జమీల్యా చింగిజ్ ఐత్‌మాతొవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన నవల . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది. సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ నాటి సమిష్టి వ్యవసాయ సంస్కృతి (collective farming culture) నేపథ్యంలో సమకాలీన గిరిజన సంస్కృతి జీవితాలను ప్రతిబింబించే ఒక మనోహరమైన ప్రేమ కథ ఇది. ఫ్రెంచ్ రచయిత లూయిస్ అరగోన్ ఈ నవలని "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమకథ" గా ప్రశంసించారు.[1] 1958 లో కిర్గిజ్ భాషలోనూ, రష్యన్ భాషలోను, వెలువడిన ఈ చిన్న నవల ప్రపంచ ప్రఖ్యాతి పొంది, పలు భాషలలోకి అనువదించబడింది. జమీల్యా నవలా రచనతో చింగిజ్ ఐత్‌మాతొవ్ ప్రపంచ సాహితీ జగత్తులో సుస్థిరమైన స్థానం పొందాడు.

రచయిత విశేషాలు

మార్చు
 
రచయిత చింగిజ్ ఐత్‌మాతొవ్

చింగిజ్ ఐత్‌మాతొవ్ 1928 లో కిర్గిజిస్తాన్ లో ముస్లిం గిరిజన సంచార జాతుల కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇరువురూ ఉపాధ్యాయులు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు. చింగిజ్ ఐత్‌మాతొవ్‌కు తొమ్మిదేళ్ల ప్రాయంలో అతని తండ్రి తొరెకూల్ ఐత్‌మాతొవ్‌ని స్టాలినిస్ట్ ప్రక్షాళనలో భాగంగా అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా చంపివేసారు. ఆ విషాద ఘటన ఒక పీడకలగా ఇతని జీవితమంతా వెంటాడి వేధించింది. ఆ విషాదంలో నుండి వెలువడిన రచయితగా ఐత్‌మాతొవ్ సోవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలను నిష్కర్షగానే అయినప్పటికీ ఆలోచనాత్మకంగా ప్రతిబింబించాడు.

నిజానికి జమీల్యా అతని మొదటి కథా రచన కాదు. ఇతని మునుపటి కథలు స్థానిక కిర్గిజ్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అయితే సోవియట్‌లో అతనికి అత్యంత గుర్తింపు తెచ్చిన తొలి రచన జమీల్యా. 1958 లో ప్రచురించబడిన జమీల్యా నవల, రచయితగా చింగిజ్ ఐత్‌మాతొవ్‌కు ఎనలేని కీర్తిని, అనేక పురస్కారాలను సాధించిపెట్టింది. దీని ఫ్రెంచ్ అనువాదంతో ఐత్‌మాతొవ్ ప్రతిభను యావత్ ప్రపంచం గుర్తించింది.

ది ఫస్ట్ టీచర్ (1962), టేల్స్ అఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్పీస్ (1963), ఫేర్ వెల్ (1966), గైలుసారే (1966) మొదలైనవి ఐత్‌మాతొవ్ ఇతర ముఖ్య రచనలు. 1963లో లెనిన్ ప్రైజ్, హీరో అఫ్ ది సోషలిస్ట్ లేబర్, యూరోపియన్ సాహిత్యానికి ఆస్ట్రియన్ స్టేట్ ప్రైజ్ వంటి అనేకానేక పురస్కారాలు అందుకొన్నాడు. రాజకీయంగా ఉన్నతశిఖరాలు అధిరోహించాడు. 1989లో కాంగ్రెస్ అఫ్ ది పీపుల్స్ డిప్యూటీస్ లో సభ్యుడిగా, శాశ్వత పార్లమెంటరీ కమిషన్ అధినేతగా, నాటి సోవియట్ అధ్యక్షుడు గోర్బచెవ్‌కు సలహాదారునిగా మెలిగాడు. 1991లో కిర్గిజిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక యురోపియన్ దేశాలకు (ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్) మాత్రమే కాక యురోపియన్ యూనియన్, యునెస్కో, నాటో వంటి సంస్థలకు సైతం కిర్గిజ్ రాయబారిగా వ్యవహరించాడు. 2008 లో జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో మరణించాడు.

