నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఆధీనంలో స్థాపించబడిన స్వతంత్ర సంస్థ. ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, పఠనాసక్తిని పెంపొందించడం కోసం 1957లో ప్రారంభమైంది.
దస్త్రం:NBT India logo.jpg | |
సంకేతాక్షరం | NBT |
---|---|
స్థాపన | ఆగస్టు 1, 1957 |
రకం | ప్రభుత్వ రంగ సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | వసంత్ కుంజ్, న్యూఢిల్లీ |
సేవా ప్రాంతాలు | India |
అధికారిక భాష | English, Hindi |
Chairman | గోవింద్ ప్రసాద్ శర్మ |
Publication | NBT Newsletter |
మాతృ సంస్థ | Ministry of Education, Govt. of India |
చరిత్ర
మార్చు1957లో స్థాపించబడిన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా 2007లో స్వర్ణజయంతిని జరుపుకుంది. న్యూఢిల్లీ వసంత్ కుంజ్ లోని ఎన్.బి.టి. నూతన భవనం నెహ్రూ భవన్లో తన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెక్టారు విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన భవన సముదాయంలో కార్యాలయ విభాగం, శాశ్వత పుస్తక ప్రదర్శన విభాగం, గోదాము, నివాస సముదాయాలు ఉన్నాయి.
కార్యకలాపాలు
మార్చునేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా కార్యకలాపాలు స్థూలంగా ఐదు విభాగాలుగా ఉన్నాయి. అవి:
- ప్రచురణ
- పఠనాసక్తిని ప్రోత్సహించడం
- భారతీయ గ్రంథాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పించడం
- రచయితలకు, ప్రకాశకులకు ఆర్థిక సహకారం అందించడం
- బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించడం
ప్రచురణ
మార్చుకొత్తగా అక్షరాస్యులైన వయోజనులు, పిల్లలతో సహా సమాజంలో అన్ని వర్గాల వారికి వినోదం, విజ్ఞానం, వికాసం కలిగించే గ్రంథాలను ప్రచురించడం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురణల విభాగం లక్ష్యం. కథాసాహిత్యం, ఇతర సాహిత్యాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీలతోపాటు 16 భాషలలో గ్రంథాలను ప్రచురిస్తున్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో అనుబంధంలో చేర్చిన భాషలన్నిటిలో పుస్తక ప్రచురణలు చేపట్టారు. ఇవేకాక ఆవో, గారో, ఖాసీ, మిసింగ్, మిజో మొదలైన ఆదివాసీ భాషలలో కూడా ప్రయోగాత్మకంగా ప్రచురణలు చేపట్టారు.
ప్రాముఖ్యత కలిగివున్నా, భారతసాహిత్యంలో నిర్లక్ష్యానికి గురైన పాపులర్ సైన్స్ పుస్తకాలు, సాంకేతిక పరిభాష లేని సమాచార గ్రంథాలు, పర్యావరణ విజ్ఞాన గ్రంథాలు, దేశంలోని వివిధ విషయాలకు చెందిన పుస్తకాల ప్రచురణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ భాషల్లోని మౌలిక గ్రంథాలు, అనువాదాలు, ఉత్తమ గ్రంథాల పునర్ముదణలు కూడా చేస్తున్నారు.
సాహిత్య అకాడెమీ పురస్కారాలు, జ్ఞానపీఠ్ పురస్కారాలు పొందిన ఉత్తమ గ్రంథాలను, ఇతర క్లాసిక్ పుస్తకాలను ఎంపికచేసుకుని అన్ని భాషల్లోకీ అనువాదాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుని గతంలో అంతర భారతీయ గ్రంథమాల, ప్రస్తుతం ఆదాన్ ప్రదాన్ పథకాలుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 32 భాషల్లో 17వేలకు పైగా పుస్తకాలు ప్రచురించారు.[1] భారతదేశానికి సంబంధించిన పలు అంశాలను సవివరంగా భారత పాఠకులకు అందించడమే లక్ష్యంగా భారతదేశం-ప్రజలు అనే శీర్షికతో పుస్తకాలు ప్రచురించారు.[2]
పఠనాసక్తికి ప్రోత్సాహం
మార్చుదేశమంతటా పుస్తక మేళాలను, ప్రదర్శనలను ఏర్పాటుచేయడం ద్వారా గ్రంథాలను, గ్రంథ పఠనాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ ప్రచురణ సంస్థల వారు ప్రచురించిన పుస్తకాలను కూడా ఎంపికచేసి వాటికి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొత్తగా అక్షరాస్యులైన పాఠకులకు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. రెండేళ్ళకొకమారు ట్రస్టు ద్వారా విశ్వ పుస్తక వేదికను న్యూఢిల్లీలో ఏర్పాటుచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అతి పెద్ద పుస్తక మేళాగా ఖ్యాతిపొందిన ఈ విశ్వపుస్తక ప్రదర్శనను 1972లో ప్రారంభించారు. తాజాగా 2013 ఫిబ్రవరి-మార్చి నెలల్లో 20వ విశ్వ పుస్తక ప్రదర్శన నిర్వహించారు.
