చదవడం
చదవడం లేదా పఠనం అనేది వ్రాయబడిన ఏదో దాని నుండి సమాచారం పొందే ఒక మార్గం. పఠనం అనేది ఒక భాషగా తయారు చేయబడిన చిహ్నములను గుర్తించడంతో కూడుకొని ఉంటుంది. పఠించడం, వినడం రెండూ సమాచారాన్ని పొందేందుకు ఉన్న అత్యంత సాధారణ మార్గాలు. పఠనం నుండి సమాచారం పొందేటప్పుడు ముఖ్యంగా కల్పన లేదా హాస్యం చదివేటప్పుడు వినోదం సహా ఉండొచ్చు. ప్రజల పఠనం ఎక్కువగా కాగితం ద్వారా జరుగుతుంది. రాతిపై చెక్కబడిన లేదా బ్లాక్ బోర్డుపై చాక్ ఫీసుతో లేదా తెల్లబోర్డుపై ఇంక్ తో వ్రాసిన వ్రాతనూ చదవవచ్చు. కంప్యూటర్ ప్రదర్శనలను చదవవచ్చు. ఎవరికి వారు చదువుకునేటప్పుడు మనసులో లేదా బిగ్గరగాను చదువుతారు. ఏదైనా విషయాన్ని చదివేటప్పుడు దాని అవసరాన్ని బట్టి ధ్యాస పెట్టి చదువుతారు. ఎక్కువ కాలం గుర్తుంచుకోవాల్సిన పెద్ద సమాచారాన్ని చదివేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులు మరింత ధ్యాసతో పలుమార్లు చదువుతుంటారు. విద్యార్థుల విధులలో చదవడం అనేది చాలా ముఖ్యమైనది. పాఠ్యాంశాలు బాగా చదివే విద్యార్థులు పరీక్షలలో తేలికగా ఉత్తీర్ణులవుతారు. విద్యార్థులు చదవడం ద్వారా గుర్తుపెట్టుకొనే విధానం రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి బట్టికొట్టడం, రెండు అర్థం చేసుకొని చదవడం. బట్టికొట్టడం ద్వారా గుర్తుంచుకోవడం కన్నా అర్థం చేసుకుంటూ చదవడం అనేది చాలా ఉత్తమమైనది. బట్టీకొట్టడం ద్వారా నేర్చుకున్నది చాలా తక్కువ సమయం గుర్తుంటుంది. అర్థం చేసుకొంటూ చదువుకున్నది చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. బట్టీకొట్టి చదవటం అనేది అప్పటికప్పుడు ఉపయోగపడుతుంది తప్ప మున్ముందు ఉపయోగపడదు. అదే అర్థం చేసుకొంటూ చదవడమనేది విద్యార్థులకు మున్ముందు మరింత ప్రయోజనాలను అందిస్తుంది.