నవలా నేపధ్యం

మార్చు

ఈ నవలలోని కథ సుమారుగా 1940-45 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో కిర్గిజిస్థాన్‌లో జరిగింది. కథలోని ఆధారాలను బట్టి ఇది వాయువ్య కిర్గిజిస్థాన్ ప్రాంతంలో కుర్కురోవ్ గ్రామంలొ జరిగివుండవచ్చు.

కిర్గిజిస్థాన్ మధ్యఆసియాలోని ఒక దేశం. ఇక్కడి ప్రజలు కిర్గిజ్ జాతికి చెందిన గిరిజన ముస్లింలు. ఈ సంచార జాతుల సమాజంలో మొదటి నుంచి సనాతన సంప్రదాయాలతో పాటు, పితృస్వామ్య భావజాలాలు ప్రబలంగా ఉండేవి. అయితే 1924 లో కిర్గిజిస్థాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ లో ఒక రిపబ్లిక్‌గా మారిపోయినపుడు ఆ సమాజంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఏర్పడిన సోవియట్ యూనియన్ ప్రభుత్వం, కిర్గిజ్ ప్రాంతంలో స్త్రీ విద్యను ప్రోత్సహించడమే కాక, ఆ రిపబ్లిక్‌లో సమిష్టి వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధిని చేపట్టింది. పారిశ్రామికీకరణను వేగంగా అమలుచేసింది. ఫలితంగా కిర్గిజ్ ప్రజలు ముఖ్యంగా అప్పటివరకు సనాతన కుటుంబ సంస్కృతులతో పెనవేసుకున్న గిరిజన ప్రజలు, కొత్తగా ప్రవేశపెట్టబడిన సాంఘిక వ్యవస్థలకు అలవాటుపడటమే కాకుండా, ఆధునిక మార్పులకు అనివార్యంగా లోనవడం జరిగింది. కిర్గిజ్ ప్రజలు, దానితో అప్పటివరకు అనుసరించిన సంప్రదాయ విశ్వాసాలకు, సోషలిజం యొక్క కొత్త భావజాలానికి మధ్య వారు మానసిక సంఘర్షణతో నలిగిపొయారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన స్త్రీ విద్య, సనాతన సంప్రదాయాలలో మగ్గిపోయిన కిర్గిజ్ మహిళలకు సంప్రదాయ సంకెళ్లను ఛేదించుకొని బయటపడటానికి, వారికి నచ్చిన జీవితంలో కొత్త దారులలో పయనించడానికి సహకరించింది. ఇటువంటి నేపథ్యంలో నాటి సనాతన కుటుంబంలో నుండి వచ్చిన నిజాయితీ, ధైర్యంగల జమీల్యా అనే స్త్రీ తనకు దక్కిన వైవాహిక జీవితాన్ని కాదని, నచ్చిన కొత్త జీవితాన్ని అందుకోవడానికి ముందడుగు వేయడం ప్రధానంగా చిత్రించబడింది.

నవల ఇతివృత్తం

మార్చు
 

ఐత్‌మాతొవ్ ఈ నవలలో ఒక చిన్న పిల్లవాడి స్వరం ద్వారా కథను ఆసాంతం నడిపిస్తాడు.

రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా రష్యా-జర్మనీల మధ్య యుద్ధం (ది గ్రేట్ పేట్రియాటిక్ వార్) ముమ్మరంగా కొనసాగుతున్న కాలం అది. దేశ రక్షణకై నిర్బంధంగా సైన్యంలోకి తరలించబడిన రష్యన్ యువకులలో, కిర్గిజ్ ప్రాంతానికి చెందిన సాదిక్ ఒకడు. సైన్యంలో చేరాల్సిందిగా పిలుపు రావడంతో పెళ్ళైన నాలుగు నెలలకే సాదిక్ అనివార్యంగా యుద్ధరంగానికి పోవలసి వస్తుంది. అలా పోతూ తన భార్య జమీల్యాను కుర్కురోవ్ గ్రామంలో వున్న తన ఉమ్మడికుటుంబంలో వదిలి వెళ్ళిపోతాడు. సనాతన సంప్రదాయాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబంలో వున్న సభ్యులందరు అహర్నిశం కష్టపడుతూ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తుంటారు. ఒకవైపు పంటను పండించడం, అలా పండిన ధాన్యాన్ని సైన్యానికి సరఫరా చేయడం కోసం సమీప పట్టణంలోని రైల్వే స్టేషన్ యార్డ్‌కు తోలుకెళుతూ గడపడంలోనే వారికి కాలం గడచిపోతూ ఉంటుంది.