పుస్తక మహోత్సవాలు
మార్చుట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ స్థాయిలో ఏటా పుస్తక మేళాలు, పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జాతీయ పుస్తక మేళాలు అహ్మదాబాద్, ఇండోర్, కోల్ కతా, చెన్నై, చండీఘర్, జైపూర్, తిరువనంతపురం, నాగపూర్, లక్నో, న్యూఢిల్లీ, బెంగళూరు, పాట్నా, భోపాల్, ముంబై, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించారు. ఇవే కాక బాలల పుస్తక మేళాలు, ప్రాంతీయ పుస్తక మేళాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఏటా నవంబరు 14 నుంచి 20 వరకు ఎన్.బి.టి. చొరవతో జాతీయ పుస్తక వారోత్సవాలు విద్యాసంస్థలు, ప్రచురణ సంస్థలు, సాహిత్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా చేస్తున్నారు.
పుస్తక ప్రచురణలో శిక్షణా తరగతులు
మార్చుపుస్తక పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసేలా ప్రచురణ వ్యాపార పరిచయం చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రచురణ, విక్రయశాలల్లో పనిచేస్తున్న వారు, ప్రతిభావంతులైన యువకుల కోసం నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని ట్రస్టు డిల్లీలో చేసేవారు. 1996 నుంచి భారతదేశంలోని 12 నగరాల్లో కూడా నిర్వహించడం ప్రారంభించారు.
నే.బు.ట్ర. బుక్ క్లబ్
మార్చుపుస్తకాలు తరచు కొనుగోలు చేసేవారిని ప్రోత్సహించేందుకు నే.బు.ట్ర.బుక్ క్లబ్ నిర్వహిస్తున్నారు.
విదేశాల్లో భారతీయ గ్రంథాల ప్రచారం
మార్చువిదేశాల్లో భారతీయ సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసం అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనల్లో పాల్గొని ప్రదర్శిస్తున్నారు. అనేకమంది భారతీయ ప్రచురణ కర్తలు ప్రచురించిన వాటిలో ఎంపికచేసిన గ్రంథాల ప్రదర్శనలను, విదేశాల్లో మరీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 1970 నుంచి ఇప్పటివరకూ 350కి పైగా అంతర్జాతీయ పుస్తకాల పండుగల్లో పాల్గొన్నారు. ఏటా ఫ్రాంక్ ఫర్డ్, బొలానా, జింబాబ్వే, టోక్యో, కొలంబో, బాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్, మనీలా, కరాచీ మొదలైన అంతర్జాతీయ పుస్తక మేళాల్లో పాల్గొంటున్నారు. యునెస్కో, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంఘం 2003-04 సంవత్సరంలో ఢిల్లీని విశ్వపుస్తక రాజధానిగా ఎంపికచేసి గౌరవించారు. అలెగ్జాండ్రియా, మాడ్రియో నగరాల తర్వాత మూడో స్థానాన్ని ఢిల్లీ దక్కించుకుంది. 2006లో ఫ్రాంక్ ఫర్డ్ పుస్తక ప్రదర్శనలో భారతదేశాన్ని ఆతిథ్యదేశంగా ఎన్నికచేశారు. నేబుట్ర ఈ గౌరవాలు దేశానికి లభించేందుకు తన వంతు కృషి చేసింది.
రచయితలు, ప్రచురణకర్తలకు ఆర్థిక సహాయం
మార్చుఉన్నత విద్యాభ్యాసానికి ఉపయోగపడే గ్రంథాలను ప్రచురించి సరైన ధరలకు పాఠకులకు అందించడాన్ని ప్రోత్సహించడం కోసం పాఠ్యపుస్తకాలకు, రిఫరెన్స్ పుస్తకాల రచయితలకు, ప్రచురణకర్తలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఉత్తమ గ్రంథాల ప్రచురణకు సబ్సిడీ పథకం ఇస్తున్నారు. ఈ ప్రణాళిక కింద 900కు పైగా గ్రంథాలను ప్రచురించారు. ఇవన్నీ దాదాపుగా ఆంగ్ల పుస్తకాలే కావడంతో ఇకపై భారతీయ భాషల్లో కూడా ప్రచురించనున్నారు.
బాలసాహిత్య ప్రచురణకు ప్రోత్సాహం
మార్చునే.బు.ట్ర. ద్వారా దేశభాషలలోని బాల సాహిత్య ప్రచురణలకు అన్ని విధాలుగా తోడ్పడే బాల సాహిత్య జాతీయ కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ లిటరేచర్) పేరుతో ప్రత్యేక వ్యవస్థన ఏర్పాటు చేశారు. బాలల సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయం, దానికై జాబితాల తయారీకి ఏర్పాట్లు చేయడంతోపాటు ఈ కేంద్రం కార్యాలయాలు, పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంది.