గ్లోబ్ వాల్వు

ద్రవాల యొక్క ప్రవాహాన్ని నిరోధించే లేదా నియంత్రించే పరికరం.

గ్లోబ్ వాల్వు అనేది ఒకపైపులో ప్రవహించు పదార్థాల (ద్రవం లేదా వాయువు, నీటిఆవిరి వంటివి) ప్రవాహాన్ని నిరోధించు లేదా ప్రవాహా పరిమాణాన్ని నియంత్రణలో వుంచు నియంత్రణ కవాటం. గ్లోబ్ వాల్వులు పీడనం కల్గిన ద్రవ, వాయువుల ప్రవాహాన్ని నియంత్రణలో పంపు నిర్మాణం వున్న పరికరాలు. కవాటాలు లేదా వాల్వులు నిర్మాణ వైవిధ్యం పరంగా పలురకాలు ఉన్నాయి. అందులో గ్లోబ్ వాల్వు ఒక రకం. దీనిని తెలుగులో గోళాకార కవాటం అంటారు. ఈ వాల్వు ప్రధాన నిర్మాణ భాగం అయిన బాడీ చూచుటకు ఆకృతిలో గోళాకారంగా వుండుట వలన దీనిని గ్లోబ్ వాల్వు అంటారు.గ్లోబ్ వాల్వులో ద్రవం లేదా వాయువు సరళ మార్గంలోనే ప్రవహించును.అనగా వాల్వు లోపలికి వెళ్ళు, బయటికి వచ్చు మార్గం ఒకే సరళ రేఖలో వుందును. గోళాకారంగా వున్న బాడీ అనే భాగంలోని నిలువురంధ్రం పైన వాలుసిటింగు లేదా వాల్వు డిస్కు అనే బిళ్ళ వంటి భాగం పైకి కిందికి కదులుతూ ద్రవ, వాయు ప్రవాహాలను నియంత్రించును. వాల్వు డిస్కు అనే భాగం వాల్వు సిటింగ్ రింగు అనే భాగం పై ఖాళి లేకుండా బిగింప బడినపుడు ద్రవం/ వాయువు ప్రవాహం పూర్తిగా నిలిచి పోవును. సీటింగు రింగు నుండి వాల్వు డిస్కు దూరం పెరుగు కొలది, పైపు/గొట్టం నుండి ప్రవహించు వాయువు, ద్రవం పరిమాణం పెరుగును.గొట్టంలో పదార్ధం ప్రవహించు దిశకు వ్యతిరేకంగా అనగా నిలువుగా /90°డిగ్రీల కోణంలో వాల్వు డిస్కు/కవాట బిళ్ళ పైకి కిందికి కదులును.

గ్లోబ్ వాల్వు అడ్దుకోత పటం
ఫ్లాంజిలున్న, క్యాస్ట్ స్టీలుతో చేసినగ్లోబ్ వాల్వు
ఎంగిల్ గ్లోబ్ వాల్వు
Y-రకం గ్లోబ్ వాల్వు

గ్లోబ్ వాల్వులోని ప్రధాన భాగాలుసవరించు

 • బాడీ (body) (ఆకృతి నిర్మాణం)
 • వాల్వు సిటింగు రింగు
 • వాల్వు/వాల్వు డిస్కు లేదా వాల్వు బిళ్ళ
 • బోనిట్ (కుళ్ళాయి వంటీ నిర్మాణం)
 • వాల్వు డిస్కు కాడ (stem)
 • గ్లాండ్
 • తిప్పు చేతి చక్రం.

బాడీ లేదా ఆకృతి నిర్మాణంసవరించు

బాడీ లేదా ఆకృతి నిర్మాణం అనేది వాల్వులో ప్రధాన భాగం.ఈ బాడీ ద్వారానే ద్రవం లేదా వాయువులు పయనించును.బాడీ రెండు వైపులకు సమాంతరంగా రంధ్రం వుండీ, మధ్య భాగంలో రంధ్రం నిలువుగా వుండి, దాని మీద వాల్వు బిళ్ళ వుండును.బాడీ రెండు వైపులకు సమాంతరంగా రంధ్రం వుండి, మధ్య భాగంలో రంధ్రం నిలువుగా వుండిదాని మీద వాల్వు బిళ్ళ వుండును.ఫ్లాంజి అనేది వర్తులారంగా మందంగా వుండును, ఫ్లాంజి అంచున బోల్టులు బిగించురంధ్రాలు వుండును.ఈఫ్లాంజిల ద్వారానే వాల్వును పైపు లేదా మరేదైనా పరికరానికి బిగిస్తారు.కొన్ని వాల్వు బాడీలకు ఫ్లాంజిల బదులు మరలు వుండును.ఈ మరలు వాల్వు బాడీ చివరి భాగాల లోపల వైపున వుండును.ఇలాంటి వాల్సులను, వెలుపలి ఉపరితలం మీద మరలున్న పైపులకు బిగిస్తారు.బాడీ పైభాగాన కూడా ఫ్లాంజి వంటి భాగం వుండును.దీనికి బోనిట్అనే భాగాన్ని బోల్టుల ద్వారా బిగిస్తారు. ½”నుండి 1 ½” అంగుళాల పరిమాణపు ఇత్తడి వాల్వులలో వాల్వు బాడీ పైభాగాన ఫ్లాంజి కాకుండా కొంత భాగం పైకి నిలువుగా వుండి దాని బయటి బాగాన మరలు వుండును.దీనికి బిగించు బోనిట్కుడా లోపలి వైపు మరలు కల్గివుండును.కాస్ట్ ఐరన్, కాస్ట్ స్టీలు లోహాలతో చేసిన వాల్వులైన బోనిట్ బిగించుటకు ఫ్లాంజి నిర్మాణం వుండును[1].