అటువంటి సాంప్రదాయిక ఉమ్మడికుటుంబంలో అడుగుపెట్టిన జమీల్యాకు దుడుకుతనం, మంకుపట్టు ఉన్నప్పటికీ నిజాయితీగా, నిష్కపటంగా వర్తించే స్వభావం కలది. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పాటు అందరితో సరదాగా కలుపుగోలుతనంతో వుండే జమీల్యాకు అత్తింట్లో చిట్టి మరిది సీట్ చేదోడు వాదోడుగా నిలుస్తాడు. కుటుంబ సంప్రదాయాలను అమితంగా గౌరవించే సాదిక్, తన భార్య జమీల్యా పట్ల ప్రేమను వ్యక్టం చేయడంకన్నా ఆమెను తన సొత్తులా భావించే మనస్తత్వం కలిగివుంటాడు. యుద్ధభూమి నుండి భర్త రాసిన ఉత్తరాలలో కూడా కనీసం ప్రేమాస్పదమైన పిలుపు కూడా నోచుకోని వైవాహిక జీవితం ఆమెది. అందుకే అత్తింట ఆదరాభిమానాలతో ఉల్లాసంగా గడిచిపోతున్నప్పటికీ ఆమెకు జీవితం ప్రేమ రాహిత్యంగానే గడిచిపోతుంది.

ఇది ఇలా ఉండగా యుద్ధంలో కాలుకి గాయమవడంతో సైన్యం నుండి తిరిగి వచ్చేసిన ధనియార్ ఒక అనాథగా తన స్వగ్రామానికి చేరుకొంటాడు. సహజంగానే మితభాషి అయిన ధనియార్ ఆ గ్రామంలోని ప్రజలతో అంతగా కలివిడిగా వుండలేడు. కానీ పని పట్ల అంకితభావం వున్నవాడు. సమిష్టిక్షేత్రంలో పండించిన గోధుమ ధాన్యాన్ని సమీప పట్టణం లోని రైల్వే స్టేషన్‌కు తరలించే పని జమీల్యా, మాజీ సైనికుడు ధనియార్, మరిది సీట్ లకి అప్పగించబడుతుంది. ఈ పనిలో నిమగ్నమైన జమీల్యా-ధనియార్‌ల మధ్య చిన్నగా పరిచయం ఏర్పడుతుంది. స్పర్ధతో మొదలైన వీరి పరిచయం, వేళాకోళాలతో ఆటపట్టించడంగా సాగి, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడి, చివరకు ప్రేమగా మారుతుంది. నీలి పర్వత సానువులలో, విశాల స్టెప్పీ మైదానాలలో, మెరిసే నక్షత్రపు రాత్రుళ్లలో, పోప్లార్ చెట్ల సాక్షిగా ప్రకృతిలో మమేకం అవుతూ గుర్రపు బగ్గీలు తోలుకుంటూ కాలం గడుపుతారు. స్టెప్పీ మైదానాలలో వెన్నెల రాత్రుల్లో దనియార్ పాడిన శ్రావ్యమైన పాటలు జమీల్యా మనస్సును మైమరపిస్తాయి. అతని మధుర కంఠస్వరంలో ప్రతిఫలించిన ప్రేమకు, ఎనలేని మమకారానికి, ఆర్తికి జమీల్యా హృదయం పరవశించిపోతుంది.

