పుట్టపర్తి
- బుక్కపట్నం
- కొత్తచెరువు
- పెనుకొండ
- రొద్దం
- సోమందేపల్లె
- చిలమతూరు
- లేపాక్షి
- హిందూపురం
- పరిగి
- మడకశిర
- గుడిబండ
- అమరాపురం
- అగలి
- రొల్ల
రవాణా వ్యవస్థసవరించు
జాతీయ రహదారులు యన్.హెచ్. 44, యన్.హెచ్ 43, అనంతపురం గుండా పోతున్నాయి. అనంతపురం నుండి హైదరాబాదు, బెంగుళూరు,ముంబాయి, న్యూ ఢిల్లీ,అహ్మదాబాద్, ఆదోని, జైపూర్, భువనేశ్వర్, పూనా, విశాఖపట్నం, చెన్నై మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ గుంతకల్లు ఇదే జిల్లాలో ఉంది.ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురం నుండి గుంతకల్లు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా వివరాలుసవరించు
అనంతపురం జిల్లా ప్రస్తుతం కరువు జిల్లాగా ప్రసిద్ధి చెందినప్పటికీ రాయల వారి కాలంలో సకల సంపదలతో విరాజిల్లింది.
1981 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 25,47,721, స్త్రీ,పురుషుల నిష్పత్తి: 936:1000, అక్షరాస్యత, 27.08 శాతం.నాటి గ్రామాల సంఖ్య: 934. (*మూలం: ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1985.)
2011 నాటి జనాభా వివరాలుసవరించు
2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 4.083.315 .అనంతపురం జిల్లాలో 866 గ్రామాలు ఉన్నాయి. తెలుగు ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడతారు. 56,69% అక్షరాస్యత రేటు. ఉర్దూ, కన్నడ భాషలు ఈ జిల్లాలో 3 విస్తృతంగా మాట్లాడే భాషలు. ప్రధాన మతపరమైన సముదాయాలలో హిందువులు 32,25,156, ముస్లింలు 3,89,201, క్రైస్తవులు 20.770.భారత జనగణన శాఖ వారు 2011 లో ఈ జిల్లాకు ఇచ్చిన కోడ్ 553.
నైసర్గిక స్వరూపంసవరించు
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ భాగాన వ్యాపించి ఉంది. జిల్లా 14-40, 15-15 ఉత్తర అక్షాంశాలు, 76-50, 78-31 తూర్పు రేఖాంశాల మద్య విస్తరించి ఉంది.
ఆహారపు అలవాటుసవరించు
- రాగి సంకటి, జొన్నరొట్టె ఎక్కువగా తీసుకుంటారు
విద్యాసంస్థలుసవరించు
అనంతపురం లోని గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని 1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.
సంఖ్య | విద్యాసంస్థ | వివరణ | సంఖ్య |
1 | ప్రాథమిక పాఠశాలలు | ఆంగ్ల మాద్య పాఠశాలలు | 3 |
2 | హైస్కూల్స్ | ప్రభుత్వ, ప్రవేట్ హైస్కూపాఠశాల రెసిడెన్షియల్ | 7 |
3 | జూనియర్ కాలేజులు | బాలల, బాలబాలికల జూనియర్ | 3 |
4 | కళాశాలలు | ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు | 6 |
5 | ఉన్నతకళాశాలలు | ఎమ్ ఎస్ సి, పి జి, డిగ్రీ, పిజి కాలేజులు | 4 |
6 | విశ్వవిద్యాలయాలు | కేంద్ర, జవహర్లాల్ | 2 |
7 | మెడికల్ కాలేజీలు | ప్రభుత్వ మెడికల్ కాలేజ్ | 1 |
8 | ఫార్మసీ | రాఘవేంద్రా కాలేజ్ 1 | 1 |
9 | ఇంజనీరింగ్ కాలేజీలు | ఇంజనీరింగ్ కాలేజీలు | 4 |
10 | పోలీస్ ట్రైనింగ్ | పోలీస్ ట్రైనింగ్ | 1 |
11 | నర్సింగ్ | శ్రీ సాయీ నర్సింగ్ | 1 |
12 | ఇన్‌స్టిట్యూట్స్ | ఎజ్యుకేషనల్, టెక్నో డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ | 10 |
13 | టీచర్ ట్రైనింగ్ | సత్యసాయీ, లిటిల్ ఫ్లవర్ సంస్థలకు చెందినవి | 2 |
14 | ఫిజియోథెరఫీ | కస్తూర్భా ఫిజియోథెరఫీ | 1 |
పర్యాటక ఆకర్షణలుసవరించు
అనంతపురం జిల్లా లోని పర్యాటక ఆకర్షణల్లో
- పెద్దవడుగూరు మండలంలో కోటకొండ ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందినది.
