గౌను
గౌను అనునది బాలికలు లేదా స్త్రీలు వేసుకొనే ఒక వస్త్రము. ఇది గొంతు వద్ద నుండి తొడల/మోకాళ్ళ/పిక్కల/పాదాల వరకు ఆచ్ఛాదననిస్తుంది. ప్రస్తుతము మహిళలు వాడుతున్న నైట్ డ్రెస్ కూడా ఒక రకమైన గౌనే.
గౌను అన్న పదం మధ్యయుగపు లాటిన్ పదం gunna (గున్న) నుండి వచ్చింది. ఇది ఐరోపా ఖండంలో మధ్యయుగపు ప్రారంభం నుండి 17వ శతాబ్దం వరకు స్త్రీలు, పురుషులు ధరించిన వదులుగా ఉండి, మోకాలు నుండి పాదాల వరకు పొడవున్న వెలుపలి ఆచ్ఛాదన. కొన్ని వృత్తులలో ఈ తరహా వస్త్రధారణ నేటికీ కొనసాగుతున్నది. కానీ ఆ తర్వాత గౌను అన్న పదం కాళ్ళ వరకు పూర్తి పొడవుండి, bodiceతో పాటు అతికిన స్కర్టు ఉన్న ఏ ఆచ్ఛాదణకైనా వర్తించడం కొనసాగింది. 18వ శతాబ్దంలో పురుషులు బన్యన్ (దీనికి నేటి బనియన్‌తో పోలిక లేదు) అనే ఒక పొడవాటి, వదులైన గౌను, సాధారణ కోటులాగా ఉపయోగించేవారు.
నేడు విద్యావేత్తలు, న్యాయమూర్తులు, క్రైస్తవ ఫాదరీలు ధరించే గౌన్లు, మధ్యయుగాలలో ఆయా వృత్తుల వారు ధరించిన సామాన్య రోజువారీ వస్త్రాల నుండి రూపుదిద్దుకొన్నవే. 16వ, 17వ శతాబ్దం కల్లా ఇవి ఒక యూనిఫాం రూపంలో వ్యవస్థీకరించబడినవి.
ఫార్మల్ గౌను
మార్చుస్త్రీల ఫ్యాషన్లో, ముఖ్యంగా ఆంగ్లంలో గౌను అనే పదం దాదాపు ఏకవస్త్ర ఆచ్ఛాదనలన్నింటికీ వర్తించబడింది. ముఖ్యంగా 18వ శతాబ్దం వరకూ పెట్టీకోటుతో సహా ధరించే వెలుపలి ఆచ్ఛాదనను గౌను అనటం సాధారణం. ఇది ఫ్రెంచి భాషలోని రోబ్‌తో సరిసమానమైనది. 18వ శతాబ్దం పూర్వభాగంలో పొట్టి గౌన్లు లేదా బెడ్ గౌన్లు వచ్చాయి.
విక్టోరియన్ కాలానికి ముందు, "డ్రెస్" అన్న పదం స్త్రీ, పురుషులిరువరి ఆచ్ఛాదణకు ఈవినింగ్ డ్రెస్, మార్నింగ్ డ్రెస్, ట్రావెలింగ్ డ్రెస్ మొదలైన పదప్రయోగాల్లో సాధారణ పరిభాషాపదంగా ప్రయోగించేవారు. ఈ పదం ఒక ప్రత్యేకమైన ఆఛ్ఛాదనను సూచించేది కాదు. అప్పట్లో స్త్రీలు ధరించే స్కర్టు లాంటి ఆచ్ఛాదనలను గౌను అనేవారు. 20వ శతాబ్దపు తొలినాళ్ళలోకి వచ్చేసరికి గౌను, ఫ్రాకు అన్న రెండు పదాలు డ్రెస్ అన్న పదంతో సమానార్ధాలైపోయాయి. కాకపోతే గౌను అన్న పదాన్ని ముఖ్యంగా ప్రత్యేక సందర్భాలలో ధరించే, భారమైన లేదా పొడవైన ఆచ్ఛాదనలకు ఉపయోగిస్తారు. ఫ్రాకు లేదా డ్రెస్ అన్న పదాలు తేలికవైన, పొట్టివైన, రోజువారీ ఆచ్ఛాదనలకు అన్వయిస్తారు. గత కొన్ని దశాబ్దాలలో అమెరికాలో గౌను అన్న పదం వాడుక తగ్గిపోయి, అర్ధాన్ని కోల్పోయి, దాని స్థానంలో డ్రెస్ అన్న పదం ప్రాచుర్యమైంది. ప్రస్త్రుతం గౌను అన్న పదాన్ని ఆ అర్ధంలో కేవలం బ్రిటీషు ఇంగ్లీషులోనూ, చారిత్రక దృష్టితోనూ లేదా కొన్ని ప్రత్యేక సందర్భపు ఆఛ్ఛాదనల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.