అతని సంపూర్ణ వ్యక్తిత్వంతో, గానమాధుర్యంతో, ఆ ప్రేమ మహోజ్వలమై చివరకు ఆమె తన భర్తను, సమాజాన్ని విడిచి అతని వెంట పోవడానికి దారితీస్తుంది. అతని ఆత్మీయ సాహచర్యంతో, తనకు కావాలినదేమిటో ఆమెకు విస్పష్టమైన తరువాత ఆమె ఇక వెనక్కి చూడడానికి ఇష్టపడదు. భర్త సాదిక్ త్వరలోనే గ్రామానికి రానున్నాడని తెలిసినప్పటికీ ఆ వైవాహిక జీవితాన్ని కాదనుకొని, అప్పటి సామాజిక ఆచారాలను, కుటుంబ కట్టుబాట్లను, ధిక్కరించి మరీ జమీల్యా తన మనస్సుకి నచ్చిన ధనియార్‌తో సహజీవనం కొనసాగించడానికి స్వేచ్ఛగా, ధైర్యంగా అడుగులు వేస్తుంది. చివరకు ఒక వర్షం రాత్రి వేళ జమీల్యా తన భర్తను, ఇంటినీ, గ్రామాన్ని విడిచిపెట్టి తన జీవగర్ర అయిన ధనియార్ వెంట తనకు నచ్చిన కొత్త జీవితంలోకి సాగిపోతుంది.

ఆమె చిట్టి మరిది సీట్, వదినగా ఆమెను మూగగా ఆరాధిస్తూ, ఎల్లప్పుడూ ఆమె వెన్నంటి తిరుగుతూ ఉంటాడు. జమీల్యా-ధనియార్‌ల పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమగా మారడాన్ని మొదటి నుంచీ ఆశ్చర్యంతో గమనిస్తుంటాడు. ఒకరికోసమే ఒకరు అన్నట్లు అపూర్వానందంతో ఓలాడుతున్న వారి స్వచ్ఛమైన ప్రేమను, వారి ఆనందాన్ని అర్ధం చేసుకొన్న సీట్ ఖండించలేడు సరికదా వారి జీవన మార్గాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాడు. పైగా దాని నుండి కళాత్మకమైన స్ఫూర్తిని పొందడమే కాకుండా తన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకొని తదనంతర కాలంలో చిత్రకళాకారుడిగా ఎదుగుతాడు. ఇదీ స్థూలంగా కథ.

