జంట నగరాలు (పుస్తకం)

జంట నగరాలు నవల ప్రముఖ తమిళ నవలా రచయిత అశోక మిత్రన్ రచించిన "పదునెట్టువదు లక్షతగళు" నవలకు తెలుగు అనువాదం.

జంట నగరాలు
కృతికర్త: అశోక్ మిత్రన్
అనువాదకులు: జి.సి.జీవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ
విడుదల: 1994
అశోక మిత్రన్ రచించిన "పదునెట్టువదు లక్షతగళు" నవలకు తెలుగు అనువాదమే జంట నగరాలు (పుస్తకం)

రచన నేపథ్యం

మార్చు

తమిళ రచయిత అశోక మిత్రన్ చిన్నతనంలో సికిందరాబాద్ నగరంలో జీవించారు. నిజాం పాలన, వ్యతిరేక పోరాటం, భారతదేశ స్వాతంత్రం, పోలీసు చర్య వంటి పరిణామాలను సికిందరాబాద్ ప్రజల్లో ఒకనిగా ఆయన వీక్షించారు. 1947-48ల నాటి ఆ చారిత్రిక పరిణామాలను అనంతరం 30 సంవత్సారాలు గడిచాకా ఈ నవలగా మలిచారు. నవల తమిళ శీర్షికకు పద్దెనిమిదో అక్షాంశరేఖ అనే పేరును హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాల భౌగోళిక స్థితిగతులను సూచించేలా పెట్టారు అశోకమిత్రన్. అశోక మిత్రన్ ఈ నవలను తమిళంలో 1985లో రచించగా జి.సి.జీవి జంట నగరాలు గా అనువదించారు. జంట నగరాలు నవలను 1994లో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రథమ ముద్రణగా ప్రచురించారు. ఐ.ఎస్.బి.ఎన్. సంఖ్య 81-237-0739-8 కాగా, వెల రూ.34.

రచయిత గురించి

మార్చు

తమిళ సాహిత్యంలో ప్రఖ్యాతి పొందిన రచయిత అశోక మిత్రన్. ప్రత్యేక శైలిని, శిల్పాన్ని ఎంచుకుని విభిన్న ధోరణిలో రచన చేస్తున్న రచయితగా ఆయన పేరొందారు. నవల, కథానిక, నవలిక తదితర ప్రక్రియల్లో పలు రచనలు చేశారు. సినీరంగాన్ని నేపథ్యంగా తీసుకుని కరైంద నియళ్ గల్(కరిగిన నీడలు), పారిశ్రామికంగా పురోగమించిన మద్రాసు నగరంలో మంచినీళ్ళకు కరువు ఏర్పడడాన్ని(1960-70ల్లోనే) తన్నీర్(నీళ్ళు), హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన వల్ల ఇక్కట్లు, అనంతరం భారతదేశంలో సంస్థానం విలీనం నాటి స్థితిగతులు వంటివి పదినెట్టావదు అచ్చుక్కోడు(పద్దెనిమిదవ అక్షాంశ రేఖ) తదితర నవలలను రచించారు.[1]

ఇతివృత్తం

మార్చు

తమిళనాడు నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ కుటుంబంలోని అబ్బాయి చంద్రశేఖరం. మనోఫలకంపై అనుభవాల గుర్తులు పడే ప్రాయంలో హైదరాబాద్ నగరంలో చదువుతుంటాడు. అతని సహాధ్యాయులైన ముస్లిం విద్యార్థులు సంపన్నవర్గానికి చెందినవారు. తోటి తమిళ విద్యార్థులకన్నా ముస్లిం, క్రైస్తవ విద్యార్థులతోనే అతనికి స్నేహమూ, చనువూ ఎక్కువ. పాఠశాల దశను దాటి కళాశాల దశకు చేరుకున్నా అతనికి సాగుతున్న రాజకీయ పరిణామాలు అర్థం చేసుకునే పరిపక్వత రాదు. ఐనా హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలనే రాజకీయ ఉద్యమంలో భాగమవుతాడు. తనను ఆ ఉద్యమంలో చేరేందుకు ప్రోత్సహించిన మిత్రుడే ధైర్యం కోల్పోయి పరారి అవుతాడు. వీటన్నిటి వల్ల చంద్రశేఖరం అయోమయానికి లోనవుతాడు.
మహాత్మాగాంధీని కాల్చి చంపినప్పుడు చంద్రశేఖరం పొందిన ఆవేదన, దుఃఖం ఇతర మతస్తుల్లో కనిపించకపోవడాన్ని గమనించి తాను ఈ మహానగరంలో ఒంటరినేమోనని బాధపడతాడు. ఆపైన చారిత్రిక పరిణామాలు వేగం పుంజుకుంటాయి. యుద్ధవాతారవరణం ఏర్పడుతుంది(ఇదే సమయంలో జంటనగరాల ఆవలి హైదరాబాద్ రాజ్యమంతా యుద్ధకల్లోలంలో ఉంది). విలీనం, ఆ సమయంలో ముస్లిములపై ప్రతీకార దాడులు వంటివి కూడా చోటుచేసుకుంటాయి. ఇవన్నీ నవలలో చిత్రితమవుతాయి.[2]

మూలాలు

మార్చు
  1. తమిళ నవల - ఆధునిక ధోరణులు : పె.కో.సుందర్ రాజన్(చిట్టి)
  2. జంటనగరాలు:మూ.అశోక మిత్రన్, అ. జి.సి.జీవి:నేషనల్ బుక్ ట్రస్ట్ 1994 ముద్రణ