చైల్డ్ ఆశ్రం, గొల్లపాలెం

గొల్లపాళెం "ఛైల్డు ఆశ్రం" నెల్లూరుకు 22 కి. మీ దూరంలో, అల్లూరు వెళ్ళే మార్గంలో జమ్మిపాలెం సమీపంలో ఉంది. రాజుపాలెం మీదుగా గొల్లపాళెం చేరుకోవచ్చు. ఆశ్రమ నిర్వాహకులు రామచంద్ర శరత్ గత 30 ఏళ్లుగా ఆశ్రమాన్ని నడుపుతున్నారు. రామచంద్ర శరత్ నెల్లూరు సర్వోదయ కళాశాలలో బి.ఎస్.సి పూర్తిచేసిన ఏడే,1979 లో రైల్వే సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రైల్వేలో ఉద్యోగంలో చేరాడు. శరత్ తండ్రిగారు కూడా రైల్వే ఉద్యోగి, లోకో డ్రైవర్, బిట్రగుంట లోనే నివాసం.

ఉద్యోగంలో శరత్ కు తరచూ రైలు పెట్టెలో యాచిస్తూ అనాథ బాలలు తారసపడ్డారు. వారికోసం తను శరణాలయం ఏర్పాటు చేయడం, రైల్వే అధికారులు కూడా తన ఉద్యోగ బాధ్యతల్లో కొంత సడలింపు ఇచ్చి సమాజ సేవకు పరోక్షంగా ప్రోత్సాహం అందించడంతో అతను ఉత్సాహంగా సేవాభావం, అంకితభావంతో జీవితాన్ని ఈ సంఘ పరిత్యక్త బాలబాలికలకు అంకితం చేయడానికి పూనుకొన్నాడు. 2010లో స్వచ్ఛందంగా పదవీవిరమణ చేసి శరత్ పూర్తి సమయాన్ని ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తున్నాడు. తాను పూనుకొకపోతే ఇంతమంది నిరాశ్రయ బాలలు ఏమైపోయేవారో, నేరజీవితంలోకి వెళ్ళిపోయేవారేకదా!

శరత్ "ఛైల్డు ఆశ్రం"కు వచ్చిన శిశువులను మానసికంగా రీహేబిలిటేట్ చేయడం మొదటి బాధ్యతగా పెట్టుకొన్నాడు. కొందరు నిజంగానే అనాథలు, కొందరి పేరెంట్స్ జైళ్ళలో ఉన్నారు. కొందరి పేరెంట్స్ వివరాలు తెలియవు. పిల్లలంతా చట్టం ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీలద్వారా ఇక్కడికి చేరినవారు. పదహారు, పదిహేడేళ్ల బాలబాలికలు, మూడు నాలుగు ఏళ్ళ పసిపాపల వరకూ ఉన్నారు. ఇంతమంది పసివాళ్ళ మంచి చెడులు గమనించుకోను ఇద్దరు ఆయాలు ఉన్నారు. వంటావార్పుకు ఒకరో ఇద్దరో ఉన్నారు. పిల్లలు అన్ని పనులూ చేస్తారు. అందరూ శుభ్రంగా స్నానం చేసి మంచి వేసుకొని ఉంటారు.

ఆశ్రమంలో బాల బాలికలకు విడివిడిగా పాఠశాలలు, హాస్టళ్లు ఉన్నాయి. ఇక్కడ పదవతరగతి వరకు పాఠాలు చెబుతున్నారు. ఎవరి ఉత్సాహం శ్రద్ధను బట్టి వారు చదువుతారు.

ఆశ్రమంలో అందరూ వేకువనే లేచి, కాలకృత్యాలు, స్నానం పూర్తి చేసుకుని చదువుకు కూర్చుంటారు! 7.30కి ఫలహారం పెడతారు. తర్వాత ఎవరికి కేటాయించిన విధులు వారు నిర్వహిస్తారు. 9-30నుంచి 12-30వరకూ క్లాసులు, మధ్యాహ్న భోజనం తర్వాత 2 గంటలకు క్లాసులు. 4-30కి స్కూల్ అయిపోతుంది. సాయంత్రం అల్పాహారం తర్వాత వ్యాయామం, క్రీడలు ఉంటాయి. రాత్రి 8-30కి భోజనం తర్వాత ఎవరి ఇష్టం వారిది. అన్నీ పిల్లలే చూచుకొంటారట. టీచర్లు కూడా స్థానికులే.

శరత్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాడు, మంచీ చెడూ చూసుకొంటూ. అతని అంకితభావం, నిజాయితీ, సేవాభావం వల్ల ఎందరో ఉదార హృదయులు ఛైల్డు ఆశ్రమం సజావుగా సాగడానికి అండగా ఉన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులూ. ప్రభుత్వం పెద్ద వ్యాన్ ఆశ్రమ ఉపయోగం కోసం బహూకరించినట్లు తెలిసింది. శరత్ ఏకైక కుమార్తె ఉన్నత విద్యా వంతురాలు, వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు.

శరత్ కు ఆ పిల్లలు, ఆశ్రమమే లోకం. తనకు షుమారు 65 ఏళ్ళు. 2010 ప్రాంతంలో పదేళ్ళ సర్వీసు ఉండగానే స్వచ్ఛందంగా పదవీవిరమణ చేసి ఆశ్రమానికి అంకితం అయిపోయాడు.అతని తర్వాత ఆశ్రమం ఏమవుతుంది?

ఆశ్రమంలో పెరిగినవారిలో పోలీసు ఆఫీసర్లు, ఉద్యోగులు, సైంటిస్టులు అయిన చాలా మంది ఉన్నారు. కొందరు శరత్ బాధ్యత కొనసాగించడానికి తయారుగా ఉన్నారు.

ఆశ్రమం విద్యార్థులతో, బాలబలికలతో, మామిడి, టెంకాయ కానుగచెట్లతో కలకళలాడుతోంది. ఈ బాలల ఆశ్రమమే లేకపోతే ఎందరు చిన్నారులు నేరప్రవృత్తితో జీవిస్తూ బతుకులీడ్చేవారోకదా! ఈ గొప్ప సేవాకార్యక్రమాన్ని రామచంద్ర శరత్ అంకితభావంతో కొనసాగిస్తున్నారు.