చెన్నకేశవాలయం (కారంపూడి)

చెన్నకేశవాలయం (కారంపూడి)

కారంపూడి చెన్నకేశవాలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించాడు. ఇది పల్నాడులో విశిష్టమైన దేవాలయం. చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఒకపక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. అందుకే ఈ గుడిని గురించి విశేషంగా చెప్పుకుంటారు. కారంపూడి వీరత్వానికి పెట్టింది పేరు. అందుకు తగ్గట్టుగానే, ఈ గుడిలో వీరావేశాన్ని పెంచి పోషించే ఆయుధాలు ఉన్నాయి. చెన్నకేశవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయం గర్భగృహం, అంతరాలయం, మండపం - మూడు భాగాలుగా ఉంటుంది. మండపంలో చెన్నకేశవుని వాహనం గరుత్మంతుడు, బ్రహ్మనాయుడి ఆయుధం కోతతం, బాలచంద్రుడి ఆయుధం సామంతం, కన్నమదాసు ఆయుధం భైరవ ఖడ్గం ఉంటాయి. ఇక గర్భగుడిలో చెన్నకేశవ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ చెన్నకేశవాలయం గుంటూరు జిల్లా పల్నాటి సీమ, కారంపూడి గ్రామంలో ఉంది. బ్రహ్మనాయుడి పేరు చెప్పగానే చాపకూడు గుర్తొస్తుంది. కులాల వ్యత్యాసం విపరీతంగా ఉండి, నిమ్న జాతులుగా పరిగణించే కొన్ని కులాలు అవమాన భారంతో కుంగిపోతున్న రోజుల్లో బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. అన్ని కులాలవారినీ ఒకదగ్గర కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టించాడు. కౌరవ, పాండవుల మహాభారత యుద్ధం మాదిరిగానే పల్నాటి యుద్ధం అన్నదమ్ముల మధ్య చెలరేగింది.అంతులేని కల్లోలాన్ని కలిగించి, అశాంతికి దారితీసిన పల్నాటి యుద్ధం జరిగింది ఈ కారంపూడిలోనే జరిగింది. ఆ యుద్ధ చిహ్నాలు ఆలయంలో కనిపిస్తాయి. చెన్నకేశవ స్వామినే కాకుండా ఈ ఆయుధాలను కూడా పూజిస్తారు.

మూలాలు

మార్చు