బోనిట్(bonnet)సవరించు

ఇది వాల్వు బాడీ నుండి పైపులో ప్రవహించు ద్రవం లేదా వాయువు వాల్వు డిస్కుకు వున్న కాడ సందునుండి బయటికి రాకుండా/ కారకుండా చేయును.అంతేకాదు బోనిట్ వాల్వు డిస్కుకు బిగించిన కాడ/stem పైకి కిందికి కదులుటకు సహాయ పడును.బోనిట్‌కు బాడీకి బిగించు భాగానికి పైన వాల్వు డిస్కు కాడ సైజుకు సరిపడా రంద్రం వుండును.ఈ రంధ్రంనుండి లోపలి ప్రవహించు పదార్ధం బయటికి కారకుండా ఆస్బెస్టాస్ తాడును కాడ చుట్టూ చుట్టి, గ్లాండు అను ఇత్తడి రింగుతో నట్టుతో గట్టిగా బిగిస్తారు. ఈ గ్లాండు ఆస్బెస్టాస్ రోపును బోనిట్, కాడ మధ్య ఖాళీలో బలంగా సందులేకుండా వుండేలా నొక్కి వుంచడం వలన లోపలి ద్రవం లేదా వాయువు బయటికి కారాదు. బోనిట్ కింది భాగాన ఫ్లాంజి వుండును.ఈ ఫ్లాంజిని వాల్వు బాడీకి బోల్టుల ద్వారా బిగిస్తారు.చిన్న వాల్వులైన ఫ్లాంజి బదులు బోనిట్ కింది లోపలి బాగాన మరలు వుండును. బోనిట్ కున్న గ్లాండు అనేది ఆస్బెస్టాస్ రోపును/తాడును బలంగా నొక్కి వుంచుటకు మరలు వున్న నట్ ( లోపల మరలువున్న పలకల ఉపరితలం వున్న బిళ్ళ) ఉపయోగిస్తారు. కాస్ట్ స్టీలు లేదా కాస్ట్ ఐరన్ తోచేసిన వాల్వు బోనిట్ పైభాగన మరలు వుండీ, వాల్వు డిస్కు కాడకు కూడా మరలు వుండును.

వాల్వు డిస్కు/బిళ్ళ లేదా ప్లగ్సవరించు

ఇది సాధారణంగా గుండ్రంగా బిళ్ళ ఆకారంలో, గుండ్రంగా వుండును.బిళ్ళ పైన కింద సమతలంగా వుండును.కిందికి రెండుఅంచులు కొద్ది వాలుకల్గి (Taper) గా వుండును. డిస్కు యొక్క అడుగు భాగాన్ని వాల్వు సిటింగు రింగుపైన బలంగా నొక్కి వుంచిన గొట్టంలో ప్రవహించు పదార్థం ప్రవాహం ఆగిపోవును.వాల్వు బిళ్ళ పైన ఒక లోహ కాడ (stem) వుండును.ఇది స్తూపాకారంగా వున్నకడ్డీ. కాడను అంగ్లంలో stem అంటారు. ఇది ఇత్తడి లేదా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.కాడ బలంగా డిస్కును నొక్కడం వలన వాల్వు రంధ్రాన్ని బిళ్ళ మూసి ఉంచును.కాడను పైకి లాగిన, కాడతో పాటు బిళ్ళ పైకి కదిలి రంధ్రం తెరచుకుని రంధ్రం ద్వారా ద్రవం లేదా వాయువు రెండో వైపు ప్రవహించును.వాల్వు బిళ్ళను ఇత్తడి లేదా స్టెయిన్ లెస్ స్టీలుతో చేస్తారు[2].

