జోళదరాశి దొడ్డనగౌడ

జోళదరాశి దొడ్డనగౌడ గాయకుడిగా, నటుడిగా, కన్నడాంధ్ర కవిగా, నాటకకర్తగా, ప్రయోక్తగా, వీరశైవతత్వజ్ఞుడిగా ప్రసిద్ధుడు.

జీవిత విశేషాలు

మార్చు
 
జోళదరాశి దొడ్డనగౌడ

జోళదరాశి దొడ్డనగౌడ బళ్లారి జిల్లా జోళదరాశి గ్రామంలో 1910, జూన్ 27వ తేదీన ఒక సంపన్న రైతు కుటుంబంలో పంపనగౌడ, రుద్రమ్మ దంపతులకు జన్మించాడు[1]. ఇతడు బాల్యం నుండే సంగీత, నాటక, సాహిత్యాలపై అమితమైన ఆసక్తిని కనబరచాడు. స్వగ్రామంలోనే నాటక సంఘాన్ని నెలకొల్పి "గరుడ గర్వభంగ" అనే నాటకాన్ని ప్రదర్శించి ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ ప్రశంసలందుకున్నాడు. ఆనాటి నుండి వారిద్దరి మధ్య అనుబంధం బలపడి తెలుగు, కన్నడ నాటకరంగానికి ఒక కొత్త వెలుగు నిచ్చింది. ఇతడు వ్రాసిన కన్నడ నాటకాలు బసవేశ్వర, కనకదాసులలో బళ్ళారి రాఘవ ప్రధాన పాత్రలను ధరించాడు. రాఘవ నాటకబృందంలో సభ్యుడిగా ఇతడు బెంగుళూరు, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ, రంగూన్ మొదలైన పలు పట్టణాలలో ప్రదర్శనలిచ్చాడు. కబీరు, నారదుడు, కృష్ణుడు, రాముడు మొదలైన పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఇతడు బళ్ళారి జిల్లా నాటకకళాపరిషత్తును స్థాపించాడు. బళ్లారిలో రాఘవ కళామందిరం నిర్మాణంలో కృషి చేశాడు. స్వగ్రామంలో రామేశ కళామందిరాన్ని నిర్మించాడు. ఇతడు శివభక్తుడు. శరణకవిగా ఇతడు కళారాధనతో పాటు మత, వేదాంత తత్త్వ ప్రచారాలను చేశాడు. ఇతడు రైతుగా, గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు.

రచనలు

మార్చు

ఇతడు కన్నడ భాషలో 30కి పైగా కావ్యాలు, నాటకాలు, కవితా సంపుటాలను వెలువరించాడు. తెలుగులో "గేయ గుంజారము", "వచనామృతము", "శూన్య సంపాదనము" మొదలైన గ్రంథాలను రచించాడు. ఇతని జీవిత చరిత్ర "నందే నానోదిదే" అనే పేరుతో కన్నడ భాషలో వెలువడింది. ఇది తెలుగులో "అనుభవాలు - జ్ఞాపకాలు" పేరుతో తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణగా వెలువడింది.

కావ్యగానం

మార్చు

ఇతడు కంచుకంఠంతో వేలాది సభలలో కావ్యగానం చేసి కన్నడ ప్రజలను సంగీత సాహిత్యాలలో ఓలలాడించాడు. తన గానం మూలకంగా ఇతడు కన్నడ కావ్యాలపట్ల ప్రజలకు ఆసక్తిని, అభిరుచిని కలిగించాడు. రాజశేఖర విలాస, శూన్యసంపాదన, భరతేశ వైభవ, ప్రభులింగలీలె, బసవపురాణ, హరిహరన రగళెగళు, గిరిజాకళ్యాణ, హరిశ్చంద్రకావ్య, రామాయణ దర్శనం, జైమిని భారత మొదలైన ఎన్నో కన్నడ కావ్యాలను సాహిత్యాభిరుచి, సంగీతప్రజ్ఞ, దైవభక్తి ముప్పేటలుగా ఆవేశంతో గానం చేసేవాడు. ఇతడు గానంలో లీనమై, తన్మయుడై, భావావేశానికి లోనై ఒక్కోసారి భోరున విలపించేవాడు.

సన్మాన సత్కారాలు

మార్చు

ఇతడు "గమకకళానిధి" అనే బిరుదును పొందాడు. కన్నడ సాహిత్య పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీలనుండి ఇతడు సత్కరించబడ్డాడు. కర్ణాటక రాష్ట్రప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్థిని, కర్ణాటక సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాడు. కల్బుర్గి విశ్వవిద్యాలయం ఇతడిని గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.

ఇతడు 1994, మే 10వ తేదీన మరణించాడు.

మూలాలు

మార్చు
  1. జానమద్ది, హనుమచ్ఛాస్త్రి (14 October 1979). "గమక కళానిధి శ్రీ జోళదరాశి దొడ్డన గౌడ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 192. Retrieved 29 December 2017.[permanent dead link]