1.వసుదేవుని తమ్ముఁడైన దేవభాగుని పెద్దకొడుకు. 2.చిత్రకేతుడు శూరసేనదేశపు రాజు. ఇతఁడు సంతానములేక ఉండి చిరకాలమునకు ఒక పుత్రుని పడసెను. ఆపుత్రుఁడు (తన మాఱుదల్లులు విషముపెట్టి చంపఁగా) బాల్యముననే చచ్చినందున చిత్రకేతుఁడు పుత్రశోకమును సహింపలేక కడు దుఃఖితుఁడై విలపించుచు ఉండెను. అప్పుడు నారదుఁడును అంగిరసుఁడును వచ్చి అతనికి జ్ఞానోపదేశము చేసిపోయిరి. అంతట అతఁడు తెలివిని ఒంది జ్ఞానవంతుఁడై దేహమును వదలి దేవత్వమును వహించి విద్యాధరాధిపతి అయి ఒకప్పుడు కైలాసమునకు పోయి అచ్చట పార్వతితో కూడుకొని ఉండు శివునిచూచి జగత్కర్తలు అయినవారు కూడ ఇట్లు మిథునరూపముగ ఉండురా అని పార్వతీదేవి వినునట్లు పలికెను. అందులకు ఆమె కోపించి అతనిని రాక్షసుఁడు అగునట్లు శపించెను. అంత అతఁడు వృత్రాసురుఁడుగ పుట్టి ఇంద్రుని చేత చంపఁబడి మోక్షమును పొందెను.