నవల ప్రత్యేకతలు

మార్చు
  • ఈ నవల కిర్గిజ్ మధ్య సామాజిక సంబంధాలను చక్కగా వివరిస్తుంది. ముఖ్యంగా మధ్య ఆసియాలోని సంచార జాతులు స్థిరపడుతున్న ఒకానొక సంధి కాలంలో, కిర్గిజిస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో నెలకొన్న కుటుంబ సంబంధాలు, అల్లుకున్న జీవితాల గురించి సూక్ష్మమైన అంతర్దృష్టిని అందించడమే కాకుండా, కుటుంబం, వైవాహిక బందం, జీవితం, వాస్తవికత, నిజమైన ప్రేమ, జీవితం యొక్క ఆనందం తదితర అంశాల గురించిన అనేక ప్రశ్నలకు సమాధానాలను సృజనాత్మకంగా అన్వేషించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కిర్గిజ్ సంచార సంస్కృతులపై సోషలిస్టు సంస్కృతి ప్రభావం తీవ్రంగా వున్నప్పుడు ఆయా సంస్కృతుల సంఘర్షణ, సమకాలీన జీవిత సంక్లిష్టతలను ఈ నవల ప్రతిఫలించింది.
  • ఈ నవల 1940 లలో సోవియట్ యూనియన్‌లోని సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది. ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ యుద్ధకాలంలో రాయబడ్డ ఈ కథ, యుద్ధం వలన కలిగే సామాజిక సంక్షుభిత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియచేస్తుంది. పురుషులంతా నిర్బంధంగా యుద్ధభూమికి తరలిపోవడాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు లేని గ్రామాలు, యుద్ధరంగం నుండి ఏ రోజు, ఏ కబురు వినవలసివస్తుందో అని భయపడే వృద్ధులు, చెమర్చిన కళ్లతో తనయుల రాక కోసం ఆశగా ఎదురుచూసే తల్లులు, యుద్ధసమయంలో స్త్రీలు పడే కష్టాలు, భర్త దగ్గరలేని స్త్రీలకు ఎదురయ్యే వేధింపులు, బడులు మూసివేయడంతో కళాభిరుచులు చంపుకొంటూ కష్టించి పనిచేసే బాలలు, చిన్ననాటి ఆనందాలను కోల్పోతున్న పిల్లలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలోను సంక్షోభ పరిస్థితులతో నెట్టుకొస్తున్న వ్యధాభరిత జీవిత చిత్రణలు అడుగడుగునా ఈ నవలలో కనిపిస్తాయి. మరోపక్క "పండే ప్రతి గింజ యుద్ధభూమికే" అనే నినాదంతో, యుద్హంలో పాల్గొనే సైనికుల ఆహారం కోసం ప్రతీ కుటుంబం నుంచి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని తేడా లేకుండా యావన్మందీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో రాత్రింపగళ్ళు పనిచేయక తప్పని సామాజిక పరిస్థితులను మన కళ్ల ముందుంచుతుంది.
  • మధ్య ఆసియా సమాజంలోని కట్టుబాట్లలో చిక్కుకున్న మహిళల జీవితాలను ఈ నవల స్పృశించింది. మధ్య ఆసియాలోని సంచార గిరిజన సమాజాల మధ్యన ఉన్న సామాజిక సంబంధాలను, ఆచార-సంప్రదాయాల పేరిట అక్కడ పాతుకుపోయిన సాంస్కృతిక బంధనాలను ఈ నవల సున్నితంగా మన కళ్ళ ముందు నిలుపుతుంది. ఉదాహరణకు, ఒక వితంతువుకు కుమారులు ఉన్నప్పుడు, వంశాన్ని విడిచిపెట్టకుండా ఆమె తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడం కిర్గిజ్ ఆచారం. ఆ విధంగా ఆమె తన పిల్లలతో పాటు, వివాహితుడి ఆస్తి అవుతుంది. ఆచారాలు, కట్టుబాట్లను గౌరవించే సాదిక్ (జమిల్యా భర్త) తన ఉత్తరంలో పేరు పేరునా అందరిని పలకరించి, చివరకు తన భార్యను మొక్కుబడిగా అడిగానని చెప్పమంటాడు. అతని దృష్టిలోనే కాదు అప్పటి పితృస్వామిక వ్యవస్థలోనే భార్యకు అంతకు మించి ప్రాధాన్యత లేదు. జమీల్యాను వివాహం చేసుకున్న విధంగానే, ఆచారం పేరిట స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం కిర్గిజిస్థాన్ సమాజాలలో ఇప్పటికీ కనిపిస్తుంది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా భావించే సమాజపు కట్టుబాట్లలో చిక్కుకున్న మధ్యఆసియా మహిళల దయనీయ జీవితాలను ఈ నవల హృద్యంగా తాకగలిగింది.
  • సంధి దశలో ఒక దేశం ఎదుర్కొన్న సంఘర్షణలకు నిలువుటద్దంగా నిలిచింది ఈ నవల. ఆధునిక సోషలిస్ట్ వ్యవస్థలు మధ్య ఆసియా రిపబ్లిక్లలోని సంచార గ్రామీణ వ్యవస్థలను భర్తీ చేస్తున్న చారిత్రాత్మక కాలంలో జమీల్యా నవల రాయబడింది. అందువలనే సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొంటున్న సంధి దశలో కిర్గిజిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణకు ఈ రచన అద్ధం పట్టింది.
  • సంధి దశలో సామాన్యుల మానసిక ఘర్షణని ప్రతిఫలించింది. జమీల్యా నవల, సంధి దశలో నలిగిపోతున్న వ్యక్తుల మానసిక సంఘర్షణను సుస్పష్టంగా ప్రతిబింబించింది. ఒకవైపు కుటుంబ పరువు ప్రతిష్టలు, కట్టుబాట్లు మరోవైపు సోషలిస్టు భావజాలం తీసుకు వస్తున్న విన్నూతన ఆలోచనల మధ్య నలిగిపోతున్న సామాన్య జీవితాలు పొందే మానసిక ఘర్షణ, జమీల్యా లోని ప్రతీ అక్షరంలోను కనిపిస్తుంది.

