జస్టిస్ పార్టీ
జస్టిస్ పార్టీ (అధికారిక నామం సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్) ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీ. దీనిని నవంబరు 20, 1916న టి. ఎం. నాయర్, పి. త్యాగరాయ చెట్టి మద్రాసులోని విక్టోరియా మెమోరియల్ హాలులో ప్రారంభించారు. ప్రెసిడెన్సీలో వరుసగా చోటు చేసుకున్న బ్రాహ్మణేతర సమావేశాల ఫలితంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. 19వ శతాబ్దం చివర్లోనూ, 20 వ శతాబ్దం మొదట్లో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల మధ్య సామాజిక అంతరాలు పొడచూపాయి. దీనికి ముఖ్య కారణం ఇతర కులాలపై ఉన్న దురభిప్రాయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే అధిక సంఖ్యలో ఉండటం మొదలైనవి. జస్టిస్ పార్టీ స్థాపనతో బ్రాహ్మణేతరులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం వల్ల ఒక రకంగా ద్రవిడ ఉద్యమానికి ప్రారంభం అని చెప్పవచ్చు.[1][2][3]
ప్రారంభంలో ఈ పార్టీ ఆంగ్ల పరిపాలనా విభాగాల్లో బ్రాహ్మణేతరులకు ఎక్కువగా ప్రాతినిథ్యం కల్పించేలా బ్రిటిష్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. 1919లో మాంటేగ్ షెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా మద్రాసు ప్రెసిడెన్సీలో ద్వంద్వ పరిపాలనా విధానం (Diarchy) అమల్లోకి వచ్చింది. అలా మొదటి సారిగా జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. 1920 లో జరిగిన ప్రెసిడెన్సీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 17 ఏళ్ళలో ఐదుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు అయితే అందులో నాలుగు సార్లు ఈ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 ఏళ్ళు అధికారంలో ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఇదొక్కటే. 1937లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత ఇది ఆత్మగౌరవ నినాదంతో పెరియార్ రామస్వామి నాయకత్వం కిందకు వచ్చింది. 1944లో పెరియార్ ఈ పార్టీని ద్రవిడర్ కళగం అనే పేరుతో సామాజిక సంస్థగా మార్పు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం విరమింపజేశాడు. 1952లో ఈ సంస్థలోని కొంతమంది తిరుగుబాటు దారులు ఎన్నికల్లో పోటీ చేశారు.
జస్టిస్ పార్టీ అవలంభించిన కొన్ని వివాదాస్పద విధానాల వల్ల భారత రాజకీయాల్లో ఏకాకిగా మిగిలిపోయింది. ఈ పార్టీ ముఖ్యంగా సివిల్ సర్వీసుల్లో, రాజకీయాల్లో బ్రాహ్మణులను వ్యతిరేకించింది. బ్రాహ్మణ వ్యతిరేకతనే తమ పాలసీలుగా ఏర్పాటు చేసుకున్నారు. అనీబిసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమం బ్రాహ్మణులకు మేలు చేసిదిగా ఉందంటూ దాన్ని వ్యతిరేకించారు. తమ ప్రెసిడెన్సీలో సహాయ నిరాకరణోద్యమాన్ని కూడా వ్యతిరేకించారు. బ్రాహ్మణత్వాన్ని సమర్ధించినందుకు మహాత్మా గాంధీతో విభేదించారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Joshua Fishman; Ofelia Garcia (2010). Handbook of Language and Ethnic Identity:The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts (Volume 2): The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts. Oxford University Press, USA. pp. 230–. ISBN 978-0-19-539245-6. Retrieved 7 July 2016.
- ↑ "A century of reform The Dravidian movement has left its progressive imprint on Tamil Nadu". Manuraj Shunmugasundaram. The Indian Express. 22 November 2016. Retrieved 8 August 2018.
- ↑ "The Inner Grammar Of Dissent Lives". K.S. Chalam. Outlook India. 12 December 2016. Retrieved 8 August 2018.