వాల్వు సిటింగు/సీట్(seat)సవరించు

వాల్వు బాడీ యొక్క లోపలి వెళ్ళు బయటికి వచ్చు మార్గాలు ఒకే సరళ మార్గంలో (ఒకే దిశలో) వుండగా, వాల్వు సిటింగు యొక్క రంధ్రం నిలువుగా వుండును.అనగా వాల్వు తెరచివున్నప్పుడు ప్రవాహం సరళంగా వచ్చి, సిటింగు రంధ్రం వలన నిలువు/అడ్డంగా పైకి వెళ్లి, అక్కడి నుండి బయటికి సరళ /నిలువు మార్గంలో నిర్గమించును. వాల్వు సిటింగు రంధ్రం అంచున ఇత్తడితో లేదా స్టీలుతో చేసిన నునుపైన ఉపరితలం వున్న రింగు (కంకణం వంటి తొడుగు) వుండును.ఈ రింగు మీదనే వాల్వు బిళ్ళ/బిళ్ళ కూర్చోనును[2].

కాడ(stem)సవరించు

ఇది వాల్వుడిస్కు లేదా బిళ్ళను పైకి కిందికి జరుపు ఉపకరణం.ఇది ఘనస్తూపాకార కడ్డీ.కాడను అంగ్లంలో stem అంటారు.ఇది ఇత్తడి లేదా స్టెయిన్ లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. కాడ కిందిచివరి భాగం వాల్వు బిళ్లకు బిగించబడి వుండును.వాల్వు డిస్కు/బిళ్ల కాడకు స్థిరంగా కాకుండా కొద్దిగా డిస్కు కదిలేలా బిగించబడి వుండును.కాడ పై చివర నలుపలకలగా వుండి, దానికి ఒక చక్రం వుండును.ఈ చక్రాన్ని తిప్పడం వలన కాడ అక్షాంకంగా గుండ్రంగా తిరుగును. కాడకు బోనిట్‌లో లోపలి గంలో మరలున్న ప్రాంతానికి సమానంగా కాడ ఉపరితలం భాగంలో మరలు వుండును.అనగా కాడ కదిలే బోల్టులా, బోనిట్ స్థిరంగావున్న నట్ (nut) లా పనిచేస్తాయి.కాడ చివరనున్న చక్రాన్ని తిప్పినపుడు కాడ గుండ్రంగా తిరిగి, బోనిట్ కున్న మరల కారణంగా కాడ పైకి, కందికి చలించును. ఆవిధంగా వాల్వు బిళ్ళ వాల్వు రంద్రాన్ని మూయడం తెరవడం చేస్తుంది[2].

గ్లాండు/గ్లాండ్(glad)సవరించు

బోనిట్‌లో కాడ పైకి, కిందికి రెండింటికి వున్న మరల వలన తిరుగును.ఈ మరల సందుల ద్వారా వాల్వులో ప్రవహించు పదార్ధం బయటకు కారకుండా నిరోధించునదే గ్లాండ్.ఇది ఇత్తడితో చేయబడిన, మధ్యలో రంధ్రంవున్న బుష్ వంటి ఆకృతి.లోపలి రంధ్రం కాడ వ్యాసం కన్న కొంచెం ఎక్కువగా వుండును.అనగా గ్లాండ్, కాడ మీద బిగుతుగా కదిలేలా వుండును. అలాగే గ్లాండ్ వెలుపలి వ్యాసం బోనిట్ యొక్క లోపలి వ్యాసానికి సమానంగా వుండును. కాడ చుట్టు బిగుతుగా అస్పాబెస్టాస్ తాడును చుట్టి ఈగ్లాండును తాడుపై బలంగా ఒక నట్ ద్వారా బిగిస్తారు.అందువలన ద్రవం లేదా వాయువు బయటికి కారదు.

చేతి చక్రంసవరించు

ఇది కాడ చివర బిగించివుండును.ఇది కాదను గుండ్రంగా తిప్పును. చక్రాన్ని సవ్యదిశలో (గడియారపు ముళ్ళు దిశ) తిప్పిన వాల్వు మూసుకోనును. అపసవ్యదిశలో తిప్పిన వాల్వు తెరచుకోనును.