ప్రధాన పాత్రలు

మార్చు

జమీల్యా : కథానాయకి. స్వేచ్ఛాయుత జీవి. సాంప్రదాయిక బంధనాలు నుండి స్వేచ్ఛను కోరుకొంటూ తనకు నచ్చిన కొత్త జీవితంలోకి ధనియార్ వెంట నడిచిన పాత్ర.
ధనియార్: కథానాయకుడు. కుంటికాలితో సైన్యం నుండి తిరిగి వచ్చి గ్రామంలో స్థిరపడిన అనాథ. ఆత్మికంగా సంపన్నుడు. మధుర గాయకుడు. చివరకి జమీల్యా ప్రేమను చూరగొంటాడు.
సీట్: జమీల్యా మరిది. సాదిక్ తమ్ముడు. అన్నలు యుద్దభూమికి వెళ్ళినపుడు, వదిన జమీల్యాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె పట్ల అంతులేని అభిమానంతో వుండే పాత్ర. కథ యావత్తూ ఇతని కోణం నుంచి చెప్పబడుతుంది.
సాదిక్: జమీల్యా భర్త. యుద్ధరంగంలో ఉంటాడు. సాంప్రదాయిక సమాజానికి, పితృస్వామిక భావజాలానికి ప్రతినిధి.
ఒస్మాన్: ఉమ్మడి కుటుంబానికి దూరపు బంధువు. పోకిరీ. జమీల్యాను అల్లరి చేష్టలతో విసిగిస్తుంటాడు.
ఒరోజ్మాత్: సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి దళ నాయకుడు. సైన్యానికి ధాన్యం తోలే పనులను పర్యవేక్షిస్తుంటాడు

కథా నిర్మాణం-శైలి-చిత్రణ

మార్చు

జమీల్యా ప్రేమ కథను కౌమారప్రాయంలో అడుగుపెడుతున్న ఒక కథకుని కోణంలో చెప్పడం కనిపిస్తుంది. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.

కథ-కూర్పు నిర్మాణంలో మాత్రమే కాకుండా, కథ యొక్క ప్రధాన సైద్ధాంతిక, కళాత్మక స్వభావాన్ని నిర్ణయించడంలో కూడా శ్రావ్యత ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ ప్రేమ కథలో సంగీతం యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా ఉందంటే రచయిత మొదట్లో తన రచనను 'ఓబోన్' (కిర్గిజ్ లో ఓబోన్ అంటే శ్రావ్యత) అని పిలవడం జరిగింది. చివరకు రష్యన్ అనువాదకుని కారణంగా జమీల్యా అనే పేరు స్థిరపడింది.

కథ యొక్క లిరికల్-రొమాంటిక్ స్వభావం కారణంగా, ఈ కథను తరచుగా "గద్యంలో కవిత్వం" అని పిలుస్తారు. వాస్తవానికి ఈ రచన యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రేమ. అయితే ఇందులో వ్యక్తీకరించబడిన ప్రేమ, ఇద్దరు ప్రేమికుల (జమీల్యా-ధనియార్) మధ్య ఏర్పడినది మాత్రమే కాదు. అది భూమి, సంగీతం, కళ, అన్నిటికీ మించి ప్రకృతికి కూడా స్ఫూర్తినిచ్చే విశ్వ జనీనమైన ప్రేమ. అలాగే జీవితం పట్ల అంతులేని ప్రేమ, ప్రజల పట్ల మమకారం, జన్మ భూమి పట్ల అఖండ ప్రేమ మొదలైన అంశాలను ఈ ప్రేమ కథకు సాన్నిహితైక్య అంశాలుగా పరిగణిస్తారు.