- గుత్తి పట్టణంలో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి. తరచు పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధ కోటను సందర్శిస్తుంటారు.
- ఉరవకొండ పెన్న అహోబిళంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
- హెమావతి గుడి 8- 10 దశాబ్దమ్ లో కట్టారు. ఇది చాలా పెద్ద గుడి
- స్వాతంత్ర్యం వచ్చిన రోజులలో నిర్మించిన గడియారగోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది.
- లేపాక్షి ఆలయం (విజయనగరాజుల కాలంనాటి ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులకు ఆకర్షిస్తూ ఉంటుంది. లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు. సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీదతో నిలువెత్తు గాయకులు, నృత్యకారిణిల శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడి ఈ ఆలయం చూపరులను ఆకర్షిస్తూ మానసికోల్లాసము శక్తీ కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న నంది ప్రపంచ ప్రసిద్ధి చెందినది అలాగే అతి పెద్దది. (రాతితో చెక్కబడిన ఈ నంది శివుడికి వాహనము, ద్వారపాలకుడుగా ఉంటుంది) లేపాక్షి హిందూపూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- పుట్టపర్తిప్రశాంతి నిలయము (ఇది సత్యసాయి బాబా నివాసము. అలాగే సత్యసాయి చేత స్థాపించబడిన అనేక ఇన్‌స్టిట్యూట్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉన్నాయి).
- తిమ్మమ్మ మర్రిమాను (ఇది కదిరి సమీపంలో ఉన్న 5 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద మర్రిచెట్టు. 1989 గిన్నిస్ రికార్డిలో ఈ వృక్షం అతిపెద్ద వృక్షంగా నమోదు అయింది )
- తాడిపత్రిలో ఉన్న వెంకటేశ్వరాలయం, శివావిష్ణు ఆలయం. ఇది ఒక శిల్పకళావైభవం.
- గుంతకల్లు సమీపంలోని కాసపురంలో ఉన్న హనుమాన్ ఆలయం.
- తాడిపత్రికి 28కిలోమీటర్లదూరంలో ఉన్న బెలూం గుహలు (ప్రకృతి సిద్ధమైన గుహలు).
- కనంపల్లిలో గ్రామంలో ఉన్న శ్రీ నల్లమల స్వామి ఆలయం. ఇది అనంతపురం నుండి సుమారు 22 కిలోమీటర్లదూరంలో ఉంది.
- నీలంపల్లి గ్రామంలోఉన్న శ్రీ నాగలింగేశ్వరాలయం. ఇది సుమారు అనంతపురానికి 12 కిలోమీటర్లదూరంలో ఉంది.
- కదిరి సమీపంలో ఉన్న బట్రేపల్లి వాటర్ ఫాల్స్. ఇది కదిరి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాత దృశ్యం చూడవచ్చు.
- పెన్న అహోబిలంలో ఉన్న లక్ష్మీనారాయణాలయం. ఇది అనంతపురానికి 35 కిలోమీటర్లదూరంలో ఉంది.
- కదిరిలో ఉన్న శ్రీలక్ష్మీనారాయణాలయం ఈ ఆలయంలోని విగ్రహం స్వేదజలాలను స్రవిస్తూ ఉండడం ఒక ఆధ్యాత్మిక అద్భుతం.
- కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయం
- అనంతపురంలో కొండశిఖరం మీద ఆలయం ఉన్న ఒకేఒక కొండ దేవరకొండ.
- జాతీయరహదారి 7లో నగరశివార్లలో ఉన్న ఇస్కాన్ ఆలయం.
- అనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో కుడేరులో ఉన్న శివాలయం.
- అనంతపురానికి 20కిలోమీటర్లదూరంలో పంపనూరులో ఉన్న సుభ్రహ్మణ్యస్వామి ఆలయం.
- అనంతపురానికి 10కిలోమీటర్ల దూరంలో కందుకారు గ్రామంలో త్రవ్వకాలలో బయట పడిన పురాతనమైన శ్రీ శివాలయం.
- అనంతపురానికి 70కిలోమీటర్లదూరంలో అలాగే బెంగుళూరు విమానాశ్రయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండ (ఘనగిరి) హజారత్‌బాబా మసీదు (దర్గా), పెనుకొండ ప్రవేశంలో ఉన్న 14వ శతాబ్ధానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరుసు సమాధి, పెద్ద నరసింహస్వామి ఆలయం, కొండశిఖరం మీద ఉన్న కోనేరు, పచే పరస్వంతాలయం (ఇది ఒక పురాతన జైన ఆలయం), గగన్ మహాల్ (కృష్ణదేవరాయ వేసవి విడిది) మొదలైన ఈ అధ్యాత్మిక పట్టణంలో ఉన్నాయి.
- సోములదొడ్డి సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం.