వాల్వు తయారు చేయు లోహాలుసవరించు

గ్లోబ్ వాల్వులబాడీలను ఇత్తడి/కంచు, పోత ఇనుము, క్యాస్ట్‌ స్టీలు, స్టెయిన్‌లెస్ స్టీలు, కార్బను స్టీలులతో చేస్తారు. వాల్వు డిస్కులు/బిళ్లలను కంచు/ఇత్తడి, స్టెయిన్‌లెస్ స్టీలు, గ్రే కాస్ట్ ఐరన్‌తో చేస్తారు, ఇక కాడనుకంచు/ఇత్తడి, స్టెయిన్‌లెస్ స్టీలు, K metal (C3531) తో చేస్తారు.[3] ఇత్తడితో చేసిన వాల్వులు ఖరీదు ఎక్కువ మన్నిక వుండును.పోత ఇనుము చేసిన వాల్వులు తక్కువ ఖరీదులో లభించును. కాని కొంతకాలం వాడిన తరువాత పాడై పోవును.

పనిచేయు పీడనం-ఉష్ణోగతలుసవరించు

గ్లోబ్ వాల్వులు -272°C (-455°F) నుండి 540°C (1000°F) ఉష్ణోగ్రత వరకు పనిచేయును.[4] వాల్వులలో ప్రవహించు ద్రవాల లేదా వాయువుల ఉష్ణోగ్రతను బట్టి వాల్వులను అవి పంపిణి చేయు ద్రవాలు/వాయువుల ఉష్ణోగ్రత, పీడనం ఆధారంగా రకాలు #150 #300, #400, #600, #900 అని వర్గీకరించారు #అనే గుర్తు, క్లాస్ (class, పౌండ్స్, అనేవి అన్ని ఒకే అర్థం. క్లాస్ 150 అనేది 2.0Mpa సమానం .అలాగే క్లాస్ 300 అనేది 5.0Mpa కు, క్లాస్ 400 అనేది 6.3Mpa సమానం[5].1 PSI = 0.0069Mpa.

గ్లోబ్ వాల్వుల ఆకృతిలో తేడాలుసవరించు

గ్లోబ్ వాల్వులను ఆకృతి పరంగా ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించారు.

టి(T) ఆకృతి లేదా జెడ్(Z) ఆకృతి బాడీ గ్లోబ్ వాల్వుసవరించు

ఎక్కువగా టి లేదా Z ఆకృతి బాడీ వాల్వులను ప్రవాహ నియంత్రణలో వాడుతారు.ఇందులో ద్రవం లేదా వాయువు వాల్వులోకి ప్రవేశించు, బయటికి వెళ్ళు మార్గాలు ఒకే సరళరేఖ మార్గంగా వుండును.వాల్వు బాడీకి వాల్వు డిస్కును నియంత్రించేకాడ నిట్టనిలువుగా వుండి పైన చేతితో తిప్పు చక్రం ఉండటం వలన కాడ/ stem అంగ్ల అక్షరం T ని పోలి వుండటం వలన దీనిని టి (T) ఆకృతి వాల్వు అంటారు. ఈ రకపు వాల్వుల కొన్నింటి బాడీ రెండు అర్థభాగాలు కొద్ది వంపు కల్గి, బాడీ చూచుటకు ఆంగ్ల అక్షరం Z లా వుండటం వలన జెడ్ బాడీ గ్లోబ్ వాల్వు అంటారు.

కోణవిన్యాసం నమూనా/ ఏంగిల్ పేటర్న్(Angle Pattern) గ్లోబ్ వాల్వుసవరించు

ఏంగిల్ పేటర్న్ గ్లోబ్ వాల్వులో వాల్వు యొక్క రెండు ఫ్లాంజిలు (లోపలి వెళ్ళు దారి, బయటికి వచ్చు దారి) ఒకదానికి మొరొకటి 90°డిగ్రీల కోణంలో వుండటం వలన ఈ రకపు వాల్వులను Angle Pattern వాల్వులు అంటారు.

Y బాడీ ఆకృతి గ్లోబ్ వాల్వుసవరించు

ఈ రకపు గ్లోబ్ వాల్వులలో వాల్వు డిస్కు, వాల్వు సిటింగు బాడీకి 45°కోణం చేస్తూ వుండును.ఈ రకపు వాల్వులలో ప్రవహించు పదార్థాల పీడనంలో తగ్గుదల ఎక్కువగా వుండును

బయటి లింకుల వీడియోలుసవరించు

ఈ వ్యాసాలు కూడా చదవండిసవరించు

మూలాలు/ఆధారాలుసవరించు

 1. "valve Parts". pipingonline.com. Retrieved 2018-02-23.
 2. 2.0 2.1 2.2 "Introduction to valves - Globe valves". wermac.org. Archived from the original on 2017-08-07. Retrieved 2018-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. "Valve Materials". kitz.co.jp. Archived from the original on 2016-11-04. Retrieved 2018-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 4. "Typical Operating Temperatures". engineeringtoolbox.com. Archived from the original on 2017-08-09. Retrieved 2018-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 5. "HOW ANSI CLASS RELATES TO PSI". directmaterial.com. Retrieved 2018-02-23.