అనువాదాలు

మార్చు

కిర్గిజ్‌లో "ఒబాన్" పేరుతో ప్రచురితమైన ఈ నవల 1958 లో రష్యన్‌ భాషలో న్యూ వరల్డ్ మాగజైన్‌లో "జమీల్యా" పేరుతో ప్రచురించబడింది. ఈ పేరుతోనే ప్రపంచ భాషలలో ప్రసిద్ది చెందింది. తొలుత సోవియట్ యూనియన్ లో విశిష్టమైన గుర్తింపు పొందిన దీనిని కవి లూయీ అర^గొవ్ ఫ్రెంచ్ భాషలో అనువదించడంతో, దీని గొప్పతనం ప్రపంచానికి వెల్లడైంది. నేటివరకు జమీల్యా నవల నూట యాభైకి పైగా ప్రపంచ భాషలలో ప్రచురించబడింది. భారతదేశంలోను దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలో ఇది అనువదించబడింది. తెలుగులో ఉప్పల లక్ష్మణరావు చేసిన అనువాదాన్ని 1971 లో ప్రగతి ప్రచురణాలయం ప్రచురించింది. తరువాత 2008 లో హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించింది.

చలన చిత్రీకరణలు

మార్చు

1968 లో ఇరినా పోప్లావాస్కయా, సెర్గీ యుట్కెవిచ్ దర్శకత్వంలో ఈ నవల రష్యన్ భాషలో జమీల్యా (రష్యన్ Джамиля) సినిమాగా విడుదలైంది. కథానాయకి జమీల్యా పాత్రలో నటల్యా అరిన్‌బసరోవా, ధనియార్ పాత్రలో సుయ్మెన్కుల్ చోక్మరోవ్ నటించారు.[2] ఈ క్లాసిక్ చిత్రానికి రచయిత 'చింగిజ్ ఐత్‌మాతొవ్' స్వయంగా కథ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

1994 లో మోనికా టిబెర్ దర్శకత్వంలో ఈ నవలను ఇంగ్లీష్ లో జమీలా (Jamila)పేరుతొ సినిమాగా తీశారు. [3]

ఉద్వేగభరితమైన జమీల్యా ప్రేమకథతో ప్రేరణ పొందిన ఫ్రెంచ్ దర్శకుడు మేరీ-జౌల్ డి పోంచెవిల్లే 2008 లో కిర్గిజిస్థాన్‌లో "టెంగ్రి: బ్లూ ప్యారడైజ్" చిత్రంను రూపొందించాడు. కిర్గిజిస్థాన్ స్టెప్పీ గడ్డి మైదానాల్లో పూర్తిగా చిత్రించబడిన మొదటి ఫ్రెంచి చలన చిత్రం ఇది.[4]

పురస్కారాలు-గుర్తింపులు

మార్చు
 
జమీల్యా రచనకు అంకితంగా కిర్గిజిస్థాన్ విడుదల చేసిన స్మారక నాణెం

"జమీలా" నవల సాహిత్య లోకంలో అప్పటివరకూ ఎవరికీ అంతగా పరిచితంగాని ఒక మధ్య ఆసియా రచయితను సోవియట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యలోకానికి తొలిసారిగా పరిచయం చేసింది. "జమీల్యా", "ఫస్ట్ టీచర్", "ఫేర్‌వెల్ గుల్సరీ" లతో కూడిన సంకలనం "టేల్స్ ఆఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్పీస్" నకు 1963 లో చింగిజ్ ఐత్‌మాతొవ్‌కు సోవియట్ యూనియన్‌లో లెనిన్ ప్రైజ్ లభించింది. జమీల్యా రచనకు స్వర్ణోత్సవం నిండిన సందర్భంలో స్మారక చిహ్నంగా కిర్గిజిస్థాన్ ప్రభుత్వం 2009 లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళలో జమీల్యా, ధనియార్ లతో పాటు వారు ప్రతిరోజూ స్టేషన్‌కు తీసుకువెళ్ళే బండి ఉన్నాయి. అదేవిధంగా జమీల్యా-ధనియార్ లు కలసి వున్న దృశ్యంతో ఒక స్మారక నాణెంను 2009 లో విడుదల చేసింది.