- కల్యాణదుర్గ్లో ఉన్న శ్రీరామస్వామి ఆలయం.
- అనంతపురం జిల్లా చిల్లావారి పల్లిలో ఉన్న కటకోటేశ్వరాలయం.
- అనంతపురం జిల్లా బుదగవి పల్లెలో పురనకాల సూర్యదేవాలయము కలదు
- ఉరవకొండ సమీపంలో జారుట్ల రామపురంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం. ఈ ఆలయం అనంతపురం నుండి 65 కిలోమీటర్లు ఉరవకొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే పెన్న అహోబిలం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి దూరంగా ఉండే ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయానిని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ, పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది) వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది.
- గుంతకల్ మండలంలోని కలశాపురం (కసాపురం) గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్ఠిత వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది.
- పాతనగరంలో ఉన్న అనంతసాగర్ తీరాన ముసలమ్మ కట్ట నుండి ప్రబలంగా చెరువుకట్ట అని పిలువబడుతున్న గణేశ్ పార్క్ వద్ద ఉన్న వరుస ఆలయాలు.
- బెంగుళూరు రహదారిలో శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ లార్నింగ్ ఎదురుగా ఉన్న శ్రీ శృంగేరి ఆలయం. 1.8 ఎకరాల విస్తీర్ణంలో సుందర ప్రకృతి నేపథ్యంలో ఉన్న ఈ వరుస ఆలయాలు ప్రతిదినం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంటుంది.
- అనంతపురానికి 30 కిలోమీటర్ల దూరంలో పంపనూరులో ఉన్న స్వామి సుబ్రహ్మణ్యాలయం.
- అనంతపురానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లపురం కొండలు.
- అనంతపురానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న నసన కొట ముత్యాలమ్మ గుడి, వేంకటేశ్వర స్వామి ఆలయం.
- డీ.హిరేహల్ మండలంలోని మురడి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
- శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం, కంబదూరు
- ఫొటో గ్యాలరీ
క్రీడలుసవరించు
అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 లో ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.
ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురంలో ఉంది.
జిల్లా ప్రముఖులుసవరించు
- పూర్వ భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (రెండుమార్లు), లోక్‌సభ స్పీకరు (రెండుమార్లు), ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, నీలం సంజీవరెడ్డి.
- కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్‌సభ సభ్యుడు, తరిమెల నాగిరెడ్డి.
- పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు.
- తెలుగు సినీ దర్శకుడు కె. వి. రెడ్డి జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో జన్మించాడు.
- పారిశ్రామికవేత్త ఎన్.అరుణ్ రాజు s/o ఎన్.లక్ష్మినారాయణ అనంతపురం పట్టణంలో జన్మించాడు.
- మైక్రోసాఫ్ట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్య నాదెళ్ళ ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.
- జెసి దివాకర్ రెడ్డి
- ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ (సూరి)
- కెతిరెడ్డి సుర్య ప్రతప్ రెడ్డి,కెతిరెడ్డి పెద్దరెడ్డి కేతిరెడ్డి వెంకత్రమిరెడ్డి వీరి కుతుంబం చాలా యెల్ల నుండి తాడిపత్రి, యల్లనూర్ పుత్లుర్ మండలాలు ప్రతినిద్యం వహిస్తున్నరు వీరు తిమ్మంపల్లిలో నివాసం ఉంటున్నారు
వాతావరణంసవరించు
అనంతపురం సంవత్సరమంతా వేడి, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి, మే మాసానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37° సెల్సియస్ ఉంటుంది. అనంతపురంలో కేరళ నుండి వీచే నైరుతీ ఋతుపవనాల ద్వారా ముందుగానే వర్షాలు మొదలౌతాయి. సెప్టెంబరులో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు ఉంటుంది. నవంబరు చివరిలో ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెల్సియస్ ఉంటుంది. అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 560 మి.మీ.
స్వచ్ఛంద సేవా సంస్థలుసవరించు
ఒకప్పుడు పాడి పంటలతో కళకళ లాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో సతమతమౌతోంది. జిల్లాలో అధిక విస్తీర్ణం సాగు వర్షాధారం. ఇక్కడ వేరుసెనగ సాగు చేస్తారు.ఏళ్ళు గడచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు. ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ చాలా ఏళ్ళుగా కృషి చేస్తోంది.
మూలాలుసవరించు
- ↑ కలవటాల జయరామారావు (1928). "అనంతపురం జిల్లా చరిత్ర" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-01-02.
- ↑ కొమర్రాజు లక్ష్మణరావు, ed. (1934). ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం). వికీసోర్స్.
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో అనంతపురం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 7, 2007న సేకరించారు.
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైటులో ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to అనంతపురం జిల్లా. |