గురు నానక్ దేవ్ (Guru Nanak) 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ, ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) ని నమ్మతారు. సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్‌ తరువాత గురుపరంపర కొనసాగింది. ఐదవ గురువు అర్జున్‌, తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధలను సంకలనం చేసి ‘‘గురు గ్రంథ సాహిబ్‌’’ పవిత్రగ్రంథానికి రూపకల్పన చేశారు.

గురు నానక్
జననం1468
టాల్వెండి గ్రామం, పంజాబు, (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది)
వృత్తిఆధ్యాత్మిక గురువు
జీవిత భాగస్వామిసులక్ష్మి
తల్లిదండ్రులు
  • కాళుడు (కలూచంద్ ఖత్రీ) (తండ్రి)
  • తృప్తా దేవి (తల్లి)
A rare Tanjore style painting from the late 19th century depicting the ten Sikh Gurus. Nanak is in the centre

సిక్ఖు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ(1469–1539) తల్వాండీ గ్రామంలో (ప్రస్తుతం లాహోర్ సమీపంలోని నాన్కానా సాహెబ్) ఒక హిందూ కుటుంబంలో జన్మించారు.[1] ఆయన తండ్రి మెహతా కలు ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారీ. నానక్ తల్లి మాతా త్రిపుర, ఆయనకి బీబీ నాన్కీ అనే అక్క ఉన్నారు.

గురు నానక్ దేవ్ జీ చిన్నతనం నుంచీ ప్రశ్నించే, ఆలోచించే తత్త్వంతో ఉండేవారు. చిరువయసులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకన్నా భగవంతుని నిజ నామాన్ని హృదయంలో ధరిస్తాననీ, నూలుపోగులా అది తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం, తగలబడడం, పోవడం లేక అఖండంగా రక్షణను ఇస్తుందనీ వాదించారు. అత్యంత పిన్న వయసు నుంచీ బీబీ నాన్కీ తన తమ్ముడిలో భగవంతుని జ్యోతి చూడగలిగేవారు, కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమె గురు నానక్ దేవ్ జీ తొలి శిష్యురాలిగా పేరొందారు.

చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్త్వికతపై ఆకర్షితుడై, జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదలి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో నానక్ భారతదేశంలోని ముఖ్యులైన తాత్త్వికులు, బోధకులు కబీర్, రవిదాస్ (1440-1518)లను కలుసుకున్నారు. నానక్ బతాలాకు చెందిన వ్యాపారి మూల్ చంద్ చోనా కుమార్తె సులేఖ్నీని వివాహం చేసుకున్నారు, ఆయనకు శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు జన్మించారు.

ఆయన అక్క నాన్కీ భర్త, బావగారైన జైరాం నానక్ కు సుల్తాన్ పూర్ లో ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజరుగా ఉద్యోగమిప్పించారు. 28 సంవత్సరాల వయసులో ఒక ఉదయం గురు నానక్ దేవ్ సామాన్యంగా నదికి స్నానం చేసి, ధ్యానం చేసుకుందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మూడురోజుల పాటు ఎవరికి కనిపించకుండా పోయారు. తిరిగి వచ్చాకా ఆయన "దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను" అన్నారు. ఆయన తిరిగివచ్చాకా తొలి మాటల్లో ఒకటి: హిందువూ లేడు, ముస్లిమూ లేడు. ఈ మత సామరస్య బోధలతో ఆయన బోధలు వ్యాపింపజేయడం ప్రారంభించారు.[2] వేలాది కిలోమీటర్లను చుడుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ నాలుగు సుస్పష్టమైన ప్రధాన దిశల్లో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు, వీటినే ఉదాసీలు అని పిలుస్తారు.[1]

గురు నానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్ పూర్ లో జీవించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు గురు నానక్. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాకా 22 సెప్టెంబరు 1539లో 70వ ఏట మరణించారు.

ఇవి కూడా చూడండి మార్చు

గురునానక్ ఉపదేశాలు మార్చు

సత్యం, అహింసలతో కూడిన మార్గంలో నడవాలని గురునానక్ చాటిచెప్పారు, ఈయన బోధించిన కొన్ని ముఖ్య ఉపదేశాలు

  • ఓంకారంలా ఈశ్వరుడు ఒక్కడే. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. మనందరికీ ఆయనే తండ్రి. అందుకే అందరితో ప్రేమ పూర్వకంగా మెలగాలి.
  • మనలోని లోభ గుణాన్ని తరిమికొట్టి, కష్టించి పనిచేయాలి. న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని ఆర్జించాలి.
  • ఎప్పుడైనా, ఎవరి హక్కునైనా హరించడం తగదు. నీతిగా, నిజాయితీతో సంపాదన సాగిస్తూ, అర్హులను ఆదుకుంటుండాలి.
  • డబ్బు అనేది జేబు వరకు మాత్రమే ఉండాలి. అది మన హృదయాన్ని తాకుండా చూసుకోవాలి. అలా జరిగితే సమస్యలు చుట్టుముడతాయి.
  • మహిళలను గౌరవించాలి. స్త్రీ, పురుషులిద్దరూ సమానులే.
  • మానసిక వ్యాకులతను విడిచిపెట్టి, నిరంతరం కర్మను చేస్తుండాలి. నిత్యం ప్రసన్నంగా ఉండాలి.
  • బాహ్య ప్రపంచంలో గెలిచేముందు మనలోని దుర్గుణాలను తొలగించుకోవడం ఎంతో ముఖ్యం.
  • అహంకారమే మనుషులకు అతిపెద్ద శత్రువు. అందుకే ఎప్పుడూ అహంకారానికి లోనుకాకూడదు. వినయం, సేవాభావాలతో జీవితాన్ని గడపాలి.
  • ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటివారికి అందించాలి

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Singh, Khushwant (2006). The Illustrated History of the Sikhs. India: Oxford University Press. pp. 12–13. ISBN 0-19-567747-1. పురాతన్ జనమ్ సాఖీ (నానక్ జన్మ కథలు) ప్రకారం కూడా.
  2. Shackle, Christopher; Mandair, Arvind-Pal Singh (2005). Teachings of the Sikh Gurus: Selections from the Sikh Scriptures. United Kingdom: Routledge. pp. xiii–xiv. ISBN 0-415-26604-1.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.