సాహిత్యంలో నవల స్థానం–అంచనా

మార్చు

తాను పుట్టి పెరిగిన సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సామాజిక, సాంస్కృతిక బంధనాల పట్ల సానుభూతితో, నిబద్దతతో స్పందించిన రచయితగా చింగిజ్ ఐత్‌మాతొవ్ ఒక సామాజిక మార్పుకు నాంది పలుకుతూ స్త్రీ స్వేచ్ఛా పరిణతికి ప్రతీకగా జమీల్యాను సృష్టించాడు. ఇది ఒక మనోహరమైన ప్రేమకథగా ప్రశంసించబడినప్పటికీ, అంతకు మించి సోవియట్ ప్రగతిశీలక సాహిత్య చరిత్రలో వచ్చిన గొప్ప రచనలలో ఒకటిగా పరిగణించబడింది. ప్రపంచ సాహిత్యరంగంలో స్త్రీ స్వేచ్ఛను ప్రతిబింబించిన ఉదాత్తమైన రచనగా నిలిచింది. పితృస్వామిక సమాజంలో నలిగిపోతున్న స్త్రీల స్వేచ్ఛాయుత ప్రేమ జీవనాన్ని కాంక్షిస్తూ, నిజమైన జీవితానంద విలువలను పునర్నిర్వచిస్తూ వచ్చిన ప్రామాణిక నవల ఇది.

ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం (1940-45) కాలం నాటి సోవియట్ పాలనలో కిర్గిజ్ సంచార జాతుల సాంఘిక జీవన పరిస్థితులకు అద్దం పట్టిన ఈ కథను, సామాజిక కట్టుబాట్లను అధిగమించిన సాహసోపేతమైన ప్రేమకథగా మాత్రమే కాకుండా, అంతకు మించి సంక్షుభిత జన జీవితాలను సృజనాత్మకంగా ప్రతిఫలించే నవలగా, ఆధునికతకు, సంప్రదాయాలకు మధ్య తలెత్తే వైరుధ్యాలను స్పృశించిన నవలగా దీనిని పరిగణించారు.

నవల యొక్క సైద్ధాంతిక, కళాత్మక స్వభావం కారణంగా, ఇది కిర్గిజ్ కథాకౌశలాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడమే కాక, మధ్య ఆసియా ప్రజల సృజనాత్మక కథాకౌశలానికి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ చిన్న నవలలో చిత్రితమైన ఉదాత్త పాత్రలు, కళాత్మకత, జీవిత వాస్తవికత, సార్వజనీన మానవీయత, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ, నిజమైన జీవితానంద విలువలు, అభ్యుదయ దర్శనాలు వంటి అంశాలు, తరాలు మారినా, అలనాటి పరిస్థితులు కనుమరుగైనా పాఠకుల ఆలోచనలను సంఘర్షింపచేసి తద్వారా మానవ సమాజాలను ప్రగతి పథంలో మరింత ముందుకు నడిపించడానికి దోహదం చేస్తాయి. ఈ లక్షణాలే జమీల్యా కథను ప్రపంచ సాహిత్యంలో ఉత్తమ క్లాసిక్ నవలలలో ఒకటిగా నిలబెట్టాయి.

రిఫరెన్సులు

మార్చు
  • జమీల్యా - చింగిజ్ ఐత్‌మాతొవ్ (తెలుగు అనువాదం ఉప్పల లక్ష్మణరావు) హైదరాబాద్ బుక్ ట్రస్టు (2015)

మూలాలు

మార్చు
  1. Erich Follath and Christian Neef, "Kyrgyzstan Has Become an Ungovernable Country", Der Spiegel|SPIEGEL ONLINE International, 8 October 2010.
  2. "Jamilya (1969)". IMOB. Retrieved 2 September 2020.
  3. "Jamila (1994)". www.imdb.com. IMDB. Retrieved 4 September 2020.
  4. "Tengri: Blue Heavens (2008)". www.imdb.com. Retrieved 5 September 2020.