చిట్టగాంగ్ ఆయుధశాల దాడి

చిట్టగాంగ్ ఆయుధశాల దాడి[1] (ఆంగ్లం:Chittagong armoury raid) - దీన్ని చిట్టగాంగ్ తిరుగుబాటు, అని కూడా పిలుస్తారు. ఇది 1930 ఏప్రిల్ 18న సూర్య సేన్ [2]నేతృత్వంలోని యోధులు భారత స్వాతంత్ర్యం కోసం బెంగాల్ ప్రెసిడెన్సీ ఆఫ్ బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లోని చిట్టగాంగ్ ఆయుధశాల పై దాడి చేసారు. ఈ చిట్టగాంగ్ సాయుధ పోరాటం ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ చేపట్టింది.[3]

ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ

మార్చు

ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులు, బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి సాయుధ తిరుగుబాట్లను ఎంచుకున్నారు. వారు 1916 ఐర్లాండ్‌లో జరిగిన ఈస్టర్ రైజింగ్ నుండి ప్రేరణ పొందారు. దీనికి సూర్య సేన్ నాయకత్వం వహించారు. వారు సోవియట్ రష్యాలోని కమ్యూనిస్టులచే సైద్ధాంతికంగా ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ సాయుధులలో చాలా మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. ఈ బృందంలో గణేష్ ఘోష్, లోకేనాథ్ బాల్, అంబికా చక్రవర్తి, హరిగోపాల్ బాల్ (టెగ్రా), అనంత సింగ్, ఆనంద్ ప్రసాద్ గుప్తా, త్రిపుర సేన్, బిలాష్ డే, బిధుభూషణ్ భట్టాచార్య, ప్రీతిలతా వడ్డేదార్, కల్పనా దత్తా, హిమాంగ్షు సేన్, బినోద్ బిహారీ చౌదరి, సుభోద్ రాయ్, మనోరంజన్ భట్టాచార్య.. మొదలగు వారు ఉన్నారు.[4]

ప్రణాళిక

మార్చు

సూర్య సేన్ చిట్టగాంగ్‌లోని రెండు ప్రధాన ఆయుధాగారాలను స్వాధీనం చేసుకుని తద్వారా టెలిగ్రాఫ్, టెలిఫోన్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి, యూరోపియన్ క్లబ్ సభ్యులను బందీలుగా పట్టుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. అదే సమయంలో రైలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాలను కూడా విధ్వంసం చేసి కలకత్తా నుండి చిట్టగాంగ్‌ను విడదీయాలన్నది ప్రణాళిక. తదుపరి తిరుగుబాట్ల కోసం డబ్బును సేకరించేందుకు చిట్టగాంగ్‌లోని ఇంపీరియల్ బ్యాంకులను దోచుకోవాలి. అలాగే జైలులో ఉన్న వివిధ విప్లవకారులను కూడా విడుదల చేయాలి.

1930 ఏప్రిల్ 18న రాత్రి 10 గంటలకు ప్రణాళిక అమలు చేసారు. దంపరాలోని పోలీస్ లైన్‌లో పోలీసు ఆయుధశాలను గణేష్ ఘోష్, ఇతర విప్లవకారుల బృందం స్వాధీనం చేసుకుంది. లోకేనాథ్ బాల్, మరో పది మంది వ్యక్తులతో కూడిన మరో బృందం సహాయక దళాల ఆయుధాగారాన్ని (ప్రస్తుతం  పాత సర్క్యూట్ హౌస్) స్వాధీనం చేసుకుంది. ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ, చిట్టగాంగ్ బ్రాంచ్ పేరుతో చేపట్టిన ఈ దాడిలో దాదాపు 65 మంది పాల్గొన్నారు. అయితే వారు మందుగుండు సామగ్రిని గుర్తించడంలో విఫలమయ్యారు కానీ టెలిఫోన్, టెలిగ్రాఫ్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలోనూ, రైళ్ళ రాకపోకలలో అంతరాయం కలిగించడంలోనూ విజయం సాధించారు.

సమూహంలోని దాదాపు 16 మంది పహర్తాలిలోని యూరోపియన్ క్లబ్ (ఇప్పుడు షాజహాన్ ఫీల్డ్ పక్కన ఉన్న రైల్వే కార్యాలయం), ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ రోజు గుడ్ ఫ్రైడే సెలవు దినం కావడంతో క్లబ్ సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముందుగానే యూరోపియన్లు ఈ దాడిని పసిగట్టి, విప్లవకారులు ఊహించని విధంగా  దళాలకు అలారం ద్వారా విషయం చేరవేసారు. ఆ దాడుల తర్వాత, విప్లవకారులు పోలీసు ఆయుధశాల వెలుపల గుమిగూడారు, అక్కడ సూర్య సేన్ సైనిక వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేసి, తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఆ తరువాత విప్లవకారులు తెల్లవారకముందే చిట్టగాంగ్ పట్టణాన్ని విడిచిపెట్టి, దాక్కోవడానికి సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతూ చిట్టగాంగ్ కొండ శ్రేణుల వైపు వెళ్ళారు.

గణేష్ ఘోష్, అనంత సింగ్, ఆనంద్ ప్రసాద్ గుప్తా, జీబోన్ ఘోషల్‌ సహా మరి కొంతమంది సభ్యులు ఫెని రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డా తప్పించుకోగలిగారు. తరువాత చందన్‌నగర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు.

విచారణ

మార్చు

దాడుల సమయంలో, ఆ తర్వాత అరెస్టు అయిన వారిని 1932 జనవరిలో సామూహికంగా తుది విచారణ జరిపి 1932 మార్చి 1న తీర్పు వెలువడింది. నిందితుల్లో 12 మందికి జీవిత ఖైదీ విధించబడింది. వీరిని అండమాన్‌కు తరలించారు. వీరిలో గణేష్ ఘోష్, లోకేనాథ్ బాల్, పదహారేళ్ల ఆనంద గుప్తా, ఆనంద్ ప్రసాద్ గుప్తా ఉన్నారు. ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన 32 మంది వ్యక్తులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

మూలాలు

మార్చు
  1. "70 years of Independence: How Communists kept pestering the British throughout the freedom struggle". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-18. Retrieved 2018-01-30.
  2. "Homage paid to Surya Sen on his 84th execution day". Dhaka Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-01-30.
  3. "India's former president Pranab Mukherjee starts Chittagong visit". bdnews24.com. Retrieved 2018-01-30.
  4. Chopra, P. N. "Who's Who of Indian Martyrs". Retrieved 7 December 2017.