జయధీర్ తిరుమలరావు

జయధీర్ తిరుమలరావు చారిత్రిక పరిశోధకుడు, రచయిత, సాహిత్య కారుడు. అతని అసలు పేరు రేపల్లె తిరుమలరావు. తన స్నేహితుడు పి.జయధీర్‌తో కలిసి జంటగా వ్రాసి పంపిన కవిత్వాన్ని చూసి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ రెండు పేర్లనూ కలిపి ‘జయధీర్ తిరుమలరావు’గా మార్చి ప్రచురించాడు. ఆ ఆనవాయితీ కొనసాగి రేపల్లె తిరుమలరావు జయధీర్ తిరుమలరావు అయ్యాడు.

జయధీర్ తిరుమలరావు

జీవిత విశేషాలు

మార్చు

అతను 1950 జూన్ 20న వరంగల్ లో జన్మించాడు.[1] అతను తెలంగాణ రచయితల వేదిక (తెరవే) అధ్యక్షుడు.[2] భాషా సాహిత్యాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రచయితలపై ఉందని తెలిపాడు. తెలంగాణ మాండలికాల అభివృద్ధి కోసం రచయితల వేదిక కృషి చేస్తుందన్నారు.[3] అతను జానపద సాహిత్య మౌలిక పరిశోధకుడు. పరిశోధన కోసం అతను తెలంగాణ లోతట్టు జనపదాల్లో, గిరిజన ప్రాంతాల్లో కాళ్లరిగేలా తిరిగాడు. కాలగతిలో నిర్లక్ష్యానికి గురైన ఉపకులాల బతుకుల, కళల ప్రతిబింబాలను సేకరించాడు. తన నాలుగు దశాబ్దాల శ్రామిక శోధనను 2017 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రదర్శించాడు. అట్టడుగు ఉపకులాల నుంచి అతను సేకరించిన సామాజిక సాంస్కృతిక కళాఖండాల ప్రదర్శనమది. అతను స్వాతంత్ర్య సమర కాలంలోనూ, నిజాం పరిపాలనా కాలంలోనూ దొరతనాల నిషేధానికి గురైన సాహిత్యం మీద సాధికార పరిశోధనా గ్రంథాన్ని నిర్మించాడు. ఇందుకోసం అతను న్యూదిల్లీ, చెన్నై, పాండిచ్చేరి లాంటి తావుల్లో ఎన్నో అభిలేఖాగారాల్నీ, పొత్తపుగుడుల్నీ సందర్శించాడు.

జయధిర్ తిరుమల రావు ఆదిలాబాద్ జిల్లాలోని నార్నుర్ మండలం గుంజాల గ్రామంలో లభ్యమైన పురాతన గోండి లిపి రాతపత్రలపై మరియు ఆ లిపి పై ఆనేక పరిశోధనలు చేశాడు ‌.

అతను ప్రాచీన గిరిజన సంగీత వాద్యాల సేకరణ మహాయజ్ఞంగా భావించి మూడున్నర దశాబ్దాలుగా క్షేత్ర పర్యటన ద్వారా పరిశోధించి, సేకరించి సజీవంగా సమాజం ముందుంచారు. తన అవిరళ కృషితో వీటి అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చాడు. పలు ప్రదర్శనలు నిర్వహించాడు. దానిలో భాగంగానే గుంటూరులో బృందావన్‌ గార్డెన్స్‌లోని పద్మావతి కల్యాణమండపంలో 'ఆదిధ్వని' పేరుతో గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఇది 2020 ఫిబ్రవరి 25 నుంచి 28 వరకూ నాలుగురోజులు నిర్వహించాడు. సంగీతంతోనే మానవీయ సమాజం ఆవిష్కృతమవుతుందని, కనుమరుగవుతున్న మూల సంగీతాన్ని బతికించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపాడు[4].

రచనలు

మార్చు
  1. తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం[5]
  2. ప్రజాకళా రూపాలు
  3. పొది (సంభాషణలు-అక్షరచిత్రాలు)
  4. సాహిత్య వ్యాసాలు
  5. జానపద చారిత్రక గేయగాథలు
  6. అలనాటి సాహిత్య విమర్శ
  7. దళిత గీతాలు (రెండు భాగాలు)
  8. భాషావరణం (వ్యాసాలు)
  9. యుద్ధ కవచం (కాళోజీ గురించి)
  10. తొవ్వ ముచ్చట్లు (రెండు భాగాలు)
  11. వీరుల పోరుగద్దె మేడారం (సంపాదకత్వం)

మూలాలు

మార్చు
  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-28.[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-28.
  3. "18న తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు | V6 Velugu" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-28.
  4. "ఆదివాసీల హృద‌య ధ్వ‌ని | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-06-28.
  5. తిరుమలరావు, జయధీర్ (1988). తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజాసాహిత్యం. సాహితి సర్కిల్.

బాహ్య లంకెలు

మార్చు